"అమ్మాయ్! రాజాకు కాఫీ ఇచ్చావా?" అడిగింది శాంతమ్మ లోపలకు వస్తూ.
"అదేమిటి అలా వున్నావు?" కోడలి ముఖంలోకి నిశితంగా చూస్తూ ప్రశ్నించింది శాంతమ్మ.
"అబ్బే! ఏంలేదు. ఇప్పుడే కాఫీకాచి ఆయనకు ఇచ్చాను" అంటూ గతుక్కుమంది, రాజారావుగారికి అనకుండా ఆయనకు అన్నందుకు.
"నువ్వు తాగావా?" కోడలి ముఖంలోకి చూస్తూ అడిగింది. "ఇంకా లేదు ఫ్లాస్కులో పోశాను, మీకిచ్చిన తరవాత తాగుదామని" అంది తడబాటు కనిపించకుండా.
అరుంధతి అన్యమనస్కంగానే కూచుని అత్తగారితోపాటు గోంగూర కాడల్నుంచి కోస్తూంది. అంతలో రాజారావు వచ్చి శాంతమ్మ పక్కనే నేలమీద బాసింపట్టు వేసుక్కూర్చున్నాడు. గోంగూర కోస్తూ నవ్వించే కబుర్లు చెబుతున్నాడు. ఉల్లాసంగా శాంతమ్మతో కబుర్లు చెబుతూ పసిపిల్లవాడిలా నవ్వుతూ కూచున్న రాజారావును చూస్తూ విస్తుపోయింది అరుంధతి. అతను తనవైపు ఒక్కసారికూడా చూడకపోవటం, తనతో ఒక్కమాటకూడా మాట్లాడకపోవటం బాధగా అనిపించింది. రోషంతో మనస్సు కుతుకుతలాడిపోయింది. విసురుగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.
7
రాజారావు వచ్చి నెలరోజులు దాటిపోయింది. ఊళ్ళో రామమందిరం దగ్గిర దినపత్రికలు చదివి వస్తూండేవాడు. ఊళ్ళో వాళ్ళు వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ముభావంగా వుండేవాడు. ఇరుగుపొరుగు వాళ్ళకు శాంతమ్మ తమ్ముడు కొడుకని చెప్పింది. ఊళ్లో పెద్దలకు అనుమానం రాకుండా సీతాపతి ఓ కథ అల్లి చెప్పాడు. సీతాపతి చెప్పిన కథ విన్న తర్వాత రాజారావుపట్ల ఎవరూ పెద్ద కుతూహలాన్ని చూపడంలేదు. జాలిగా చూసి వూరుకుంటున్నారు. "పాపం అనటం ఒకటి రెండుసార్లు రాజారావు చెవులో పడింది.
ఆనాడు రాత్రి భోజనంచేస్తూ రాజారావు సీతాపతితో అన్నాడు: "పత్రిక చదవటానికి వెళ్ళిన రోజుల్లో చాలామంది నన్ను చాలా చాల ప్రశ్నలు వేసేవారు. కాని ఇప్పుడు ఎవరూ ఏమీ అడగటంలేదు. అంతవరకు ప్రాణం హాయిగానే వుంది. కాని నన్ను జాలిగా చూస్తారు. పాపం అంటూ అదోలా చూస్తారు ఎందుకో అర్ధం కావటంలేదు."
సీతాపతి నవ్వుతూ "దాని వెనక ఓ కథ వుందిలే" అన్నాడు.
"ఏమిటది?" శాంతమ్మ ,రాజారావు ఒకేసారి అడిగారు.
"పల్లెటూరి వాళ్ళకు అక్కరలేని విషయం ఉండదు. ఎవరింటి కయినా చుట్టాలువస్తే సాయంత్రానికల్లా ఆ వూరంతా తెలుస్తుంది. నువ్వు ఇక్కడకు వచ్చి నెలరోజులయింది. నీ గడ్డం వాలకం చూసి అందరికీ కుతూహలంగానే వుంది. నన్నుకూడా ప్రశ్నలతో వేధించేవాళ్ళు. ఈ ఊళ్ళో ఒకే పార్టీ వాళ్ళున్నారు. అందరూ అధికార పార్టీకి చెందినవాళ్ళే. నువ్వు ఫలానా అని తెలిస్తే తెల్లవారేటప్పటికి వూళ్ళోకి మలబారు పోలీసుల్ని దించుతారు. అందుకే నేను ఒక కథ అల్లి చెప్పాను" అన్నాడు సీతాపతి.
