ఆమె తల ఎత్తలేదు.
"రాత్రి కాగితాలు ఫెయిర్ చేశావా? ఏవి?"
"చెయ్యలేదు."
హారే ఆశ్చర్యంగా ఆమెకేసి చూశాడు. తను చూస్తున్నది సీతనేనా?
హారే చివ్వున లేచి నిల్చున్నాడు.
"రాయలేదా? ఎందుకు రాయలేదు?" దగ్గరకు వచ్చాడు హారే.
సీత వెనక్కు తగ్గింది. తలెత్తి అతన్ని చూసింది. మళ్ళీ మామూలుగానే భయం శరీరంలోకి చలి కుదుపులా ప్రవేశించింది. గజగజ వణికిపోతూ, బేలచూపులు చూస్తూ నిల్చుంది.
"మాట్లాడవే?"
"సారీ...అంకుల్! ఈ రాత్రికి పూర్తిచేస్తాను" వణుకుతూ సమాధానం ఇచ్చింది.
"ఇవాళ్టి పని రేపు చేస్తావా? పైగా నిన్నటి స్క్రిప్తు నిండా తప్పులే. ఏమైంది నీకు. నీకంటే - ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలు బాగా ఫెయిర్ చెయ్యగలరు" అని టేబుల్ మీద ఉన్న కాగితాలను అందుకున్నాడు.
సీత దగ్గరికి నడిచాడు.
"చూడు ఎన్ని తప్పులో!" కాగితాలను సీత ముఖం మీద విసిరికొట్టాడు.
"నీకు తిండి పెడుతున్నాను. గతిలేని నీకు ఆశ్రయం ఇచ్చాను. నీ బరువుబాధ్యతల్ని వహిస్తున్నాను. తేరగా తిండి తింటుంటే బొత్తిగా వళ్ళు వంగడం లేదు" అరిచాడు హారే.
సీత కళ్ళల్లో నీరు తిరిగింది. తలవంచుకున్నది.
"యూ ఫూల్! స్టుపిడ్! మాటకు ముందు ఏడుపొకటి. వెళ్ళు ఇవన్నీ మళ్ళీ రాసి పట్టుకురా. ఆ తర్వాత నిన్న రాత్రి చెయ్యవలసిన పని చెయ్యి. లేదా నీ ఎముకలు చితక్కొడతాను జాగ్రత్త. పో! ఆ కాగితాలు తీసుకెళ్ళు! ఇంకా నిల్చున్నావే?"
ఆమె వంగి కాగితాలు తీసుకోలేదు.
హారే చెయ్యి ఎత్తాడు.
సీత దెబ్బపడకుండా పక్కకు తప్పుకొన్నది. రెచ్చిపోయిన కోపంతో మళ్ళీ చెయ్యెత్తాడు.
అంతలో ఎవరో క్యాబిన్ డోర్ కొట్టారు.
ఎత్తిన చెయ్యి గాలిలోనే ఉండిపోయింది.
"లోపలకు రావచ్చు" చెయ్యి దించుతూ అన్నాడు హారే.
ఆ మాటలు పూర్తికాకుండానే డాక్టర్ లోపలకు వచ్చాడు.
అతని వయసు దాదాపు ఏభయ్యేళ్ళుంటాయి. బట్టతల, లావుగావుంటాడు.
ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అతను ఓడలో పనిచేసే డాక్టర్ అని హారేకు తెలుసు. సీత అతన్ని చూడగానే కళ్ళు తుడుచుకొని తనకు దెబ్బను తప్పించిన అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొన్నది.
తన బాబాయి కేకలు వినే అతను లోపలికి వచ్చి ఉంటాడు అని అనుకొన్నది సీత.
"ఏం కావాలి?" హారే కనుబొమ్మలు చిట్లించాడు.
"మిమ్మల్ని డిస్ట్రబ్ చేసినందుకు విచారిస్తున్నాను. మిస్టర్ హారే మీతో ఉన్న అమ్మాయి ఇవాళ మీతోపాటు బ్రేక్ ఫాస్ట్ కి రాలేదు."
"అయితే?"
"ఆమె ఆరోగ్యం బాగాలేదనే అనుమానం కలిగింది"
"అలా ఎందుకనుకున్నారు? మా అమ్మాయి ఆరోగ్యానికే? దివ్యంగా వుంది.
బ్రేక్ పాస్ట్ కు ఆలస్యంగా వెళ్ళింది. మీకు తెలియందేముంది. ఈ రోజులలో యువతీయువకులు బద్ధకం గురించి? మా సీతకు ఈమధ్య సోమరితనం బలిసిపోయింది. అందుకే ఆలస్యంగా నిద్రలేచింది."
"మీరు చెప్పింది నిజం కావచ్చును. కాని నేను ఆమెను పరీక్షించాలి." అన్నాడు డాక్టర్.
"ఎందుకూ?" తీవ్రంగా పలికింది సర్ హారే స్వరం.
అదేమిపట్టించుకోనట్టే డాక్టర్ క్యాబిన్ తలుపు వేశాడు. సీత దగ్గరకు వచ్చాడు.
"మిస్ అరాన్ ముఖం మీద రాష్ వచ్చిందని విన్నాను. అది ఒకవేళ అంటువ్యాధి అయితే షిప్ లో వున్నవాళ్ళందరికీ పాకుతుంది" అన్నాడు డాక్టర్.
సీత డాక్టర్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
అతను తన బుగ్గమీద వున్న దెబ్బను ఉద్దేశించి అంటున్నాడని గ్రహించింది సీత.
రాత్రి తన బాబాయి కొట్టాడు. ఆ దెబ్బ తగిలి చంప ఎర్రగా కందిపోయి ఉన్నది. తనను రక్షించిన అతను బాబాయి తనను కొడతాడని విన్నప్పుడు చాలా బాధపడ్డాడు.
వినగానే నమ్మలేనట్టు బిత్తరపోయాడు.
"నేను...నేను...బాగానే...ఉన్నాను." గొణిగినట్లుగా అన్నది.
అదే సమయంలో హారే "మా అమ్మాయి బాగానే వుంది. ఆమె చెంపమీద మార్కు ఉన్నదన్న మాట నిజమే. అది నీకు అనవసరం" దాదాపు అరిచినట్టే అన్నాడు హారే.
"క్షమించాలి మిస్టర్ హారే... అది నా డ్యూటీ. ఈ షిప్ లో ఎవరికి ఏ కొంచెం అనారోగ్యం ఏర్పడిందని తెలిసినా వాళ్ళను పరీక్షించడం నా కర్తవ్యం" అన్నాడు డాక్టర్.
"నాన్సెన్స్!" అరిచాడు హారే.
వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్ తో వాదించడం గానీ, మాట్లాడటం గానీ తనకు ఇష్టంలేదని తెలియజేయటానికన్నట్లు మీద కాగితాలు తిరగెయ్యసాగాడు.
"డాక్టర్ నాకు అర్థమయింది" అంది సీత.
"నీ క్యాబిన్ లోకి వెళదామా? లేక ఇక్కడే పరీక్షించమన్నావా?" డాక్టర్ సీతను అడిగాడు.
"ఇక్కడే చూడవచ్చును. నా వెనక అనవసరమైన విషయాలు చెప్పి, పిల్లను భయపెట్టటం నాకిష్టం లేదు" హారే గంభీరంగా అన్నాడు.