Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 10


    అరుంధతి చేత్తో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. సీతాపతి కోపంతో రొప్పుతున్నాడు. శాంతమ్మ కర్తవ్యం తోచనిదానిలా చూస్తూ నిలబడిపోయింది.

 

    "ఈసారి మా అమ్మను అవమానించావా నీకు ఈ ఇంట్లో స్థానముండదు. ఖచ్చితంగా, కఠినంగా వుంది సీతాపతి కంఠస్వరం.

 

    "ఏమిటిరా ఆ మాటలు? ఇప్పుడు నన్నేం కాని మాటలందని? పాలు పొంగిపోయాయనే బాధలో నేనే తొందరపడ్డాను. అయినా ఆడపిల్లమీద చెయ్యి చేసుకోవడమేమిటి? ఈ వంశంలో ఎప్పుడైనా మీ నాన్నగానీ, మీ తాతలుగాని పెళ్ళాల్ని కొట్టారని విన్నావటరా? ఆడపిల్ల నట్టింట కన్నీరు కారిస్తే శుభం కాదురా. శాంతమ్మ బాధగా మందలించింది.

 

    సీతాపతి అంత కోపమూ ఇట్టే నీరుకారిపోయింది. అపరాధిలా తల వంచుకుని నిలబడ్డాడు.

 

    అప్పటికే అరుంధతి అక్కడనుంచి వెళ్ళిపోయింది.

 

    "అసలే వట్టిపిల్ల కూడా కాదు, మనస్సు బాధపడకూడదు. వెళ్ళి బుజ్జగించు అంది శాంతమ్మ.

 

    "వట్టిపిల్లకాదా? అంటే?" మనస్సులోనే ప్రశ్న వేసుకొని అర్ధంకానట్లు తల్లి ముఖంలోకి చూశాడు.

 

    "అలా చూస్తావేంరా పిచ్చి నాగన్నా! నీకు కొడుకు పుట్టబోతున్నాడురా సీతాయ్!" అంది శాంతమ్మ మురిపెంగా చూస్తూ.

 

    శాంతమ్మ మాటలు తేనెలసోనల్లా తాకాయి సీతాపతి హృదయం అంచుల్ని.

 

    సీతాపతి ఉత్సాహంగా భార్యవున్న గదిలోకి వెళ్ళాడు. అరుంధతి మంచంమీద బోర్లాపడుకొని దిండులోకి తలదూర్చుకొని వెక్కివెక్కి ఏడుస్తూంది. చిన్న మంచం పట్టెమీద కూచుని, ఏడుస్తూన్న అరుంధతిణి చూశాడు. అప్రయత్నంగా అతని చెయ్యి అరుంధతి తల నిమిరింది. అరుంధతి కస్సుమంటూ లేచి కూచుంది. అతడి చేతిని విదిలించి కొట్టింది.

 

    "క్షమించు అరూ! ఏదో కోపంలో పొరబాటు జరిగిపోయింది. ఈ జన్మలో నీమీద మళ్ళీ చెయ్యి ఎత్తను. నీమీద ఒట్టు," అన్నాడు సీతాపతి అరుంధతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అరుంధతి విసురుగా తన చేతిని లాగేసుకుంది.

 

    "అలా ఏడవకు అరూ! కావాలంటే నన్ను నాలుగు తిట్టు. నువ్వు ఏడుస్తూంటే నేను చూడలేను."

 

    అరుంధతి మాట్లాడలేదు కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.

 

    "నన్ను క్షమించవూ? ఇవి చేతులు కావు" అంటూ అరుంధతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

 

    అరుంధతి త్రుళ్ళిపడింది. "ఛ! అదేమిటి? తప్పు!" అంటూ చేతిని తొలగించింది.

 

    "తప్పులేదు-గిప్పులేదు. ఆ శ్రీకృష్ణపరమాత్మ అంతటివాడికే భార్య కాళ్ళు పట్టుకోక తప్పలేదు" అన్నాడు సీతాపతి అరుంధతి కళ్ళనీళ్ళు తుడుస్తూ. భర్త మాటలకు అరుంధతికి అంత ఏడుపులోనూ నవ్వొచ్చింది. పెదవులు కదిలాయి.