"ఏం చెప్పావు?" కుతూహలంగా ప్రశ్నించాడు రాజారావు. అరుంధతి కూడా కుతూహలంగా వినటానికి కూచుంది.
"నీ పేరు రంగారావు."
"అవును, ప్రస్తుతం నేను ఆ పేరుతోనే ఉన్నానుగా."
"అందుకే ఆ పేరు చెప్పాను. నీకు ఉత్తరాలు వచ్చినా ఆ పేరుతోనే వస్తాయిగా! వేరే పేరు చెబితే మళ్ళీ చిక్కురావచ్చు. నీ భార్య చనిపోయిందట. నువ్వు భార్యను చాలా ప్రేమించేవాడివనీ, దాంతో నీకు మతి చాంచల్యం కలిగిందనీ, అందుకే అమ్మ నిన్ను ఇక్కడకు రప్పించిందనీ చెప్పాను. నువ్వు నా వేలువిడిచిన మేనమామ కొడుకువనీ చెప్పాను. అందరూ నమ్మారు. అందుకే నిన్ను చూచి అందరూ జాలిపడటం."
కథ విని రాజారావు పకపక నవ్వాడు.
"అదేంటిరా, భార్య చనిపోయిందని ఎలా చెప్పావు? అపశకునం మాటలు?" అంది దిగులుగా శాంతమ్మ.
"అవునమ్మా! అది నేను ఆలోచించలేదు. పొరపాటే జరిగింది" అన్నాడు సీతాపతి నొచ్చుకుంటూ.
"అదేమిటమ్మా? అనగానే చచ్చిపోతారా! అలా అయితే రోజుకు ఎంతమంది భర్తలు భార్యల్నీ, భార్యలు భర్తల్నీ చంపేస్తారో" అన్నాడు రాజారావు! తేలిగ్గా నవ్వేస్తూ.
ఆ విషయాన్ని అతను అంత తేలిగ్గా తీసుకోవటం అరుంధతికి ఆశ్చర్యాన్నే కలిగించింది.
అరుంధతి రాజా తెప్పించిన పుస్తకాలు ఒక్కొక్కటే చదివింది. ఒక పుస్తకం చదవగానే ఆ పుస్తకాన్ని గురించి విపులంగా అరుంధతికి చెప్పేవాడు. ఆ పుస్తకాల గురించి స్వంత అభిప్రాయాలను వ్యక్తంచెయ్యటంకూడా నేర్చుకుంది అరుంధతి. ఆ చర్చలు సీతాపతి ఇంటికి వచ్చాక శాంతమ్మ పని అయ్యాక సాయంత్రం కూచుని చేసేవారు. అరుంధతికి అది నచ్చేదికాదు. ఎవరూ లేనప్పుడు తనతో అతను ఎక్కువ మాట్లాడకపోవటం ఆమెలో ఏదో పట్టుదలను రెచ్చగొట్టసాగింది.
రాజా ఉన్న కొద్దిరోజుల్లోనే అరుంధతికి ఎన్నో విషయాలు తెలిసినట్లనిపించింది. రాజా సాన్నిధ్యమే ఒక పెద్ద విజ్ఞానకోశం అనిపించసాగింది.
ఆనాడు శ్రావణ మంగళవారం. శాంతమ్మ, కోడలిచేత నోము పట్టించింది. ఇల్లంతా హడావిడిగా వుంది. కాఫీతాగి ఉదయమే సీతాపతితో రాజారావు కూడా పొలం వెళ్ళాడు. ఇంటికి ముత్తయిదువులు వస్తారు. తనువుంటే బాగుండదని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం రాజా కూడా సీతాపతితో కూచుని పొలంలోనే అన్నం తిన్నాడు. పొలాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కూచున్నారు స్నేహితులిద్దరు. సాయంత్రం మూడవుతుంది. మసువుగా కూడా వుంది.
