Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 8

   మూడురోజులు ఇట్టే గడిచిపోయాయి. అజయ్ నువ్వెళ్ళిపోతానంటే నాకెదోలా వుంది. నిన్ను వొదిలి బతకలేనేమోననిపిస్తోంది అంది కంటతడి పెడుతూ మాధవి.
    నాకూ అలాగే వుంది మధూ. హైదరాబాదు వెళ్ళగానే త్వరలోనే నాన్నగారితో చెప్పి, నిన్ను నాదాన్ని చేసుకుంటాను.
    "నిజం?"
    "ప్రామిస్"
    "అజయ్! మీరెంత మంచివారు." అతని గుండెల మీద తల ఆనించి, చిలిపిగా అతని కళ్ళలోకి చూసింది. ఇరువురి చూపుల రాపిడిని భరించలేకేమో ఆకాశం మేఘావృతమైంది. సన్నగా జల్లు ప్రారంభమైంది.
    "అజయ్! చాలా పొద్దుపోయింది. ఇంటి దగ్గర అమ్మమ్మ ఎదురుచూస్తూ వుంటుంది. పోదాం పద అంటూ లేచింది మాధవి.
    రకరకాల ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ వుంటే భారంగా అడుగులు వేస్తూ ఇల్లు చేరుకున్నారు ఇద్దరూ. వెళతాను అన్నాడు అజయ్. ఉండండి అమ్మమ్మకి పరిచయం చేస్తాను అంది మాధవి. ఇద్దరూ లోపలికి నడిచారు.
    అమ్మమ్మ ఇతను అజయ్, ఈమే మా అమ్మమ్మ అంటూ పరిచయాలు పూర్తిచేసింది మాధవి. నమస్కార ప్రతి నమస్కారాలయ్యాక అవునూ ఇప్పటికీ నాలుగురోజులబట్టి చూస్తున్నాను. రోజూ పొద్దుపోయేదాకా ఇల్లు చేరుకోవడం లేదు. ఎక్కడికి వెళుతున్నట్లు మందలించింది అమ్మమ్మ.
    అమ్మమ్మా....మరేమో నేనూ.... ఎక్కడికెళ్ళలా...
    నీళ్ళు నమిలింది మాధవి. "ఏమిటే ఆ తడబాటు! చూడు మధూ ఆడది తిరిగి చెడితే, మగవాడు తిరక్క చెడ్డాట్ట."
    "అమ్మమ్మా...నీకు నామీద నమ్మకం లేదా?"
    నీమీద నమ్మకం లేకకాదు తల్లీ, నీ వయస్సట్లాంటిది. ఏ క్షణాన ఏ అఘాయిత్యం జరుగుతుందోననే నమ్మా నా బాధ. చిన్నప్పట్నుంచీ అమ్మా, నాన్నా లేకపోయినా నాకున్నదాన్లో ఏ కష్టమూ తెలీకుండా పెంచాను. దుఃఖంతో గొంతు బొంగురు పోయింది.
    అమ్మమ్మా! ఇప్పుడవన్నీ ఎందుకు? ఏం జరిగిందనీ? ఏమీ జరగకముందే హెచ్చరిస్తున్నాను. ఆడదాని జీవితం పువ్వులాంటిది. ఒకసారి ఎవరి కాలికిందనైనా పడి నలిగితే వాడి ఎండిపోవడం తప్ప, తిరిగి వికసించదు.
    అమ్మమ్మగారూ! మీరు చెప్పిందంతా నిజమే. కానీ నేను అలాంటివాణ్ణి కాదు. మాధవిని మనసారా ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను అన్నాడు అజయ్.
    "మాటలు చెప్పినంత మాత్రాన ఎలా నమ్మమంటావు బాబూ. నాలుగు రోజుల కోసం సరదాగా ఈ ఊరొచ్చి నిముషంలో మాటివ్వడం తేలికే. ఆ మాట నిలబెట్టుకోవడమే కష్టం. ఏదో ఆకర్షణ పడి ఆవేశంలో చేసిన బాసలూ, చెప్పుకున్న మాటలూ ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి."
