"ఇంకా వేరే వ్యసనాలు అలవాటు అయ్యే పరిస్ధితులు రానియ్యకు" నన్ను తనమీదకి లాక్కుంటూ అన్నాడు.
"ఛీ...సిగ్గు లేకపోతే సరి!" అంటున్న నా పెదవులని తననోటితో బంధించాడు. మడి, తడి, పూజా పునస్కారం కలఇంటిలో పుట్టిపెరిగిన నాకు ఆ వాసనకీ, ఆ చర్యలకీ కడుపులో తిప్పేసింది.
వివేక్ కాసేపయ్యాకా- "యూ ఆర్ ఏ వెజిటబుల్!" అన్నాడు.
అతను తాగుతాడు అన్న విషయం నాకు చిన్న విషయంగా తోచలేదు. మరునాటికీ నాకు ఒళ్లుతెలీని జ్వరం వచ్చింది ఆ జ్వరంలో అమ్మమ్మని కలవరించానట. పనిమనిషి చెప్పింది.
వివేక్ హాస్పిటల్ కి వెళ్లలేదు. ఇంటిదగ్గరే వున్నాడు నేను మగతగా పడుకున్నాను.
"ఊఁ...బ్రెడ్ తిను" వివేక్ కీ అందించబోయాడు.
"ఉహూ! వద్దు"
"పాలైనా తాగు. నీరసం వస్తుంది"
"నాకొద్దు"
"పోనీ ఏంకావాలోచెప్పు ఇస్తాను"
"నిజంగా ఇస్తారా?"
"ఊఁ..."
"అయితే అమ్మమ్మ కావాలి!" అని ఏడ్చాను.
వివేక్ లేచి మౌనంగా వెళ్ళిపోయాడు. తెల్లారేసరికే అమ్మా, అమ్మమ్మా వచ్చారు.
వాళ్లని చూసి నేను లేచి కూర్చున్నాను. అమ్మమ్మ నన్ను కావలించుకుని, "నా బంగారుతల్లీ! ఎంత చిక్కిశల్యమయ్యావే!" అంటూ శోకాలు పెట్టింది.
వివేక్ కీ ఇందతా నచ్చదని తెలుసు బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండానే హాస్పిటల్ కీ వెళ్ళిపోయాడు.
* * *
సాయంత్రం వివేక్ ఇంటికి వచ్చేసరికి చాలా హడావిడిగా వుంది.
అమ్మమ్మ నాకు నూనెబట్ట కాల్చి దిష్టీ తీస్తోంది. కార్పెట్ ఎత్తి గోడవారగా పెట్టివుంది. నా చుట్టూ అమ్మమ్మ మండుతున్న బట్ట తిప్పుతోంది.
"వాటీజ్ దిస్ నాన్సెన్స్?" అరిచాడు వివేక్
అతను రాకను గమనించిన క్రింద వాటా ఆవిడా. పై వాటా ఆయనా గబగబా ఇంట్లోకి వస్తూ-
"వచ్చావా బాబూ! ఇందాకట్నుంచీ నీకోసమే చూస్తున్నాం ప్లాట్స్ లో వుండే పద్ధతి ఇదేనా? నలుగురూ నడిచే దారిలో ఈ ముసలావిడ అడ్డమైనవీ దిగుదుడిచి పారేసి, ఇది మా స్ధలం, మా మెట్లూ అంటోంది" అన్నాడు పై ఆయన.
"జ్వరం వస్తే మందు వేసుకోవాలి గానీ ఈ దిష్టి మంత్రాలేవిటండీ డాక్టర్ గారూ?" అంది పక్కింటావిడ హేళనగా నవ్వుతూ
వివేక్ సిగ్గుపడ్డట్లు తలవంచుకుని- సారీ! మీకు ఇన్ కన్వీనియన్స్ కలిగించారు వీళ్ళు పెద్దావిడ ఏదో చాదస్తం. నేను చెప్తాలెండి" అన్నాడు.
అమ్మమ్మ గొంతు పెంచి
"అదేవిటి నాయనా? నువ్వూ ఇదేదో పెద్ద తప్పన్నట్లు మాట్లాడుతున్నావు. పిల్ల చూడు సరైనతిండీ తిప్పలూ లేక ఎలా చిక్కి పోయిందో? నరదృష్టికి నల్లరాయికూడా నుగ్గు అవుతుంది" అంది.
"అక్కడికీ మీ పిల్లకి దిష్టీ పెట్టడం తప్ప మాకేం పని లేదా?" అని పక్కావిడ పోట్లాటకి దిగింది.
