'అంతేనంటావా సాంబయ్యా!' దిగాలుగా రెండో వృద్దుడు అన్నాడు.
'అంతేకాక మరేమిటి? రేపు మున్సిపాలిటీ వాళ్ళే నిన్నూ నన్నూ కూడా పారెయ్యాలి.'
'దహన సంస్కారాలు చేస్తారంటావా?'
'నీ పిచ్చిదొంగలు దోలా! దహన సంస్కారాలా? ప్రభుత్వం చచ్చినవాళ్ళమీద అంత ఖర్చు పెడుతుందా? గొయ్యితీసి పాతి పెడ్తారు'
'అదైనా లోతుగా తీస్తారోలేదో! పైపైనే కప్పి పెడతారో! కుక్కలు పీక్కు తినకుండా ఉంటాయా?' అప్పుడే తనను పీక్కు తింటున్నట్టుగా బాధపడుతూ అన్నాడు సాంబయ్య.
'బతికుండగానే కుక్క బతుకు బతుకుతున్నాం. చచ్చాక ఏమైతే ఏంలే! పద! పద!' అన్నాడు కనకయ్య.
ఒక్కొక్కరే అక్కడ్నుంచి కదలిపోయారు. సుందరమ్మ కాళ్ళల్లో సత్తువ లేనట్టుగా అక్కడే గోడకి చేరబడి కూర్చుంది.
ఎక్కడ పుట్టిందో? ఎక్కడ పెరిగిందో? వయసులో ఎన్నెన్ని కలలు కన్నదో? ఎన్ని సుఖాలు అనుభవించిందో! ఎన్ని కష్టాలు చవి చూసిందో! చివరికి ఇలా - ఈ మున్సిపాలిటీ లారీలో - నా అనేవాళ్ళు లేని చోట - చివరి ప్రయాణం చేసింది. రేపు... రేపు తన గతి ఇంతేనా? దిక్కులేని చావేనా? అనాథ శవంగా మున్సిపాలిటీ వాళ్ళు పారేస్తారా? లేదు .లేదు. తనకేం ఖర్మ. ఆరుగురు బిడ్డలున్నారు. చస్తే తప్పక వస్తారు. గొప్పగా దహన సంస్కారాలు చేస్తారు. పదిమందిలో మరి అవుననిపించుకోవాలిగా? తన కొడుకులు సంగతెలా వున్నా, కూతురూ అల్లుడూ వస్తారు.
పాపం! శాంతమ్మ రాత్రి తనకు చచ్చిపోవాలని లేదన్నది. చావంటే భయం అంది. మనిషికి చావంటే ఎందుకో అంత భయం?
తను లేని ఈ ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. తను ఉండడు. అకస్మాత్తుగా మాయం అయిపోతాడు. అందరూ ఉంటారు. తను మాత్రమే ఉండడు. తన వస్తువులన్నీ ఎక్కడివక్కడే వుంటాయి. తను మాత్రం వుండడు. ఇలాంటి ఆలోచనలే కారణం చావంటే భయపడడానికి.
'సుందరమ్మా!'
వార్డెన్ పిలుపుకు తృళ్ళిపడి లేచి నిల్చుంది.
'ఎందుకంతగా బాధపడ్తావ్? ఒకరోజుకే ఎంత అనుబంధం పెంచుకున్నావమ్మా! పెద్దదయి పోయింది. ఎనభయ్ దాటాయి. చచ్చిపోయి సుఖపడుతుంది. మనం బాధ పడకూడదు.'
సుందరమ్మ మాట్లాడలేదు.
'వెళ్ళు - వెళ్ళి స్నానం చెయ్యి.' అంటూ వార్డెన్ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
సుందరమ్మ గదిలో కాలు పెడుతూనే ఆశ్చర్యంతో శాంతమ్మ మంచం దగ్గిర నిలబడిపోయింది. అప్పటికే దుప్పటి మర్చి ద్రౌపది ఆ మంచంమీద కూర్చుని వుంది. అక్కడ్నుంచి కదిలితే తను ఆక్రమించుకున్న స్థలాన్ని మరొకరు దురాక్రమణ చేస్తారేమో అన్నట్టుగా బిగుసుకొని కూర్చుని వుంది.
'చూశావా సుందరమ్మా! కొంతమంది శాంతమ్మ ఎప్పుడు చస్తుందాని, గుంటకాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారంటే నమ్ము'. అంది ఆయేషా.
'ఒసే! ఒసే! ఎవర్నే నక్కా కుక్కా అంటున్నావ్ నీ నోరు పడ! నీకు వాయవ రాను!' తన బారాటి చేతుల్ని చాస్తూ అరవసాగింది ద్రౌపది.
'నిన్నెవరన్నారే?'
'నన్నుగాక ఎవర్నే! నేను ఈ మంచం మీదకి వచ్చానని ఏడుస్తున్నావ్.'
'ఛ! నోరు మూసుకో. అందరితో తగాదాలే. నీనోరు పడిపోను' ఆయేషా అరిచింది.
'ఏమిటీ అన్నావ్?' (ద్రౌపది మంచం మీదినుంచి ఒక్క దూకు దూకి ఆయేషా మంచం దగ్గరకు వచ్చింది.
'ఏయ్! ద్రౌపదీ ఏమిటది? ఆ గదిలో రోజూ ఎవరో ఒకరితో తగాదా పడేదానివి. ఇక్కడకు వచ్చావో లేదో...'
'అనండమ్మా! అనండి అందరూ నన్నే అనండి. నిజం చెప్పు సుందరమ్మా! ముందెవరు తిట్టారు?' ద్రౌపది సంజాయిషీ ఇచ్చుకోసాగింది.
