నాలుగవ వారం సీరియల్
" ఈ రోజు నా ఫ్రెండ్ ఫ్యామిలీని భోజనానికి పిలిచాను. ఏదైనా స్పెషల్ చెయ్యి" అని హాస్పిటల్ నుండి ఫోన్ చేశాడు.
నేను ఉత్సాహంగా వంటంతా చేశాను. అతనికి ఇష్టమైన ఆవడలూ, గులాబ్ జామ్ కూడా చేశాను. అన్నీ తయారుచేసి, నేనుకూడా తయారైవాళ్ళకోసం ఎదురుచూస్తుండగా, అమ్మమ్మ దగ్గర్నుండి ఓ కబురు పట్టుకుని మా ఊరు పెద్దమనిషి ఒకాయన వచ్చాడు.
అక్కడితో నా జీవితం ఊహించని మలుపు తిరిగింది.
"పాపమ్మగారూ, ఈ వార్త మీకు అవసరంగా అందజేసి రమ్మన్నారు అమ్మమ్మగారు" అంటూ ఓ కవరు అందించాడతాను.
నేను ఆత్రంగా కవరు చింపి చదివాను.
'పాపా! నీకు అనకాపల్లి ఏడు కొండలు అన్నయ్య తెలుసుకదా! వాళ్లనాన్న రాత్రి హఠత్తుగా పోయాడుట.నీకు వరుసకు పెదనాన్న జ్ఞాతులం కాబట్టి నువ్వు ఈ నిమిషం నుండే నూతకం పట్టి, మూడో నాడు శుద్ధి స్నానం చేసి ఇంట్లోకి రా. మీ ఆయన ఏం చెప్పినా వినకు. ఏదైనా కలుపుకోవచ్చు కానీ చావుమైల కలుపుకుంటే అరిష్టం!' అని అమ్మమ్మ తాటికాయలంత అక్షరాలతో వ్రాసి పంపింది.
నా గొంతులో పచ్చివెలక్కాయ పడినంత పనైంది. వివేక్ కి ఈ విషయం తెలియజేసేటంత వ్యవధి లేదు. అతను అతిథులని తీసుకునివచ్చే టైమ్ అవనే అయింది. ఏంచెయ్యాలి? చెప్తే రభస చేస్తాడు. చెప్పకుండా దాచే విషయం కాదు! అమ్మమ్మమాట నేనెప్పుడూ కొట్టిపారేయ్యలేదు.
మా ఊరునుండి వచ్చిన వ్యక్తి మంచినీళ్ళు కూడా తాగకుండా చక్కా పోయాడు.
నా ఆలోచలలో నేను వుండగానే వివేక్ ఫ్రెండ్ నీ అతడి భార్యానీ తీసుకుని వచ్చాడు.
నేను బలవంతంగా చిరునవ్వు నవ్వాను.
"అనూ... కాఫీ తీసుకురా" అన్నాడు వివేక్.
నాకు వంటింట్లోకి వెళ్ళి ఏదైనా తాకాలంటే కాళ్లు వణుకుతున్నాయి. ప్రతి సీసాలోంచీ డబ్బా వెనకనుండీ అమ్మమ్మ తొంగిచూస్తూ' అరిష్టం...అచ్చిరాదు...అనర్ధం' అంటున్నట్లు అనిపిస్తోంది.
ఆంజనేయస్వామివైపు చూశాను. కళ్ళు పెద్దవి చేసి తోకతో కొట్టేట్లు కనిపించాడు. చెంపలు వేసుకుంటూ అడుగు గడప అవతలికి వేశాను. దీనంగా అమ్మవారి ఫోటోవంక చూశాను. నోటి మీద వేలు వేసుకుని 'తప్పు' అంటున్నట్లు అనిపించింది.
గుండెల్లోంచి భయం తన్నుకొస్తోంది. ఏమైతే అయిందని "ఏవండీ..." అనిపిలిచాను. వివేక్ లోపలికి వచ్చాడు. "రెడీనా?" అన్నాడు.
నేను మాట్లాడకుండా అమ్మమ్మ వ్రాసిన ఉత్తరం అతని చేతిలో పెట్టి, గుండెలు చిక్క బట్టుకుని అతని రియాక్షన్స్ కోసం ఎదురుచూడసాగాను.
అతను చదివి విసుగ్గా. "సో...వాట్?" అన్నాడు.
నేను కొంచెం గట్టిగా-" నాకు మైల ఇంట్లో ఏమీ ముట్టుకోకూడదు, మహాపాపం!" అన్నాను.
