Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 8

    అంతలో ఆ కురాడు నెత్తిమీద మూడు ఇటుకల్ని పెట్టుకొని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నిలబడ్డాడు. వాడి నెత్తినుంచి ఒక్కొక్క ఇటుకే తీసి కింద పెట్టింది. కుర్రాడు చేత్తో నెత్తి రుద్దుకున్నాడు.

    "ఇంకో మూడు తీసుకురారా నాగేషూ!"   

    కుర్రాడు మళ్ళీ పరుగెత్తాడు హుషారుగా విశ్వనాధంగారు ఉరుకులు తీస్తున్న కుర్రాన్నీ, పళ్ళమ్మనీ చూసి ముత్తవా మనవడు అయివుంటారనుకున్నాడు. మళ్ళీ కుర్రాడు నెత్తిమీద ఇటుకలతో వచ్చాడు. పళ్ళమ్మి ఇటుకల్ని అందుకుంది. ఈసారి రెండు చేతుల్తో నెత్తి రుద్దుకుంటూ, ముఖం అదోలా పెట్టి కుర్రాడు "మల్లమ్మోయ్! ఇంక సాలా!" అన్నాడు.

    మల్లమ్మ ఇటుకల్ని చక్కగా పేర్చి వాటిమీద కూర్చుంది. కుర్రాడు ఎదురుగా నిల్చొని పళ్ళవంకే చూస్తున్నాడు.

    విశ్వనాథంగారు కుర్రాణ్ణి పరిశీలనగా చూశారు. వాడు ఆమె మనమడు కాడు, అయితే అలా పేరుపెట్టి పిలవడు. ఆమె కూడా అలాంటి పనులు చేయించదు. పైగా వాడి రూపం! కాళ్ళూ, చేతులూ, సన్నగా నల్లగా ఎండిపోయిన పుల్లల్లా వున్నాయి. పెద్ద తలా, గుండ్రటి ముఖం, నిరుసోగకళ్ళు. ఆ కళ్ళల్లో, బాలసహజమైన అమాయకత్వం, చాంచల్యం గోచరిస్తున్నాయి. వాడి పొట్ట, జీవితంలో తన ప్రాముఖ్యం ఎంతగా వుందో చూపించటానికి అన్నట్లు ముందుకు పెరిగి వుంది. లాగు కుడికాలు చిరిగి మోకాలు దగ్గరగా వేలాడుతోంది. చొక్కా ఎడంచెయ్యి భుజంవరకే వుంది. పళ్ళమ్మి ఆ కుర్రాణ్ణి మళ్ళీ "ఒరేవ్ నాగేషూ!" అని పిలిచింది.

    కుర్రాడు ఉత్సాహంగా ముందుకు వెళ్ళాడు. జడ్జిగారు కుతూహలంగా వాళ్ళకేసి చూడసాగాడు.

    మల్లమ్మ అందించిన ఓ పెద్ద కూజాను తీసుకొని కుర్రాడు పరుగుతీశాడు. ఓసారి పడబోయి తమాయించుకున్నాడు.

    "ఒరేయ్ నాగేషూ! పడేవ్! కూజా జాగ్రత్త!" మల్లమ్మ హెచ్చరికలో 'కుర్రాడు పడితే', కూజా పగులు తుందేమోనన్న పాయింటే ముఖ్యం అని జడ్జీగారికి అర్ధం అయింది.

    అప్పటికే చాలాదూరం వెళ్ళిపోయాడు నాగేషు. నాగేష్ చక్కని పేరు. పిల్లవాడికి తల్లిదంద్రులున్నారా? వాడెవడు? ఎందుకిలా వుంటాడు? ఆలోచిస్తున్న విశ్వనాథంగారికి తన చిన్నతనం గుర్తొచ్చింది. అంతలో అతి వైభవంగా పుట్టినరోజు జరుపుకొంటున్న కొడుకు కళ్ళకు కనిపించాడు. నిండు కూజాను రెండు చేతులతో పొట్టకు అదిమపట్టుకు అతి కష్టంగా ఒక్కొక్క అడుగే వేస్తూ అల్లంత దూరంలో, ఎదురుదెబ్బ తగిలి బొక్కబోర్లాపడిన నాగేషుచూసి జడ్జీగారి మనస్సు కలుక్కుమంది. 'అయ్యో నా కూజా' అంటూ మల్లమ్మ పరుగుతీసింది నాగేష్ దగ్గరకు. ముక్కలయిన కూజాను దిగులుగా చూస్తూ, మల్లమ్మ వేస్తున్న మొట్టికాయల్ని తింటూ అపరాధిలా నిల్చున్నాడు. జడ్జీగారి ఏం చెయ్యాలో తోచలేదు. సానుభూతితో చూశారు.

    "ఊరుకో పాపం, చెయ్యాలని చెయ్యలేదుగా!" ఆ పక్కనే కూర్చొని భర్తతో కబుర్లు చెబుతూ పల్లీలుతింటున్న ఓ యువతి అంది.

