Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 8


    "ఇక ఆపు !" గట్టిగా అరిచాను.

 

    నేను భూతరాజును భయపెట్టాలని ఉట్టినే అన్నాను. వాడు భయపడలేదు. పైగా వాడిమాటలు వింటుంటే నాకు రక్తం గడ్డకడ్తున్నట్టు అయిపోతున్నది. ఈ భూతరాజు భూతాలకు రాజులాగే ఉన్నాడనిపించింది.

 

    నేను నడక సాగించాను.

 

    ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం.

 

    కూడదీసుకొన్న ధైర్యంతో నడుస్తున్నానేగాని నాగుండెల్లో ఏవేవో వింతభయాలు కదలసాగాయి.

 

    ఇరుకైన కంకరరోడ్డు తుప్ప పొదల మధ్యనుంచి పాములా తిరిగిపోతూంది.

 

    రోడ్డుకు ఇరువైపులా కొద్దిగజాల దూరంలోనే అడవి ప్రారంభం అయి. చూపు కందినంతవరకూ దట్టంగా అలుముకుపోయి ఆకాశంతో కలిసి పోయినట్టుగా కన్పిస్తోంది. మధ్యమధ్య కొండలు చిన్నవీ పెద్దవీ, బారులు తీర్చి దూరంగా కన్పిస్తున్నాయి. ఆ మసక వెన్నెల్లో అడవీ, కొండలూ, ఆకాశం ఒకదానికొకటి హత్తుకుపోయి ఏది ఎక్కడ ప్రారంభం అయిందో, ఎక్కడ అంతం అయిందో తెలియడంలేదు.

 

    కొండల్లో నుంచి వస్తున్న ఈదరగాలి కొండలు ఈలలు వేస్తున్నట్టుగా అన్పిస్తోంది. ఆ ఈలలూ, కీచురాళ్ల అరుపులూ కలిసి, ఎన్నో కంఠాలు ఒకసారిగా ఏడుస్తున్నట్టు భయంకరంగా విన్పిస్తున్నాయి.

 

    గుండెల్ని జలదరింప జేస్తున్న ఆ శబ్దాలతోపాటు ముందు నడుస్తున్న భూతరాజు కిర్రుచెప్పులు చేస్తున్న శబ్దం ఒకటి.

 

    ఈ శబ్దాలన్నీ కలిసి మృత్యుదేవతకు స్వాగతం పాడుతున్నాయా అన్పించింది నాకు.

 

    భూతరాజు నాముందు పెద్దపెద్ద అంగలు వేసుకొంటూ కొంచెంగా వంగి నడుస్తున్నాడు.

 

    భూతరాజు చెప్పింది నిజమేనేమో ?

 

    ఆ వాతావరణంలో, ఆ సమయంలో నిజానికీ అబద్ధానికీ ఉన్న దూరం చాలా తక్కువ అన్పించింది.

 

    వెన్నెలదుప్పటిని చంద్రుడు ప్రకృతిమీదకు విసిరాడు. దూరంగా ఉన్న వస్తువులు ఇప్పుడు స్పష్టంగానే కన్పిస్తున్నాయి.

 

    తల పైకెత్తి చూచాను. తెల్లటి మబ్బుల్లోనుంచి పుచ్చపువ్వులాంటి వెలుగు కిందకు జారుతూన్నట్టుంది. ఆ వెలుగుమధ్య చందమామ పరుగులు తీస్తున్నాడు.

 

    తలకిందకు దించాను.

 

    నేలంతా విచ్చిన మల్లెపూలు విరజిమ్మినట్టుగా ఉంది.

 

    తల పక్కకు తిప్పాను. కొండ చరియల్లో బొండు మల్లెలు కుప్పలు పోసినట్టుగా ఉంది.

 

    తల రెండోపక్కకు తిప్పిచూచాను.

 

    అడవంతా వెన్నెల. ఆ వెన్నెల్లో చెట్లూ పుట్టలూ తళతళ లాడుతున్నాయి.

 

    నా మనసులో అంతవరకూ గూడుకట్టుకున్న చీకటి కరిగిపోయి వెన్నెల వ్యాపించింది. అంతవరకూ ఉన్న భయం చాలావరకు పోయింది.

 

    నా ఎదురుగా నడుస్తున్న భూతరాజు నీడ రోడ్డుపక్కగా పొడవుగా అతనితోపాటు ముందుకు సాగిపోతోంది.

 

    అతడు ముందుకు పోతున్నాడు.

 

    అతన్ని అనుసరిస్తున్న నాకాళ్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి.

 

    "భూతరాజూ ! అటెక్కడికి ?" అన్నాను ఠక్కున ఆగి.

 

    "ఇటే మనం వెళ్ళాలి!" అంటూ భూతరాజు కాలిబాటమీదే నిలబడ్డాడు.

 

    "మరి ఈరోడ్డు ఎక్కడికి పోతుంది?" రోడ్డుమీదే నిలబడి అడిగాను.

 

    "అది దుమ్మలగూడెం పోతుంది."

 

    నేను తృళ్లిపడ్డాను.

 

    "మనం వెళ్తున్నది దుమ్మగూడెం కాదా?" అన్నాను.

 

    "అవును ! మనం వెళ్ళేది దుమ్మలగూడెమే !"

 

    నాకు వళ్ళు మండిపోయింది. వీడు డిటెక్టివ్ నవలలు బాగా చదువుతాడులావుంది. ప్రతి మాటలోనూ సస్పెన్స్ ఏడుస్తున్నాడు.

 

    "మరి అటెందుకు వెళ్తున్నావ్ ?"

 

    "ఇది దగ్గరిదారి." క్లుప్తంగా అన్నాడు.

 

    "నో ! నో ! నేను ఆ దారినిరాను. దూరం అయినా పర్వాలేదు. ఈ రోడ్డునే వెళ్దాం."

 

    "వద్దుబాబూ ! నామాట వినండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి."

 

    "ఏమిటి వినేది? రోడ్డునే పోదాం పద !"

 

    "ఎందుకు చెప్తున్నానో, పెద్దవాడ్ని చెప్తున్నాను. కాదనకండి. ఆ దారిన వెళ్ళడం ప్రమాదం." భూతరాజు అడ్డదారినే వెళ్ళడానికి నిశ్చయించుకొన్నవాడిలా అన్నాడు.

 

    దొంగవెధవ ! మళ్ళీ ఏదో ఎత్తు వేస్తున్నాడు. ఎలాగయినా తను దుమ్మలగూడెం వెళ్ళకుండా చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇంతవరకూ ఎలాగో వాడి ఎత్తులను తప్పించుకున్నాను. ఇది వాడి చివరి ప్రయత్నం. ఇందులోనుంచి బయటపడితే చాలు.

 

    వెన్నెలకాస్తోంది. రోడ్డునే వెళ్తే ఇంకెంతో దూరం ఉండదు దుమ్మలగూడెం.

 

    "నువ్వెళితే వెళ్ళు అటు. నేను ఇటు వెళ్తాను !" అన్నాను.

 

    అనడమే కాదు. నడక సాగించాను. పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ గబగబా నడుస్తున్నాను.

 

    వాడక్కడే ఆగిపోయినట్టున్నాడు దొంగవెధవ !

 

    వాడిని చిత్తుచేశానన్న సంతృప్తితో ముందుకు నడుస్తున్నాను.

 

    కొంతదూరం వెళ్ళేసరికి నాకు వెనక ఎవరో వస్తున్నట్టుగా అన్పించి, ఆగి వెనక్కు మెడ తిప్పి చూచాను.

 

    భూతరాజు కన్పించాడు.

 Previous Page Next Page