Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 9

"అనవసరమయిన విషయాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు."
"ఒకసారి పరీక్షించి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవడం నా విధి" అన్నాడు డాక్టర్.
డాక్టర్ సీతను చూసి చిరునవ్వు నవ్వాడు.
"కాస్త వెలుగులోకి రామ్మా! నీ చెంప మీద ఉన్నది ఏమిటో పరీక్షించాలి"
సీత కనురెప్పల్ని టపటపలాడించింది. డాక్టర్ కు చెంప మీద దెబ్బపడటం వల్లనే అలా ఎర్రగా ఉబ్బినట్లు తెలుసునని అర్థం చేసుకుంది.
సీత కొంచెం వెలుగులోకి వచ్చి నిలబడింది.
డాక్టర్ ఆమె చంపాను మృదువుగా నిమిరి చూశాడు.
"దెబ్బ తగిలిందా?"
"కొంచెం" తడబాటుగా అన్నది.
"మచ్చ పడొచ్చును. కాని త్వరలోనే పోతుంటుంది భయపడకు" అన్నాడు డాక్టర్ జాన్ సన్.
సీత చూస్తూ నిల్చుంది.
"వెనక్కు తిరుగు - వీపు చూడాలి. సాధారణంగా అంటు జబ్బులు చెవులకిందా, వీపు మీదా మొదట మొదలవుతాయి."
సీత యాంత్రికంగా వెనక్కి తిరిగింది. గౌనుకున్న గుండీలను తియ్యసాగింది.
కొట్టిన దెబ్బల తాలూకు వాతలు స్పష్టంగానే కన్పిస్తాయని ఆమెకు తెల్సు. రాత్రంతా వీపు మంట పుట్టింది.
"ఈ వాతలు అంటుజబ్బుకు సంబంధించినవి కావు. అయినా నేను చెప్పేది విను."
"వింటున్నాను" అంది సీత.
"ఇవి పెద్దగా పట్టించుకోవలసిన గాయాలు కావు. అయినా మరోసారి ఇలా జరిగితే నాదగ్గరకు వచ్చి చూపించు" అన్నాడు డాక్టర్.
"అలాగే డాక్టర్!"
డాక్టర్ తలతిప్పి హారేకేసి చూశాడు.
హారే చేతిలో వున్న పేపర్లు చూస్తున్నాడు.
"మిస్ ఆరాన్! నువ్వు ఇలా బాధపడనక్కరలేదు. ఇకముందు ఇలాంటిది జరిగితే వెంటనే నా దగ్గిరికి రా" అన్నాడు సీతతో చిన్నగా.
సీత డాక్టర్ ని చూసింది.
అతను సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వాడు. ఆమెకు అతని అభిప్రాయం అర్థమయింది.
డాక్టర్ బయటకు నడిచాడు. తలుపు దగ్గిర నిల్చుని వెనక్కి చూస్తూ "మిస్టర్ హారే! గుడ్ మార్నింగ్" అన్నాడు.
హారే ఆ మాటలు విననట్టే కాగితాల్లోకి చూస్తూ వుండిపోయాడు. సమాధానం లేదు. డాక్టర్ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
సీత ఇబ్బందిగా హారేకేసి చూసింది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు. చూస్తూ నిల్చుంది.
"ఇంకా అక్కడే నిల్చున్నావేం? రా! వచ్చి పనిచెయ్! ఎంతో పని అలాగే ఉండిపోయింది" అన్నాడు సర్ హారే.
సీత కదిలింది. ముందుకు నడిచింది. అంతకుముందు అతను విసిరికొట్టిన కాగితాలు వంగి ఒక్కొక్కటే తీసుకోసాగింది.
మళ్ళీ ఎవరో తలుపు కొట్టారు.
"చెప్పడం మరిచిపోయాను మిస్టర్ హారే! మిస్ అరాన్ కు వేరే క్యాబిన్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు ఆమె వుంటున్న క్యాబిన్ లో గాలిలేదు - వెలుతురు కూడా చాలా తక్కువగా వుంది" అన్నాడు డాక్టర్ డోర్ తెరిచిపట్టుకొని.
"నేను అంత డబ్బు కట్టుకోలేను" సర్ హారే విసుగ్గా అన్నాడు.
డాక్టర్ జాన్ సన్ హారే క్యాబిన్ ను పరిశీలనగా చూశాడు. అది చాలా పెద్దగా ఉంది. బోలెడంత గాలీ, వెలుతురు వున్నాయి ఆ గదిలో.
"ఆ విషయం నేను ముందే ఆలోచించాను. నువ్వు ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసిన క్యాబిన్ కు ఎక్కువ డబ్బు చెల్లించనక్కరలేదు. ఆ క్యాబిన్ లో మిస్ అరాన్ కు ఎలాంటి కష్టం వుండదు. ఆమె ఆరోగ్యానికి మంచిది." డాక్టర్ మృదువుగా సమాధానమిచ్చాడు.
డాక్టర్ హారే సమాధానానికి ఎదురుచూడలేదు. తలుపుమూసి వెళ్ళిపోయాడు.
"చాలా చాలా కృతజ్ఞతలు" సీత చిన్నగా అన్నది తనకుతానే చెప్పుకుంటున్నట్లుగా.
ఆమె మనసు హాయిగా తేలిగ్గా గాలిలో తేలిపోతున్నట్లుగా వుంది.
ఆ క్యాబిన్ లోనుంచి సముద్రం కన్పిస్తుంది. ఇకపైన బాబాయి తనను కొట్టటానికి సాహసించడు.
తనకు తెలుసు డాక్టర్ ను ఎవరు పంపించారో?
ఆలోచిస్తూ పేపర్సు తీసుకోసాగింది.
సర్ హారే అవమానంతో దహించుకోసాగాడు.
డాక్టర్ దగ్గర మాట్లాడలేకపోయాడనే బాధగా వుంది.
సీతను చూస్తుంటే వళ్ళు మండిపోతున్నది.
కానీ సీతకు భయంగా లేదు. ఆమెకు వెన్నెముకలోకి కొత్తగా బలం వచ్చినట్టుగా ఆమె ఆలోచిస్తున్నది.
అవును! అతనే డాక్టర్ ను పంపించాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
అతనే తన చెంప ఎర్రగా కంది ఉండటాన్ని గమనించాడు. అది దెబ్బవల్ల ఏర్పడ్డ అరవడి అని అతను చూడగానే తెలుసుకున్నాడు.

 Previous Page Next Page