"వర్షం వచ్చేలా వుంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు" అన్నాడు సీతాపతి.
"ఇద్దరం కలిసే వెళదాం" అన్నాడు రాజారావు.
"లేదు నాకు కొంచెం పనుంది. అచ్యుతరామయ్యగారి పొలం దగ్గిరకెళ్ళివస్తాను. ఆయనతో కాస్త పనివుంది" అన్నాడు సీతాపతి.
"ఇంటి దగ్గిర హడావిడి తగ్గి వుంటుందంటావా?"
"ఇంకా హడావిడేమిటి? పొద్దుటే అన్ని లాంఛనాలూ అయిపోయి వుంటాయి. నీకు కాఫీ సమయం అయింది వెళ్ళు" అన్నాడు సీతాపతి.
రాజారావు ఇంటికి వచ్చేటప్పటికి వీధి వాకిలి గడప పట్టుకుని ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు నిల్చొని ఉంది అరుంధతి. ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న దేన్నీ చూట్టంలేదు. దూరంగా కనిపించే దేన్నో చూట్టానికి ప్రయత్నిస్తున్నాయి.
అరుంధతి ముదురాకుపచ్చని జరీ పట్టుచీర, అదే రంగు పట్టురవికా ధరించి ఉంది. తలంటి పోసుకున్న కురుల్ని వదులు వదులుగా జడ వేసుకుంది. ముఖంమీద పడుతున్న ముంగురులతో చల్లగాలి సయ్యాటలాడుతూంది. మంచిముత్యపు కాంతుల్ని విరజిమ్ముతున్న ఆమె శరీరపుకాంతితో సూర్యకిరణాలు పోటీపడుతున్నాయి. ఆ పెద్ద పెద్ద సోగకళ్ళు చుట్టూవున్న వాలుజడలోని చేమంతులు వెలవెలపోతున్నాయి. కాటుక చెరిగి వెడల్పుగా వ్యాపించటంవల్ల ఓ వింత సోయగాన్ని తెచ్చి పెట్టింది ఆ ముఖానికి. చేతికి పచ్చని నూలు తోరణం కట్టింది. ముగ్ధమనోహరంగా ఉన్న ఆ సౌందర్యమూర్తి ముందు మోకరించాలనిపించింది రాజారావుకు అలాగే కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు.
రాజారావు మైమరచి చూస్తూ నిల్చోవటాన్ని అరుంధతి చూసింది. సిగ్గుతో ఆమె చెక్కిళ్ళు రాగరంజితమైనాయి. లోపలకు పారిపోయింది. రాజారావు అపరాధిలా తల ఒంచుకుని లోపలకు వచ్చాడు.
అరుంధతి కాఫీ తెస్తుందని ఆశించిన రాజారావుకు శాంతమ్మ రాక నిరాశనే కలిగించింది. కాఫీ తాగుతూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. తల వంచుకుని ఆలోచిస్తున్న రాజారావుకు తెల్లనిపాదాలు రెండు కనిపించాయి. వాటినుంచే దృష్టి మరల్చుకోవాలనిపించలేదు.
"మీకు ఉత్తరం వచ్చింది." రాజారావు దగ్గరగా వచ్చాయి పాదాలు. తలెత్తి ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరాన్ని అందుకుంటున్న రాజారావు దృష్టి-జారిన పమిటను సర్దుకుంటున్న గోరంటాకుతో పండి పగడాలలా కనిపిస్తున్న అరుంధతి చేతిగోళ్ళమీద ఓ క్షణం నిలిచిపోయింది. అరుంధతి రాజారావు ముఖంలోకి చూసింది. అతను చూపులు మరల్చుకొని ఉత్తరం చదువుకోసాగాడు. ఉత్తరం చదువుతున్న రాజారావు ముఖంలోని భావపరివర్తనను గమనిస్తూ నిల్చుంది అరుంధతి. రాజారావు ముఖం చూసి అరుంధతికి ఆ ఉత్తరం ఏదో దుర్వార్తనే మోసుకొచ్చిందని అనిపించింది.
