కళ్ళనీళ్ళు చెంపల మీదుగా జారి గుండెల మీద పడుతున్నాయి. సుందరమ్మ 'మళ్ళీ తెల్లవారకూడదు - మళ్ళీ తెల్లవారకూడదు' మనసులోనే మళ్ళీ మళ్ళీ అనుకోసాగింది. తెలతెల వారుతుండగా ఆలోచనల నుంచి గాఢ నిద్రలోకి జారిపోయింది.
* * *
సుందరి తండ్రి వేమూరు హైస్కూల్లో హెడ్ మాస్టరుగా పని చేసేవాడు. సుందరిని చూసిన వాళ్ళు కూతురికి తగిన పేరు పెట్టాడు తండ్రి అనేవాళ్ళు. సుందరి వెంకట్రావు పెద్దకూతురు. ఆమె తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. సుందరి చదువు తొమ్మిదో క్లాసుతో ఆగిపోయింది. తండ్రికి ఆడపిల్లల్ని కూడా మగపిల్లలా చదివించాలని వుండేది. తల్లికి ఇష్టం ఉండేదికాదు. బతక లేకపోతే బడిపంతులు అనేరోజులు. సుందరికి చదువు మీద పెద్దగా శ్రద్ధ వుండేదికాదు. అది తెలుసుకున్న తండ్రి ఆమె చదువు గురించి ఆలోచించడం మానేశాడు.
సుందరికి పదిహేడేళ్ళు వచ్చాయి. ఆ వయసు ఆడపిల్లలకు సహజంగా వచ్చే ఆలోచనలే సుందరి బుర్రలోకి ప్రవేశించాయి. యవ్వనం శరీరాన్ని చలికాలపు మధ్యాహ్నపు ఎండలా కాలుస్తూ ఉంటే, మనసు ఊహా సౌధాల్లో విహరిస్తూ వుండేది. టూరింగ్ టాకీసులో సినిమాలు చూసింది. ఆ సినిమాలలో హీరోలను చూసింది. తనను కూడా స్టంట్స్ పిక్చర్స్ లో హీరో ఎవడో వచ్చి ఎత్తుకు పోయి రాక్షస వివాహం చేసుకుంటాడు. ఒక పెద్ద బంగళా - ఆ బంగళా చుట్టూ పూల మొక్కలు - హాల్లో సోఫాలు - టెలిఫోనూ - తనూ - తన హీరో - చిన్న చిన్న బొమ్మలు - బుజ్జి బుజ్జి పిల్లలు. సుందరి కలలు ఇలా వుంటే...
వాస్తవం...
పదిహేనేళ్ళ ఆడపిల్ల తల్లి తండ్రులకు గుండెల మీద కుంపటిలా వుంది. 'పదిహేనేళ్ళు వచ్చాయి. వెన్ను ముదిరిపోవడం లేదూ? ఇంకెప్పుడు పెళ్ళి చేస్తారు? సంబంధాలు ఏమైనా వస్తున్నాయా? ఊళ్ళో వాళ్ళ కుతూహలంతో కూడిన ప్రశ్నలు వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
కట్నాలు గుమ్మరించి పెళ్ళి చెయ్యలేని అసహాయ స్థితిలో తండ్రి తన అసహాయతకు ఎవరి మీదో చిరాకు - సంబంధం చూడమని నిత్యం పోరే భార్య మీద చిరాకు - ఇంట్లో ఎప్పుడూ సమస్యలే.
సుందరి కలలు చెదిరిపోతూ వుండేవి. జీవితం కల కాదని తెలుసుకోవడానికి సుందరికి అట్టే కాలం పట్టలేదు.
కామేశ్వరరావు అనే యువకుడు, వెంకట్రావు పనిచేస్తున్న హైస్కూలుకు లెక్కల టీచరుగా కొత్తగా వచ్చి చేరాడు. ఎం.ఏ పాసయ్యాడు. కామేశ్వరరావు హెడ్ మాస్టరు వెంకట్రావు అభిమానాన్ని చూరగొనడానికి ఎంతో కాలం పట్టలేదు. కుర్రాడు బుద్ధిమంతుడు. తెలివైనవాడు. నిజాయితీ పరుడు. డ్యూటీ మైండెడ్! కామేశ్వరరావును చూస్తూ వెంకట్రావు అనుకునేవాడు.
వెంకట్రావు కామేశ్వరరావును ఒకటి రెండుసార్లు తన ఇంటికి తీసుకెళ్ళాడు. కామేశ్వరరావు సుందరిని చూశాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. ఆ ఇంటి పరిస్థితులను అర్ధం చేసుకున్నాడు.
'మాస్టారూ! మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను' అన్నాడు ఒకరోజు వెంకట్రావుతో.
వెంకట్రావుకు తను విన్నది నిజం అనిపించలేదు. తన మనసులో ఆ కోరిక వుండడం వల్ల అలా అన్నట్టు విన్పించిదేమోననే అనుమానం కలిగింది. కామేశ్వరరావు ముఖంలోకి చూశాడు.