 

    "నవ్వొస్తే బాగానే నవ్వులే! నీ నోటి ముత్యాలేమీ రాలిపోవు" అన్నాడు రెండు చేతుల్తో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ. అరుంధతి వారించలేదు.

 

    "నాకు చెప్పలేదేం?" అంటూ సీతాపతి అరుంధతి చుబుకాన్ని పట్టుకొని ముఖం పైకెత్తాడు. ఏడ్చి ఎర్రపడినకళ్ళతో, కందిపోయిన ముక్కూ, చెక్కిళ్ళూ చూస్తూంటే సీతాపతి ఇనుమడించిన అరుంధతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు.

 

    "ఎంత అందంగా వున్నావు అరూ!" అన్నాడు సీతాపతి.

 

    "పోనీలెండి! ఇంత కాలానికైనా మీ కళ్ళకు నా అందం కనిపించింది" అంది అరుంధతి దెప్పుతున్నట్టు. "ఈ మనిషికి ఎలాంటి అనాకారి భార్య దొరికినా ఇంతే ప్రేమగా చూసి వుండేవాడు. పెళ్ళాన్ని గౌరవించాలి, ప్రేమించాలి అని మాత్రమే తెలుసు. అందచందాల ప్రమేయమే అక్కర్లేదు. అడవిమనిషి" అనుకుంది మనసులోనే.

 

    "నాకు చెప్పకుండా దాచావుకదూ?" అన్నాడు సీతాపతి.

 

    "ఏమిటి?" అన్నట్టు చూసింది అరుంధతి తన ఆలోచనలోంచి బయటపడి.

 

    "అదే!" అంటూ చెవులో ఏదో అన్నాడు.

 

    అరుంధతి కళ్ళు సిగ్గుతో బరువుగా వాలిపోయాయి. బుగ్గల్లో రక్తం చిమ్మింది.

 

    "నాకు అబ్బాయే కావాలి, తెలుసా?" అన్నాడు సీతాపతి.

 

    "కాదు, అమ్మాయి కావాలి నాకు. అదీ మీ అందంతో!" అంది అరుంధతి భర్త ముఖంలోకి కొంటెగా చూస్తూ.

 

    సీతాపతి చిన్నబుచ్చుకున్నాడు. మాట్లాడలేదు. అరుంధతికి సీతాపతిని ఉడికించాలనిపించింది.

 

    "మీ పోలికలతో అమ్మాయి పుడితే పెళ్ళి ఎలా అవుతుందా అని దిగులా?" అంది అరుంధతి.

 

    సీతాపతి జవాబివ్వలేదు.

 

    "ఫర్వాలేదు దిగులుపడకండి. మీలాంటి మనుషులకు ప్రపంచంలో తరుగులేదు." అంది అరుంధతి.

 

    సీతాపతి గబుక్కున లేచాడు. అరుంధతి చెయ్యి పట్టుకుని కూచోపెట్టింది.

 

    "తమాషాగా అంటేకూడా అంత కోపం ఎందుకు? మరి మీరు నన్ను కొట్టినందుకు....?"

 

    "సిగ్గుపడుతున్నాను అరూ! ఆ విషయం మళ్ళీ ఎప్పుడూ ఎత్తకు. తొందరపడ్డానని చెప్పానుగా!"

 

    "ఇవ్వాళ పొలం వెళ్ళరా ఏమిటి?"

 

    "వెళ్ళను!"

 

    అరుంధతి ఆశ్చర్యపోయింది. తాను కాపరానికి వచ్చిన ఇన్ని రోజుల్లో మరీ ఆరోగ్యం బాగా లేనప్పుడు తప్ప భర్త పాలుమాలి పొలం పోకుండా ఇంట్లో కూచోవటం ఆమెకు తెలియదు.

 

    "ఎందుకని?"

 

    "ఊరికే ఇవాళ నిన్ను చూస్తూ కూచోవాలని వుంది" అన్నాడు నవ్వుతూ.

 

    "అయితే ఏలూరు వెళ్ళి సినిమా చూద్దాం పదండీ!" అంది అరుంధతి ఉత్సాహంగా.

 

    "ఇప్పుడా?"