"ఎక్కడనుంచి?"
"ఊఁ!" అంటూ తల పైకెత్తి ఏదో చెప్పబోయి అరుంధతి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.
"ఎక్కడనుంచి?" చూపుల్ని పక్కకు మరల్చుకుంటూ మళ్ళీ ప్రశ్నించింది.
ఓ క్షణం మౌనంగా ఉండి, "మా ఆవిడ దగ్గరనుంచి," అన్నాడు నిర్లిప్తంగా.
అరుంధతి మనసు కలుక్కుమంది. ముఖంలో అలుముకుంటున్న చీకట్లను బలవంతంగా చెదరగొట్టింది.
"ఏమని రాసింది?" మామూలుగా ఉన్నట్లు ప్రశ్నించింది.
"రమ్మని రాసింది!"
"వెళతారా?"
"వెళ్ళమంటారా?"
అరుంధతి తలెత్తింది. రాజారావు చిరునవ్వుతో చూస్తున్నాడు. అరుంధతికి ఏదోగా అనిపించింది.
"బాగానే ఉంది. నన్నడుగుతారే? మీ ఆవిడ రమ్మని రాస్తే వద్దనడానికి మధ్య నేనెవర్ని!" అతి సాదాగా నిర్లిప్తంగా అనాలని ప్రయత్నించింది. కాని ఆ కంఠంలో మరేదో పలికింది.
"నువ్వు నాకేమీ కావా?" రాజారావు కంఠం అతి మార్దవంగా ధ్వనించింది.
అరుంధతి అక్కడ నిల్చోలేకపోయింది. మరో నిమిషం అక్కడ నిల్చుంటే తనలోని బలహీనత బయటపడక తప్పదు. గిర్రున తిరిగి బయటకు వచ్చేసింది. గడపలో ఓ క్షణం ఆగింది. కాని వెనుతిరిగి చూడకుండానే బయటకు వెళ్ళిపోయింది. అరుంధతికి ఆ ఇంట్లోనుంచి పరుగెత్తిపోవాలని వుంది .ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్ళి బావురుమని ఏడవాలని వుంది. ఏదో అలజడి! అశాంతి!
"నువ్వు నాకేమీ కావా?" ఆ మాటే చెవుల్లో ధ్వనిస్తూంది. ఎంత మృదువుగా, మార్దవంగా అన్నాడు! సందేహం లేదు. అతనుకూడా తనలాగే బాధపడుతున్నాడు. అందుకే తనను తప్పుకు తిరుగుతున్నాడు. భార్య ఉత్తరం రాసిందిగా వెళ్ళిపోతాడేమో? పోతే పోతాడు. తనకెందుకు? పెళ్ళాం రాస్తే వెళ్ళకుండా వుంటాడా? ఛ! ఏమిటి తను ఇలా ఆలోచిస్తూంది? అతని భార్యను తను చూడనుకూడా లేదే ఆమె తలపే తనకు ఎందుకు ఏదో బాధను కలిగిస్తుంది? రాజా తనవాడెలా అవుతాడు? అతను ఏనాడో పరాయివాడయ్యాడు. తను మాత్రం! తనలో బలహీనత ఏర్పడింది. అది రోజు రోజుకూ పెరిగిపోతూంది. దేవతలా చూసుకుంటున్న భర్తకు తను ద్రోహం చేస్తూంది. తనలో పాపం ప్రవేశించింది. దైవంలాంటి తన భర్తకు తనమీద కొంచెంకూడా అనుమానం లేదు. తను ద్రోహి కాదు. తను రాజాకు దూరంగా వుండక తప్పదు. అతను వెళ్ళిపోవాలి. అతను ఇక్కడ వుంటే తను ఏ నిముషంలో ఏ అనర్ధం చేస్తుందో తనకే తెలియదు.
