Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 9

   "పిల్లా, పాపా, ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అందరికీ ఒకటే లక్ష్యం_ దేశ శ్రేయస్సు, రక్షణ.
    డాక్టరు హేమా, ఉమా అందరూ పేర్లిచ్చారు మిలిటరీలో చేరడానికి. అజయ్ కూడా ఇచ్చాడు. వెంటనే ఆ సంగతి అజయ్ తండ్రితో చెప్పకపోయినా, ఆర్డర్స్ వచ్చాక చెప్పక తప్పలేదు.
    "నో...వీల్లేదు" అన్నాడు మృత్యుంజయరావు.
    "నాన్నా!"
    "హు!... నాన్న... ఇంకా ఎందుకురా ఆ పిలుపు? నీ కోసమే బ్రతుకుతూ, నీ మీదే ఆశలు పెట్టుకుని, నీ అభివృద్ధి కోసమే పాటుపడుతూన్న 'నాన్న' ఒకడున్నాడని, యిలా యుద్ధరంగానికి వెళతానంటావా?"
    "మీరు నో అంటారని అనుకోలేదు. మాటిచ్చాను. వెళ్ళక తప్పదు.  
    "ఎవర్నడిగిచ్చావురా మాట?"
    "మీ మనసు నాకు తెలుసు కనుక. మీరు నా మాట కాదనరనే నమ్మకంతోటే మాటిచ్చాను నాన్నా!"
    "మనసు తెలుసుకున్నావే కానీ, ఈ వయస్సులో, ఎదిగిన కొడుకుతో, ఈ ముసలాడికుండే అవసరం మాత్రం తెలుసుకోలేదు, చూడు బాబూ! మీ అమ్మ పోయినప్పటినుంచీ, కష్టాలలో కరిగిపోయి కన్నీటిలో మునిగిపోయాను. జీవితంలో ఒంటరిగా పోరాడి పోరాడి అలిసిపోయాను. నువ్వు పెరిగి పెద్దవుతూన్న కొద్దీ నీ నీడలో నా బాధలన్నీ మరిచిపోయాను. ఆ కాస్త ఆశ కూడా లేకుండా చెయ్యకు బాబూ!" దుఃఖంలో మాట పెగలడం లేదు. జాలిగా చూశారు.
    "నాన్నా! ఒకప్పుడు దేశభక్తినీ, ధర్మాన్నీ మీరే నాకు నూరిపోశారు. కానీ ఇప్పుడు? గతంలోని బాధల్ని తలుచుకుంటూ, ప్రస్తుత కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు."
    "ఇప్పుడూ కాదనడం లేదురా. కావాలంటే మనకున్న ఈ ఆస్తినీ, ఐశ్వర్యాన్ని, ఫ్యాక్టరీలనూ, ఆఖరికి మనం వుండే ఈ ఇంటిని కూడా ప్రభుత్వానికిచ్చేయ్, కాదనను. ఈ సమయంలో డబ్బు కూడా అవసరమే."
    "నిజమే నాన్న! కానీ ప్రస్తుతం డాక్టర్ల అవసరం ఎక్కువ. డాక్టరుగా నేను పదిమందికి ప్రాణాలు పొయ్యగలను. కానీ మనం పంచబోయే ఆస్తి ఒక్కడ్ని కూడా కాపాడలేదు."
    "కావొచ్చును. కానీ నువ్వొక్కడివి వెళ్ళినంతమాత్రాన ఏం నష్టం లేదు. దేశంలో ఎందఱో డాక్టర్లున్నారు. కానీ, నాకున్నది మాత్రం నువ్వు ఒక్కడివే బాబూ! చేతికందిన కొడుకుని దేశానికర్పించి, దిక్కులేనివాడిలా బతికే గుండెనిబ్బరం నాకు లేదురా" దీనంగా అన్నాడు.
    "బంధాలన్నీ ఒక్కటే నాన్నా... ఎవరిబిడ్డ వారికి ముద్దు. అందరూ ఇలాగే అనుకుంటే దేశానికి ఎవరుంటారు? ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని రక్షించడం కోసం ప్రతివారూ పాటుపడాలి."
