Previous Page Next Page 
బంధితుడు పేజి 9


    "నువ్వు నోరుమూస్తావా ?" దాదాపు అరిచినట్టే అన్నాడు సత్యం.

    "మీకు చేతనయింది అదేగా ? పెళ్ళాం నోరు మూయించడం చేతనవును. చెల్లెల్ని అదుపులో పెట్టుకోవడం చేతకాదు" సాధింపుగా అన్నది పద్మ.

    "మధ్యలో నీ వాగుడేమిటే ?" విసుగ్గా అన్నాడు సత్యం.

    "వెధవ పుస్తకాలు చదువుతూ, ఆ కథల్లో హీరోలాంటి మొగుడు కావాలని కలలు కంటోంది నీ ముద్దుల చెల్లెలు. ఆరు అడుగుల  ఎత్తు హీరో అనుకోకుండా వచ్చి ప్రేమించేస్తాడనుకుంటూంది పాపం మీ ముద్దులచెల్లెలు.

    "నువ్వు నోరుమూస్తావా లేక  నన్ను మూయించమంటావా ?" రెచ్చిపోతూ అన్నాడు సత్యనారాయణ.

    "ఇంకా  కూర్చున్నావేం ? లేవే మొద్దుముండా ?" కూతురి నెత్తిమీద మొట్టికాయ వేసింది పద్మ.

    "ఏంటమ్మా నన్ను కొడతావు" ఏడుపుగొంతుతో అన్నది కవిత.

    "ఛ! వెధవ కొంప" గొణుక్కుంటూ కుర్చీలో కూలబడ్డాడు సత్యనారాయణ. కళ్ళు మూసుకున్నాడు.

    దీని వాలకం చూస్తె ఇట్లా వుంది. దాని వాలకంఅట్లా వుంది.

    సరోజకు ఒక్కడూ నచ్చటం లేదు.

    కట్నంలేని సంబంధం తప్పిపోతుందని దీని ఏడుపు. వాళ్ళ నాన్న కట్నంగా ఇచ్చిన పదివేలూ బ్యాంకులో దాని పేరుమీదేవుంది. అదెక్కడ తీసుకుంటానోనని ఏడుపు.

    అప్పు చేసయినా పెళ్ళి చేస్తాడు కానీ దాని డబ్బు దమ్మిడీ ముట్టుకోడు.

    ఇప్పుడే దానికింత నిర్లక్ష్యం.

    నోటికి ఏదోస్తే అదే అనేస్తుంది.

    దాని డబ్బుతో తన చెల్లెలి పెళ్ళిచేస్తే ఇంకేమయినా వుందా? జీవితమంతా సాధించదూ ?

    సరోజ వాలకం కూడా ఏమీ బాగా లేదు. దాని మనసులో ఏముందో అర్థం  కావడంలేదు. ఎంత మంచి సంబంధం వచ్చినా నచ్చలేదంటుంది.

    ఆ కుర్రాడికేం ? లక్షణంగా వున్నాడు ఇంతకంటే మంచిసంబంధం మళ్ళీ దొరుకుతుందా ?

    తన మెతకతనంవలెనే సరోజ మరీ మొండిగా తయారయింది. చేసుకోక ఏం చేస్తుందేం?

    సత్యనారాయణ ఒకనిర్ణయానికి వచ్చాడు. అంతలో సరోజ వచ్చి అన్నకు ఎదురుగా నిల్చుంది.

    సత్యానారాయణ తలెత్తి చెల్లెలి ముఖంలోకిచూశాడు సరోజ కళ్ళు ఎర్రగా వున్నాయ్. జట్టు రేగింది. సరోజను చూసికరిగిపోయాడు.

    "అన్నయ్యా! నేనీ పెళ్ళి చేసుకుంటాను"

    సత్యనారాయణ తృళ్ళిపడి  కళ్ళు తెరిచాడు.

    అతను ఆశ్చర్యంగా చెల్లెలి ముఖంలోకి చూశాడు. ఆ మాట ఇష్టంతో అన్నట్టులేదు. ఎవరిమీదో కక్ష సాధించడానికి అన్నట్టుగా ఉంది.

    "వద్దమ్మా! నీకు ఇష్టంలేని పెళ్ళి చేస్తానా? మరో సంబంధం చూస్తాను. నీకు నచ్చినవాణ్నే చేసుకో. పెళ్ళి సూరేళ్ళ పంట" అన్నాడు సత్యనారాయణ అనునయంగా.

    "కట్నం లేకుండా ఇంత కంటే మంచివాళ్ళెవరొస్తారు?"

    సత్యనారాయణ చెల్లెలి ముఖంలోకి  పరిశీలనగా చూశాడు. సరోజ అంతర్యం అర్థం అయింది.

    "తల తాకట్టు పెట్టయినా మంచి సంబంధం తెస్తాను. నువ్వేం  బాధపడకు" అన్నాడు సత్యనారాయణ.

    పద్మ కసికా  కవితను కొట్టింది. పిల్ల తారస్థాయిలో ఏడుపు ప్రారంభించింది.

