Previous Page Next Page 
బంధితుడు పేజి 10


    పద్మ గొణుక్కుంటూ లోపలకు వెళ్ళిపోయింది.

    సరోజకు ఈ కుర్రాడు నచ్చాడు! ఏమైనా సరే ఈ సంబంధమే చేస్తాడు. తన పిల్లలకు అన్యాయం చేయవద్దట? అంటే తన చెల్లెల్ని గాలికి వదిలెయ్యామనేగా ?

    ఆ వున్న రెండెకరాలు ఆమ్మేసి అయినా తన చెల్లెలికి ఈ పెళ్ళి చేస్తాడు! అది నాన్న సంపాదించిన పొలమేగా? సరోజకూ దానిమీద హక్కువుంది.

    సరోజకు దిగులు దిగులుగా వుంది!

    గుబులుగా వుంది.

    ఒకవేళ అన్నయ్య అంత కట్నం ఇవ్వలేనంటాడేమో?

    అంటాడు.

    తప్పక అంటాడు.

    వదిన అంత కట్నం ఇవ్వడానికి చస్తే ఒప్పుకోదు!

    ఈ సంబంధం పోతే ఇక చస్తే తను పెళ్ళి చేసుకోదు!

    అతను ఎంత బాగున్నాడో! తన అభిమానం నవలల్లో హీరోలాగే వున్నాడు.

    కళ్ళలోకి సూటిగా చూశాడు. అవును తనుకు  ఎలాగో అన్పించింది.

    ఇదేనేమో ప్రేమంటే ?

    అతని పేరు రాజారావు - అంత బాగా లేదు!

    కానీ "రాజా" అని పిలవవచ్చు!

    'రాజా' "తనూ" కలిసి ఎంచక్కా... "తనూ" "రాజా"....

    సరోజ  మనసు పురివిప్పిన మేనలిలా నాట్యం చెయ్యసాగింది. కలల్లో కరిగిపోసాగింది. తనూ, తన భర్త కలిసి గడపబోయే జీవితాన్ని గురించి ఎన్నెన్నో ఆలోచించసాగింది!

    కొద్దినిముషాలముందు వదిన అంటే ఏర్పడ్డ సద్భావం ఇట్టేజారిపోయింది సరోజ మనసులో నుంచి!

    సరోజ దిగ్గునలేచి అక్కడనుంచి వెళ్ళిపోయింది.

    పద్మా, సత్యనారాయణ ఓ క్షణం సరోజ వెళ్ళిన వైపు చూస్తూ వుండిపోయారు.

    పద్మపేర పదివేలు బ్యాంకులో వుంది. అది తీసుకోమంటుందని ఆశించాడు సత్యనారాయణ.

    అనదు!

    ఎందుకంటుంది?

    ఒకవేళ అన్నా తను తీసుకునేవాడా?

    మాట మాత్రం అంటుందనుకున్నాడు అంతే!

    "మనం ఎక్కడ తూగగలం ఈ సంబంధంతో ?" అన్నది పద్మ!

    "తప్పుతుందా, అప్పో సప్పో చెయ్యాలి! ఆ కుర్రాడు సరోజకు నచ్చాడు, ఇది ఇప్పటికిప్పుడే ఎన్ని కలలు కంటుందో, ఇది తప్పిపోతే సరోజ బాధపడుతుంది. తనకు తనే చెప్పుకొంటున్నట్లు అన్నాడు.

    "అందుకని అప్పులు చేస్తారా ? అప్పులుచేస్తే తీర్చే తాహతు వుండొద్దూ? మనకూ పిల్లలు వున్నారు" భర్త ముఖంలోకి చూస్తూ అన్నది పద్మ.

    "అయితే ఏమంటావ్ !

    "ఏమంటాను? అప్పులుచేసి నా బిడ్డలకు అన్యాయం చెయ్యవద్దంటున్నాను"

    "నీ ఏడుపు తగలెయ్యా! మళ్ళీ మొదలు పెట్టావ్?"

    అంతలోనే బుర్రలో అనేక సందేహాలు తలలెత్తాయి.

    అన్నయ్య అంతకట్నం ఇవ్వగలడా ? ఎందు కివ్వలేడూ?

    అదే తన కూతురై తే ఇవ్వడా ?

    ఒకవేళ ఈ సంబంధం తప్పిపోతే....?

    అన్నయ్య మంచివాడు. తనకోసం ఏమైనా చేస్తాడు.

    ఈ సంబంధాన్ని చెయ్యి జారిపోనివ్వడు..

    బోడి వదిన పెత్తనం ఏమిటి? ఆవిడకున్న మాత్రం అధికారం అన్నయ్య మీద తనకు లేదా ఏం?

    ఆలోచనలనుంచి __ కలత నిద్రలోకి. కలత నిద్రనుంచి కలల్లోకి జారిపోయింది సరోజ.


