Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 10


    నేను తృళ్లిపడ్డాను. బండివాడి ముఖంలోకి చూచాను.

 

    అతను నన్నే చూస్తున్నాడు.

 

    "ఆ దొంగవెధవ భూతరాజును నమ్మి వాడివెంట ఇంతదూరం వచ్చారే!"

 

    "భూతరాజును నువ్వు చూశావా ?"

 

    "ఆ సంగతి నాకు తెలుసు. నా గుర్రపు డెక్కల చప్పుడు విని పారిపోయాడు కదూ ?"

 

    "అది నీకెలా తెలుసు ?"

 

    "చెప్తాను, ముందు మీరు బండి ఎక్కండి" అన్నాడు.

 

    నేను బండి ఎక్కి కూర్చున్నాను. ఆ గుర్రానికి కళ్లెంకూడ లేదు. నేను ఎక్కగానే అతనూ ఎక్కాడు.

 

    "ముందుకు రండిబాబూ ! వెనుక బరువెక్కువైంది."

 

    నేను ముందుకు జరిగాను.

 

    గుర్రం బయలుదేరింది.

 

    "నీ గుర్రానికి కళ్లెం ఏది ?"

 

    వాడు అదోలా నవ్వాడు.

 

    "నవ్వుతావేం ?"

 

    "ఆ భూతరాజు మాటలు విని మీకు అన్నిటిమీద అనుమానం వస్తోన్నట్టుంది. ఈ గుర్రం నేను చెప్పినట్టు వింటుంది. ఆ భయం మీకేమీ అక్కర్లేదు !" అన్నాడు.

 

    బండి నడుస్తోంది.

 

    ఇద్దరి మధ్యా ఏకాంతం భరించరానిదిగా ఉంది.

 

    "నీ పేరేమిటి?"

 

    "రహమాన్ !"

 

    "భూతరాజు ఇంతవరకు నాతో వచ్చాడని నీకెలా తెలుసు ?"

 

    "అతను మాట్లాడిందల్లా విన్నాను."

 

    నేను ఒక్కసారిగా వెనక్కు జరిగాను.

 

    "ఎందుకు బాబు అంత భయం! నేను మిమ్మల్నేం చెయ్యను. వాడి నుంచి రక్షించడానికే వచ్చాను."

 

    "వాడూ అలాగే అన్నాడు"

 

    "వాడు అలాగే అంటాడు. వాడు అడ్డదారినే వెళ్దామన్నాడు కదూ?"

 

    నేను అయోమయంగా చూశాను.

 

    "నాకెలా తెలిసిందనేగా మీభయం ? నేను దయ్యాలని చూడగలను. వాళ్ల మాటల్ని వినగలను."

 

    "భూ.....భూతరా......జు...ద..."మాటలు పెగల్డంలేదు.

 

    "అవును బాబు వాడు దయ్యం. మనిషికాడు. వాడు చచ్చి నలభై ఏళ్లయింది. వాడు చేసిన పాపాలు పరిపక్వం చెందలేదు. ఇంకా ఇలా తిరుగుతూనే ఉన్నాడు."

 

    "అబద్ధం !" గట్టిగా అరిచాను.

 

    "నిజమే ! నేనే వాడ్ని చంపాను. ఇప్పటికీ వాడికి నేనంటే భయమే."

 

    "అబద్ధం!" గట్టిగా అరిచాను.

 

    "దిగిపోతారా ! అయితే వెళ్ళండి. నేను వెళ్ళగానే మళ్లీ వాడు వస్తాడు. ఇప్పటికీ వాడు మూడు గంటల్నుంచి ఈ అరణ్యంలో తిప్పాడు. తిన్నగావెళ్తే ఈపాటికి మీరు దుమ్మలగూడెం చేరేవారు."

 

    నా తల తిరిగిపోతోంది.

 

    భూతరాజు దయ్యమా ?