    "అమ్మమ్మగారూ! ఆవేశంలో చెప్పే మాటలు కావివి. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాకే చెబుతున్నాను. కేవలం ఆకర్షణలోపడి చేసుకున్న నిర్ణయం కాదు. ఆంతర్యాలు తెలుసుకున్నాకే ఈ నిశ్చయానికొచ్చింది. వెంటనే నాన్నగారితో చెప్పి పెళ్ళి ఏర్పాట్లు చేయించుతాను.
    "చూడు బాబూ! మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? లేనిపోని ఆశలు కల్పించి దాని మనసు పాడుచెయ్యకు."
    "అమ్మమ్మా! నీకంతా అనుమానమే" అజయ్ ఏమనుకుంటాడోనని మందలించింది మాధవి.
    అనుమానం కాదమ్మా. ప్రపంచాన్ని చూసిన అనుభవం. బాబూ! మా మాధవి ఉత్త అమాయకురాలు. దాని మనసు నీ చేతిలో పెట్టింది. దాన్ని కాపాడే బాధ్యత నీముందుంది అంది కళ్ళొత్తుకుంటూ ఆమె.
    మీరేం బాధపడకండి. నా మాటలు మా నాన్నగారు కాదనరు. ఆ నమ్మకంతోనే మీకు మాటిస్తున్నాను. మాధవిని పెళ్ళికూతురిగా తీసుకెళతాను అన్నాడు అజయ్.
    సరే బాబూ! నీ మాటమీద నాకూ నమ్మకం కలిగింది. మా మాధవి అదృష్టవంతురాలు.
    "ఇక వెళ్ళొస్తానండీ"
    ఉండు బాబూ, కాఫీ తాగి వెళ్ళు.
    అవును అజయ్. కాఫీ చేసి తెస్తా.
    ఇప్పుడు కాఫీ వద్దు.
    పోనీ లైమ్ జ్యూస్ తెస్తా, కూర్చోండి. అతని సమాధానానికి ఎదురుచూడకుండా వెళ్ళిపోయింది మాధవి.
    అజయ్ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు.
    ఐదు నిమిషాలలో లైమ్ జూస్ చేసి గ్లాసులో పోసి తెచ్చింది మాధవి.
    చల్లబడ్డ మనసులకి, చల్లని నిమ్మరసం మరింత హాయిని ఇచ్చింది. తియ్యని తలపులతో జూస్ తాగడం పూర్తిచేసి సెలవు తీసుకున్నాడు అజయ్.
    "ఆరోజు సాయంత్రం ఎక్కడ చూసినా ఇవే మాటలు. చైనా మన భారతదేశంలో యుద్ధం ప్రకటించింది. అంతేకాదు. చైనా వారు సరిహద్దుదాటి మన ప్రదేశంలోకొచ్చి కొన్ని ఊళ్ళను ఆక్రమించేశారు. ప్రతివారిలోనూ ఆందోళన, ప్రతి మనిషిలోనూ ఏదో విచారం. భయం ఎవర్ని చూసినా ప్రత్యేక వార్తల కోసం రేడియోలూ, ట్రాన్సిష్టర్ లూ పెట్టుకుని కూర్చున్నవారే. పీస్ ఏరియాలో వున్న మిలిటరీ వాళ్ళందరికీ హెచ్చరిక, ఫీల్డుకి రమ్మని కొత్త రిక్రూట్ మెంట్స్ కూడా మొదలెడుతున్నారని మరో వార్త. కోకొల్లలుగా యువతరం ముందుకొస్తున్నారు. విద్యావంతులు, బలవంతులూ, సాహస వంతులూ, ఇంజనీర్ లు, వైద్యులూ, ఉడుకు రక్తం ప్రవహించే ప్రతివారూ తండోపతండాలుగా సైన్యంలో చేరడానికి ముందుకొస్తున్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఫీల్డుకెళ్ళిపోతున్నారు. భార్యనీ, బిడ్డల్నీ కన్నవాళ్ళింటికి పంపేసి, దేశం మొత్తంలో ఆందోళన, భయం, ప్రాణ రక్షణ, దేశ రక్షణ గురించి బెంగ.

 Previous Page Next Page