వివేక్ వాళ్ళకి ఏదో సర్దిచెప్పిపంపించి, "అనూహ్యా నీకైనా వుండాలి కామన్ సెన్స్! ఏవిటీ మూఢనమ్మకాలు!" అన్నాడు.
"కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్ కామన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్" అన్నాడు బొమ్మకంటి గంగాదరం అనబడే బొంగరంమావయ్య.
"ఛీ...ఛీ...బుద్దుండాలి!" అంటూ వివేక్ టేబుల్ మీదున్న నీళ్ళజగ్గు తీసుకుని మంటలార్పాడు.
బొంగరం మావయ్య ఆ మాటల వాడికి భయపడి అక్కడనుండి జారుకున్నాడు.
"మూర్ఖులంకదా! మూఢనమ్మకాలే వుంటాయి" నీరసంగా వున్నా ఊరుకోలేక అన్నాను.
"నీ చదువెందుకటా? ఇలా ఇల్లు తగలబెట్టడానికా?" అన్నాడు వివేక్ కొపంగా.
అమ్మమ్మ నొచ్చుకుంటూ-
"అయ్యో! అలా ఆర్పేసేవేమిటి నాయనా? పిల్లకి ఎంత దిష్టో చూశావా?" అంది.
వివేక్ విసురుగా నా దగ్గరకొచ్చి నా ముఖం ఎత్తి "ఈ కుంకుమాబొట్లూ, జబ్బలకి తాయెత్తులూతో రోగాలు నయమవవు. ఆ సంగతి చదువురాని పల్లెటూరి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నీకు కూడా తెలియక పోవడం క్షమించరాని విషయం. అందులోనూ నువ్వు ఓ డాక్టర్ భార్యని గుర్తుంచుకో!" అన్నాడు.
అమ్మమ్మ మాటకి ఎదురుచెప్పడం. ఆవిడ పనిలో తప్పుపట్టడం ఆవిడ సహించలేకపోయింది. కానీ అవమానాన్ని దిగమింగి-" ఆడపిల్లని ఇచ్చుకున్నాక తప్పుతుందా, ఏమన్నా భరించి కడుపులో దాచుకోవాల్సిందేగా " అంది.
నా జ్వరం తగ్గేవరకూ వివేక్ మందులూ, అమ్మమ్మ గుడులూ మారుస్తూనేవున్నారు.
అమ్మ ఉపవాసాలతో చిక్కిపోయింది.
ప్రతిరోజూ అమ్మమ్మ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆయాసంతో మెట్లెక్కి వస్తూ వుంటే నా గుండె కరిగిపోయేది.
నాకు జ్వరం తగ్గింది. ఆ రోజే పథ్యం తిన్నాను.
"నువ్వూ, అబ్బాయీ కూడా ఒకసారి గుడికి రండి. సహస్రార్చన చేయిస్తానని మొక్కుకున్నాను" అంది అమ్మమ్మ.
నేను భయం భయంగా ఆవిడ అన్న మాటలు వివేక్ తో చెప్పాను.
"నాకు ఇలాంటివాటిమీద నమ్మకం లేదు. నేనే కాదు ఈ చాదస్తాలు నువ్వు చేసినా ఇష్టంలేదు. కానీ వాళ్ళకోసం నువ్వు వెళ్తే వెళ్ళు" అన్నాడు.
అమ్మమ్మకి ఈ విషయం చెప్పడానికి నేను పడిన మానసిక వేదన చూసేవారికి అర్ధరహితంగానూ, నాకు ఘరణ సదృశంగానూవుంది.
ఇటువంటి చిన్నచిన్న విషయాలు ఎంత పెద్దగా కష్టపెడ్తాయో నాకు తెలిసినట్లయింది.
అమ్మమ్మ ఈ విషయం విని-
"అదేవిటే, ఆడది చివరికి పూజాపునస్కారాలకి కూడా తన ఇష్టంమీద కాకుండా మొగుడి ఇష్టంమీద ఆధారపడాలా? ఈ శతాబ్దం చివర్న మీరు నేర్చుకున్న స్వేచ్ఛ ఇదా?" అంది.
నేనూ, అమ్మా, అమ్మమ్మా ముగ్గురం మూడుతరాలకీ ప్రతినిధులం! అమ్మమ్మకున్న స్వేచ్చాభావాలు అమ్మకు లేవు. అమ్మకున్న ఫ్రీడమ్ నాకు లేదేమో!
అమ్మా, అమ్మమ్మా ఊరికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎప్పుడూ నన్నే రమ్మనమని రాసేవారు కానీ వాళ్ళు రాలేదు.