Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 9


    "అది కాదురా. నాలో ఏదో బలహీనత ఏర్పడింది. పార్టీ ఆదర్శాలకు కూడా ద్రోహం చేస్తానేమోనని భయంగా వుంది" తనకు తనే చెప్పుకుంటున్నట్లు గంభీరంగా అన్నాడు రాజారావు.

 

    అరుంధతి అదిరిపడింది. సీతాపతి విస్మయం చెందాడు.

 

    "అంటే?" అన్నాడు.

 

    రాజారావుకు అప్పుడుగాని తోచలేదు. తను మాట జారానని.

 

    "ఆఁ ఏమీలేదు. ఆరోగ్యం దెబ్బతింది. మొదటి ఉత్సాహం లేదు. ఎక్కడైనా ఏకాంత స్థానానికి వెళ్ళిపోవాలని వుంది."

 

    "ఇదేమిటోయ్? విప్లవకారుడు సన్యాసి కావటమా?"

 

    "సన్యాసీకాదు పాడూకాదు, ఏకాంతంగా ఒంటరిగా బతకాలనిపిస్తూంది" అన్నాడు రాజారావు.

 

    "పోనీ, పార్టీకి రాజీనామా ఇచ్చి యింటిపట్టునే వుండకూడదూ? ఆ మధ్య మరో రెండు ఎకరాలు కూడా అమ్మావటగా? ఆ డబ్బుకూడా పార్టీకే ఇచ్చావట?"

 

    "నేను పార్టీకి ఇచ్చింది ఎంతలే, ఏదో ఉడుతాభక్తిగా ఇచ్చాను. ఎంతమంది పెద్ద పెద్ద ఆస్తుల్ని పార్టీకోసం త్యాగం చెయ్యలేదు!"

 

    "అయితేమాత్రం నీ భార్యా పిల్లల సంగతి ఆలోచించావా?"

 

    "వాళ్ళకు తినడానికి ఆవిడకున్నదే చాలు. అయినా ఈ దేశంలో ఎంతమందికి స్వంత ఆస్తులు ఉన్నాయంటావు?" వుద్రేకంగా అడిగాడు రాజారావు.

 

    "రేపు తప్పకుండా వెళ్ళాల్సిందేనా? పోనీ మరో నెల వుండకూడదూ? నీ ఆరోగ్యం సరిగా లేదు అని జవాబు రాయి" అన్నాడు సీతాపతి.

 

    రాజారావు మాట్లాడలేదు. రాజారావు తన సలహాను అంగీకరించాడని సీతాపతికి సంతోషం కలిగింది. శాంతమ్మకూడా తేలిగ్గా నిట్టూర్చింది. అరుంధతి ఆలోచిస్తూ కూచుంది.

 

    ఆ రాత్రి అరుంధతి భర్తగుండెలో తలదూర్చి బావురుమంది. సీతాపతి కారణం తెలియక కలవరపడ్డాడు.

 

    "ఏమిటి అరూ! ఏం జరిగింది?" ఆత్రంగా ప్రశ్నించాడు.

 

    అరుంధతి మౌనంగా గుండెలు తరుక్కుపోయేలా రోదిస్తూంది.

 

    సీతాపతి గాబరా ఎక్కువయింది. "చెప్పు, ఏం జరిగిందో. అమ్మ ఏమయినా అందా?" అన్నాడు మృదువుగా.

 

    కాదన్నట్లు తల ఆడించింది.

 

    "మరి ఏం జరిగిందో చెప్పు? నిన్ను ఎవరైనా అవమానించారా!" ఆదుర్దాగా ప్రశ్నించాడు.

 

    "మీరు నాకు దూరం అయిపోతారని భయంగా వుంది"

 

    సీతాపతి త్రుళ్ళిపడ్డాడు. అయోమయంలో పడ్డాడు.

 

    "ఛ అవేం మాటలు? అసలు నీకు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది. ఏదైనా పీడకల వచ్చిందా నామీద?" అన్నాడు భార్యను మృదువుగా లాలిస్తూ.

