అలసిపోయిన మనస్సుకి చల్లగాలి తాకగానే నిద్దర ముంచుకొచ్చింది గాబోలు, రాధిక హాయిగా నిద్దరపోయింది. నిద్దట్లో మధన్ మీదకి ఒరిగిపోయింది.
పసిపాపలా పడుకున్న ఆమెలో చిన్ననాటి రాధికని చూచుకుని నవ్వుకున్నాడు మధన్.
"మధన్.... మనం సరాసరి గుంటూరు పోతేపోలా?" అన్నాడు సిగరెట్టు తీసి వెలిగించుకుంటూ.
"కాదు అమ్మా నాన్నా కూడా రాధికని చూడాలి. అదీకాకుండా వాళ్ళకి ముందుగా వివరాలన్ని ఉత్తరం రాయాలి. ఉన్నట్టుండి అమ్మాయిని పట్టుకెళ్ళితే వాళ్ళు షాక్ అవుతారు." అన్నాడు మధన్.
తెల్లవారుఝామున కారు విజయవాడ చేరుకుంది. "ఏదైనా హోటల్ కి పోనీ" అన్నాడు సత్యం.
హోటల్లో ముగ్గురూ మొహాలు కడుక్కుని యిడ్లీ తిని కాఫీలు తాగారు. అక్కడెవరో రాధిక కేసి అదేపనిగా చూసి ఏదో గుసగుసలాడుకోవడం సత్యం రాధిక కూడా గమనించారు.
"త్వరగా పోదాం పదరా" అన్నాడు సత్యం వక్కపొడి నములుతూ.
ముగ్గురూ టాక్సీలో కూర్చున్నారు.
టాక్సీ మద్రాసు చేరుకుంది. "సత్యం! రాధికని నీ రూంకి తీసికెళ్ళు. నేను ఇంటికెళ్ళి కాస్సేపాగి వస్తాను" అన్నాడు మధన్.
టాక్సీ ట్రిప్లికేస్ లో ఒకయింటిముందు ఆగింది. ఆయింట్లో ఒకగది తీసుకునుంటున్నాడు సత్యం. సత్యం వెనకాలే దిగుతున్న రాధికకేసి అదోలా చూసింది యింటావిడ. అంతలోనే వాళ్ళ వాళ్ళ పిల్లలలో ఒకడు "రత్నావళి" అన్నాడు "రత్నావళి ఎవరు?" అంది యింటావిడ కుతూహలంగా "డాన్సర్ రత్నావళి మమ్మీ.!" మొన్న మ్యూజియం హాల్లో డాన్సు చెయ్యలేదూ?" అన్నాడు అబ్బాయి. ఇవేవీ వినిపించుకోకుండానే, సత్యం తన గది తాళం తీశాడు. రాధిక సూటుకేసుతో సహా లోపలకొచ్చింది.
"సత్యంగారూ మీకెంతో శ్రమ ఇస్తున్నాను. క్షమించాలి. మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను."
"అవేంమాటలు. మీరు నా సొంత చెల్లెలిలాంటివారు. మీకెప్పుడు ఏం సహాయం కావాలన్నా ఈ అన్నయ్యని మర్చిపోకండి. మొదటినుంచి మీరంటే నాకెంతో అభిమానం. కేవలం మిమ్మల్ని చూడ్డంకోసం మీ పాటవినడం కోసం హైదరాబాదొచ్చేవాణ్ణి. మరే ఉద్దేశ్యంతోటీ కాదు.
"మీలాంటి అన్నగారిని పొందిన నేను అదృష్టవంతురాల్ని, నన్ను నోరారా చెల్లెమ్మా, అని పిలవండి!"
"అలాగే మరి నువ్వు కూడా నన్ను గారూ గీరూ మానేసి, "అన్నయ్యా' అని పిలువు.
"అలాగే" చిరునవ్వు నవ్వింది రాధిక!
"ఆ చెల్లెమ్మా నువ్వు స్నానం చేసి రెడీగా వుండు మళ్ళీ మధన్ వచ్చేస్తాడు, నేను అలా బయటికెళ్ళి టిఫిను కాఫీ పట్టుకొస్తాను" అంటూ ప్లాస్కు పట్టుకుని బయలుదేరాడు సత్యం.
