Previous Page Next Page 
పిపాసి పేజి 9


    "అయ్యో పాపం!" అంది ఆమె జాలిగా.


    "అమ్మా.... మొన్ననేను, సత్యం, ఒక డాన్సు ప్రోగ్రాంకి వెళ్ళామే 'రత్నావళి' అని. రత్నావళే రాదికమ్మా."    


    "ఏమిటీ" ఆశ్చర్యపోయింది ఆమె.


    "అవునమ్మా. డాన్సు చూస్తున్నంతసేపూ నా కదే అనుమానం వచ్చింది ఎక్కడో చూసినట్టు. వెళ్ళి అడిగాను. గుర్తుపట్టలేదు. చిన్ననాటి విషయాలన్నీ గుర్తుచేసే సరికి, జ్ఞాపకం వచ్చి వలవలా ఏడ్చింది. తన గోడంతా చెప్పు కొచ్చింది. తన నెలాగయినా, ఆ వాతావరణం నుంచి రక్షించమని బతిమాలింది."   


    "వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాస్తేసరి. ఆయనే వెళ్ళి చూసుకుంటాడు" అంది ఆమె మనకెందుకులే ఈ గొడవలు అన్న ధోరణిలో.


    "అమ్మా.... నేనే వెళ్ళి వాడి నోరుమూయించి రాధికని పట్టుకొచ్చానమ్మా" అన్నాడు మెల్లగా, ఆమెకేసి చూస్తూ మధన్.


    "ఏమిటీ" అంది షాక్ తిన్నదానిలా ఆమె.


    "అవునమ్మా. సత్యం దగ్గరుంది" అన్నాడు పెరుగు పోసుకుంటూ.


    షాక్ నుంచి తేరుకున్నట్టుగా, అంది ఆమె. "అయితే నువ్వెళ్ళి నీతో పట్టుకొచ్చావా రాధికని?"


    ఆమె స్వరంలో మార్పును చూసి, "ఏమ్మా.... తప్పు చేశానా" అన్నాడు మధన్.   


    "బాబూ.... ఏదో కానిచోట అంటున్నావు. పెళ్ళి కావలసినవాడివి, వయస్సులో వున్నవాడివి. ఆ చోటికి నువ్వెళ్ళి, ఆ అమ్మాయిని వెంటబెట్టుకు వస్తే, నలుగురూ ఏమనుకుంటారు? సంబంధాలొస్తాయా" ఆమె కంఠములో ఏదో బాధ ధ్వనించింది.


    ఆ మాటలు పదే పదే మధన్ చెవుల్లో రింగుమన్నాయి. "నలుగురూ ఏమనుకుంటారు? సంబంధాలొస్తాయా?"


    మధన్ కి ఏదో ఆలోచన తట్టింది. "తను మగవాడే, తనకే సంబంధాలొస్తాయా? నలుగురూ ఏమనుకుంటారు? అని అమ్మ అడిగినప్పుడు, అసలు రాధిక గతేమిటి? ఆమెనెవరు చేసుకుంటారు? ఆమె భవిష్యత్తేమిటి? తను అక్కణ్ణుంచి ఆమెను పట్టుకొచ్చేశాడు? అంతేనా తన బాధ్యత?" సమాధానం దొరకడం లేదు, ఎంత ఆలోచించినా, రాధిక భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. సమాజం అంతా ఆమెని దూరంగా వుంచుతున్నట్లనిపించింది. అందరూ తనని నీచంగా చూస్తూ, అసహ్యించుకుంటూ వుంటే, రాధిక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నట్టనిపించింది. ఒక్క నిమిషం ఆలోచించి, ఒక నిర్ణయానికొచ్చినవాడిలా" అమ్మా..... నేను రాధికని పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు మెల్లగా.     


    రాజేశ్వరమ్మ ఉలిక్కిపడింది.


    "మధన్..... ఏమిటి నువ్వంటున్నది? పెళ్ళేమిటిరా. ఎవడి దగ్గరో పెరిగి ఎక్కడో పడుకున్న తనతో నీకు పెళ్ళేమిటిరా? పెళ్ళంటే నూరేళ్ళపంట. వంశం, సాంప్రదాయం, కుటుంబ గౌరవము, ఎన్ని చూడాలి."     


    "అమ్మా.... శ్రీహరిగారి కుటుంబంలో పుట్టిన అమ్మాయికి, వంశమూ, సాంప్రదాయమూ, లేవంటావా? ఇక కుటుంబ గౌరవం అంటావా? పుట్టింది వాళ్ళింట్లో, మెట్టింది మనింట్లో. అయినప్పుడు గౌరవం ఎందుకుండదు?"    


    "బాబూ, నువ్వు చిన్నవాడివి! నీకీ విషయాలు అంతగా తెలీవు. ఎప్పుడో ఏడేళ్ళప్పటి నుంచి, ఇప్పటివరకూ ఆ అమ్మాయి ఒక కానిచోట పెరిగింది. ఒకనాట్యకత్తెగా, పదిమంది నోళ్ళలో పడింది. పాపం దాని బతుకలా అయిపోయింది. మనమేం చెయ్యగలం" అంది.      


    "అమ్మా. అలా అయిపోయిన ఆమె బతుకుని, మనమే బాగు చెయ్యగలం."


    "పెళ్ళి జాలిపడి చేసుకోకూడదు బాబూ, బాగా ఆలోచించుకో. చేతులు కాలాక, ఆకులు పట్టుకుని లాభం లేదు."


    "బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. నేను ఆమె మీద జాలిపడి కాదమ్మా చెప్పేది. ఆమెని ప్రేమించాను."  


    సాంబశివరావుగారు ఈ సంభాషణంతా విన్నారు కాబోలు, "చాల్లేవోయ్ సంఘ సంస్కర్తవి బయలుదేరావ్ పెద్ద..... నీలాంటి వాళ్ళని ఎందరిని చూసిందో ఆ కొంపలో" అన్నారు కోపంగా.


    "నాన్నా.... రాధిక అలాంటిది కాదు. బురదలో పెరిగిన పవిత్రంగా మెలిగింది."


    "సమాజానికి కావలసినది, ఎలా పెరిగింది కన్నా ఎక్కడ పెరిగిందీ అనేది ముఖ్యం."


    "సమాజంతో నాకు సంబంధం లేదు."


    "అది సాధ్యంకాదు. సమాజం నిన్ను వేలెత్తి చూపుతుంది."


    "ఫరవాలేదు. నన్ను లెక్కచెయ్యని సమాజాన్ని నేను లెక్కపెట్టను."    


    "మధన్".... ఆవేశంతో గట్టిగా అరిచారు సాంబశివరావుగారు.


    "అమ్మా నాన్నా కూడా అక్కర్లేదా నీకు."


    "కావాలి,"


    "అయితే రాధికనొదులుకో."


    "వీల్లేదు. ఆమె కూడా కావాలి."  


    "ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు."


    "మీరు నాకు కత్తులు కారు నాన్నా, రెండు కళ్ళలాంటివారు."

 Previous Page Next Page