 

    "మీ స్నేహితుణ్ణి వెళ్ళమనండి! ఇక్కడ వుండవద్దని చెప్పండి. మళ్ళీ ఎప్పుడూ రావద్దని చెప్పండి" ఉద్వేగంతో అనేసింది భర్త చేతులకు చుట్టుకుపోతూ. ఆమెను అతన్నుంచి ఎవరో బలవంతంగా లాగేస్తుంటే అతన్ని గట్టిగా పట్టుకున్నట్లు చుట్టుకుపోతూంది.

 

    సీతాపతి ఆశ్చర్యానికి అంతులేదు. భార్య ముఖాన్ని గడ్డంపట్టుకొని ఎత్తుతూ ఆ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆమె ముఖంలో భయం, కళ్ళలో విషాదం కనిపించాయి.

 

    "రాజా మనింటికి రాకూడదా? అతను వస్తే నేను నీకు దూరం అవుతానా? తనను తనే ప్రశ్నించుకున్నట్లుంది అతని స్వరం.

 

    ఆ స్వరంలోని గంభీరత అరుంధతి వీపు చరిచింది.

 

    "చెప్పు అరూ! అసలు విషయం ఏమిటి?" తీవ్రంగా ప్రశ్నించాడు.

 

    అరుంధతికి కలవరపాటు కలిగింది. ఏం చెబుతుంది? మీ స్నేహితుడంటే నాకు ఇష్టం అని చెబుతుందా?

 

    "చెప్పు." విసుగ్గా వుంది సీతాపతి స్వరం.

 

    "అతనికోసం పోలీసులు తిరుగుతున్నారు! ఇక్కడే ఉన్నాడని తెలిస్తే. మిమ్మల్ని కూడా పోలీసులు..." అరుంధతి కంఠం జీరపోయింది. అబద్ధం ఆడుతున్నందుకు బాధ కలిగింది. కాని తప్పదు అనుకుంది.

 

    సీతాపతి మనస్సు తేలికపడింది.

 

    "పిచ్చి అరూ! అంతమాత్రానికేనా ఇంత ఏడుపు? పోలీసులు నన్నెందుకు పట్టుకుపోతారు?" గోముగా అన్నాడు ఆమె వీపు నిమురుతూ.

 

    "మీకు చెప్పటానికి మొహమాటం అయితే నేను చెబుతాను. అతను ఇక్కడ వుంటానికి వీల్లేదు!" అంది ధైర్యంగా అరుంధతి.

 

    "అరూ!" భర్త స్వరంలోని కాఠిన్యానికి తెల్లమొహం వేసింది. వెన్నకంటే మృదువైన అతని మనస్సునే చూసింది కాని వజ్రంకంటే కఠోరమైన అదే మనస్సు అంతవరకూ ఆమె అనుభవంలోకి రాలేదు.

 

    "రాజా నాకు సోదరుడికంటే ఎక్కువ. ఇంట్లో వాడికున్న స్థానం నీకు అర్ధంకాదు. వాణ్ణి రావద్దనే హక్కు నీకు కూడా లేదు" అన్నాడు సీతాపతి నిశ్చలమైన కంఠంతో.

 

    తన భర్త తనను చాలా ప్రేమిస్తాడు. గౌరవిస్తాడు. కాని తనలో అతనిచేత అతనికి ఇష్టంలేని ఏ పనినీ చేయించే శక్తి లేదని తెలుసుకుంది అరుంధతి.

 

    "మీకు ఎలా చెప్పాలో అర్ధంకావటంలేదు. నామీద నాకే నమ్మకం లేదు. రాజాను నేను ఆరాధిస్తున్నాను. ప్రేమిస్తున్నాను...అతనిముందు నన్ను నేను మర్చిపోతాను. ఈ ప్రపంచం ఉనికినే మర్చిపోతున్నాను. ఏక్షణాన్నైనా నేను మీకు ద్రోహం చెయ్యవచ్చు. మచ్చలేని ఈ వంశానికి తీరని కళంకాన్నే తెచ్చిపెట్టినదాన్ని కావచ్చు. అతన్ని వెళ్ళనివ్వండి" అని పిచ్చిగా అరవాలనిపించింది. కాని, "మీరు ఏనాడు నేను చెప్పింది చేశారు?" అంది భర్త గుండెలకు అతుక్కుపోతూ.  

