Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 10

    విశ్వనాథంగారి మాటలు మల్లమ్మ పూర్తిగా అర్ధం చేసుకొనే ప్రయత్నంలో వుండగానే, నాగేషు బల్లకింద దూరి, పండును తీసుకొని పరుగు లంకించుకొన్నాడు.

    "అయ్యో! అయ్యో! అర్ధరూపాయి పండర్రో! నీ జిమ్మడ! నీకు పొయ్యేకాలం రాను!" అంటూ మల్లమ్మ శక్తికొలదీ నడక రూపంలోవున్న పరుగులోనే వెంటపడింది.

    విశ్వనాథంగారు చేతికర్ర తీసుకొని ముందుకు సాగారు. రోడ్డుమీద బ్రహ్మరాక్షసి అట్టహాసంలా లారీ ధ్వని వినిపించింది. వెంటనే జనం కేకలు. విశ్వనాథంగారు పబ్లిక్ గార్డెన్ గేటుదాటి రోడ్డుమీదకు వచ్చాడు. ఎదురుగా లారీ, దానిచుట్టూ జనం. పళ్ళమ్మి మల్లమ్మ "అయ్యో బిడ్డా! "అంటూ రోదిస్తోంది.విశ్వనాథంగారు జనాన్ని తోసుకొని ముందుకు వచ్చారు.

    ఒక పసివాడి చెయ్యీ....ఆ చేతికి పక్కగా రక్తపు మడుగులో చితికిపోయిన మామిడిపండూ....ఉరిశిక్ష వేయబడినవాడి కాళ్ళకింద బల్లలా, జడ్జీగారి కాళ్ళకింద నేల దూరమయింది. విశ్వనాథంగారు శరీరాన్ని రిక్షాలో వేసుకొని ఇంటికి చేర్చుకున్నారు.

    రిక్షాదిగి లోపలకు వస్తున్న విశ్వనాథంగారికి, అప్పుడే గేటులోంచి బయటకువస్తూ ఒక పంచెకట్టు పెద్దమనిషి తారసపడ్డాడు. విశ్వనాథంగార్ని చూసి ఆయన తత్తర బిత్తరలాడుతూ, రోడ్డుమీద ఆగివున్న టాక్సీలోకి దూకి అదే పోతపోయాడు.

    ఎవరు! ఎక్కడో చూసినట్టుందే.

    జడ్జీగారు ఆలోచించే మానసిక స్థితిలో లేరు.

    హాల్లోకి ప్రవేశించిన విశ్వనాథంగారికి పెద్ద మామిడిపండ్ల గంప ఒకటి స్వాగతం పలికింది. నిశ్చేష్టుడై నిలబడ్డ భర్త చేతిలోని ఒంకికర్ర అందుకొంది పార్వతమ్మ.

    "ఏమిటవి?"

    "మామిడిపళ్ళు! కనిపించటంలా!" అంటూ పార్వతమ్మ వంటింట్లోకి వెళ్ళింది.

    పళ్ళగంపను చూస్తూ కుర్చీలో కూలబడ్డారు విశ్వనాథంగారు. అంతలో పార్వతమ్మ ఓ పెద్ద వెండిగ్లాసుతో తిరిగి వచ్చింది.

    పార్వతమ్మ చేతిలోవున్న గ్లాసు చూస్తూ "ఏమిటది?" అన్నారు విశ్వనాథంగారు

    "రెండు పళ్ళు తీస్తేనే గ్లాసుడు రసం వచ్చింది. పెద్దరసాలు గదూ?" అంటూ గ్లాసు అందించబోయింది.

    జడ్జి విశ్వనాథంగారు గుండెమీద చెయ్యి వేసుకొని యింకా అది ఆగిపోకుండా ఆడుతూనే వున్నందుకు ఆశ్చర్యపోయారు.

    భార్య  కాళ్ళకేసి చూశాడు. అవి యింకా నేలమీదే ఆనివుండటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది.
    (యువ మాసపత్రిక, దీపావళి ప్రత్యేక సంచిక 1977)

   
                                   ఆమె

    "కలెక్టర్ గారి భార్య, రిక్షా ఎలా ఎక్కుతుందోయ్?" అనేసి, నేను రిక్షా ఎక్కి కూర్చున్నాను. రిక్షావాడు ఆమెకేసి చూస్తూ ఏదో గొణిగాడు. అంతవరకూ నిలువునా చిటపటమంటూ పడుతూన్న చినుకులు, హఠాత్తుగా గాలి విసురుకు రిక్షాలోకి దూసుకు వచ్చినై. రిక్షా ముందు వున్న పట్టా కిందకి జార్చి పక్కగా ఆమెకేసి చూశాను.

