సాంబశివరావుగారుకి ఏం చెప్పాలో తెలీలేదు. ఆవేశం ముంచుకొస్తున్నా అణచుకుని ప్రాధేయపడ్డాడు. 'బాబూ! ఒక్కగానొక్కబిడ్డవి. మా ఆశలన్నీ అడియాశలు చెయ్యకు."
"నాన్నా.... నన్నర్థం చేసుకోండి."
"అయితే నీ పట్టుదల వదలవన్నమాట."
"......."
"బాబూ"..... కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాజేశ్వరమ్మ.
"అమ్మా.... సాటి ఆడదాని కన్నీటి జీవితాన్ని కూడా అర్థం చేసుకోమ్మా. మనం వెలుగుతూ, మరొకరికి వెలుగు చూపిస్తేనే జీవితానికొక అర్థం పరమార్థం ఏర్పడుతుంది. రాధిక మనకి తెలీని మనిషేం కాదు. విధివంచితురాలు. అయినా తన పవిత్రతని పోగొట్టుకోలేదమ్మా."
"నాకు తెలుసు బాబూ నువ్వు చెప్పేది. కానీ, తాటిచెట్టుకింద కూర్చుని పాలు తాగినా, అవి పాలంటుందా ఈ సమాజం."
"అనకపోవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పక అవి పాలేనని తెలుసుకుంటారు."
"తెలుసుకునే లోపల ఎన్ని నిందలు మొయ్యవలసొస్తుందో."
"తప్పదమ్మా! ఎంత మంచిపనికైనా, కొన్ని కష్టాలు తప్పవు. ఎంత మంచివాళ్ళకైనా కొన్ని నిందలూ తప్పవు. వాటిని ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలిగాని, భయపడి, పిరికివాళ్ళలా పారిపోకూడదు."
"ఏమిటో బాబూ, నువ్వు చెప్పేది. అడుసు తక్కనేల కాలు కడుగనేల అని, ఎందుకొచ్చింది బాబు, కష్టాలు కొని తెచ్చుకోవడం" కళ్ళు తుడుచుకుంటూ బతిమాలుతున్నట్టుగా అంది ఆమె.
కాస్సేపు ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.
"అమ్మా.... రాధికని సాయంత్రం యింటికి తీసుకొస్తాను. ఈలోగా నాన్నగారికి నువ్వు నచ్చజెప్పమ్మా. శ్రీహరిగారికి రాధిక దొరికిన సంగతి ఉత్తరం నేను రాయనా లేకపోతే...."
"నువ్వే రాయి నాయనా, ఎవరు రాస్తేనేం?" అంది.
"ఓ.కే" అంటూ బూట్లు టకటక లాడించుకుంటూ, బయటికి వెళ్ళిపోయాడు మధన్.
సత్యం కాఫీ టిఫిన్ పట్టుకొచ్చేటప్పటికి, స్నానం చేసి, తయారయి కూర్చుంది రాధిక. చిలుకపచ్చని చీర, అదే రంగు బ్లౌజూ ఒదులుగా అల్లుకున్న జడ, దోసగింజంత ఎఱ్ఱటి కుంకుంబొట్టూ, ఒక్క నిమిషం ఆమెకేసి అలా చూస్తుండిపోయాడు సత్యం.
"ఏమిటన్నయ్యా అలా చూస్తున్నావ్" అంది రాధిక.
"చెల్లెమ్మా, దంతపు బొమ్మలా తయారు చేశాడు ఆ దేముడు నిన్ను, మెల్లగా అతని తీరికవేళల్లో తీర్చిదిద్దాడు నిన్ను, నిన్ను వంచించి, నీ అందాన్ని ఓ కంట కనిపెడుతూనే వచ్చాడు. ఈ అందం ఎవరిదో ఒకరి సొత్తే కావాలనీ, పవిత్రంగా, పదిలంగా దాచిపెట్టాలనీ, అంటూ ప్లాస్కు, ఇడ్లీ పొట్లాలూ, ఆమె చేతికిచ్చాడు.