 

    "పిచ్చిపిల్ల! నీ మాట వినకపోతే ఇంకెవరిమాట వింటాను?" భార్యను గాఢంగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు సీతాపతి.

 

    తల్లవారుఝామున ఎవరో వీపు తట్టినట్లు లేచి కూచుంది అరుంధతి. భర్త గురకపెట్టి నిద్రపోతున్నాడు. అతను వెళ్ళిపోయాడా? వెళ్ళడు! ఎందుకు వెళతాడు? తను వెళ్ళిలేపి, వెళ్ళమని చెబితే! మంచం దిగి బయటకు వచ్చింది అరుంధతి. రాజారావు గదిలోకి అడుగు పెట్టింది. ఖాళీ మంచం ఆమె ముఖంలోకి జాలిగా చూసింది. అరుంధతి ముఖాన్ని రెండు చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అతను వెళ్ళిపోయాడు. అతని గొప్పతనాన్ని తను గుర్తించలేదు. అతను వెళ్ళడని అనుమానించింది. అతను ఆదర్శమూర్తి. తనకోసం అతను కర్తవ్యాన్ని విస్మరించి అక్కడే వుండిపోతాడని శంకించింది. తను అల్పురాలు.

 

    తన గదిలోకి వచ్చింది. ఇంకా చీకటి వుంది. భర్త నిద్రపోతున్నాడు. అత్తగారుకూడా ఇంకా లేవలేదు. అరుంధతి మళ్ళీ పడుకుంది. నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకుంది.


                                        8


    ఆనాడంతా అరుంధతి అశాంతిగానే తిరిగింది. ఎవర్నో తిట్టాలనీ, ఏడవాలనీ, ఎక్కడికో పారిపోవాలనీ, ఇంకా ఏమేమో చెయ్యాలనిపించింది. వంటింట్లోకి వెళ్ళి పని చెయ్యసాగింది.

 

    "నేను చేసుకుంటాగా నువ్వెళ్ళి కూచో" అంది అరుంధతి చేతిలో పనిని అందుకోబోతూ శాంతమ్మ.

 

    "నా ఇంట్లో నన్ను వంటకూడా చేసుకోనివ్వరా? ఎంతకాలం పరాయిదానిలా కూచోపెడతారు?" విసురుగా అంది అరుంధతి.

 

    శాంతమ్మ తెల్లపోయి చూసింది. ఏదో అనబోయి వూరుకుంది. గిర్రున తిరిగి బయటకు వచ్చేసింది. ఆమె మళ్ళీ వంటింట్లోకి వెళ్ళలేదు ఆ రోజంతా.

 

    "అమ్మా, అన్నం వడ్డించు." అంటూ వచ్చి పీటమీద కూచున్న భర్తకు అరుంధతే అన్నం వడ్డించింది.

 

    "అమ్మ ఎక్కడ?"

 

    "ఏం, అమ్మ కనిపించకపోతే ముద్ద లోపలకు పోనంటుందా?" అంది అరుంధతి విసురుగా.

 

    సీతాపతి సాలోచనగా భార్య ముఖంలోకి చూశాడు. మాట్లాడలేదు. భోజనం చేసి పొలం బయలుదేరిన సీతాపతికి తల్లి గొడ్లసావిట్లో జీతగాడితో మాట్లాడుతూ కనిపించింది. ఆ సమయంలో ముఖ్యంగా, తను భోజనానికి వచ్చే సమయంలో ఆమె అక్కడ ఉండటం ఆశ్చర్యంగానే అనిపించింది.

 

    "ఏమ్మా, ఇక్కడ వున్నావు?"

 

    "ఏమీలేదురా! ఊరికే ఇటుకేసి వచ్చాను."

