ప్రకాశం ఏదో భావగీతం పాడుతున్నాడు. అందరూ వింటున్నారు.
ఇంతలో ఎవరో "మీ అన్నయ్య వస్తున్నాడు!" అన్నారు.
ప్రకాశం ఠక్కున పాట ఆపేశాడు.
వడివడిగా నడుస్తూ వచ్చి సుబ్బారాయుడు గట్టుమీద కూర్చున్నాడు. జేబులు వెతుక్కుని, "ఒరేయ్ .... ప్రకాశం! ఓ చుట్ట ఉంటే పారేయ్!" అన్నాడు.
ప్రకాశం తల దించుకున్నాడు.
"ఇవ్వరా ... ఉంటాయని నాకు తెలుసుగా!" విసుక్కున్నాడు సుబ్బారాయుడు.
ప్రకాశం తల వంచుకునే అందించాడు.
సుబ్బారాయుడు చుట్ట నోట్లో పెట్టుకుంటూ "ఒరే సన్యాసీ! వెళ్ళి పాక హోటల్ లో ఉన్న ఆ గణపతిగాడ్ని ఓసారి అర్జెంటుగా పిలుచుకురా!" అన్నాడు.
"అలాగే, బావా!" అంటూ సన్యాసిరావు పరుగెత్తాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ "ఏవండీ....!" అని పిలిచాడు.
సుబ్బారాయుడు గొప్ప హుషారుగా "ఒరేయ్; కాసేపాగు!" అని మాధవ్ ని ఆపి "ప్రకాశం! మన కేశవుడి దగ్గరనుండి ఉత్తరం వచ్చిందిరా!" అన్నాడు.
"ఏదీ?" ఆనందంగా చెయ్యి జాపాడు ప్రకాశం.
"మొదటంతా ఇంగిలీసులో రాశాడురా! ఆగు ..... గణపతిగాడు రానీ ....! స్కూల్ ఫైనల్ చదివినోడు ఆ మాత్రం చదివి చెప్పలేడా?" అన్నాడు.
మాధవ్ ఎయిర్ బాగ్ భుజం మార్చుకుంటూ, "చూడండీ...." అన్నాడు.
"చూశాలేం గానీ ఎల్లెల్లవో.....ఏం రాసుంటాడ్రా వాడూ?" మాధవ్ నీ, అతని బురదనీ చిరాగ్గా చూసి తల తిప్పుకుంటూ అన్నాడు సుబ్బారాయుడు.
"మన ఊరికి గానీ వస్తున్నానని రాశాడేమో.... వస్తే రోడ్లువేయించే పనికి ముఖ్యమంత్రిగారికి పైరవీ చేయించాలని అడగాలన్నయ్యా!" ఆలోచించి అన్నాడు ప్రకాశం.
"ఆసుపత్రో...." ఎవరో అందించారు.
"అన్నింటికన్నా ముఖ్యం బడి!" అన్నాడు సుబ్బారాయుడు.
"మా వోడికి పట్నంలో చాలా పలుకుబడి!" పక్కనున్న వాళ్ళతో చెప్పాడు ప్రకాశం.
"నా మాట వింటారా?" అసహనంగా అన్నాడు మాధవ్.
"మేం పెద్దమనుషులం మాట్లాడుతున్నాం కనిపించడంలేదూ? ఊరికి ఏం కావాలో నీకు తెలుసా? సత్రకాయలా ఊడిపడ్డావెక్కడ్నించో!" విసుక్కున్నాడు సుబ్బారాయుడు.
ఇంతలో గణపతి వచ్చాడు.
మేనమామల్ని చూసి కాస్త భయంగా, "ఏమిటి మావయ్యా?" అన్నాడు.
సుబ్బారాయుడు జేబులోంచి ఉత్తరం తీసి మడతలు విప్పి దాన్ని ముక్కు దగ్గరగా పెట్టుకుని వాసన పీల్చి, "అంతా.....పట్నం వాసన.....ఇదో....ఈ ఉత్తరం చదివిపెట్టు!" అన్నాడు.
గణపతి 'అంతేనా!' అన్నట్లు ఊపిరి పీల్చుకుని ఉత్తరం అందుకుని, "డియర్ సుబ్బారాయుడూ!.... అంటే నా ప్రియమైన సుబ్బారాయుడూ!" అన్నాడు.