    మల్లమ్మ నాగేషును తిట్టుకుంటూ వచ్చి దుకాణం దగ్గర కూర్చుంది. నాగేషు పిల్లిలా వచ్చి పళ్ళదుకాణానికి అల్లంత దూరంలో నిల్చున్నాడు. అశాంతిగా అటూ ఇటూ తిరగసాగాడు. వాడి అవస్థ అంతా పళ్ళమ్మి మళ్ళీ పిలవాలనే అని అర్ధంచేసుకున్న విశ్వనాథంగారు లోలోపల నవ్వుకున్నారు. మల్లమ్మ వాడిని గమనించనట్లే కూర్చుని పళ్ళు అమ్ముకోసాగింది. నాగేషు విశ్వనాథం కూర్చున్న బెంచీకి వెనగ్గా వచ్చి నిలబడ్డాడు....

    "ఇట్టా రారా! సచ్చినోడా!" పిల్చింది మల్లమ్మ. నాగేషు ఉత్సాహంగా ముందుకు దూకాడు.

    తట్టలో గుడ్డకిందగా వున్న చెంబుతీసి ఇచ్చింది మల్లమ్మ. వాడు హుషారుగా చెంబు తీసుకొని పరుగెత్తుకెళ్ళాడు. అయిదు నిమిషాల్లో నీళ్ళు తెచ్చి పళ్ళమ్మికి అందించాడు. పళ్ళమ్మి చెంబెడు నీళ్ళు గటగటా తాగేసి, కొద్దిగా మిగిల్తే విసిరికొట్టి, మళ్ళీ చెంబును తట్టలో పెట్టుకొంది. ఈసారి నాగేషు మల్లమ్మకు ఎదురుగా గొంతుకూర్చున్నాడు. అరచేతిలో గడ్డాన్ని ఆనించుకొని,  పెద్ద కళ్ళను పూర్తిగా విప్పుకొని మామిడిపళ్ళకేసి చూడసాగాడు. పెదవులు తడుపుకుంటున్నాడు. వాడి కళ్ళలో మామిడిపళ్ళ తాలూకు పసిమి తళుక్కుమంది.

    పళ్ళమ్మి వాడిని కళ్ళతోనే దగ్గిరకు పిలిచి యేదో చెప్పింది. నాగేషు ఆమె పక్కన నిలబడి "మామిడిపళ్ళూ! రసాలు! పెద్దరసాలు. ఒక్కసారి తిని చూడండి!" అంటూ గట్టిగా కేకలు పెడుతుంటే, గొంతు నరాలు ఉబుకుతున్నాయి. విశ్వనాథంగారు నాగేషునూ, మల్లమ్మనూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. వ్యాపారం జోరుగా సాగింది. చాలావరకు పళ్ళు అమ్ముడుపోయాయి.

    వాగేషు మల్లమ్మ దగ్గరగా వెళ్ళి చెయ్యి చాపాడు. "చచ్చినోడ! ఏం తొందర్రా! ఇస్తాలే! ఇంకా సగామన్నా అమ్ముడుపోలేదు." అంది మల్లమ్మ. నాగేషు మళ్ళీ కేకలు పెట్టాడు! తారాస్థాయిలో వాడి కంఠస్వరం కీచుమంటున్నది. మరో పావుగంటలో పళ్ళన్నీ అమ్ముడుపోయాయి.

    కుర్రాడిలో సహనం నసిస్తున్నట్లు గమనించారు విశ్వనాథంగారు. వాడు అరవటం మానేసి దుకాణం దరి దాపుల్లోనే అశాంతిగా తిరగసాగాడు. అంతలో ఓ పాతిక సంవత్సరాల యువకుడు, ఓ ఐదేళ్ళ కుర్రాణ్ణి వెంటబెట్టుకొని పళ్ళదుకాణంకేసి వచ్చాడు. ఒక పండు కొని ఇచ్చాడు. నాగేషు కుతూహలంగా చూస్తూ కుర్రాడి పక్కగా వెళ్ళి నిల్చున్నాడు. ఓ చేత్తో రసం పీలుస్తూ, మరో చేత్తో తండ్రి చెయ్యి పట్టుకొని వెళుతున్న, ఆ కుర్రాడి వెనకే నాగేషు కొంతదూరం నడిచాడు. పండుతింటున్న కుర్రాడి ముఖంలోని ఆనందాన్ని అందిపుచ్చుకొని నాగేషు తిరిగి మల్లమ్మ దగ్గిరికొచ్చి నిలబడ్డాడు. ఈసారి వాడి ముఖంలో మొండితనం కనిపించింది. పళ్ళమ్మి ఓ నిముషం వాడి ముఖంలోకి చూసి ఏమనుకుందో, తట్టలో చెయ్యిపెట్టి, ఓ చిన్న పండు తీసి నాగేష్ చేతిలో విసురుగా వేసింది. నాగేషు ఆశగా అందుకున్నాడు. ఆ పండు తాలూకు స్పర్శవల్ల హృదయంలో కలిగిన ఆనందం కళ్ళలో మెదిలింది. ఆత్రంగా మూతిదగ్గర కొంచెం కొరికి పండు రసం జుర్రుకున్నాడు నాగేషు. క్షణంలోనే వాడి ముఖం వికృతంగా మారిపోయింది. నోట్లో మిగిలిన రసాన్ని ఊసేసి, చేతిలో పండును నేలకు కసిగా విసిరికొట్టాడు.

 Previous Page Next Page