"అలాగే అన్నయ్యా" అంటూ సత్యం బయటికెళ్ళగానే తలుపులు గడియవేసి స్నానానికుపక్రమించింది రాధిక సంతోషంగా.
టాక్సీ దిగుతున్న కొడుకుని చూసి ఎదురువెళ్ళింది రాజేశ్వరమ్మ. "వక్కరోజని చెప్పి ఇన్నాళ్ళు వెళ్ళి ఉన్నావేమిటిరా?" అంది కొడుకువంక చూస్తూ.
"ఎన్నాళ్ళే అమ్మా మూడురోజులేగా" అంటూ లోపలికి వెళ్ళాడు మధన్.
స్నానం చేసి బట్టలు మార్చుకువొచ్చి "అమ్మా వంటవుతే అన్నం పెట్టవే ఆకలేస్తోంది." అంటూ కూర్చున్నాడు భోజనానికి.
"అలాగేలే వడ్డించేస్తాను" అంటూ కంచం గ్లాసూ పెట్టి వడ్డన మొదలు పెట్టింది ఆమె.
"నాన్నరిటైరయ్యినా నువ్వింకా సర్వీసులోనే వున్నావే" అన్నాడు నవ్వుతూ తల్లి కేసి చూసి మధన్.
"ఏం చెయ్యను నాయనా, నాకూ రిటైరవ్వాలని వుంది. నువ్వా పెళ్ళిచేసుకుని కోడల్ని తీసుకురావు. ఎన్నాళ్ళో నాకీ అవస్థ, కోడల్ని చూచుకునే భాగ్యం వుందో లేదో నాకు" దెప్పుతున్నట్టుగా అంది.
"అమ్మా..... నీకెంత కోపంగా వుంది నామీద. ఏమైనా సరే నీకు వెంటనే కోడల్ని తెచ్చే బాధ్యత నాదీ. ఓ.కే" నవ్వుతూ అన్నాడు.
"మా నాయనే ఎంతకాలానికన్నావు ఈ మాట. నాన్నగారికి చెప్పి కాకినాడ మంగపతిగారికి ఉత్తరం రాయమని చెప్పాలి. వాళ్ళమ్మాయుంది. బి.ఏ. పాసయిందిట, ఆమధ్యన ఉత్తరం రాశారు. వాళ్ళు పాపం" అంది రాజేశ్వరమ్మ సంతోషంగా నెయ్యి వడ్డిస్తూ.
"అన్నట్టమ్మా..... మన శ్రీహరిగారమ్మాయి రాధిక ఉన్నట్టుండి ఎక్కడైనా కనబడితే ఎలా వుంటుంది చెప్పు" అన్నాడు ఆవిడకేసి చూస్తూ.
"అదేమి ప్రశ్నరా మధన్. పోయిందనుకున్న అమ్మాయి దొరకడంకన్నా అదృష్టమేముందిరా."
"నిజమే కానీ, ఆ అమ్మాయి ఏ పరిస్థితుల వల్లనోకాని ఒకచోట ఎక్కడైనా దొరికిందనుకో అప్పుడు కూడా తల్లి తండ్రి ఆమెని చేరదీస్తారంటావా?" తల్లి ముఖకవళికలను చదవటానికి ప్రయత్నిస్తూ అడిగాడు మధన్.
"అదేమిటి నాయనా. కన్నకూతురు ఎటువంటిదైనా, కడుపులో పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఇంతకీ ఏమిటి బాబూ ఇలా అడుగుతున్నావ్. రాధిక ఎక్కడైనా కనిపించిందా" అంది ఆత్రుతగా రాజేశ్వరమ్మ.
"అవునమ్మా, రాధికని ఒక దుర్మార్గుడు ఆ రోజు ఎత్తుకుపోయి, డాన్సూ పాటా నేర్పించి, ఆమె వల్ల డబ్బుసంపాదిస్తున్నాడు. ఇలా ఎంతమందినో పట్టుకొచ్చి, పడుపు వృత్తితో, డబ్బు చేసుకుంటున్నాడు. ఎలాగో రాధిక, అంతవరకూ దిగజారకుండా, తనపాట - డాన్సు వల్ల బతికిపోయింది."