 

    "లేదమ్మా! నువ్వు ఏదో దాస్తున్నావు. నీ స్వభావం నాకు తెలియదా. ఏనాడయినా నాకు అన్నం పెట్టకుండా వున్నావా? ఇవ్వాళ వంట కూడా నువ్వు చేయలేదు, చెప్పమ్మా! అది ఏమయినా అందా?" తీవ్రంగా వుంది అతని స్వరం.

 

    "అబ్బే ఏంలేదు, అది నన్నేమంటుంది? నువ్వు పొలం వెళ్ళు" అంటూ గబగబా అక్కడనుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ.

 

    అత్తగారి మనస్సు నొప్పించినందుకు అరుంధతి బాధ కలక్కపోలేదు.

 

    "రండి అత్తయ్యా! అన్నం తిందాం!" అంది.

 

    శాంతమ్మ మౌనంగా వచ్చి కూచుంది. రోజూ కోడలికికూడా తనే పెట్టేది. ఈరోజు కోడలు పెట్టేంతవరకూ అలాగే కూచుంది. ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఏనాడూ ఒకరిచేత ఒక మాట అనిపించుకున్న మనిషి కాదు. గౌరవంగా తన స్థానాన్ని తనే నిర్ణయించుకోవడం మంచిదనుకుంది.

 

    కానిక, అరుంధతి సాయంత్రం వంట ప్రయత్నాలేమీ చెయ్యకుండా ఏదో పుస్తకం చదువుతూ కూచుంది. శాంతమ్మకు ఏం చెయ్యాలో తోచలేదు. కొడుకు పెందలాడే అన్నం తినే అలవాటు. వస్తూనే "అన్నం పెట్టమ్మా" అంటే తనేం సమాధానం చెబుతుంది? చిన్నపిల్ల ఏదో అందని తను భీష్మించుకు కూచుంటే ఎలా! పంతాలూ, పట్టింపులూ ప్రారంభం అయితే ఇంట్లో అశాంతి రేకెత్తుతుంది.

 

    శాంతమ్మ వంటప్రయత్నం చెయ్యటానికి వంటింట్లోకి వెళ్ళింది. అరుంధతి అంతా గమనిస్తూనే వుంది.

 

    అరుంధతి అన్నం తిని గదిలోకి వచ్చేప్పటికి సీతాపతి రాజారావు ఫోటోని యథాస్థానంలో పెడుతున్నాడు.

 

    "దాన్ని అక్కడ పెట్టకండి!" అంది అరుంధతి భర్త దగ్గరగా వచ్చి నిల్చుని.

 

    "ఏం?"

 

    "వద్దు. నా మాట వినండి." అరుంధతి కంఠం వణికింది.

 

    "ఇంతకు ముందు అక్కడే వుండేదిగా?" అన్నాడు సీతాపతి.

 

    "ఇంతకు ముందు వేరు. ఇప్పుడు వేరు."

 

    "ఏమిటది?" అతని కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది.

 

    "చెప్పు!" అన్నాడు అరుంధతి భుజాలు పట్టుకుంటూ.

 

    అరుంధతి ఒక్క క్షణం ఆలోచించింది.

 

    "ఆ ఫోటో అక్కడ వుండటం శ్రేయస్కరంగాదు! పోలీసులు ఎప్పటికైనా ఆచూకీ తీయగలరు, మిమ్మల్ని అనుమానిస్తారు."

 

    "ఓ అదా! ఫరవాలేదులే."

 

    "వద్దు. నా మాట వినండి. మీ స్నేహితుడే తీసేశాడుగా?" అంటూ చేతుల్లోనుంచి ఫోటోను తీసుకెళ్ళింది. దేవుడి గదిలో వున్న పెట్టెలో గుడ్డల అడుగున భద్రంగా దాచి వచ్చింది.

 

    "ఏం చేశావు?"

 

    "పారేశాను."

 

    "ఆఁ!" అంటూ నోరు తెరిచాడు.

 

    "ఆఁ లేదు; ఊఁ లేదు" అంటూ అరుంధతి తన చేతుల్ని సీతాపతి మెడచుట్టూ చుట్టింది. సీతాపతి ప్రపంచాన్నే మర్చిపోయాడు. అరుంధతిని గుండెలకు హత్తుకున్నాడు.


