Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 10


    "ఒరేయ్...ఒరేయ్ తాతకి దగ్గులు నేర్పినట్టు నాకు పురాణాల గురించి చెబుతున్నావా? నవ్వుతూ "అయితే తండ్రి మాట నిలబెట్టడానికి పధ్నాలుగేళ్ళు అడవులకు వెళ్ళిన ఆ రాముడి సంగతేమిటి?" అన్నారు కొడుకు ఈ దెబ్బతో ఓటమిని అంగీకరించక తప్పదన్నట్లు ధైర్యంగా.
    తండ్రి గడుసుతనానికి చిరునవ్వు నవ్వుతూ "నాన్నా! దశరధుని ఆంతర్యం రాముడికి తెలుసు. తండ్రి కోరిక కేవలం తండ్రికి అపవాదు కలుగుతుందనీ తెలుసు! అందుకే కర్తవ్యబంధితుడై, తండ్రి మూర్ఛబోయినా అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా కర్తవ్యానికే కదా నాన్నా ప్రాముఖ్యం."
    భేష్! చాలా చక్కగా సమర్థించావ్! పితృవాక్య పరిపాలన కోసం అనకుండా 'కర్తవ్యం కోసం' అన్నావ్.
    "నాన్నా... మీరివ్వాళ ఇలా మాట్లాడుతున్నారూ అంటే ఆశ్చర్యంగా వుంది. మీరు కాదు నాన్నా మీలోని మమకారం. మీ బిడ్డ కోసం స్వార్థం మిమ్మల్నిలా మాట్లాడిస్తోంది. ఒక్కసారి దూరదృష్టితో ఆలోచించి చూడండి. దేశం శత్రువుల చేతులలో చిక్కుకుంటే ఎందరు తల్లులు, ఎందరు బిడ్డలు ఒకరికోసం ఒకరు ఏడుస్తుంటారో, ఎందరు భార్యలు భర్తల కోసం విలపిస్తూ వుంటారో ఆలోచించండి.
    "హు....నీ నిర్ణయం మారదంటావ్."
    "క్షమించండి. మాట తప్పి పిరికివాడిలా బతకలేను. వెళ్లొస్తాను" పాదాభివందనం చేశాడు.
    రెండు చేతులు పట్టుకుని లేవనెత్తి నుదుటిమీద ముద్దు పెట్టుకున్నారు మృత్యుంజయరావుగారు, కన్నీళ్ళతో కౌగిలించుకున్నారు. గదిలో నుంచి ఒక్కొక్క సామానే బయటికి తెస్తూన్న గోపీ అజయ్ దగ్గరగా జరిగి "బావా! మామయ్య చాలా బాధపడుతున్నారు" అన్నాడు.
    "అవునురా! ఆయనని ఎలా ఓదార్చాలో అర్థంకావడం లేదు. ఆయన మనసు కష్టపెడుతున్నాను."
    "బావా! నువ్విందాక అన్నావే దేశానికి కావాలసింది మనుష్యులూ అనీ' కనీసం నేను జవాబుగా అయినా పనికి రానంటావా?"
    "గోపీ! నువ్వూ ఒస్తానంటావా?"
    "కాదు, నేనే వెళతానంటాను. నిన్నుండి పొమ్మంటాను. నువ్వు లేకుండా మామయ్య ఒక్క క్షణం కూడా వుండలేడు" ఒణుకుతూన్న కంఠంతో అన్నాడు.
    "గోపీ! నువ్వెంత మంచివాడివిరా! నీ అభిమానానికి చాలా థాంక్స్. కానీ, అలా జరగదు. డాక్టరుగా నేను రిక్రూట్ అయ్యాను. వెళ్ళక తప్పదు. నాన్నని నువ్వు జాగ్రత్తగా చూసుకో! ధైర్యం చెప్పు... రెండు చేతులూ పట్టుకుని బతిమాలుతున్నట్లు ప్రాధేయపూర్వకంగా అడిగాడు.
    "నేనా పని చెయ్యగలనంటావా?"
    "ఓ...తప్పకుండా. ప్రేమతో ఏదైనా చెయ్యొచ్చు."
    "కానీ, కన్నకొడుకుని మాత్రం కాలేను."