'ఏం మాస్టారూ? నేనేమైనా తప్పుగా అన్నానా?' వెంకట్రావుకు తను విన్నది నిజమేనని నమ్మకం కలిగింది. ఇది నిజమా! కామేశ్వరరావు లాంటి యువకుడు తన బిడ్డకు... ఏమో! తన దగ్గిర డబ్బు బాగా వుందనుకుంటున్నాడేమో!
'ఏమిటి మాస్టారూ! అలా చూస్తున్నారేం? మీ సంస్కారం, మీ అమ్మాయి అందం - చూసి నాకు అలాంటి కోరిక కలిగింది. తప్పయితే క్షమించండి'
'బాబూ! ఇది నిజమా! నాకంత అదృష్టమా! కాని నేను బొత్తిగా కట్నకానుకలు ఇచ్చుకోలేని వాడిని'
'మాస్టారూ! నన్ను చూస్తే మీకు అలా అన్పిస్తుందా?'
'లేదు లేదు. కాని మీతల్లిదండ్రులు అంగీకరించాలిగా?'
'వాళ్ళు అభ్యంతరం పెడతారని నేను అనుకోను'
'ఒకవేళ'...
'మీకా అనుమానం వద్దు. ఇది నా నూరేళ్ళ జీవితానికి సంబంధించిన నిర్ణయం. నా నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తే సరే! కాదన్నా నేను ఈ పెళ్ళి చేసుకుంటాను.' అన్నాడు కామేశ్వరరావు.
కామేశ్వరరావు తల్లి తండ్రులు ఆ పెళ్ళికి అంగీకరించలేదు. వారు అతడి కన్న తల్లి తండ్రులు కారు. అనాథ ఆశ్రమం నుంచి తెచ్చిపెంచుకున్నారు. ఆ పిల్లని పెళ్ళి చేసుకుంటే తమకు అతడితో ఎలాంటి సంబంధముండదన్నారు. ఆస్తిలో చిల్లిగవ్వకూడా ఇవ్వమని బెదిరించారు.
ఆ వయసుకు భయం తెలియదు. ముందు గొయ్యి వుందో, నుయ్యి వుందో చూసుకోకుండా దూకడం మాత్రమే ఆ వయసుకు తెలుసు. అందుకే వెళ్ళిపోయాడు. సుందరికీ కామేశ్వరరావుకి వివాహం జరిగింది.
వివాహం అయిన ఆరునెలలకే అతనికి బుర్రిపాలెం హైస్కూలుకు హెడ్ మాస్టరుగా రమ్మని పిలుపు వచ్చింది. ఆ స్కూలు ఆ ఊరు షావుకారుది. ప్రైవేటు స్కూలు.
కొత్త ఊరు. కొత్త కాపురం. చుట్టూ కొత్త మనుషులు. అంతా కొత్త.
సుందరి తొలి కాన్పులో కొడుకుని కన్నది. పురిటికి పుట్టింటికి వచ్చింది. కబురు అందగానే కామేశ్వరరావు ఆగమేఘాల మీద వచ్చి వాలిపోయాడు. పొత్తిళ్ళలోని బిడ్డను చూసి మురిసిపోయాడు. సుందరి భర్తను చూసి సిగ్గు, సిగ్గుగా ముసి ముసిగా నవ్వుకుంది.
'అమ్మాయి కావాలంటే అబ్బాయిని ఇచ్చావు' అన్నాడు కామేశ్వరరావు కొంటెగా చూస్తూ.
'అంతా మీ పోలికే!'
'కాదు నీ పోలికే!' వంగి బిడ్డ ముఖంలోకి చూస్తూ అన్నాడు కామేశం.
'రంగు నాది, కాని పోలికలు మీవే'
భార్యముఖంలోకి చూస్తూ హాయిగా నవ్వాడు.
'ఏముండీ!'
'ఆ. ఏమిటి?'
'అబ్బాయిని డాక్టరు చదివిద్దామండీ!'
కామేశ్వరరావుకు నవ్వు వచ్చింది. ఇప్పట్నుంచే ఈ పసికందు భవిష్యత్తు గురించి ఆలోచనా? భార్య ముఖంలోకి కొంటెగా చూస్తూ 'ఊ. వీల్లేదు.' అన్నాడు.
'అదేమిటండీ?'
'లా చదివిస్తాను'
'అదేం కుదరదు. నా బిడ్డ డాక్టరే అవుతాడు. డాక్టరే చదవాలి'
'ఎందుకో?'
'ఎందుకేమిటి? నా బాబు డాక్టరవుతాడు. మనకు కాస్త జలుబు చేసినా హడావుడి చేస్తాడు నా చిట్టి తండ్రి' పిల్లవాడి వంటి మీద బట్టను సర్దుతూ అన్నది.
'ఎంత స్వార్ధం?'
'స్వార్ధమా?'
'మరి కాకపోతే ఏమిటి? వాడ్ని డాక్టరు చదివించాలను కోవడం మనకు చికిత్స చేయడానికా?'
సుందరి ముఖం చిన్నబోయింది.