వివేక్ వెంటనే నా జబ్బ గట్టిగా పట్టుకుని వంటింట్లోకి లాగి, తలుపు వేస్తూ- "గట్టిగా వాగావంటే చంపేస్తాను. ఇంత పల్లెటూరి గబ్బిలాయనని నలుగురికీ తెలియాలా?" అన్నాడు.
నాకు ఏడుపు ఆగలేదు.
నోర్మూసుకుని వచ్చినవాళ్ళకి మర్యాదలు చెయ్యి" అన్నాడు.
అమ్మో! అనర్ధం జరుగుతుందిట! అమ్మమ్మ వ్రాసింది" అన్నాను.
వివేక్ చిరాగ్గా-" ఇంతమంది పోతున్నారు గానీ నా ప్రాణానికి మీ అమ్మమ్మ పోదేం?" అన్నాడు.
"ఏమన్నారూ?" అని కోపంగా అరిచాను.
నా కోపాన్ని చూసి తను కాస్త తగ్గి, సారీ, అనుకోకుండా అనేశాను కానీ...ముందు వచ్చిన వాళ్ళకి కాఫీ కలిపి తీసుకురా " అన్నాడు.
"ఉహూ!" తల అడ్డంగా ఉఉపాను.
"నేను చెప్తున్నాను... తీసుకురా!" అతను వేలు ఆడిస్తూ ఆర్డర్ లా అనేసి వెళ్ళిపోయాడు.
మనసుకీ, శరీరానికీ మధ్య ఎంతో సంఘర్షణ జరిగాక నేను కాఫీ కలిపి, వణికే చేతుల్తో తప్పు చేస్తున్న భావనతో హాల్లోకి ట్రే తీసుకుని నడిచాను.
వాళ్ళు జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వివేక్ ముఖంలో ఎందుకో అంత సంబరం!
నాకు మా ఊరు గుర్తొచ్చింది! ఎవరైనా పోయారని తెలిస్తే, తెలియని వాళ్ళైనా సరే కంటతడి పెడ్తారు. శవాన్ని ఊరి పోలిమేరలకి తరలించేదాకా ఎవరూ పొయ్యిలో నిప్పు రాజెయ్యారు.
ఇక్కడ పక్కింట్లో మనిషి పోయినా పట్టించుకోకుండా ఆనందంగా పండగ చేసుకోగలరు. ఎంతో అడ్వాన్స్ అయిపోతున్నాము అనుకుంటూ మానవతా విలువల్ని కోల్పోతున్నారు.
వివేక్ ఏదో జోక్ వేశాడు. అందరూ నవ్వుతూ నా వైపు చూశారు.
సరిగ్గా అప్పడే నేను కొంగుతో నా కంట్లో తడిని అడ్డుకుంటున్నాను.
"వివేక్! మీ మిసెస్ అలా వున్నారేంటి? ఒంట్లో బాలేదా? ముందుగా ఆవిడ్ని కన్ సల్ట్ చెయ్యకుండా మమ్మల్ని పిలిచారా?" అడిగింది అతని స్నేహితుడి భార్య.
వివేక్ నావైపు కాల్చేస్తున్నట్లుగా చూశాడు వివరణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి, "మా పెద్దనాన్నగారు పోయారు. ఆ వార్త నాకు ఇందాకే తెలిసింది. అందుకే అఫ్ సెట్ అయ్యాను" అన్నాను.
"అయ్యొయ్యో సారీ!" అన్నారు వాళ్ళు.
వివేక్ రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు.
నేను బాధగా- " నా చేత్తో పండింది పెట్టి మిమ్మల్ని మైలపరచాల్సివస్తున్నందుకు బాధగా వుంది. మీరు ఇంటి కెళ్ళగానే తలారా స్నానం చేయ్యండే" అన్నాను.
వాళ్లు తెల్లబోయినట్లుగా ఒకళ్ల ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు.
వివేక్ పళ్ళబిగువున కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా నావైపు చూశాను.
అతని "ఫ్రెండ్" అవన్నీ ఒకప్పటి మూఢనమ్మకాలు, ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు.... చాదస్తం కాకపోతేనూ...." అన్నాడు.
నాకు నోరు ఆగలేరు. "చాదస్తం కాదు అనర్ధం. మైల కలుపుకుంటే మంచి జరగదుట! మా అమ్మమ్మ ఉత్తరంలో వ్రాసింది" అన్నాను.
ఆ మాటకి వివేక్ ఫ్రెండ్ భార్య ముఖం ఎర్రగా చేసుకుని -" వెళ్ళిపోదాం పదండి ఎందుకొచ్చిన తంటా మనకి?" అంది లేచి నిల్చుంటూ.