 

    "ఏం? టైం చాలా వుందిగా? ఇంకా తొమ్మిదన్నా కాలేదు. బండి కట్టించండి. రెండు గంటలకల్లా ఏలూరు వెళతాం. మ్యాట్నీచూసి వెంటనే తిరిగి రావచ్చు. రాత్రికి వచ్చేద్దాం" అంది అరుంధతి.

 

    "అయితే అమ్మకు చెబుతాను" అంటూ లేచి వెళుతున్న భర్తను చూస్తూ "అమ్మకు చాలని దేవయ్య" అనుకుంది కసిగా ఆమె అహం దెబ్బతిన్నది.

 

    "అరూ! అమ్మ ఒప్పుకుంది. జీతగాడిని బండి కట్టమని చెబుతాను. మనం అన్నం తినేటప్పటికి వాడు సవారీ కడతాడు" అన్నాడు సీతాపతి ఉత్సాహంగా.

 

    "అక్కర్లేదు."

 

    "అదేం? ఇప్పుడేగా వెళదాం అన్నావు!"

 

    "అప్పుడు వెళదాం అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళాలనిలేదు" అంది అరుంధతి మొండిగా.

 

    సీతాపతి మౌనంగా వుండిపోయాడు.


                                       10


    అరుంధతి ప్రసవించే రోజులు దగ్గరికొచ్చాయి. ఈ మధ్య కాలంలో రెండు మూడుసార్లు అరుంధతి భర్తతో ఏలూరు వెళ్ళి సినిమాలు చూసింది. ప్రతి పర్యాయమూ కొన్ని పుస్తకాలూ తెచ్చుకుంది కాలక్షేపం కోసం. అత్తగారికీ, భర్తకూ అంతంత డబ్బు పుస్తకాలకు ఖర్చు చెయ్యటం నచ్చలేదు. కానీ, ఎవరూ పైకి ఏమీ అడ్డు చెప్పలేదు. అరుంధతి తండ్రి ఒకసారి కూతుర్ని చూట్టానికి వచ్చాడు కానుపుకు తీసుకెళతానన్నాడు. అరుంధతి వెళ్ళనంది. శాంతమ్మకూ పంపించటం ఇష్టంలేదు.

 

    "ఎక్కడయితేనేంలే, కూతురయినా, కోడలయినా ఆ పిల్లెగా ఇంట్లో" అంది శాంతమ్మ. ముసలాయన వెళ్ళిపోయాడు ఏమీ అనలేక. అరుంధతి తండ్రితో ఆప్యాయంగా మాట్లాడలేదు. అదిచూసి సీతాపతికూడా నొచ్చుకున్నాడు.

 

    "అమ్మా! అది పురుడు గుంటూరు ఆస్పత్రిలో కానీ, ఏలూరులో కానీ పోసుకుంటానంటూందే" అన్నాడు ఒకరోజు సీతాపతి తల్లితో.

 

    "ఎందుకు నాయనా? బస్తీలకు వెళ్ళటం అంటే మాటలా? బోలెడు ఖర్చవుతుంది. పైగా, మనం ఉండటానికి కొత్త, ఆ వూళ్ళో అవస్థ పడాలి. మన ఊళ్ళో డాక్టరుగారి దగ్గిర వుండే నర్సు చాలా తెలివైందట. ఈ ఊళ్ళో అందరికీ అదే కాన్పులు చేస్తూంది. మంత్రసాని సుబ్బమ్మకూడా మంచిదే. దాని హస్తవాసి చాలా మంచిది" అంది శాంతమ్మ.

 

    సీతాపతి మరేం మాట్లాడలేదు. అరుంధతికి వళ్ళు మండిపోయింది. ఆవిధంగానన్నా నాలుగు రోజులు బస్తీలో పదిమంది ముఖాలు కనిపించే చోటు ఉండవచ్చుననుకుంది.

 

    అరుంధతి ప్రసవించింది. ఆ రోజు నర్సు జ్వరంగా ఉందని రాలేదు. మంత్రసాని సుబ్బమ్మే పురుడు పోసింది. ఆడపిల్ల పుట్టింది.

 

    "తొలుచూరి కాన్పు ఆడపిల్ల పుట్టింది!"