    ఏం సమాధానం చెప్పాలో, ఎలా నచ్చచెప్పాలో, కడుపు చించుకుపోయే కన్నతండ్రి బాధ ఏ రకంగా తెలియపరచాలో అర్థం కాక, అవాక్కయిపోయారు మృత్యుంజయరావుగారు. కట్ట తెగిన ఏరులా బద్దలవుతూన్న హృదయంలోంచి పొంగుకొస్తూన్న కన్నీటిని అతికష్టం మీద ఆపుకుంటూ "అమ్మా! గోవిందూ! నువ్వైనా చెప్పమ్మా వాడికి" అన్నారు చెల్లెలికేసి తిరిగి.
    ఒక్క నిమిషం తండ్రి కొడుకులకేసి చూసింది గోవిందమ్మ. "వెళ్ళనివ్వు అన్నయ్యా౧ వీరుడిలా వాడు వెళతాను అంటే నువ్వొద్దనడం బాగోలేదు. నిన్ను చూసుకోడానికి మేమందరమూ లేమూ అంది.
    "ఉన్నారమ్మా ఉన్నారు. ఎందరున్నా ఈ ముసలాడు ఛస్తే కొరివిని పెట్టడానికి వాడే కావాలమ్మా...చిన్నప్పటినుంచీ తల్లినీ, తండ్రినీ నేనే అయి పెంచాను.
    గోరుముద్దలు తినిపించాను. జోకొట్టి నిద్రపుచ్చాను.
    వాడు తడబడుతూ తప్పటడుగులు వేస్తూ వుంటే, నా చెయ్యి ఆసరాగా ఇచ్చి అడుగులు వెయ్యడం నేర్పించాను. వాడు పెరిగి పెద్దవాడయితే నా ముసలి వయస్సులో నా చెయ్యి పుచ్చుకుని నన్ను నడిపిస్తాడని ఆశపడ్డాను. కానీ ఇలా అన్యాయం చేస్తాడనుకోలేదు. పంచ కొంగు నోటికడ్డం పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగుకున్నాడు.
    కన్నతండ్రి బాధ కళ్ళారా చూస్తూ అతనికెలా నచ్చజెప్పాలో, ఒప్పించాలో తెలీక అవస్థ పడుతున్నాడు అజయ్. మెల్లగా తండ్రి దగ్గరగా జరిగి "నన్ను అపార్థం చేసుకోకండి నాన్నా. కర్తవ్యానికి బద్ధుడనై వెళుతున్నాను కానీ, కన్నతండ్రి మీద ప్రేమ లేక కాదు. నన్ను క్షమించండి. ఆశీర్వదించండి, వెళ్లొస్తాను."
    మృత్యుంజయరావుగారు మాట్లాడలేదు. రెండడుగులు ముందుకు వేసి దూరం జరిగిపోయారు, కోపాన్ని ప్రదర్శిస్తూ.
    "సరే! వెళ్ళొస్తా నాన్నా!" అజయ్ వెనక్కి తిరిగాడు.
    "ఆగు!" కఠినంగా వుంది మృత్యుంజయరావుగారి గొంతు. ఆగి తండ్రికేసి చూశాడు అజయ్ అశ్రుపూరిత నయనాలతో.
    అజయ్ భుజాలమీద చేతులు వేసి దీనంగా అన్నారు మృత్యుంజయరావుగారు. "బాబూ! కన్నతండ్రి బతిమాలుకుంటూ వుంటే అతని మాట వినడం నీ కర్తవ్యం కాదా? ఎండి మోడైన అతని జీవితంలో ఆ మాత్రం సంతోషాన్నివడం నీ ధర్మం కాదా? బాబూ! కళ్ళలో ఒత్తులు వేసుకుని నీ బాగు చూడాలని బతికివున్న నా ఆశ నిరాశ చెయ్యడం న్యాయమా, చెప్పు?" ప్రాధేయపడుతూ అడిగారు.
    "నాన్నా! మీరు కర్తవ్యానికీ, మమకారానికీ ముడి వేస్తున్నారు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో మమకారం అడ్డు రాకూడదు అనే కదూ భగవద్గీత చెబుతోంది" ధైర్యం చెబుతూన్నట్లుగా అన్నాడు అజయ్.

 Previous Page Next Page