వివేక్ కల్పించుకుని" తనమాటలు పట్టించుకోకండి. పల్లెటూరిరకం... పెద్దగా ఏంతెలీదు!" అన్నాడు.
అది విని నేను అక్కసు పట్టలేక- "నేనేం పల్లెటూరిమొద్దుని కాదు. ఈ మహానగరంలోనే హస్టలో వుండిమరీ డిగ్రీ చేశాను" అన్నాను.
వివేక్ ఫ్రెండ్ "ఇట్స్ ఆల్ రైట్! ఆవిడ్ని ఏమీ అనకు. వస్తాం అనూహ్యగారూ...సారీ మీకు ట్రబుల్ ఇచ్చాం" అంటూ లేచాడు.
వాళ్ళ ఆవిడ చేతులు జోడించి నమస్కరించి, గబగబా గుమ్మంవైపు నడిచింది.
వాళ్లు వెళ్ళేదాకా ఆగి వివేక్ నావైపు తిరగి చాలా నెమ్మదిగా-" చాలా తెలివిగా ప్రవర్తించాననుకుంటున్నావా?" అని అడిగాడు.
"న్యాయంగా ప్రవర్తించాననుకుంటున్నాను. వాళ్ళ కలా నిజాన్ని దాచి మైలకూడు పెట్టడం తప్పు కాదూ!" అన్నాను.
వివేక్ కోపంగా ఏదో అనబోయి, మానేసి "ఓ ... గాడ్!" అని తల కొట్టుకున్నాడు.
నేను భయంగానే "ఈ వంటకాలన్నీ బయటపారేసి, రెండు బకెట్ల నీళ్ళు పోసి ఇల్లంతా కడగండి. నేను బాల్కనీలో కూర్చుంటాను" అన్నాను.
వివేక్ వింతగా చూస్తూ- "వాట్! నేనా...ఇల్లు కడగాలా? ఎందుకూ?" అన్నాడు.
"నేను అన్నీ ముట్టుకున్నానుగా!" అన్నాను.
"అయితే!" అతను నా దగ్గరకోస్తూ అన్నాడు.
"ఆ...దూరందూరం...నన్ను తాకకండి" అన్నాను. అతను నేను ఊహించినదానికన్నా వేగంగా నాదగ్గరకు వచ్చి, నన్ను ఒడిసిపట్టుకుని- "ఏవైందీ? నాకేం షాక్ కొట్టకేదేం? ఎందుకు తాకకూడదూ?" అన్నాడు.
నేను గింజుకుంటూ-" తప్పు... చెప్తే మీక్కాదూ... వదలండి" అని అరిచాను.
"అదే... అసలేంజరుగుతుందో చూద్దాం!" అంటూ నా మోకాళ్ళక్రిందుగా చేతులేసి అమాంతంగా పైకి ఎత్తి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
"ఏవిటి మొండితనం? వదలండి... పాపం! పెద్ద వాళ్ళు ఎందుకు చెప్పారో ఏమో... అనర్ధం జరుగుతుందిట" ఏడుస్తూ అన్నాను.
"అనర్ధం...అంటే అర్ధం లేనిది అని అర్ధం తెలుసా?" హేళనగా అడిగాడు.
"ఏవండీ...వద్దు" బ్రతిమాలాను.
అతను వినలేదు.
అతని ముఖం నా ముఖం మీదికి వస్తూవుంటే తల తిప్పబోయను. అతను నా ముఖాన్ని రెండు చేతుల మధ్యా కదలకుండా బంధించి-" ఇంత అందమైన శరీరంలో దేవుడు అతి ముఖ్యమైన పార్ట్ పెట్టడం మరిచిపోయాడు....ఎందుకో?" అన్నాడు.
అతను నాకు మెదడు లేదంటున్నాడని నాకర్ధమైంది. గింజుకోవడానికి కూడా ఓపిక లేక అలాగే పడుకుని చూస్తుండిపోయాను.
అతను నా శరీరంలోని ప్రతి అవయవాన్నీ తాకుతుంటే...నాకు పాపం నా నరనరాల్లో ప్రవహిస్తున్నంత భయం వేసింది. భయంవేస్తే దేవుడ్ని తలుచుకుంటాం! కానీ ఆ సమయంలో... తప్పకదా! అందుకే నేను ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు.
"ఎక్కడా షాక్ కొట్టలేదు... అంతా మామూలుగానే వుంది" చెప్పాడు నవ్వుతూ.
నాకు చాలా అవమానంగా అనిపించింది. నా శరీరం మీద నాకు ఏమీ హక్కు లేనట్లు నేను అలా అశక్తురాల్లా ఎందుకుండిపోయానో తెలియలేదు!