"ఓరి సచ్చినోడా! బంగారంలాంటి పండును నేలపాలు చేశావు!" అంది మల్లమ్మ.
"కుళ్ళిపోయింది ఇచ్చావు. ఇంకోటి ఇయ్యి!" చేతిని చొక్కాకు తుడుచుకుంటూ అడిగాడు నాగేషు.
"దొంగ సచ్చినోడా! ఇంకోటి ఇయ్యాలా! పో దూరంగా!" కళ్ళెర్రజేసి కసిరింది మల్లమ్మ.
నాగేషు ముఖంలో దుఃఖం, కోపం ముప్పిరిగొన్నాయి. దుకాణం దరిదాపుల్లోనే పళ్ళమ్మిని ఉరిమి ఉరిమి చూస్తూ తిరగసాగాడు. ఆకాశంలో పూర్తిగా వెలుగు ఆరిపోలేదు. కాని గార్డెన్ లో దీపాలు వెలిగాయి.
"మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడి పళ్ళకు రష్యాలో చాలా గిరాకిగా వుంది__" రేడియోలో తెలుగులో వార్తలు వినిపిస్తున్నాయి.
మల్లమ్మ నాగేషును దగ్గరకు పిల్చింది. వాడు ఉత్సాహంగా వచ్చాడు. చెంబు అందిస్తూ నీళ్ళు తెమ్మంది. వాడు చెయ్యి చాపలేదు. "ముందు పండు ఇవ్వు నీళ్ళు తెస్తాను."
"ఇచ్చాగా?"
"అది కుళ్ళిపోయింది."
"రేపిస్తాలే."
"ఉహూ! ఇప్పుడే ఇవ్వాలి!"
"ఇస్తాలే నీళ్ళు తే!"
"అదేం కుదరదు. ముందు పండిస్తేనే!" మొండిగా అన్నాడు నాగేషు.
"దొంగసచ్చినోడా! ముప్పయ్ పైసల కూజా ముక్కలు చేశావు. ఆరణాల పండు, బంగారంవంటి పండు మట్టిపాలు చేశావ్" అంటూ మల్లమ్మ చెంబు తీసుకొని లేచి నిలబడింది. దుకాణం కేసి ఓసారి పరీక్షగా చూసుకుంది.
"బాబుగారూ!" తమవైపే చూస్తున్న విశ్వనాథం గారిని సంబోధించింది. మల్లమ్మ ఏమీ చెప్పకపోయినా పళ్ళమ్మి ఉద్దేశాన్ని గ్రహించారు విశ్వనాథంగారు. మల్లమ్మ తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది. అలా పోతున్న మల్లమ్మనీ, కింద గోనెపట్టామీద పరచివున్న పళ్ళనీ మార్చి మార్చి చూశాడు నాగేషు. ఒకడుగు ముందుకువేసి, ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా బెంచీమీద కూర్చున్న విశ్వనాథంగారివైపు చూశాడు. ఆయనగారు తనను గమనిస్తున్నట్లు చూసి, ఏమీ ఎరగనట్లు దూరంగా నిలబడ్డాడు. దారేపోతున్న కుక్కమీద గడ్డ విసిరాడు.
ఇదంతా గమనిస్తున్న విశ్వనాథంగారికి ఓ తమాషా ఆలోచన వచ్చింది. తను గమనించనట్టే కూర్చుంటే నాగేషు ఏం చేస్తాడో! ముఖం తిప్పుకొని దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నట్లు కూర్చున్నారు జడ్జిగారు. నాగేషు అటూ ఇటూ చూసి, రెండుసార్లు విశ్వనాథంగారి ముందుగా అటూ ఇటూ నడిచాడు. ఆయనకు నవ్వొచ్చింది. వాణ్ణి గమనించనట్లే దీక్షగా మరోవైపుకు చూడసాగాడు. నాగేషు పండ్ల దుకాణం దగ్గిరకు, నడవాలనే ఉద్దేశం లేనట్లే నడిచాడు. అటూ ఇటూ ఓసారి చూసి వంగి, గబుక్కున ఓ పండుతీసి చొక్కాకింద పెట్టుకొని విశ్వనాథంగారివైపు చూశాడు. ఆయన తనను గమనించలేదని నిశ్చయించుకున్నాక ఆయనగారు కూర్చున్న బెంచీ వెనక్కు వెళ్ళి, బెంచీకింద గడ్డిలో పెట్టాడు. పండుమీద ఆ పక్కనేవున్న ఎండుటాకుల్ని కప్పాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్లు వచ్చి బెంచీ చేతిమీద కూర్చుని, ముందుకూ వెనక్కూ ఊగుతున్నాడు. విశ్వనాథంగారు సర్ధుకొని కూర్చుని నాగేష్ ముఖంలోకి చూశారు. వాడి కళ్ళల్లో ఏదో సాధించినట్లు సంతృప్తి వెలుగుతోంది. విశ్వనాథంగారు తనవైపే చూడటం గమనించిన నాగేష్ గుర్రాన్ని వేగంగా నడిపిస్తున్నట్లు ఆటలో మునిగిపోయాడు. మల్లమ్మ తిరిగి వచ్చింది. అనుమానంగా పళ్ళకేసి చూసుకుంది. మళ్ళీ నాగేషుకేసి చూసింది. విశ్వనాథంగారి ముఖంలోకి చూసి యేదో అడగబోయి మళ్ళీ ఊరుకుంది. పళ్ళను చేత్తో తాకి లెక్కపెట్టుకుంది. తల గోక్కుంటూ ఆలోచనలో పడింది మల్లమ్మ. బొడ్లోనుంచి డబ్బులసంచి తీసి డబ్బులు లెక్క చూసుకోసాగింది. నాగేష్ మల్లమ్మను చూస్తున్నాడు. విశ్వనాథంగారు పసివాడి ముఖంలోని భావాలను చదవసాగారు.
