'తమాషాగా అన్నానులే. అలాగే మొదటి బిడ్డ డాక్టరే చదవాలి' అన్నాడు భార్యను సంతోష పెట్టే ధోరణిలో.
ఆ పసికందు బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు.
'ఓరే కాముడూ! ఆ పురిటి గదిలోంచి బయటికి రావా ఏమిటి? బయటి నుంచి దూరం బంధువు కాంతమ్మ కేక పెట్టింది.
కామేశ్వరరావు సిగ్గు పడ్డాడు. లేచి బయటికి వెళ్ళిపోయాడు.
'రోజులు మారిపోయాయి. మారోజులే వేరు. మా పెద్దాడికి మూడోఏడు వచ్చిందాకా మీ బాబాయి, అందరి ముందూ పిల్లాడ్ని కన్నెత్తి చూడ్డానికే సిగ్గు పడిపోయేవాడు. భార్య పురిటి నొప్పులు పడ్తుంటే మగాళ్ళు ఆ దరిదాపుల్లోనే కన్పించేవాళ్ళు కాదు. ఇప్పుడేముంది పురిటిగది ముందే తచ్చాడుతూ వుంటారు. అసలు ఆ రోజుల్లో పగటి పూట మొగుడూ పెళ్ళాం మాట్లాడుకునేవారా?' కాంతమ్మ సుందరి పెద్ద చెల్లెలితో అంటున్నది. కామేశ్వరరావు విన్నాడు. తల వంచుకుని బయటికకి వెళ్ళిపోయాడు.
పిల్లాడికి పదినెలలు నిండేసరికి, సుందరికి నెల తప్పింది. స్కూలు నుంచి వస్తూ, స్వీట్లూ, మల్లెపూలు తెచ్చిన భర్తతో 'ఎందుకండీ ఇవన్నీ? దుబారా ఖర్చులు చేస్తే ఎట్లా?' అన్నది.
'ఏమిటో! ముసలమ్మలా పూలు కొనడం కూడా దుబారా ఖర్చు అంటున్నావ్! మల్లెపూలంటే నీకు ఇష్టంగా?'
'ఇకనుంచి ఆలోచించాల్సింది మన ఇష్టాల గురించి కాదు'
'మరి'
'పిల్లల గురించి ఆలోచించాలి'
'పిల్లలా? ఒక్కడేగా?...అంటూ భార్య ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబారింది. అర్ధం అయింది. సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్యను ఆప్యాయంగా రెండు చేతులతో చుట్టేశాడు.
మళ్ళీ కొడుకే పుట్టాడు. మళ్ళీ కొడుకే పుట్టినందుకు అందరూ సంతోషించారు. పొగడ్తలతో ముంచేశారు సుందరమ్మకు గర్వంగా అన్పించింది. కామేశ్వరరావుకు కూతురు పుడితే బాగుండేది అన్పించింది.
* * *
పన్నెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.
పెరిగే పిల్లలు పెరిగిపోతూ వుంటే, సుందరమ్మ చంకలో పసిబిడ్డ వుంటూనే వుంది. ఆరో కాన్పులో కామేశ్వరరావు కోరిక తీరింది. ఆడబిడ్డ పుట్టింది. ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
కామేశ్వరరావు పదో క్లాసు వాళ్ళకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. లెక్కలు. పైగా స్వయంగా హెడ్ మాస్టరు గారి దగ్గర ట్యూషన్. చాలామందే వస్తున్నారు. విద్యార్ధులు తమ దొడ్లలో కాచిన కూరగాయాలు, పండ్లూ తెచ్చి ఇస్తుంటారు. కామేశ్వరరావుకు తీసుకోవడం ఇష్టం వుండదు. కాని పిల్లలు చిన్న పుచ్చుకుంటారని మౌనంగా వుండిపోతాడు.
పిల్లలు పెద్దవుతున్నారు. పెద్ద క్లాసులకు వెళ్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. సుందరి కోళ్ళ పెంపకం మొదలు పెట్టింది. దొడ్లో వున్న ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ మొదలుపెట్టింది. కోడిగుడ్లు అమ్మి, కూరగాయలు అమ్మి ఇంటి ఖర్చులకు వాడుతుంది.
'ఎందుకు సుందరీ అంత కష్ట పడతావు?'
'మన పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళ కోసం కష్టం పడడంలో సంతృప్తిలేదూ?' అంది సుందరమ్మ.
సుందరమ్మ లోకం అంతా పిల్లల చుట్టూ అల్లుకుని పోయింది. ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఆడపిల్ల అల్లారు ముద్దుగా పెరుగుతోంది.
పిల్లలంతా క్రమశిక్షణతో పెరుగుతున్నారు. వాళ్ళ వినయవిధేయతలను చూసిన వాళ్ళకు ముచ్చట గొలిపేది.
'ఎంతమందైతే కామేశ్వరరావు మాస్టారి పిల్లలవుతారు? రత్నాలు! తల్లి తండ్రుల మాటకు జవదాటరు' అనేవారు ఊళ్ళో వాళ్ళు.