 

    "ఏ పిల్లయితేనేంలే, బంగారు బొమ్మ పుట్టింది. అంతా తల్లి పోలికే."

 

    "కోడలు అందమయింది. పిల్లలంతా అందమయిన వాళ్ళే పుడతారు. కోడలు నలుపైతే, కులమెల్లా నలుపవుతుందని నెత్తి కొట్టుకుని చెప్పినా ఆ మనిషి వినలేదు. ఇప్పుడు చూడరాదూ. మా మనమలూ, మనవరాళ్ళూ ఎంత నల్లగా వుంటారో, నాకే వాళ్ళను దగ్గరకు తీసుకోవాలనిపించదు" అంది వీరయ్యగారి పున్నమ్మ పిల్లను చూట్టానికి వచ్చి.

 

    "శాంతమ్మ అదృష్టవంతురాలు" అంది మరో పునిస్త్రీ.

 

    "అష్టమి సోమవారం పుట్టింది. సీత పుట్టినరోజు" అంది ఓ వయస్సు స్త్రీ.

 

    "ఎంత అదృష్టం!"

 

    "అదృష్టం ఏమిటి నా మొహం. ఆనాడు పుట్టినవాళ్ళు సీతమ్మవారు అనుభవించినన్ని కష్టాలు అనుభవించాల్సిందే" అంది ఆ స్త్రీ మళ్ళీ.

 

    అమ్మలక్కలు అనుకుంటున్న మాటలన్నీ వింటూనే వుంది శాంతమ్మ. చివరి మాటలకు ఆమె మనస్సు చివుక్కుమంది.

 

    సీతాపతి పురిటి గదిలోకి వచ్చాడు. సంతోషం పట్టలేకుండా వున్నాడు. అరుంధతి కళ్ళు మూసుకొని ఉంది. పసిబిడ్డ గుప్పెళ్ళు మూసివున్న చేతుల్నీ, కాళ్ళనూ గాలిలోకి విసురుతూంది. కళ్ళు మూసుకునే ఉంది. సీతాపతి భార్యనూ, బిడ్డనూ మార్చి మార్చి చూస్తూ నిలబడ్డాడు. హృదయంలో ఉత్సాహం ఉరకలు తీస్తూంది. తమాషా అనుభూతి కలుగుతూంది. అరుంధతి కళ్ళు తెరిచి భర్త ముఖంలోకి చూస్తూ నీరసంగా నవ్వింది.

 

    "నువ్వే గెలిచావు. మొత్తం మీద అమ్మాయినే కన్నావు" అన్నాడు సీతాపతి చిరునవ్వుతో.  

 

    అరుంధతి ముఖం సిగ్గుతో జేవురించింది.

 

    "అమ్మాయికి నీ పోలికలే" అన్నాడు.

 

    "మంచిదే అయింది. మీ పోలికలే వస్తే చచ్చిపోయేదాన్ని" అంటూంటే పాలిపోయి పేలవంగావున్న పెదవులమీద చిరునవ్వు లాస్యం చేసింది.

 

    "ఈసారి పుట్టే అమ్మాయికి నా పోలికలే వస్తాయి, అలా చూస్తూండు" అన్నాడు గర్వంగా.

 

    అరుంధతి హాయిగా నవ్వింది. నీరసంగా కళ్ళు మూసుకుంది. సీతాపతి భార్యనూ బిడ్డనూ తనివితీరా చూస్తూ నిల్చున్నాడు.

 

    "అయ్యో! అదేమిటిరా? పురిటి గదిలోకి వచ్చావు? పిల్లను నేను తెచ్చి చూపించేదాన్నిగా! అంత తొందరేం?" అంది శాంతమ్మ.

 

    సీతాపతి సిగ్గుపదిపోయాడు. గబగబా బయటకు వస్తూంటే తల్లి అంది "బట్టలు మార్చుకో, మైలపడిపోయావు."

 

    సీతాపతి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.


