ఇద్దరూ ఈ మధ్య సినిమాలు, పార్కులకూ, హోటళ్ళకూ తిరుగుతున్నారు. అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. రేణుకకు ఈ మధ్య గర్వం ఎక్కువైంది. తనతో మాట్లాడటం మానేసింది.
వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటే తనెందుకు బాధపడాలి? ఆ మాత్రం దరిద్రుడు తనకు దొరకడనా? లక్షాధికారులు తను కోరుకోవాలేగాని తన కాళ్ళముందు మోకరిల్లుతారు. కాలేజీలోని ఎందరో తన ఒక్క చిరునవ్వును పొంది తన్మయత్వము చెందేవాళ్ళు ఉన్నారు. తనకి గౌతమ్ పిచ్చి ఏమిటి?
గౌతమ్ గర్వం, అతని నిర్లక్ష్యం తనలోని అహాన్ని రెచ్చగొట్టింది. అతని గర్వం అణచాలనుకుంది. అతన్ని తనవైపుకు తిప్పుకొని కొన్ని రోజులు ఆడించి ఆ తర్వాత అవమానించి తిరస్కరించాలనే కోరిక తనలో ప్రారంభం అయింది. ఆ కోరికే తనకు తెలియకుండా తన మనసు అతనివైపు తిప్పింది.
గౌతమ్ తను అంతగా కోరుకుంటున్నట్టు తనకు తెలియదు. రేణుకతో సన్నిహితంగా తిరగడం చూసినప్పటినుంచీ తనలో ఏదో అశాంతి ప్రారంభం అయింది. తన మనుసులోని ఒక భాగం ఏదో తనకు కాకుండా విడిపోయినట్టు, బాధ కలగసాగింది. నిరంతరం అశాంతి.
మనసును ఏదో కసి చుట్టి వేస్తున్నది. గౌతమ్ మీద కసి, రేణుక మీద కసి, తనమీద తనకు కసి.
రేణుక ఎందుకో అకస్మాత్తుగా ఊరికి వెళ్ళింది ఈ రోజు మధ్యాహ్నం బండిలో. తను అనుకోకుండా స్టేషన్ కు వెళ్ళడం వాళ్ళిద్దరూ కన్పించడం తన మూడ్ ఆఫ్ అయిపోవడం జరిగింది. తాను తన పిన్ని కూతురికి సెండాఫ్ ఇవ్వడానికి వెళ్ళింది. కాని బండి కదిలేదాకా ఉండలేకపోయింది. రేణుకా, గౌతమ్ చుట్టూ ప్రపంచాన్నే మరిచి కబుర్లు చెప్పుకుంటున్నారు. అనుకోకుండా గౌతమ్ ఒకసారి తనకేసి చూసి వెంటనే చూపులు తిప్పుకున్నాడు. రేణుక మాత్రం తనకేసి చూడను కూడా లేదు.
ఆమె ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతున్నాయ్. యాంత్రికంగా కారు నడుపుతోంది.
యూనివర్శిటీ బిల్డింగ్ దగ్గిర సడన్ బ్రేక్ పడింది. కారు చిన్న శబ్దం చేసి ఆగింది. ఆ శబ్దానికి దరిదాపుల్లోని వాళ్ళు తిరిగి చూశారు. పేవ్ మెంటు మీద ఆలోచిస్తూ నడుస్తున్న గౌతమ్ కూడా ఆగాడు. కారుకేసి చూశాడు.
సుధారాణి కన్పించింది. కారు ఎందుకు అలా ఆగిందో అర్థం అయింది. ముందుకు రెండడుగులు వేశాడు.
"మిస్టర్ గౌతమ్!"
గౌతమ్ ఆగాడు.
సుధ కారు దిగింది.
గౌతమ్ వెనక్కు వచ్చి "హలో సుధారాణిగారూ! ఇలా వచ్చారేం?" అన్నాడు మర్యాదగా.
"సుధారాణీ"...కాకుండా 'గారూ' కూడా... అంత పొడుగ్గా పిలవకపోతేనేమో? సుధా అనకూడదూ హాయిగా!" హాయిగా నవ్వుతూ అన్నది.
గౌతమ్ ఓ క్షణం మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు.
"బీచికి వచ్చారా?"
గౌతమ్ కారు అద్దంపైన రెండు చేతులూ ఆనించి వంగి "అవును" అన్నాడు.
"ఆసుపత్రీ, రోగులూ, రోగాలూ, మందులూ, పుస్తకాలూ తప్ప మీకు మరోధ్యాస లేదనుకున్నానే?" వ్యంగ్యంగా అన్నది.
"డాక్టర్ డిగ్రీ మీకు ఒక అలంకారం మాత్రమే. కాని నాకు అది జీవితం!"