కాని నాలుగో కొడుకు సత్యం ఐదేళ్ళకే కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. వాడికి తోచిందే చేసేవాడు. తల్లి తండ్రులు కొడ్తే మొండికేసి అదే పని మళ్ళీ మళ్ళీ చేసేవాడు.
'వీడేమిటండీ! రత్నాల మధ్య రాయిలా తయారయ్యాడు?' సుందరి భర్తతో అనేది. కామేశ్వరరావు మౌనంగా వుండిపోయేవాడు.
'వాడికి మీరు భయం చెప్పడం లేదు'.
'వాడ్ని నువ్వూ ఏమీ అనకు. అలాంటి పిల్లలు కొట్టిన కొద్దీ మొండిగా తయారవుతారు. వాళ్ళను మంచితనంతోనే మార్చుకోవాలి' అనేవాడు కామేశ్వరరావు.
'మరీ పెడసరంగా తయారయ్యాడు. మెన్నను నేను ఒక దెబ్బ వేశాను. నిండా ఐదేళ్ళు లేవు. కసిగా నామీద తిరగబడి జుట్టు పట్టుకుని పీకసాగాడు. వాడి గుప్పెళ్ళనుంచి జుట్టు వదిలించుకోవడం ఎంత కష్టం అయిందో తెలుసా? వాడి గురించే నా బెంగ అంతా! తప్ప పుట్టాడు'. సుందరి బాధగా అంది.
కామేశ్వరరావు మౌనంగా వుండిపోయాడు.
పెద్దవాడు రఘు గుంటూరులో ఇంటరు పరీక్ష రాసి శెలవులకు ఇంటికి వచ్చాడు.
కొడుకు తల నిమురుతూ 'ఎంత చిక్కిపోయావురా నాన్నా!' అంది సుందరమ్మ.
'వాడు చిక్కి పోయాడా?' కామేశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
'అయ్యో! అదేమిటండీ! తల్లిదండ్రుల దిష్టికి నల్లరాయి బద్దలౌతుందంటారు. ఉండరా బాబూ దిష్టితీస్తాను. మీనాన్న కళ్ళు నీమీద పడ్డాయి' అంటూ సుందరమ్మ లోపలకు వెళ్తుంటే,
'ఏంటమ్మా నీకు మరీ చాదస్తం ఎక్కువైంది. నాన్న అన్నమాట నిజమే. నేను కొంచెం లావయ్యాను.' అన్నాడు రఘు.
సుందరమ్మ వినిపించుకోలేదు. దిష్టి తీసింది. కొడుక్కు రోజుకొక పిండి వంట వండి పెడ్తున్నది.
మిగతా మగ పిల్లలు ముగ్గురూ స్కూలుకు వెళ్తున్నారు. ఆడపిల్లను ఇంకా స్కూలుకు పంపలేదు.
రఘు పరీక్షా ఫలితాలు తెలిశాయి. ఫస్టుక్లాసులో పాసయ్యాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
ఆ రోజు రాత్రి భర్తకు అన్నం వడ్డించి ఎదురుగా కూర్చుంది సుందరమ్మ.
'పెద్దవాడికి డాక్టరు చదవాలని వుందండీ!' అంది చిన్నగా.
కామేశ్వరరావు మాట్లాడలేదు.
'మాట్లాడరేమండీ?'
'వాడి కోరిక సహజమైందే! కాని మనకు అంత తాహతు వుండొద్దూ?'
'అయ్యో అదేమిటండీ మర్చిపోయారా?
ఏమిటి?'
'వాడు పుట్టినప్పుడే డాక్టరు చదివించాలనుకున్నాం కదండీ!'
కామేశ్వరరావుకు నవ్వు వచ్చింది. కాని నవ్వలేకపోయాడు. ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆగి భార్య ముఖంలోకి చూశాడు.
'మీరు మర్చిపోయారు. కాని నేను ఎట్లా మర్చిపోతాను?'
'ఆరోజు ఏదో సర్దాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితులు గురించి ఆలోచించు. మనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రెక్కల కష్టంమీద ఇంతమంది పిల్లల్ని ఏ తరుగూ లకుండా పెంచుతున్నాం. తాహతకు మించి ఎగిరి కిందపడి కాళ్ళూ చేతులూ విరుచుకోవడం తెలివైన పని అంటావా?'
సుందరమ్మ ముఖం చిన్నబోయింది.
'చూడు సుందరీ! నన్నర్ధం చేసుకో. నాకు మాత్రం నా కొడుకు డాక్టరు కావాలని వుండదా? ఇంకా మనకు ఐదుగురు పిల్లలున్నారు. ఆ కాస్త బ్యాంకులో వున్న డబ్బు, వీడి చదువుకే ఖర్చు చేస్తే మిగతా వాళ్ళ సంగతేమిటి? పైగా ఆడపిల్ల కూడా వుంది. దానికి పెళ్ళి చెయ్యాలి. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా చెప్పు?'