    సరోజ లోపలకు వెళ్ళిపోయింది ముసి ముసిగా  నవ్వుకొంటూ.

    తను నిర్ణయించుకున్న దేమిటి? తీరా సరోజ చేసుకుంటాను అనేటప్పటికి తను అన్నదేమిటి? తను ఇంతకంటే మంచి సంబంధం తేగలడా?

    సత్యనారాయణ తల పట్టుకొని కూర్చున్నాడు.

    అదే తన కుమార్తియితే?

    "ఏమంటుంది?" అన్నది పద్మ.

    భార్యకు సమాధానం ఇవ్వాలనిపించలేదు. మౌనంగా వుండిపోయాడు.

    మధ్యలో దీని గొడవ ఒకటి? ఎప్పుడు బరువు దించుకుందామా! అని చూస్తుంది. తన చెల్లెలు తనకు బరువా? దాని మంచి చెడ్డలు తను తను చూడకపోతే ఇంకెవరు చూస్తారు?

    "మధ్యలో నాకెందుకు బుద్ధిలేకగాని....మీ అన్న చెల్లెళ్ళూ ఏ గంగలో దిగితే నాకెందుకు?" సాధింపుగా అన్నది.

    "సంతోషం ! ఇప్పటికైనా నిజం మాట్లాడావు. నువ్వు ఇకనుంచి కల్పించుకోకు" అన్నాడు సత్యనారాయణ.

    విసురుగా నడుం తిప్పుకొంటూ వెళుతున్న పద్మ పుట్టలోకి జరజరా పాకుతూ వెళ్తున్న పానులా కన్పించింది. సత్యనారాయణ కళ్ళకు.


                                            7

   
    ఏమిటమ్మా ఇంకా అలాగే వున్నావేం ? వాళ్ళోచ్చే వేళయింది. త్వరగా ముస్తాబవు!" సత్యనారాయణ చెల్లెల్ని హెచ్చరించాడు.

    సరోజకు ఈ పెళ్ళి చూపుల తతంగం మహాచిరాకుగా వుంది. మళ్ళీ ఏ గుమాస్తా ఉద్యోగం చేసేవాణ్నో పట్టుకొని వుంటారు. లేచింది సరోజ మనసులో అనుకుంటూ!

    తెల్లగా పొడవుగా వున్న ఆ యువకుడు సరోజ కళ్ళకు నవలల్లో చదివే హీరోలాగా  కన్పించాడు. హృదయం పులకించింది. మనసు ఆనందంతో పరుగులు పెట్టింది. రెక్కలు మొలవాలనీ, ఆకాశం హాయిహాయిగా ఎగరాలనీ, అనిపించింది.

    అందరూ వెళ్ళిపోయాక "కుర్రవాడు అందంగా వున్నాడు" అన్నది పద్మ తృప్తిగా.

    "నీకూ నాకూ అందంగానే వున్నాడు! మరి సరోజకు ఎలా కన్పించాడో," అంటూ సరోజ ముఖంలోకి చూశాడు సత్యం!

    సరోజ  ముఖంలో సంతోషం కన్పించింది.

    భార్యాభర్తలు ఒ రి ముఖంలోకి ఒకరు చూసుకొని హాయిగా నవ్వుకున్నారు.

    "లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఎం .ఏ పాసయాడు"

    "సరోజ విననట్టే శ్రద్దగా వింటూ కూర్చుంది.

    "ఏమ్మా! కుర్రాడు ఎలా వున్నాడు ?"

    సరోజ ముఖం సిగ్గుతో కందిపోయింది.

    "చెప్పమ్మా! నీకు ఇష్టమేనా! ఈ సంబంధం ఖాయం చెయ్యమంటావా?"

    "నీ ఇష్టం !" సిగ్గుపడుతూ అన్నది!

    "అబ్బ! ఇంత కాలానికి మీ చెల్లెలికి ఓ మగాడు నచ్చాడు! ఇఅమికా సందేహం ఎందుకు, ముహూర్తం పెట్టించండి" అన్నది పద్మ.

    పద్మకు  నిజంగానే సంతోషంగా వుంది!

    సరోజకు మొదటిసారిగా వదినమీద సద్భావం ఏర్పాడింది.

    "కట్నంచాలాఅడిగేటట్టున్నారు" ఆలోచిస్తూఅన్నాడు సత్యనారాయణ.

    సరోజ కళ్ళెత్తి అన్న ముఖంలోకి చూసింది.

    "ఎంత అడుగుతున్నా రేమిటి?" అడిగింది పద్మ.

    "ఇంకా స్పష్టంగా చెప్పలేదు. కానిపదివరకు వెళ్ళేట్టువున్నాడు" దిగులుగా అన్నాడు సత్యనారాయణ.

    "పది వేలే, పెళ్ళికీ లాంఛనాలకూ మరొక ఐదు వేలన్నా కావాలి. పదిహేనువేలు ఎక్కడనుంచి తెస్తాం!"  భర్తను  చూస్తూ అడిగింది పద్మ.

 Previous Page Next Page