"ఆ అదికాదు-నేననేది-మీరే ఏదైనా చెప్పాలనుకొని పిల్చారేమోనని..." నసిగింది.
"మీకు ఏమీ చెప్పాలని లేదా!"
ఎందుకు లేదూ? ఉన్నది. ఒక్కటి కాదు ఎన్నో విషయాలు. ఇలాగే యుగాల తరబడి కూర్చుని మాట్లాడాలని ఉంది. కాని ఏం మాట్లాడాలో తోచడం లేదు! మనసులోనే అనుకుంది.
"మాట్లాడరేం!"
"ఏం మాట్లాడను?"
"మీకు నేనంటే ఇష్టమేనా?"
"అదికూడా చెప్పాలా! కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటే బాగుంటాయి. అలాంటి విషయాల్ని అర్థం చేసుకున్నప్పుడే వాటి లోతును తెలుసుకున్న భావం కలుగుతుంది. భాషలో పెట్టేసరికి పేలవంగా ఉంటాయి."
"మీరు నవలలు బాగా చదువుతారా?"
రేణుక చివ్వున తలెత్తిచూసింది.
గౌతమ్ ముసిముసిగా నవ్వుతున్నాడు.
రేణుకకు అతను తనను ఎగతాళి చేసినట్టుగా అనిపించింది.
"కోపంవచ్చిందా రేణూ!"
రేణూ! ఆ పిలుపు...వేణునాదంలా విన్పించింది రేణుక చెవులకు.
"సరదాగా అన్నాను అంతే! నాకూ అలాంటి విషయాల గురించి మాట్లాడడం రాదు. మనసును తనకు అనుకూలమైన మనసును అర్థం చేసుకొన శక్తి ఉంది, అందువల్ల నేనీ మనసును నేను అర్థం చేసుకోగలిగాను. ధైర్యంగా బీచ్ కిరమ్మని చెప్పాను"
"అప్పుడేమిటి? ముందు నేను పలకరించాకేగా?" అన్నది రేణుక.
"అవును! నువ్వంటే నాకు మొదటినుంచీ అభిమానమే. అది కేవలం నీ బాహ్య సౌందర్యం మీది ఆకర్షణ మాత్రమే కాదు. నీ ప్రవర్తనా నీ వ్యక్తిత్వం నన్ను ఆకర్షించాయి. నేను చాలా బీదవాణ్ణి, నువ్వు చాలా ఎత్తుగా కన్పించేదానివి. అందుకే నన్ను నేను అదుపులో పెట్టుకోవడం కోసం నిన్ను తప్పించుకుని తిరిగేవాణ్ణి.
నువ్వు నన్ను చూసే చూపుల్లో నీ మనసు నాకు అర్థం అయింది. అయినా నేను చొరవ తీసుకోలేకపోయాను. ఈ రోజయినా ఎందుకు రమ్మన్నానో తెలుసా?
"చెప్పండి"
"ఒకర్ని గురించి ఒకరం అరమరిక లేకుండా మాట్లాడుకోవడం మంచిదని. నా మీద నువ్వు అభిమానాన్ని పెంచుకోవడంగానీ, నీమీద నేను ప్రేమను పెంచుకోవడంగానీ అంతమంచిదికాదేమోనని చెప్పాలనే"
"ఇది చెప్పాలనేనా మీరు ఇక్కడకు పిల్చింది." గాయపడిన పక్షిలా చూసింది"
"రేణూ నేను చెప్పేది శ్రద్ధగా విను. మేము ఒకప్పుడు బాగా కలిగిన కుటుంబానికి చెందిన వాళ్ళమే. మా నాన్నకు లేని వ్యసనం లేదు. వళ్ళూ ఇల్లూ కూడా గుల్ల చేసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు ఐదేళ్ళు. నా తరువాత పిల్లలు లేరు. అంతవరకు అమ్మ అదృష్టవంతురాలనే చెప్పాలి. అమ్మ ఆ ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం అయినా వెళ్ళి చాకిరీ చేసేది. ఎలాగో నన్ను పెంచి పెద్ద చేసింది. ఊళ్ళో ఉన్న స్కూల్లో పదివరకు చదువుకున్నాను. అమ్మకు నేను చదివి చాలా గొప్పవాడిని కావాలని కోరిక. ఈ విషయంలో అందరు తల్లులూ అలాగే ఉంటారనుకో. అమ్మకు నా అనేవాణ్ణి నేను ఒక్కణ్ణే. కనక పంచప్రాణాలు నామీదే పెట్టుకొని తను తినీ తినకా నన్ను పెంచింది. నాకు ఎక్కడ ఏం తక్కువ అవుతుందోనని పాకులాడేది. నేను పది ఫస్టుక్లాసులో పాసయ్యాను. గుంటూర్లో వారాలు తిని ఇంటర్ చదివాను. స్కాలర్ షిప్ కూడా వచ్చేది. నా చదువు విషయంలో మా హైస్కూలు హెడ్ మాస్టరుగారు చాలా సహాయం చేశారు. ఆయనే వారాల ఇళ్ళు కూడా కుదిర్చారు.