"చూశారా....చూశారా....ఆడికి నేనంటే ఎంత ప్రేమో!" కాళ్ళు రెండూ గట్టుమీదకి పెట్టేసుకుని గర్వంగా అన్నాడు సుబ్బారాయుడు.
"దొరలు రాసినట్లు లేదూ!" అన్నాడు ప్రకాశం.
అందరూ తలలూపారు.
గణపతి చదివాడు "ఐ యామ్ డూయింగ్ ఫైన్..... అంటే నేను ఫైను కడుతున్నాను. ఫైను అంటే అపరాధ రుసుం!"
"ఆఁ! ఎందుకురా? ఏం తప్పు చేశాడటా?" ఆదుర్దాగా అడిగాడు సుబ్బరాయుడు.
మాధవ్ కి నవ్వొచ్చింది ఎయిర్ బాగ్ గట్టున పెట్టి వినోదంగా చూడసాగాడు.
"ఐ థింక్ యువార్ ఆల్సో డూయింగ్ ఫైన్!.....అంటే నువ్వూ ఫైన్ కడుతున్నావని అనుకుంటున్నాను!"
"ఛ! నేనెందుకు డబ్బు కడతానూ? ఈడికి చిన్నతనం పోలేదు. ఏం చేశాడో ఏమో?" చిరాకుపడ్డాడు సుబ్బారాయుడు.
"నువ్వు వస్తానని రాలేదు. నెవర్ మైండ్!.....అంటే నీకు మతి లేదు!"
సుబ్బారాయుడు కాస్త కోపంగా "నాకెన్ని పనులో ఆడికేం తెలుసూ? నాకు మతిలేదంటాడా?" అన్నాడు.
"మా అబ్బాయి మీ ఊరికొస్తానన్నాడు. సారీ! నే చెప్పలేదు కదూ! మా వాడు అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే మన దేశం తిరిగొచ్చాడు. నైస్ చాప్! కెమికల్ ఇంజనీర్!" మళ్ళీ గణపతి తెలుగు అనువాదం "మంచి చాపలు వండిపెట్టండి!" అని, చదివాడు "ట్రై టు ఇంప్రెస్ హిమ్!"
"అంటే ఏంట్రా?" ప్రకాశం అర్ధంకాక అడిగాడు.
"బాగా ఒళ్లంతా మంగళాడిచేత వత్తించండి అని అర్ధం!"
"ఏంటో....పట్నంవాళ్ళ మోజులు!" మురిపెంగా అన్నాడు సుబ్బారాయుడు.
మాధవ్ కి బాగా నవ్వొచ్చి నవ్వేశాడు.
"మా అన్నయ్యని వాడితోపాటు పంపించండి. వాడు ఉన్నన్ని రోజులూ ఏ లోటూ లేకుండా చూసుకోండి. నో మోర్ టు పెన్!..... అంటే పెన్ లో ఇంకు అయిపోయిందని అర్ధం!" అన్నాడు గణపతి.
"ఛ!' అన్నీ ముందే చూసుకోరూ.....తొందరబాటు పనులు కాకపోతేనూ!" అన్నాడు చిరాగ్గా సుబ్బారాయుడు.
"ఇట్లు సిన్స్.....ఇయర్లీ.....కేశవరావు.....అంటే చాలా ఏళ్ల కిందటి కేశవరావు!" చెప్పాడు గణపతి.
మాధవ్ ఇంక ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు. అందరూ అతనివైపు తలలు తిప్పి చూశారు.
గణపతి విసుగ్గా "ఇతనెవరూ?" అన్నాడు.
"ఏమో.....ఇందాకటి నుండీ బురద కారుతూ ఇక్కడే నిలబడి ఉన్నాడు ఎవరింటికొచ్చాడో?" కాస్త చిరాగ్గా అన్నాడు సుబ్బారాయుడు.
"నాకు సీతారామయ్యగారి ఇల్లు కావాలి!" చెప్పాడు మాధవ్.
"ఆ ప్రక్కకి తిరిగి తిన్నగా పోతే, మూడో ఇల్లు! ఇంటిముందు వేప చెట్టుంటుంది. ఇంతకీ ఆయనతో ఏం పనీ?" చుట్టపొగ గట్టిగా పీలుస్తూ అడిగాడు సుబ్బారాయుడు.
"చాలా పనుంది!" ఎయిర్ బాగ్ భుజాన వేసుకుంటూ చెప్పాడు మాధవ్.