                                                                   9


    అరుంధతిలో చిరాకు ఎక్కువయిందని సీతాపతి గ్రహించాడు. ఒకటి రెండుసార్లు కోపంతో చెయ్యి ఎత్తబోయి తమాయించుకున్నాడు. అరుంధతి మనస్సును రాజావైపుకు పరుగెత్తకుండా దానికి కళ్ళెంవేసి ఆపాలని ఎంత ప్రయత్నించేదో, అంత వేగంగా ఆ మనస్సు పరుగెత్తేది. రాడేమో! మళ్లీ కనిపించడేమో! అనే ఆలోచనలు ఆమె హృదయాన్ని క్రూరమృగాల్లా నమలసాగాయి. మధ్యాహ్నం వేళల్లో మరీ మనస్సును అదుపులో పెట్టుకోలేని సమయాల్లో పెట్టెలో బట్టల అడుగున దాచిన రాజారావు ఫోటోను తీసి గంటలకొద్దీ చూస్తూ ఉండిపోయేది. రాజారావు రూపంతో భర్త రూపాన్ని పోల్చుకొనేది. ఎత్తుగా కండపుష్టితో నీరుకావి పంచె, కాలర్ లేని గుండ్రటి మెడ చొక్కా, నెత్తిన తలగుడ్డా, చేతిలో బారాటి కర్రా, ఏదోగా అనిపించేది. ఎలా వున్నా అతను తన భర్త అని మనస్సుకు సర్ది చెప్పుకోటానికి ప్రయత్నించేది.

 

    ఆనాటి ఉదయం శాంతమ్మ పిండి రుబ్బుతూంది. "పాలు పొయ్యిమీద పెట్టాను చూస్తూండ"మని కోడలితో చెప్పి వెళ్ళింది. ఆలోచిస్తూ కూచున్న అరుంధతికి ఆ మాటలు వినిపించలేదు. పాలు పొంగిపోయి కవురు వాసన కొడుతున్నా పట్టించుకోలేదు. శాంతమ్మ లోపలకు పిండిచేత్తోనే పరుగెత్తింది.      

 

    కుండలోని పాలన్నీ పొయ్యిలోనే వున్నాయి. చిక్కటి పాలు పొయ్యిలోనుంచి ధారగా ప్రవహిస్తున్నాయి నేలమీదకు. శాంతమ్మ ప్రాణం ఉసూరుమంది. కుండ దింపేసి రుస రుసలాడుతూ అరుంధతి దగ్గరకు వచ్చింది. శాంతమ్మకు సాధారణంగా కోపం రాదు.

 

    "ఆడపిల్లవుకాదూ? పాలు అలా పొంగి వాసన కొడుతుంటే తెలియలేదూ?" అంది మందలిస్తున్నట్లు.

 

    "తెలియలేదు కనుకనే చూడలేదు" తీవ్రంగా వుంది అరుంధతి స్వరం.

 

    "ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ అలా కూచోవటం ఏమిటో నాకు అర్ధం కావటంలేదు. మాట్లాడితే చిరాకు పడతావు. అత్తగారింట్లో ఆడపిల్లలు వుండాల్సిన విధం ఇదికాదు" అంది శాంతమ్మ కోడల్ని మందలిస్తూ.

 

    "నా ఇష్టం వచ్చినట్లుంటాను. మీ సలహాలు నాకేమీ అక్కర్లేదు. కొడుకును కొంగుకు ముడేసుకున్నావు గదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే పడేది లేదు."

 

    మాటలు పూర్తి అవకుండానే అరుంధతి చెంప చెళ్ళుమంది. కళ్ళముందు రంగులు కనిపించాయి. ఏం జరిగిందో అర్ధం చేసుకోవటానికి ఓ నిముషం పట్టింది.

 

    కోడలన్న మాటలకే నోట మాట రాక తెల్లబోయి చూస్తున్న శాంతమ్మకు కొడుకు చేసిన పని చూశాక మతి పోయినంత పనైంది.

 Previous Page Next Page