అతనికి ఇంత పరపతి వుందా? చూడ్డానికి పల్లెటూరివాడిలా, బీదవాడిలా వున్నాడు. భారతీయుడిలా కూడా వున్నాడు. తన అనుమానం కూడా అదే! అతను మారువేషంలో వున్నాడన్న అనుమానం- ఆధారరహితం కాదని తోస్తుంది.
నేలమీద వున్న కాగితాలను గట్టిగా పట్టుకొని తన క్యాబిన్ కు వెళ్ళింది. సీత కొత్త క్యాబిన్ లోకి మారింది. అది విశాలంగా వున్నది. గాలీ, వెలుతురూ పుష్కలంగా వున్నాయి. ఆమెకు అతని తలపులు వదలడంలేదు. క్యాబిన్ లో ఎంతోసేపు కూర్చోలేకపోయింది. డెక్ మీదకు వెళ్ళింది. అతను కనిపిస్తాడనే ఆశతోనే వెళ్ళింది.
డెక్ పైన చాలామంది వున్నారు. కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు పేకాట ఆడుతున్నారు. మరికొందరు తమ పిల్లలతో ఆడుకుంటున్నారు. సీత కళ్ళు నలువేపులా వెతుకుతున్నాయి. తనకు కావాల్సిన వ్యక్తి కన్పించలేదు. అతని పేరు ఆమెకు తెలియదు. ఎవర్ని అడగాలో ఎలా అడగాలో బోధపడటంలేదు. అతని పేరు తెలుసుకోనందుకు ఆమెకు తనమీద తనకే కోపం వస్తోంది.
అతను మాత్రం తనపేరు తెలుసుకున్నాడు. అతడు తనపేరు చెప్పలేదు. తను కూడా చెప్పకుండా వుండాల్సింది.
ఇక ఇవాళ కన్పించడు.
రేపు కన్పిస్తాడా?
ఏమో! అతనికి తనని చూడాలని వుంటే కన్పిస్తాడు.
సీత తిరిగి తన క్యాబిన్ లోకి వచ్చింది. పని చెయ్యాలని కూర్చుంది. కాని మనసు లగ్నం కావడం లేదు.
కళ్ళు మూసుకొని అతని రూపాన్ని గుర్తుచేసుకుంటూ పడుకున్నది. సాయంత్రం వరకూ అలాగే పడుకున్నది.
సాయంకాలం తను సాధారణంగా వేసుకునే దుస్తులు వేసుకుంది. అంతలోనే ఏదో ఆలోచన వచ్చింది.
అతను కన్పిస్తాడేమో! కాస్త మంచి గౌను వేసుకోవాలి. అమ్మ గౌను వేసుకుంటే?
అది చాలా ఖరీదైనది. కానీ తనకు అది చాలా పెద్ద సైజు. వదులుగా వుంటుంది.
అయినా ఫర్వాలేదు. అందులో తనను చూసినవాళ్ళు తనను గొప్పింటిపిల్లగా భావిస్తారు.
ఆలోచిస్తూ తల్లి గౌను వేసుకొని అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నది. గౌను వదులుగా వుంది. తన రూపం తనకే నవ్వు గొల్పింది.
ఆమె బయలుదేరేప్పుడు మిస్టర్ హారే కొద్దిగా డబ్బు ఇచ్చాడు. రెండు గౌనులు కుట్టించుకున్నది. అవి సాధారణ దుస్తులే. అయినా కొత్తవి. అందుకే భారతదేశం వెళ్ళాక వేసుకోవాలని దాచిపెట్టుకున్నది.
ఒకప్పుడు ఆమె బాబాయి భారతదేశంలో పెద్ద పదవిలో ఉన్నవాడు. అందుకే అతనికి చాలామంది గొప్ప స్నేహితులు వుండి వుంటారని వాళ్ళందరూ త్వరలో ఆహ్వానిస్తారనీ, అప్పుడు తను కూడా వెళ్ళవలసి వస్తుందని సీత భావించింది. ఆ భావంతోనే కొత్త గౌనులు జాగ్రత్తగా భద్రపరిచింది.