"కాని ఈ మధ్య కొంచెం గాడి తప్పినట్టున్నదే! వెన్నెలరాత్రిళ్ళలో బీచ్ లూ, సినిమాలూ
..." అంటూ ఆగి గౌతమ్ ముఖంలో చూసింది.
"ఊ ముగించండి! ఆపారేం?" చిరునవ్వుతో అన్నాడు గౌతమ్.
"మీకు అర్థం అయ్యాక కూడా చెప్పడం అనవసరమని..."
"అవును! నాకు అర్థం అయింది" అన్నాడు గంభీరంగా.
"సుదారాణీగారూ!" గారూ అనే శబ్దాన్నే నొక్కుతూ సంబోధించాడు.
"చెప్పండి!"
"జీవితం నీరసమైన తన్మయత్వంలో వికసించదు. చెరకు గడ ఎడారిలో పెరుగదు.
"మీరంతా రోజూ కప్పులకొద్ది చెరుకురసం జుర్రుకోవడము చూస్తూనే ఉన్నాను"
"ఓహో అదా! ప్రస్తుతం మీరు చెరకురస పానంలో తన్మయులై ఉన్నారన్నమాట!"
"నేనూ మనిషినే! నాకూ జీవితం... రసమయజీవితం...కావాలనే ఉంటుంది" అన్నాడు గౌతమ్.
గౌతమ్ కు, సుధారాణి మనసు ఏనాడో అర్థం అయింది. రేణుక చూసి ఈర్ష్యపడుతుందని కూడా తెలుసు. ఎలాగయినా ఆ అమ్మాయి మనసు మార్చాలని అనుకొనేవాడు. కాని ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అర్ధం అయేదికాదు. తనమీద సుధారాణి వ్యామోహాన్ని పెంచుకోవడం ఎవరికి మంచిదికాదని అతనికి అనిపించేది. ఆమె కళ్ళలో ఈర్ష్యనీ, మాటల్లో కాసినీ పసికట్టాడు. ఆ విషయం రేణుకతో మాత్రం చర్చించలేదు.
ఆ రోజు లభించిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదని నిశ్చయించుకున్నాడు.
"నిజంగా?" అదోలా చూస్తూ గౌతమ్ చేతిమీద చెయ్యి వేసింది.
గౌతమ్ చెయ్యి లాక్కోలేదు.
కాని తనచేతిని పట్టుకొని ఉన్న సుధ చేతిని చూశాడు.
సుధ చటుక్కున చెయ్యి లాక్కుంది.
"మీరు మరీ ఇంత సీరియస్ గా ఎందుకుంటారూ? ఎప్పుడు చదువేనా!" మాటమారుస్తూ అన్నది. గౌతమ్ పలకలేదు.
"అంత కష్టపడటమెందుకూ? పైగా ట్యూషన్స్ కూడా చెబుతారనుకుంటానూ?"
"రేపటి కోసం నేను కడుపు నిండుగా తింటూ నా మీద ఆధారపడినవాళ్ళకు ఇంత తిండైనా పెట్టడానికి!"
సుధ గతుక్కుమన్నది. గౌతమ్ ముఖంలోకి జాలిగా చూసింది.
"నన్ను చూసి జాలిపడుతున్నారా" గౌతమ్ నవ్వుతూ అడిగాడు.
"అవును! మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడూ జాలిగానే ఉంటుంది"
"ఎందుకో?"
"మీకు బాగా డబ్బు ఉంటే మంచిబట్టలు వేసుకుంటారు. ట్యూషన్స్ చెప్పి కష్టపడనక్కర్లేదు హనుమంతరావు వాళ్ళలా కులాసాగా త్రుళ్ళుతూ జలసాగా తిరుగుతూ కాలం గడిపేవారు కదా? పాపం!" అనిపిస్తుంది.
గౌతమ్ అదోలా నవ్వాడు.
"నన్ను చూసి ఎవరూ జాలిపడనక్కర్లేదు. బీదతనం పాపంకాదు సిగ్గు పడాల్సిన పని అంతకన్నా కాదు. నాకంటేకూడా బీదవాళ్ళు నిస్సహాయులూ కోట్లకొద్ది జనం ఉన్నారు ఈ దేశంలో ఈ బూర్జువా సమాజం నన్ను వెధవను చేసింది. సుమంగళిలా ఫోజులుకొట్టడం నావల్లకాదు. హనుమంతరావులాంటి స్నేహితులు దగ్గరచేరి నేను టెర్లిన్ ఫ్యాంటు సంపాదించుకోగలను. ఆడపిల్లల ముందు ఫోజులు కొట్టగలను. అలా చేస్తున్నవాళ్ళను చూస్తూనే ఉన్నాను" అంటూ ఆగి సుధ ముఖంలోకి చూశాడు.