                                                                                         8


    పిల్లలూ, సరోజా భోజనంచేసి పడుకున్నారు.

    రాత్రి తోమ్మిదయినా సత్యనారాయణ ఇంకా ఇంటికి రాలేదు.

    పద్మ భర్తకోసం ఎదురుచూస్తూ మండిగం మీద కూర్చుని ఆలోచిస్తూ  వుంది.

    ఈ మధ్య బొత్తిగా ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే వుంటారు. చెల్లెలిపెళ్ళి గురించే. డబ్బు అప్పు దొరికినట్టులేదు. పొలం బేరం పెట్టారని ఎవరో చెప్పారు. తనతో మాటమాత్రం అనలేదు.

    జీవితంలో కష్టసుఖాలను సమంగా పంచుకుంటామని పెళ్ళిలో ప్రమాణాలు చేసు కుంటారు, భార్యా భర్తలు.

    కాదు పురోహితుడు ప్రమాణాలు చేయిస్తాడు.

    అసలు ఆ ప్రమాణాలు వాళ్ళకు అర్థమయ్యే చేస్తున్నారా? పురోహితుడు ఏదో చెబుతాడు. వాళ్ళు వల్లిస్తారు.

    ఈయనగారి తత్త్వం తనకు బొత్తిగా అర్థం కావడం లేదు. తనకొచ్చే జీతంతో తిండికీ, బట్టకూ కరువులేకుండా సరిపోతుంది.

    కాని రేపు పిల్లలు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళ చదువులకూ సంధ్యలకూ ఇప్పటినుంచే జాగ్రత్తపడకపోతే వాళ్ళకు అన్యాయంచేసినట్టుకాదా? ఆ మనిషి బొత్తిగా ఆలోచించడేం? పదివేలు కట్నం ఇచ్చి పెళ్ళి చేస్తాడా? ఆ వున్న రెండెకరాల పొలం కూడా అమ్మితే రేపు తన పిల్లలేంకాను ?

    చెల్లెలికి మంచి సంబంధం చూడవద్దని తను అనడంలేదే ?

    ఆ రంగారావు కేం ?

    చెల్లెలు వద్దు అనగానే అంత మంచి సంబంధాన్ని ఒదులుకున్నాడు. సరోజకేం తెలుసు? ఊహల్లోని రాజకుమారుడు కావాలని, ఆ వయసులో వున్న ప్రతి ఆడపిల్లా కోరుకుంటుంది.

    ఈనాడు వచ్చే నవలలూ, సినిమాలు, కలలుగనే వయసులోవున్న పిల్లల మీద నల్లమందులా పని చేస్తున్నాయి.

    ఆ నవలల్లోని హీరోలా ఏ.ఐ.ఏ.యస్. ఆఫీసరో, పెద్ద బిజనెస్ మేనో వచ్చి అకస్మాత్తుగా ప్రేమించి వెంటబడి మరీ పెళ్ళి చేసుకుంటాడని కలలు కంటారు.

    ఏ పెద్ద ఆఫీసరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తన దగ్గర పని చేసే టైపిస్టును పెళ్ళి చేసుకున్నట్టు ఎవరైనా చెప్పారా?

    మరో రకంగా ఆమెను ఉపయోగించు కోవడానికి అతనికి అభ్యంతరం లేకపోవచ్చును. కాని పెళ్ళిమాత్రం  చేసుకోడు. అలాంటి పెళ్ళిళ్ళు కధల్లోనూ, సినిమాల్లోనూ మాత్రమే జరుగుతాయి.

    ఒక లక్షాధికారి కూతురు రిక్షావాణ్ని ప్రేమించి "నాన్నా! ఆయన లేని ఆస్తి నాకు అక్కర్లేదు" అంటూ ఇల్లు విడిచి వెళ్ళి నానా అగచాట్లు పడటం సినిమాల్లో చూట్టానికీ, నవలల్లో చదవడానికీ బాగానే వుంటుంది.

    కాని నిజజీవితంలో ఇది సంభవమా ?

    ఈ కధలు రాసే వాళ్ళు ఎందుకు ఆలోచించరు?

    సమాజానికి ద్రోహం చేస్తున్నట్టు వారికి తెలియదా?

    "ఏమిటి పద్మా ఆలోచిస్తున్నావ్!"

    పద్మ ఉలిక్కిపడి లేచి నిల్చుంది.

    సత్యనారాయణ ఎదురుగా నిల్చుని వున్నాడు. ముఖం పీక్కుపోయి వుంది. కళ్ళల్లో పుట్టెడు దిగులు కన్పిస్తోంది.

    పద్మ మనసు ఎలాగో అయింది.

    "ఇంత ఆలస్యం అయిందేం!"

    సత్యనారాయణ సమాధానం ఇవ్వకుండా బట్టలు మార్చుకోసాగాడు.

    "పొలం బేరం పెట్టారటగా !"

 Previous Page Next Page