Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 9


    "ఇంత త్వరగానా?" ఇష్టం లేనట్టు లేచాడు గౌతమ్.


    "ఏదీ నా పెన్!"


    "ఏ పెన్?"


    "ఆహా! అమ్మాయిగారు ఇంత త్వరగా ప్లేట్లు ఫిరాయిస్తున్నారే! బాబోయ్ నిన్ను నమ్ముకుంటే..."


    "ఆ సముద్రంలో దిగాల్సిందే!" రేణుక మాట పూర్తి చేసి కిలకిలా నవ్వింది. గౌతమ్ శృతి కలిపాడు. రేణుక పర్సు తెరిచి పెన్ ఇచ్చింది. అలా ఇస్తున్నప్పుడు రేణుక చెయ్యి పట్టుకున్నాడు. రేణుక చేతిని చటుక్కున లాక్కుంది.


    "అరే! కాలిందా?"


    "ఏమిటి?"


    "చెయ్యి!"


    "అవును!" కిసుక్కున నవ్వింది రేణుక.


    "నాకు పెన్ అక్కర్లేదు" ముందుకు నడుస్తూ అలిగినట్లు అన్నాడు గౌతమ్ "కోపం వచ్చిందా?"


    మాట్లాడకుండా ఇసుకలో నడుస్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళి ఆగి వెనక్కు చూశాడు. రేణుక కాశ్మీర్ సిల్కు చీర గాలికి పైకి ఎగురుతున్నది. లంగా కన్పిస్తోంది. ఆ చీరను ఎగరకుండా పట్టుకొని నడవడానికి అవస్థ పడుతోంది, గౌతమ్ వెనక్కు వచ్చాడు.


    "నేను సహాయం చెయ్యనా?" నవ్వుతూ అడిగాడు.


    రేణుక సిగ్గు పడిపోయింది.


    "కొంటెతనం చాలా ఉంది. పైకి మహాబుద్ధిమంతుడిలా ఫోజుకొడ్తారు!" చీర మరీ పైకి లేచేసరికి ఇసకలో చతికిలపడింది.


    "అదేమిటి మళ్ళీ కూర్చున్నావ్?"


    "కొంచెంగాలి తగ్గనివ్వండి"


    "పోని ఒక పని చెయ్యి"


    "ఏమిటి?"


    "ఎత్తుకోమంటావా?"


    "ఛ! మీరు...."


    "నేను నువ్వు అంటున్నాను. నువ్వేమో మీరు మీరు అంటూ బోరుకొడ్తున్నావ్!"


    "మీరు ఇన్ని మాటలు మాట్లాడగలరనుకోలేదు"


    "మూగవాణ్ణి అనుకున్నావా? అయితే మూగవాడిలా సైగలు చేస్తాలే! పద!" అంటూ చెయ్యి అందించాడు.


    ఆమె అందుకొనిలేచి నిల్చుంది.


    "ఇప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా?"


    "తెలుసుకోగలను" అన్నది రేణుక.


    "నీకూ అలాగే ఉందా?" కొంటెగా ముఖం దగ్గరగా పెట్టి కళ్ళలో చూశాడు.


    "ఇలా ఏడిపిస్తే మీతో రాను"


    "సరే అయితే నేను వెళ్ళిపోనా?"


    "ఊ"


    "చెయ్యి వదిలించుకొని గబగబా ముందుకు నడిచాడు"


    "రేణుక మొండిగా మళ్ళీ కూర్చుంది"


    వెనక్కు వచ్చి గౌతమ్ కూడా ఆమె కెదురుగా కూర్చున్నాడు.


    రేణుక టైం చూసుకుంది.


    "బాబోయ్! ఎనిమిది దాటింది పదండి"


    గౌతమ్ లేవలేదు.


    "ఊ లేపండి"


    చెయ్యి అందించాడు.


    పట్టుకోకుండా అలాగే నిల్చుంది.


    గౌతమ్ చెయ్యి పైకెత్తి అలాగే కూర్చున్నాడు.


    "అబ్బ లేవండీ!"


    గౌతమ్ లేవలేదు.


    "మొండిఘటం!" అంటూ చెయ్యి పట్టుకొని లేవబోయింది.


    గౌతమ్ ముందుకు లాగాడు.


    రేణుక అతనివడిలో పడిపోయింది.


    "ఛీ! వాళ్ళు చూస్తున్నారు!" కొంచెం దూరంలో కూర్చున్న వాళ్ళను చూపిస్తూ అన్నది.


    "చూడనివ్ నాకేం!" అంటూ లేచాడు గౌతమ్.


    సుధారాణి గారేజ్ నుంచి కారు బయటకు తీసింది.


    "ఈ వేళప్పుడు ఎక్కడికమ్మా. ఇవాళ కోయంబత్తూరు వాళ్ళు వస్తారని నాన్న చెప్పలేదూ?"


    "ఇదిగో మమ్మీ! ఆ అబ్బాయి నీకు నచ్చితేనే...."


    "అబ్బబ్బ మమ్మీ! ఇక ఆ విషయం ఎత్తకు"


    "డాడీ వాళ్ళను తీసుకొని వస్తారు"


    "నేను వచ్చేంతవరకూ ఉంటే చూస్తాను. లేదా మీరే ఏదో చెప్పి వాళ్ళను పంపించేయండి"


    తల్లి మరో ప్రశ్న వెయ్యడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కారు స్టార్ట్ చేసింది. తల్లి నెత్తి బాదుకుంది.


    కొత్త ఫియట్ బీచ్ రోడ్ మీద పోతున్నది. ఉన్నట్టుండి స్పీడు పెరిగింది "సర్" మంటూ గాలిని చీలుస్తూ కారు ముందుకు దూసుకొని పోతున్నది.


    తెల్లని వెన్నెల్లో కారు రోడ్డు నల్లటి త్రాచులా తళతళలాడుతున్నది. కారు ముందుకు పోతున్నది. రోడ్డు వెనక్కు పుట్టలోకి జొరబడుతున్న త్రాచులా వెనక్కు పోతున్నది.


    చల్లటిగాలి సుధారాణి ముఖాన్ని చురుగ్గా తాకుతున్నది.


    రేణుకా గౌతమ్


    తను ఎన్ని ప్రయత్నాలు చేసి తను గౌతమ్ ను ఆకర్షించలేకపోయింది. వాణితో పందెం వేసింది. కాని తనకు ఓటమి తప్పలేదు.


    సుధ మనసులో నాగుపాము బుసకొట్టింది.

 Previous Page Next Page