"అవునన్నయ్యా.... ఒకప్పుడు దేముడు లేడేమోననిపించేది. కానీ మొన్న నిన్నూ, మధన్ ని చూశాక దేముడుండటమేకాదు. నా కోసం, మిమ్మల్ని నాదగ్గరికే పంపించాడేమోననిపిస్తుంది. లేకపోతే ఎంత విచిత్రం మీరు ఆ రోజు ఆ ప్రోగ్రాంకి రావడం, మధన్ నన్ను గుర్తుపట్టడం, నన్ను ఆ ఊబిలోంచి లాగెయ్యడానికి మీరు శ్రమ పడటం, ఇదంతా ఏమనుకోవాలి. మీరే కనపడకపోతే, నా జీవితం అక్కడే కుళ్ళిపోయి, నశించిపోయేది." కంటనీరు పెట్టుకుంది రాధిక.
"చెల్లీ..... నన్ను క్షమించమ్మా, ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేశాను. ఆఁ..... ఏదీ..... కాఫీ పోసివ్వు." అంటూ రెండు కప్పులు తీసుకొచ్చి అందించాడు.
రాధిక కళ్ళు తుడుచుకుని, కప్పులోకి కాఫీపోసి, ఒకటి సత్యానికి ఇచ్చి, ఒకటి తను తీసుకుంది.
అంతలోకి తలుపు తీసుకుని మధన్ లోపలికొచ్చాడు.
"చెల్లెమ్మా, కాఫీని మూడుకప్పులు చెయ్యి" అంటూ మరో కప్పు అందించాడు సత్యం. "ఒద్దురా. నాకు బాగా ఆకలిగా వుంటే, భోం చేసేశాను." అన్నాడు మధన్.
"మధన్..... అత్తయ్యా మామయ్యా ఎలా వున్నారు? నా సంగతి చెబితే ఏమన్నారు?" అంది రాధిక.
"చాలా సంతోషించారు" అన్నాడు మధన్.
"మధన్..... మా అమ్మకి నాన్నకీ....."
"ఇదిగో కవరు పట్టుకొచ్చాను. ఇప్పుడే రాస్తాను" అంటూ కాగితం కలం తీసి రాయడం మొదలెట్టాడు ఉత్తరం పూర్తిచేసి, రాధికకి చదివి వినిపించాడు. సత్యానికిచ్చి పోస్టుచేసి రమ్మన్నాడు.
"ఇవాళ నువ్వు ఆఫీసుకి రావడంలేదా?" అడిగాడు సత్యం.
"లేదురా రాధికని యింటికి తీసుకెళ్ళాలి. బద్ధకంగా వుంది రాలేను ఇవ్వాళ."
"అయితే సెలవు పెట్టెయ్యి. నేవెళ్తాను."
"ఒరేయ్ నువ్వూ ఉండిపోరా ఈ పూటకి, రేపెళ్ళొచ్చునులే" అని బలవంతం చేశాడు మధన్.
"సరేలే" అన్నాడు సత్యం.
రాధిక ఆలోచిస్తూ కూర్చుంది.
"రాధీ.... ఏమిటాలోచిస్తున్నావు" అన్నాడు మధన్.
"మధన్ ఈ ఉత్తరం నాన్నగారికి అందడానికి రెండు రోజులు పడుతుంది. అక్కణ్ణుంచి సమాధానం రావడానికి మరో రెండు రోజులు పడుతుంది.
"ఇన్నాళ్లూ లేని తొందర నాలుగురోజుల్లో వచ్చిందేం?"
"మధన్ ఇన్నాళ్ళూ నేనెవరో నాకే తెలీదు. నాకూ అమ్మా నాన్నా అంతా వున్నారనీ తెలీదు. తెలిశాక మనసు నిలుపుకోవటం కష్టం. అమ్మనీ అందర్నీ చూడాలనీ, అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని హాయిగా నిద్దరపోవాలనీ పసిపిల్లలా నా గోడంతా ఆమెకి వినిపించి, బావురుమని ఏడవాలనీ, మనసు కొట్టుకుపోతోంది. మధన్.... ఒక్కసారి, పోనీ నాన్నగారి ఆఫీసుకి ట్రంక్ కాల్ చేస్తే...." అంది రాధిక సలహా ఇస్తున్నదానిలా మధన్ కళ్ళల్లోకి చూస్తూ.