"బాబూ ! నామాట వినండి. మిమ్మల్ని భద్రంగా దుమ్మలగూడెం చేర్చే బాధ్యతను పూర్తి చెయ్యనివ్వండి. అది ప్రమాదకరమైన మార్గం. నామాట వినండి."
నాకు వళ్ళు మండిపోయింది.
వాడికి సమాధానం ఇవ్వడంకూడా అనవసరం అనుకొన్నాను.
ముందుకు చకచక నడువసాగాను.
ఇక లాభం లేదన్నట్టుగా భూతరాజు నా వెనకే నడవసాగాడు. వాడు వెనక నడవడం నాకు యిష్టంలేదు. వెనుకనుంచి ఏ రాయి తీసుకొని నెత్తి బద్దలుకొట్టినా కొడ్తాడు. అందుకే నేను ఆగాను. అతడ్ని ముందు నడవమన్నాడు. అతను ఓ క్షణం ఆలోచిస్తూ నిలబడ్డాడు.
"ఏమిటాలోచిస్తున్నావు ?"
"ఆఁ ఏం లేదు !" అంటూ ముందుకు నడవసాగాడు.
మళ్లీ ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం.
నాకు భూతరాజును పలకరించాలని ఉంది.
కాని వాడు నడిచే ఊపుచూస్తుంటే పలకరించినా పలికేలాలేడు.
టైం చూసుకొన్నాను.
రెండు గంటలైంది.
భూతరాజు అకస్మాత్తుగా ఆగాడు.
మళ్లీ ఏదో వింటున్నట్టుగా నిల్చున్నాడు.
నాకు వళ్లు మండిపోయింది. ఈ వెధవ ఇంకా ట్రిక్స్ చేస్తూనే ఉన్నాడు.
"ఏమిటి భూతరాజూ ? మళ్లీ ఆ ఆడదాని ఏడుపు విన్పిస్తోందా?"
అతడు పలుకలేదు.
"పలకవేం ?"
"వినండి బాబూ !" వాడి కంఠం అదోలా పలికింది.
"ఏమిటి ? ఆ ఏడుపేనా ?"
"కాదు."
"మరి మగవాడి ఏడుపా ?"
"ఉఁహు !"
"సరిగ్గా చెప్పు !"
"గుర్రంబండి చప్పుడు, గుర్రాల డెక్కల చప్పుడు విన్పిస్తోందా"
"లేదే !"
"సరిగ్గా వినండి." భూతరాజు ఈసారి నిజంగా భయపడుతున్నట్టే అన్నాడు.
నాకు దూరంనుంచి గుర్రపు డెక్కల శబ్దం విన్పించింది. "అవును భూతరాజూ ! గుర్రంబండి వస్తోంది. ఖాళీబండి అయితే దుమ్మలగూడెం ఆ బండిలోనే వెళ్లొచ్చును !" అంటూ భూతరాజు ముఖంలోకి చూసి తెల్లముఖం వేశాను.
భూతరాజు ముఖంలో భయం. ముఖంమీద చమట్లు పడుతున్నాయి.
"వద్దుబాబూ ! ఆ బండి ఎక్కొద్దు. తొరగా రండి ఆ దోవన వెళ్దాం." ఖంగారుగా అన్నాడు.
నేను వినలేదు. గుర్రపుడెక్కల చప్పుడు దగ్గరౌతోంది.
భూతరాజులో ఖంగారుకూడా ఎక్కువైంది.
"రండిబాబూ !" అంటూ భూతరాజు వెనక్కు తిరిగి గబగబా నడక సాగించాడు.
నేను అలాగే నిల్చున్నాను.
వాడు నేను వస్తున్నదీ లేనిదీకూడా చూచుకోకుండా గబగబా వెళ్ళిపోతున్నాడు.
నేను తలతిప్పి ముందుకు చూశాను.
వెన్నెల్లో తెల్లటి గుర్రం కాళ్లు తమాషాగా డ్యాన్సు చేస్తున్నాయి. నాకు గుర్రాలంటే ఇష్టం. అవి పరుగెత్తడం చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను.
తలతిప్పి వెనక్కు చూచాను.
భూతరాజు కన్పించలేదు.
నా ఆశ్చర్యానికి అంతులేదు.
ఇంతత్వరగా అడ్డదారి పట్టాడా ? ఏ చెట్లచాటునో దాక్కొని ఉంటాడు. తను ఊహించింది నిజమే. వాడు తనను దుమ్మలగూడెం వెళ్ళకుండా చెయ్యడానికే వచ్చాడు. అతడి చివరి ప్రయత్నంకూడా విఫలమైంది. ఈ రోడ్డుమీద తనను ఖాతం చేసేవాడు. అందుకే వెనక వెనక నడవసాగాడు. వాడిలో దురుద్దేశ్యం లేకపోతే ఈ బండినిచూసి ఎందుకు పారిపోతాడు ?
బండి దగ్గరగా వచ్చింది. అది ఖాళీబండి.
"ఏయ్ ! బండబ్బాయ్ ?" నేను పిల్చాను.
బండి ఆగింది. బండిలోనుండి ఓ యువకుడు దిగాడు. గళ్ల లుంగీ ఖాకీషర్టు తలకు బ్రౌన్ మఫ్లర్, అతను భూతరాజులా భయంకరంగా లేడు. అందంగా ఉన్నాడు. సజ్జనుడిలా ఉన్నాడు.
"ఏం బాబూ! ఎక్కడికెళ్లాలి? ఈ ఏళప్పుడు వంటరిగా నడుస్తున్నారేం?" అన్నాడు బండివాడు.
"దుమ్మలగూడెం వెళ్ళాలి. బండి కడ్తావా ?"
"దుమ్మలగూడెం ఎవరింటి కెళ్ళాలి ?"
"భైరవమూర్తింటికి !"
అకస్మాత్తుగా బండివాడి ముఖకవళికలు మారిపోయాయి. ముఖంలో కండరాలు బిగుసుకున్నాయి. దవడ ఎముకలు పైకీ కిందకూ కదిలాయి. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి.
అతని రూపంచూస్తుంటే నాకు భయం వేసింది.
వీడు ఆ హత్య కేసులో ఉన్నాడేమో ? భూతరాజే నయం. వీడు ఈ క్షణంలో నన్ను చంపేలాగున్నాడు. నా గుండెలో గుబులు పుట్టుకొచ్చింది.
"నీకిష్టం లేకపోతే వద్దులే. నడిచే వెళ్తాను" అని అతన్ని తప్పించుకొని వెళ్ళబోయాను. అతను దగ్గరకొచ్చి నాదారికి అడ్డంగా నిల్చున్నాడు.
"అదేమిటి బాబూ ! బండి కావాలన్నారుగా ! ఎక్కండి."
"నేను ఎక్కను !"
"ఏం బాబూ !"
"నిన్ను చూస్తుంటే నీ బండి ఎక్కాలని లేదు !" అన్నాను మొండికెత్తినట్టు.
"ఏంబాబూ ! నేనంత దుర్మార్గుడిలా కన్పిస్తున్నానా ? భూతరాజు కంటె మంచివాడ్నే !"