    ఆమె కూడా నాకేసే చూస్తోంది. వాన జల్లుకు షెల్టర్లో నిల్చున్నదల్లా ఇంకొంచెం వెనక్కు జరిగి నిల్చున్నది. ఆమె మొహాన కత్తివాటుక్కూడా నెత్తురుచుక్క లేదు. ఆలిచిప్పల్లాంటి ఆ పెద్ద కళ్ళను తెరిచి నిస్తేజంగా నాకేసి చూస్తోంది. పెదాలు కదిలినట్లు కన్పించాయి. నాలో ఏదో జాలి. నా మాటల్తో అంత బాధ పెట్టానా? పాపం! అనిపించింది. స్వాంతన వచనాల్తో క్షమించమని అడుగుదామనుకున్నాను. కాని ఆత్మాభిమానం ఎదురు తిరిగింది.

    రిక్షావాడికి వెళ్ళవలసిన చోటు చెప్పి, తిరిగి ఆమెకేసి తల తిప్పాను. అంతలోనే హారన్ కొడుతూ ఒక బస్సు....రెండు...దిగే జనం...ఎక్కే జనం...ఆమె నా దృక్పథం నుంచి తప్పుకుపోయింది.

    రిక్షావాడు తల వొంచుకొని పరుగెడుతున్నాడు. గాలి విసిరినప్పుడల్లా చినుకులు సూదుల్లా వచ్చి నా మొహాన్నీ, కాళ్ళనూ తాకుతున్నాయి. పెళపెళమనే ఉరుములతో ఆకాశభాండం ఓడిపోయినట్లు పేలవంగా ధ్వనిస్తోంది. నా దురుసుతనానికీ, తొందరపాటుకూ మనస్సు చివుక్కుమన్నది.

    ఆమెను__అవును__ఆమె పేరు కూడా నాకు తెలీదు; అంత కర్కశమైన మాటల్తో పరిహసించవలసింది కాదు! స్త్రీ సహజమైన సానుభూతి, సహనాల్లాంటివి మరొక స్త్రీ విషయంలో ఎందుకు చూపలేకపోయానా అన్న అనుమానం, సంశయం నన్ను బాధిస్తోంది.

    రిక్షా వాకిటిముందు నిల్చింది. నా ఆలోచనల్తో.....అన్యమనస్కంగా రిక్షా దిగి డబ్బులిచ్చి మెట్లు ఎక్కాను. అమ్మ వాకిట్లో నిలబడి వుంది. నన్ను చూస్తూనే ఆదుర్దాతో కూడిన ముఖంమీదికి, పట్టరాని కోపాన్ని తెచ్చిపెట్టుకుని-

    "గొడుగు ఎందుకు తీసుకెళ్ళలేదు?" అంటూ ప్రారంభించింది.

    ఇక అలాంటి సమయాల్లో నేను జవాబు చెబితే అమ్మ చదవబోయే కుమారీ శతకం నాకు తెలియంది కాదు.

    "పెద్దవాళ్ళంటే లక్ష్యం వుండాలి. నేనన్నా, నా మాటలన్నా దూడపుల్లాయి కింద కట్టేస్తావు."
    నేను కిక్కురుమనకుండా కాళ్ళు కడుక్కుని, వానజల్లుకు తడిసిన జుత్తును తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. బయట వానజల్లు తగ్గినట్లుగా వుంది. కిటికీ రెక్క పక్కకు నెట్టి ఆకాశంకేసి చూశాను. మబ్బులు విచ్చిపోతూ సూర్యకిరణాలకు దారి ఇస్తున్నాయి. అంతా మద్రాసు వాతావరణం. అంతలో వాన, అంతలో ఎండ!
 
    ఆమె మానసికతత్వం అంతేనేమోననిపించింది. ఎంత హుందాతనం__ఎంత ధీమా, దర్పం ప్రదర్శించింది! అంతలోకే అబలలా, ఛాయామాత్రంగానైనా వ్యక్తిత్వం లేని దానిలా....అంతా ఒక్క మాటతో__

                                                  *    *    *

 Previous Page Next Page