తన భార్య రమ్మన్నదట! అయితే వెళ్ళొచ్చుగా? వెళ్ళమంటావా అంటూ తనను అడుగుతాడేం? తనను పరీక్షిస్తున్నాడా? స్నేహితుడికి దోర్హం చేస్తున్నాననే బాధ లేదా? పగటి నిద్రలో వచ్చిన తలనొప్పిలా, రాజారావును మనస్సునించి ఎంతగా తోసెయ్యాలని చూస్తుందో అంతగా వదలకుండా మనస్సులోనే తిష్ఠ వేశాడు.
రాత్రి భోజనాల దగ్గిర శాంతమ్మ రాజారావుకూ సీతాపతికి వడ్డిస్తూంది. అరుంధతి వంటింటి గడపలో నిల్చొని కావాల్సిన పదార్ధాలను శాంతమ్మకు అందిస్తున్నది. రాజారావు మౌనంగా అదోలా వుండటాన్ని గమనించాడు సీతాపతి.
"ఏరా ఏదోగా వున్నావు?" ప్రశ్నించాడు సీతాపతి.
"పిల్లలు గుర్తొచ్చారేమో?" అంది శాంతమ్మ. శాంతమ్మ అలా అనటం ఎందుకో అరుంధతికి రుచించలేదు.
"వాడికి పెళ్ళాం పిల్లలుకూడా గుర్తొస్తారా? పార్టీవాళ్ళు గుర్తొచ్చి వుంటారు" అన్నాడు సీతాపతి నవ్వుతూ.
"ఏడ్చావులే" తేలిగ్గా నవ్వేశాడు రాజారావు. "అంతలో ఎంత హాయిగా నవ్వేయగలడో!" అనుకుంది అరుంధతి.
"నేను తెల్లవారుఝామున వెళుతున్నాను" అన్నాడు రాజారావు మౌనం భంగంచేస్తూ.
"రేపే వెళ్ళాలా! ఎక్కడకు?"
"ఎక్కడకు వెళ్ళాలో చెప్పనుగాని వెళ్ళాలి. పార్టీనుంచి పిలుపు వచ్చింది."
"మీ పార్టీ రహస్యం ఎలా చెబుతావు? మర్చిపోయి అడిగేను! ఏమిటంత అర్జెంటు?" సీతాపతి ప్రశ్నించాడు.
"అదికూడా చెప్పకూడదు." అన్నాడు రాజారావు అన్నం కలుపుకుంటూ.
"అవునులే. పోనియ్ మళ్ళీ ఎప్పుడొస్తావు?"
"అదీ చెప్పలేను. వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో! మా స్థావరాలను పోలీసు కుక్కలు పసికట్టాయట!" అన్నాడు రాజారావు ఆలోచిస్తూ.
"ఇద్దరు నాయకులు అరెస్టయారట! ఒకతను పారిపోతుంటే కాల్చేశారట!"
అరుంధతి బెదురుగా చూసింది. "కాల్చేయటమే? ఎందుకొచ్చిన గొడవ బాబు నీకు ఇదంతా? ఇంటిపట్టున లక్షణంగా వుండక?" అంది శాంతమ్మ ఆదుర్దాగా.
"సరేలే! వాడు-నువ్వూ నేనూ చెబితే వింటాడా? రాజా! నీకు ఎప్పుడు రక్షణ కావల్సివచ్చినా వెనకా ముందూ ఆలోచించకుండా వచ్చేయ్, ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీకోసం తెరిచే వుంటాయి."
అరుంధతి భర్తను జాలిగా చూసింది. ఎంత మంచివారు!
"నాకు ఆ విషయం తెలుసురా. కాని ఇక నేను ఇక్కడకు రావటం జరక్కపోవచ్చు. నేను రావటం నీకు మంచిది కాదు." అప్రయత్నంగానే రాజా చూపులు అరుంధతి చూపులతో కలిశాయి. అరుంధతి కళ్ళు వాల్చేసుకుంది.
"నీ మొహం! నువ్వొస్తే నాకొచ్చే చెడు ఏమిటో నాకు అర్ధం కావటం లేదు. అంతగా అయితే పోలీసులు నన్నుకూడా నీతోపాటు తీసుకెళ్ళి నాలుగురోజులు జైల్లో వుంచుతారు అంతేగా?" నవ్వుతూ అన్నాడు. శాంతమ్మ గాబరాగా చూసింది.