    "నిజమే! కొడుకునే మరిపించగల మహాశక్తివి కావొచ్చు, ప్రయత్నించు" అంటూ గోపీతో కరచాలనం చేసి సామాను తీసుకుని బయలుదేరాడు అజయ్. స్టేషన్ వరకూ వెళ్ళి సాగనంపారు ఇంటిల్లిపాదీ.
    రైలు కదిలేవరకూ కన్నార్పకుండా చెయ్యూపాడు అజయ్.
    "అక్కడెన్నాళ్ళుంటాట్ట_ ఇప్పుడెక్కడికి వెళుతున్నాట్టా" కొడుకుని అడగలేని ప్రశ్నలు గోపీని అడిగారు మృత్యుంజయరావుగారు.
    "ఎవరో ఫ్రెండుని చూసొస్తాడట నాగార్జునసాగర్ లో. గుంటూరులో దిగి అక్కడి నుంచి వెళతాడట. నాలుగు రోజుల్లో వచ్చి, ఆ తరవాత మళ్ళీ వారం ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోతాడు" ప్రోగ్రాం అంతా ఏకరువు పెట్టాడు గోపీ.
    "అలాగా! ఇప్పుడే వెళ్ళిపోతున్నాడనుకున్నా, ఈ హడావిడంతా చూసి" అంది గోవిందమ్మ.
    "ఉన్న కొద్దిటైములోనూ స్నేహితుడి కోసం నాలుగు రోజులు ఖర్చుపెట్టెయ్యాలా? ఒక్కరోజు చాలదూ?" విసుగులాంటి బాధ చూపించారు మృత్యుంజయరావుగారు.
    "పోనీలే మామయ్యా...క్లోజు ఫ్రెండు కదా..." అని సర్దిచెప్పాడు గోపీ.
    హృదయభారాన్ని అతి కష్టంమీద మోస్తూ గృహోన్ముఖులయ్యారు రావుగారు. ఆ రోజంతా నిశ్శబ్దం ఇంటినిండా తాండవం చేసింది.
                                      *    *    *
    పున్నమినాటి చంద్రుడు పాల నురుగులాంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు. వెన్నెల తాకిడికీ కాబోలు సాగరుడు వెర్రెత్తినట్లు పరవళ్ళు తొక్కుతున్నాడు. పారవశ్యాన్ని పట్టలేనట్లు సాగరుని సంతోషానికి తాళం వేస్తున్నట్లు గాలులు శరవేగంతో వీస్తున్నాయ్. పైకెగురుతూన్న చీరని ఎడంచేతితో పట్టుకుంటూ కుడిచేతితో ముఖంమీద పడుతున్న ముంగురుల్ని దిద్దుకుంటోంది మాధవి. ఇవేవి పట్టించుకోకుండా మాధవి ముఖకవళికలను పరీక్షిస్తూ, ఆదుర్దాగా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు అజయ్. అలా అయిదు నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి.
    మీ నిర్ణయం నాకు చాలా నచ్చింది. మీరు తప్పకుండా వెళ్ళండి" అంది మాధవి. అజయ్ కళ్ళలోకి చూస్తూ.
    మధూ! నిజంగానా?" తృప్తిగా మాధవికేసి చూస్తూ అడిగాడు.
    "అవును."
    "నాన్నగారిలాగే నువ్వూ ఒప్పుకోవనుకున్నాను. నువ్వెంత మంచిదానివి మధూ!" మాధవి అరచేతిని గట్టిగా నొక్కుతూ అన్నాడు.
    నాన్నగారి బాధ నాకు తెలుసు. ఒక వయసొచ్చాక ఎటువంటి పరిస్థితిలోనైనా సరే చేతికందిన కొడుకు తనదగ్గిరే వుండాలని కోరుకుంటాడు తండ్రి. పరిస్థితి ఎలాంటిదైనా భర్త ఉన్నత స్థానాలని చేరుకుంటున్నప్పుడు తాను అడ్డుపడకూడదూ అనుకుంటుంది భార్య. బాధ ఇద్దరిదీ ఒక్కటే! తండ్రి వయసు వల్ల సహజంగా కలిగే భయం నిరుత్సాహపరిస్తే, భార్యకీ భర్త గొప్పవాడవడానికి తన కర్తవ్యం ఉత్సాహాన్ని చేకూరుస్తుంది."

 Previous Page Next Page