'సరేలే! నీ మంచం మీదకు వెళ్ళు. నీకేమైనా కావాలంటే సుందరమ్మకు చెప్పు. తగాదాలు పడకు.'
'అదిగో మళ్ళీ నన్నే అంటున్నారు.'
'మాట్లాడొద్దన్నానా?' వార్డెన్ గట్టిగా అరిచింది.
ద్రౌపది మూతి బిగించి వెళ్ళి మంచం మీద కూర్చుంది.
సుందరమ్మకు అంతా అయోమయంగా వుంది. ఏమిటో ఈ జీవితాలు. కాటికి కాళ్ళు చాచుకుని వున్నవాళ్ళు మంచం కోసం పోట్లాడుకోవడమా? అసూయ పడడమా? అదీ, గంటకు ముందు శవం లేచిన మంచం కోసమా? కనీసం వీళ్ళకి స్మశాన వైరాగ్యం లాంటిది కూడా రాదా?
'ఏంటి ఆలోచిస్తున్నావు?'
సుందరమ్మ ఆలోచనల దారం పుటుక్కున తెగింది .తలతిప్పి చూసింది. శ్రీలక్ష్మి సుందరమ్మ ముఖంలోకి జాలిగా చూస్తోంది.
'బాధపడకు. కొన్ని రోజులు బాధగానే వుంటుంది. కలలో కూడా ఊహించలేని జీవితం గడపడం కష్టమే. కాని కొద్ది రోజులకు అలవాటు పడిపోతాం. అయిన వాళ్ళ మధ్య క్షణం క్షణం మనసు చంపుకోవడం కంటే కష్టమైనా ఇలాంటి వాళ్ళ మధ్య వుండడమే మంచిదేమో! ఎందుకంటే ఇక్కడ మనం మనంగా బతుకుతాము. శ్రీలక్ష్మి మాటల్ని సుందరమ్మ శ్రద్ధగా వింది.
ఈమె కూడా తనలాగే చాలా అవమానాలకు గురి అయి వుంటుంది. అవును! మనసు చంపుకు బతకడం అందరూ చెయ్యలేని పని.
'అదికాదు. ఈ వయసులో, ఇలాంటి చోట చేరి కూడా వీళ్ళ తాపత్రయం - గంటకు ముందు శవం లేచిన మంచం కోసం కొట్లాడుకుంటూ వుంటే ఆశ్చర్యంగా వుంది' అంది సుందరమ్మ.
'మనిషి పరిస్థితుల చేతిలో కీలు బొమ్మ. వయసు ముదిరిన కొద్దీ మనిషికి శారీరకంగా, మానసికంగా కూడా విశ్రాంతి కావాలి. మరో ఆలోచనలు తావు వుండదు. ఓపిక వుండదు. ఇప్పుడు ద్రౌపదినే చూడు. తనకూ 76 ఏళ్ళు ఉంటాయి. ఎముకల గూడు లాంటి శరీరం. నేలమీద పడుకోవడం శరీరానికి బాధే. అందరికీ మంచాలు ఏర్పాటు చేసే స్తోమత హోమ్ కు లేదు. ఆకాస్త శరీర సుఖం కోసమే మంచం కోసం గొడవ. ఇందులో అసహజం ఏమీ లేదు.'
'ఇది సొంత ఇల్లు కాదుగా పోట్లాడుకోవడానికి?' అన్నది సుందరమ్మ.
'స్వంత ఇల్లు లేని వాళ్ళే కదా ఇక్కడికి వస్తారు. నీ భర్త పోయాక నీకా ఇల్లంటూ లేదు. నీ పిల్లల ఇళ్ళల్లో మరి నువ్వు పోట్లాడి ఇది కావాలి అది కావాలి అని అడగగలవా?'
'ఛ! ఛ! చస్తే అడగను. అంత అభిమానం లేనిదాన్ని కాదు. అభిమానం చంపుకోలేకే ఇక్కడకు వచ్చాను.'
'కరెక్టు. మరి ఇక్కడ వీళ్ళు పొట్లాడి సాధించుకుంటున్నారంటే తమ పిల్లల దగ్గర కూడా లేని స్వతంత్రం ఏదో ఇక్కడ వుందనేగా? ఇక్కడ అభిమానం దెబ్బతినే ప్రసక్తి లేదుగా?'
'ఆ... అవును! ఇది ఇక్కడ వుండే వాళ్ళందరి ఇల్లు.' సుందరమ్మ తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా అంది. 'ఇక పడుకో సుందరమ్మా!' అంటూ శ్రీలక్ష్మి మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. మరు నిమిషంలో గురక పెట్టింది.
ఇక్కడ కూడా ఎంత హాయిగా నిద్రపోతోంది. తనకు ఈ గతి పడుతుందని కలలోనైనా అనుకుందా? అసలు ఇలాంటి గృహాలు వుంటాయని కూడా తను వినలేదు. ఒక్కొక్క కొడుకే పెరిగి పెద్దవుతుంటే తనకేం ఐదుగురు జగజ్జీట్టీల్లాంటి కొడుకులున్నారను కొంటూ మురిసిపోయింది.
భర్త గుర్తొచ్చాడు. భర్త ఆఖరుసారిగా తన ముఖంలోకి చూసిన చూపు గుర్తొచ్చింది. 'నీకేం నువ్వు బాగానే వెళ్ళిపోయావు. నీదారి నీవు చూసుకున్నావు. నాగతి ఏమైందో చూస్తున్నావా? చూస్తూ ఊరుకున్నావా? నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. ఇక్కడ వుండలేను. వుండలేను. మళ్ళీ తెల్లవారకూడదు నా బ్రతుకులో. నన్ను తీసుకెళ్ళు భగవాన్.