 

    వీడు ? వీడుకూడా దయ్యమేనేమో ?

 

    అవును వీడు పిశాచే !

 

    లేకపోతే భూతరాజు మాటలు ఎలా విన్నాడు ?

 

    బాబోయ్ ! తోడేలు బోనులోనుంచి సింహం బోనులోపడ్డానులా ఉంది. తను బండిలోనుంచి దూకలేడు. దూకితే ఏకాలో చెయ్యో విరగడం ఖాయం.

 

    "అయితే నువ్వు దయ్యానివే !"

 

    వాడు పకపక నవ్వాడు.

 

    "మీ వరస బాగుందిబాబూ ! అంతభయం అయితే దిగివెళ్ళిపొండి." బండి ఆగింది.

 

    వీడిమాటలు గుర్రానికికూడా అర్థం అవుతున్నాయా ?

 

    "నువ్వు దయ్యంకాకపోతే వాడి మాటలు ఎలా విన్నావ్?" బండి దిగకుండానే అడిగాను.

 

    "అదాబాబు మీ సందేహం. నాకు ఆశక్తి ఉందని చెప్పాగా? వాడ్ని చంపాక నేను ఉత్తరదేశం పారిపోయాను. కాశీకి చేరాను. అక్కడొక యోగి తటస్థపడ్డాడు. అతను నన్ను చూడగానే నేను ఇంటినుంచి ఎలా పారిపోయివచ్చానో చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అతనికి శుశ్రూష చేస్తూ పదేళ్లు అక్కడే ఉండిపోయాను. తను సమాధిలోకి వెళ్ళిపోతూ నాకు ఏంకావాలో కోరుకోమన్నాడు. నేను దయ్యాలను చూసే శక్తీ, వాళ్ల మాటలు ఎంతదూరంలో ఉన్నా వినగలిగేశక్తిని ఇవ్వమన్నాను. ఎందుకో తెలుసాబాబూ ! భూతరాజును చంపినా నా కసితీరలేదు. వాడు దయ్యం అయి ఈ ప్రాంతాల్లోనే తిరగడం అంతకుముందే నాకు అంజనంలో చూపించాడు." చెప్పి "పద" అన్నాడు.

 

    గుర్రం పరుగు మొదలుపెట్టింది.

 

    "భూతరాజును నువ్వుచంపినప్పుడు వాడివయసెంత ?"

 

    "అరవయ్ ఏళ్లు."

 

    "ఇప్పుడూ వాడు అరవై ఏళ్లవాడిలాగే కన్పిస్తున్నాడుగా ?" నాకు పిచ్చేక్కే లాగుంది. జుట్టుపీక్కోవాలని బండిలోనుండి దూకిపారిపోవాలని ఉంది.

 

    "అరవయ్యో పడిలో చచ్చిపోయి దయ్యం అయ్యాడు. మనిషి ఏ వయసులో చచ్చిపోతే, దయ్యం అదే వయసులో, పాపపరిహారం అయి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళేంతవరకు అలాగే ఉంటుంది."

 

    నాకు గొంతు ఎండిపోతున్నది.

 

    "దాహం !" గొంతు పెగల్చుకొని అన్నాను.

 

    రెహమాన్ నీళ్ల సీసా ఇచ్చాడు. నీళ్లు గటగట తాగేశాను. అప్పటికి కొంతసేద తీరినట్టయింది. చల్లని గాలివీస్తోంది. ప్రాణం కాస్త కుదట పడినట్టు అయింది. బుర్ర చురుగ్గా పనిచెయ్యసాగింది.

 

    ఖాళీసీసా అందిస్తున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. అడగ్గానే నీళ్ల సీసా ఎలా ఇవ్వగలిగాడు ? ఇంతవరకు ఆ చిన్న బండిలో నాకు నీళ్ళ సీసా కన్పించలేదు. భూతరాజు దయ్యం అయితే వీడూ దయ్యమే.

 Previous Page Next Page