                                         11


    ఇప్పుడు అరుంధతికి తోచకపోవడం అంటూ ఏమీలేదు. పిల్లపనితోనే రోజంతా సరిపోతుంది. పిల్లకు మూడోనెల వచ్చిందనీ, ఐదోనెల వచ్చిందనీ ఏదో ఒక పండుగ చేస్తూనే వుంది శాంతమ్మ. పదవ నెలలో పిల్లకు అన్నప్రాసన చేశారు. పేరు పెట్టడం విషయంలో మాత్రం అరుంధతి చాలా మొండికెత్తింది. పెద్దల పేర్లు చస్తే పెట్టడానికి వీల్లేదు అంది. శరత్ సృష్టించిన మాధవి పాత్ర అంటే అరుంధతికి ఎంతో ఇష్టం. "మాధవి" అని పేరు పెట్టుకుంది.

 

    శాంతమ్మకు తన అత్తగారి పేరు మహలక్ష్మి అని పెట్టుకోవాలని వున్నా లాభం లేదని వూరుకుంది.    

 

    సంక్రాంతి నెల పట్టారు. కోతలు అయి కొత్తవడ్లు ఇంటికి వచ్చాయి. రైతులంతా ఉత్సాహంగా వున్నారు. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. ముఖ్యంగా సీతాపతి పొలం ఎకరం రెండు పుట్లు రాలింది. మాధవి అదృష్టవంతురాలు అని తండ్రి మురిసిపోయాడు. ప్రతి సంవత్సరం పని పాటలు చేసేవాళ్ళకూ, ఆ రోజు వచ్చిన బిచ్చగాళ్ళకు సంక్రాంతి రోజున మూడు బస్తాల వడ్లు పెట్టించేది శాంతమ్మ. "ఈసారి ఐదు బస్తాలు పెట్టిస్తాను నా చిట్టితల్లి చేతుల్తో" అన్నాడు సీతాపతి కూతుర్ని భుజాలమీద ఆడిస్తూ ఓ రోజున. శాంతమ్మ మనస్సు సంతృప్తిగా నిండుగా వుంది. అరుంధతికి ఇలాంటి సరదాలు అర్ధం కావు. మాధవికి పదకొండో నెల వచ్చింది. అరుంధతికి ఇప్పుడు రాజారావు స్మృతులు అంత బాధ కలిగించటంలేదు. ముఖ్యంగా ఆలోచిస్తూ కూచునే అవకాశం చాలా తక్కువగానే వుంటూంది.

 

    శాంతమ్మకు చలిజ్వరం వచ్చి పడకబెట్టింది. స్వయంగా చెయ్యకపోయిన చేస్తున్నవాళ్ళను చూసుకోవటంతో అరుంధతికి బొత్తిగా తీరిక వుండటం లేదు. ఆనాడంతా పిల్ల చంక దిగకుండా వేధిస్తూంది. వంట సమయం అయింది. కింద దింపితే ఊరుకోవటం లేదు. పిల్లను బయట వాకిలి ముందు ఎత్తుకొని నిల్చుంది. అప్పుడే జీతగాడు కడవ చేతపుచ్చుకొని బయలుదేరేవాడు.

 

    "ఒరేయ్ రంగడూ! ఎక్కడకురా వెడుతున్నావ్?" అంది అరుంధతి.

 

    "మామిడి తోటకు నీళ్ళు పొయ్యటానికమ్మగారూ!" అన్నాడు రంగడు నిల్చుని.

 

    "చూడరా పాప ఒకటే ఏడుస్తోంది. ఇంట్లో ఎక్కడ పని అక్కడే వుంది. కాస్త నీతో తీసుకెళ్ళు" అంది అరుంధతి.

 

    "అలాగేనమ్మగారూ! రండి బుల్లెమ్మగోరూ!" అంటూ మాధవిని అందుకొని భుజాలమీద కూచోపెట్టుకున్నాడు రంగడు. రంగడి భుజాలమీద కూర్చొని బోసి నవ్వులు నవ్వుతూ వెళుతున్న కూతుర్ని కనిపించినంతవరకూ చూస్తూ నిలుచుంది అరుంధతి.

 

    "పాప ఏది అరూ?" అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన సీతాపతి వంటింటి గడపలో నిలబడి.

 

    "ఇవ్వాళంతా ఒకటే ఏడుపు, రంగడు తీసుకెళ్ళాడు."

 

    "వాణ్ణి తోటకు నీళ్ళు పొయ్యమన్నానే?"

 Previous Page Next Page