భారతదేశంలో ఎక్కడ వుంటారో ఆమెకు తెలియదు. తెలుసుకోవాలని వున్నా మిస్టర్ హారే చెప్పడని ఆమెకు తెలుసు. అందుకే అడగలేకపోయింది. భారతదేశం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం వున్నది.
కాని ఆమె తన బాబాయిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అలా అడిగితే సమాధానాలు దొరకవు సరికదా! తిట్లుతినాల్సి వుంటుందని ఆమెకు తెలుసు. మిస్టర్ హారేతో ప్రయాణం చెయ్యడం ఆమెకు ఇష్టంలేదు. అయినా తప్పులేదు. వేరే గత్యంతరం లేదు.
సీత తన బాబాయితో రాత్రి భోజనానికి కూర్చుంది. కాప్టెన్ వాళ్ళను ఆహ్వానించాడు. కాని మిస్టర్ హారే అందరికీ దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. సీత కూడా వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. అక్కడ వున్నవాళ్ళు కొందరు మిస్టర్ హారేని చూసి ముసిముసిగా నవ్వుకోవడం సీత గమనించింది. ఎప్పటికిలాగే మిష్టర్ మౌనంగా భోజనం చేస్తున్నాడు.
హారే ఎవరితోనూ చనువుగా మాట్లాడడు భోజనాల దగ్గర. వంట బాగాలేకపోతే మాత్రం వంటవాళ్ళమీద కేకలు వేస్తాడు.
భోజనం ముగించి లేచారు.
"సీతా! ఇక నువ్వు నీ కేబిన్ కు వెళ్ళు. రాత్రికూడా పనిచెయ్యలేదు. రేపటికి మొత్తంపని పూర్తిచెయ్యాలి. తెల్సిందా? సోమరితనం అంటే ఎంత చిరాకో నీకు బాగా తెలుసు" అన్నాడు హారే.
"అలాగే...బాబాయ్... కాని."
కనుబొమ్మలు ముడిచి "ఏమిటి" అన్నట్టు చూశాడు హారే.
"మొత్తం పని..."
"ఆ"
"పూర్తి...చెయ్యడం...క...కష్టం..." తలదించుకొని వాక్యం పూర్తిచేసింది.
హారేలో కోపం బస్సున సోడాగ్యాస్ లా పొంగింది.
అయినా ఆ పొంగు బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు.
కారణం చుట్టూ జనం వున్నారు. అది తన క్యాబిన్ కాదు.
ఒకసారి సీతకేసి కొరకొర చూసి అక్కడ్నుంచి విసురుగా వెళ్ళిపోయాడు.
సీత గుండెల నిండుగా గాలిపీల్చుకుని వదిలింది రిలీఫ్ గా.
సీత తన కేబిన్ లోకి వెళ్ళాలనుకొన్నది. కాని అనుకోకుండానే డెక్ వెళ్ళింది.
ఆమె అంతరాల్లో ఎక్కడో మళ్ళీ తప్పక కన్పిస్తాడనే నమ్మకం వుంది. ఆ నమ్మకం అతను కలిగించింది.
తను తల్చుకుంటే వస్తానన్నాడుగా? ఉదయం నుంచి తను అతన్ని తల్చుకుంటూనే వున్నది. తన ఆలోచనలు అతని బుర్రకు అందే వుంటాయి. అతనికి టెలిపతి పవర్ ఉన్నదేమో? అతని మాటల్ని బట్టి తనకు అలాగే అనిపించింది.
కొందరి క్యాబిన్ లోని ఉక్క భరించలేక డెక్ మీద పచార్లు చేస్తున్నారు. మరికొందరు రైలింగ్ దగ్గర నిలబడి సముద్రపు నురగల్ని చూస్తున్నారు. అందరూ సీతకేసి చూస్తున్నారు. ఆమెకు కొంచెం ఇబ్బందిగా అన్పించి జనం తక్కువ వున్నచోటుకు వెళ్ళి నిల్చుంది చువలు పట్టుకుని. అక్కడ స్త్రీ పురుషులు చేతులుపట్టుకుని నిల్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు. వారు ఈలోకంలో లేరు. వాళ్ళు సీతను గమనించలేదు.