ఇంటర్ స్టేట్ ఫస్టు వచ్చాను. మెడిసిన్ లో సీటు వచ్చింది. స్కాలర్ షిప్ వచ్చింది. అమ్మ ఆనందానికి అంతులేదు. నేను బాగా చదివి డాక్టర్ని అయి అమ్మను సుఖపెట్టాలనేదే అప్పటి నా ఏకైక ధ్యేయం!" గౌతమ్ కంఠం బొంగురు పోయింది. పైకి మాట్లాడలేనట్టు ఓ క్షణం ఆగాడు.
"మరి ఇప్పుడు ఆ ధ్యేయం మారిందా!"
"అవును!"
"అదేమిటి?"
"అమ్మ నేను రెండో సంవత్సరం పూర్తిచేసి వెళ్ళినప్పుడు చనిపోయింది?"
"చనిపోయిందా?"
"అవును పాము కరిచి చనిపోయింది. అప్పటినుంచి నేను ఇంటికి వెళ్ళాల్సిన పనికూడా లేకుండా పోయింది"
"మీకు మరెవరూ లేరా?"
"ఉన్నారు! బంధువులు! ఎవరిమీద ఏం భారం పడుతుందోనని ఎవరికి వారే దూరంగా ఏ సంబంధంలేనట్టు ఉండేవారు. నేను కొన్ని ట్యూషన్స్ కూడా చెబుతున్నాను. ఎలాగో కోర్సు పూర్తి చేశాను. మరో హౌస్ సర్జెన్సీ అయితే...సరే అసలు విషయం! నువ్వు చూస్తే శ్రీమంతులబిడ్డలా కన్పిస్తావు. ఈ వయసులో ఆలోచనారహితంగా యువతీయువకుల మధ్య ఆకర్షణ ఏర్పడడం, అది పెరగడం...దాన్నే ప్రేమ అని ముద్దుగా పీల్చుకోవడం...వగైరా...వగైరా..."
ఆగి రేణుకముఖంలోకి చూశాడు.
రేణుక తల వంచుకొని వింటున్నట్టు కూర్చుంది. గౌతమ్ ఆగగానే తల ఎత్తింది. సూటిగా అతని ముఖంలోకి చూసింది. రేణుకలో ఇప్పుడు తడబాటులేదు.
"నేను మీరనుకున్నట్లు శ్రీమంతురాల్ని కాదు. మా నాన్నగారు డిప్యూటి కలెక్టర్ కుటుంబం చాలా పెద్దదే. నేనే ఇంటికి పెద్దకూతుర్ని. మా నాన్నకు నా మీద ఎంతో నమ్మకం. తొందరపడి ఎలాంటి నిశ్చయానికి రానని తెలుసు. నా నిర్ణయానికి ఎదురు చెప్పరు"
"మనం కలిసి తిరిగే ముందు, దగ్గరగా వచ్చేముందు ఒకర్ని గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం అనే నేను నా గురించి చెప్పాను. ఎవరికి నా స్వంత విషయాల గురించి చెప్పడం నాకు రుచించదు. నేను తాడూ బొంగరం లేనివాణ్ని. రేపు వెంటనే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా లేదు. ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకొనే స్తోమత కూడా లేదు. అందుకే మీరు బాగా ఆలోచించుకొని...."
"ప్రేమించమంటారు?" నవ్వుతూ అన్నది.
గౌతమ్ ఆశ్చర్యంగా రేణుక ముఖంలోకి చూచాడు.
"ఏమిటి అలా చూస్తారు? ఇక మీరు నాకేం చెప్పనక్కర్లేదు"
"మన కులాలు కూడా ఒకటిగాదు. మీ కులం కంటే మా కులం చాలా తక్కువ కులం"
"యూ సిల్లీ! నిన్న మీ ఉపన్యాసంలో చెప్పింది ఏమిటి? మనిషి ముందుపుట్టాడు ఆ తర్వాత కులాలు పుట్టాయి అన్నారు అవునా?"
"వేదికలు మీద ఉపన్యాసాలు ఇవ్వడం వేరు-ఆచరణలో పెట్టడం వేరు?"
"అంటే...మీరు...మీరు..." ఉద్రేకంతో మాటలు తడబడ్డాయి.
"నా విషయంకాదు. మీ విషయం"
"ఓహో! అయితే నన్ను అంత సంకుచిత మనస్తత్వం కలదాన్ని అనుకుంటున్నారా?"
"ప్లీజ్ రేణూ! అలా కోపం తెచ్చుకోకు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను"
"చాలా సంతోషం! ఇక పదండి. హాస్టల్ గేట్సు మూస్తారు" రేణుక లేచి నిల్చుంది.