"ఏం అవ్వా! నా పండు ఇస్తావా లేదా!" కళ్ళేగరేస్తూ ప్రశ్నించాడు నాగేష్. ఈసారి వాడి స్వరంలో మొదటి దైన్యం లేదు. మల్లమ్మ మాట్లాడకుండా చిల్లర డబ్బులు సంచిలోవేసి, మూటకట్టి, మళ్ళీ బొడ్లో దోపుకుంది.
నాగేషు బెంచీదిగి మల్లమ్మ దగ్గిరగా వెళ్ళి చేతులు వెనక్కు కట్టుకొని నిల్చుని "నా పండు నా కిస్తావా లేక తీసుకోమంటావా!" అన్నాడు కనుబొమ్మల్ని ఎగరేస్తూ.
"దొంగ వెధవ! ఈ ముసల్దాన్ని ఎంత ఏడిపిస్తున్నాడు! అయినా ఆ మల్లమ్మది మాత్రం తప్పుకాదా!" జడ్జీగారు మీ మాంసలో పడిపోయారు. ఆ సంఘటన అంతా తను కళ్ళారా చూశాడు. అంటే తను ఐ విట్నెస్ అన్నమాట!" దేముడి ముందు ప్రమాణంచేసి, ఉన్నదున్నట్లూ, జరిగింది జరిగినట్టూ, అంతా నిజమే..." బోనులో నిలబడిన ప్రాసిక్యూషన్ సాక్షి కధనం, జడ్జీగారి బుర్రలో గిర్రున తిరిగింది.
కుర్రాడిచేత పనిచేయించుకున్న మల్లమ్మ అతడికి ప్రతిఫలం ముట్టజెప్పాలి. అంటే పండు వాడికి న్యాయంగా రావాల్సిందే! "ఆమె ఇచ్చింది కుళ్ళిపోయింది" అని వాడంటాడు. ఆమె కుళ్ళిపోలేదంటుంది. నిర్ణయించాల్సింది వాళ్ళిద్దరూ కాదు. "కుళ్ళిన పండు కాకపోతే పారెయ్యడు కాబట్టి అది కుళ్ళిందే అయివుండాలి!" నేచురల్ ఇన్ఫరెన్స్!
అయితే కూజా పగులగొట్టి మల్లమ్మకు నష్టం కలిగించాడు వాడు. వాడికి మించిన బరువు మోయమన్నది అది. యాక్సిడెంటల్ గా కింద పడిపోయాడు వాడు. కాబట్టి నాగేషు నిర్దోషి. మల్లమ్మకు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. "దేర్ ఫోర్! మల్లమ్మ నాగేషుకు వాడి శ్రమకు ప్రతిఫలంగా__వాడు కోరినట్టు__మామిడిపండు ఇవ్వాల్సి వుంది. కాని ఆమె ఇవ్వలేదు. అయినా వీడు తీసుకున్నాడు దటీజ్ ఇల్లీగల్! టాంట్ అమౌంట్ టూ క్రైం. అది నేరం....అంతేకాదు....నేరాన్ని దాస్తున్నాడు. అది మరొక కౌంట్ కింద శిక్షార్హం. పైగా మల్లమ్మను పండివ్వమని బెదిరిస్తున్నాడు. దట్ కమ్స్ అండర్ సెక్షన్....మల్లమ్మ లేచి నిలబడి జడ్జీగారి ముందుకొచ్చి ప్రాధేయపూర్వకంగా న్యాయాన్ని అర్ధించింది. నాగేషు భయంగా బెదురుగా జడ్జీగారి కళ్ళలోకి చూశాడు. జడ్జి విశ్వనాథంగారి ముఖం గంభీరమయింది. ఏది ఏమయినా నాగేషు 'లా' తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాడి కా అధికారం లేదు, పసితనం కావచ్చు! తెలియక చేసినా నేరం నేరమే! శిక్షార్హమే!....
జడ్జీ విశ్వనాథంగారు బెంచీమీదనుంచి చివాల్న లేచి నిలబడ్డారు. "ఓ అమ్మా! బల్లకింద చూడు!"