Previous Page Next Page 
బంధితుడు పేజి 8


    సత్యనారాయణ సిగరెట్టు తాగుతూ ఆలోచనలో పడ్డాడు.

    పదం ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది.

    "పద్మా !"

    "ఏమిటి ?"

    "సరోజ చిన్నపిల్ల ! తల్లీ తండ్రీ లేని పిల్ల. అదేం మాట్లాడుతుందో దానికే తెలియదు. అది అన్న మాటకు బాధపడకు."

    "బాధ  ఎందుకూ? మీరు కూడా నమ్మివుంటేతప్పక బాధపడేదాన్నే."

    "నేనెలా నమ్ముతాను పద్మా?" ఆమాత్రం నిన్ను నేను అర్థం చేసుకోలే ననుకుంటున్నావా?" నీ గురించి అంత నీచంగా ఆలోచిస్తానా?"

    "అయిందేదో అయింది. ముందుసంగతి ఆలోచించండి. సరోజకు రోషం  ఎక్కువ. ఎన్నడూ కొట్టని మీరు కొట్టారు. కోపంతో ఏం చేస్తుందోనని భయంగా వుంది. 'వద్దు' అన్న పనిచేసే స్వభావం ఆ పిల్లది" అన్నది పద్మ.

    "అదే నేనూ ఆలోచిస్తున్నాను ... ఏం చెయ్యమంటావు చెప్పు?"

    "ముందు స్కూలు మాన్పించండి. తెలిసీ తెలియని వయసు. ఉత్తరాలవరకూ వచ్చించింటే వాడు వల చేత్తో పట్టుకుని సిద్ధంగావుండే వుంటాడు" అన్నది పద్మ.

    "స్కూలు మాన్పించి ఇంట్లో కూర్చో బెట్టమంటావా?"

    "సరోజ స్వభావం  మీకు తెలియదు. తీరా చేతులు కాలక ఆకులుపట్టుకుంటే ప్రయోజనంలేదు. వీలయినంత త్వరలో ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళి చేసేద్దాం!

    "పద్మ చెప్పింది బాగానే వుందనిపించింది సత్యనారాయణకు. ఆలోచిస్తూ వుండిపోయాడు.


                                             5

    సరోజ ముస్తాబయి స్కూలుకు బయలుదేరింది.

    "సరోజా" వెనక్కు పిల్చాడు సత్యనారాయణ.

    "ఏమిటన్నయ్యా!" అంటూ వెనక్కు వచ్చింది.

    "స్కూలు మానేయ్! ఇప్పుడు చదివి నువ్వేం చెయ్యాలి? చదివింది చాల్లే!" అన్నాడు  సత్యనారాయణ కరుగ్గా.

    సరోజ అర్థంకానట్టు అన్న ముఖంలోనికి చూస్తూ నిలబడిపోయింది.

    "ఎందుకు మానెయ్యాలి? నేను చదువుకుంటాను" అన్నది సరోజ మొండిగా.

    "వీల్లేదు. మా కెవరికీ తెలియకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు" ఖచ్చితంగా అన్నాడు సత్యనారాయణ.

    సరోజ వాకిట్లో నిలబడ్డ వదినకేసి ఏవగింపుగా చూసింది. కసి కసిగా చూసింది.

    సరోజ చూపులోని  అంతరార్థం తెలుసుకున్న సత్యనారాయణ మనసు చివుక్కుమంది!

    "వదినేం చెప్పలేదు. నేనే వద్దంటున్నాను" అన్నాడు సత్యనారాయణ సంజాయిషీ యిచ్చుకుంటున్న ధోరణిలో.

    "అబద్ధం! వదినే లేనిపోనివి కల్పించి చెప్పింది. నేను చదువుకోవడం ఆమెకు మొదటినుంచీ ఇష్టం లేదు! నువ్వు పెళ్ళాం మాటలు విని...." అన్న ముఖం చూసి ఆగింది!

    "నోరుముయ్యి!" సత్యనారాయణ గట్టిగా అరిచాడు!

    సరోజ వెక్కి వెక్కి ఏడుస్తూ నిల్చుంది!

    "చిన్నదానివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్! నోటికొచ్చింది పేలుతున్నావ్?" కోపంగా అరిచాడు సత్యం!

    సరోజకు దుఃఖం పొర్లుకొచ్చింది.

    "అను! ఎన్నైనా అను, నాకెవరున్నారు? అమ్మే వుంటే...నాన్నే వుంటే..." పైకి మాటలు పెగలలేదు.

    భోరున ఏడవసాగింది సరోజ.

    సత్యనారాయణ నీరు కారిపోయాడు. అమ్మ గుర్తొచ్చింది అతనికి.

    చెల్లెలి దగ్గరకెళ్ళి తల గుండెలకు అనించుకొని "చూడమ్మా! నీమీద నాకు కోపమా చెప్పు? ఏం చెప్పినా, ఏం చేసినా నీ మంచికే...అమ్మానాన్నా లేనిలోటు నీకేం చేస్తున్నాను?" లాలనగా అన్నాడు.

    సరోజ దూరంగా జరిగి ఏడుస్తూ నిల్చుంది.

    "ఇంకా మూడు నెలలేగా? స్కూల్ పైనల్ పూర్తి చేస్తుంది. వెళ్ళనివ్వండి" అన్నది పద్మ.

    సత్యనారాయణ ఆలోచనలో పడ్డాడు.

    నిజమే! మూడు నెలల్లో పరీక్షలు అయిపోతాయి. ఈ కొద్దికాలం జాగ్రత్తగా కనిపెట్టివుంటే సరిపోతుంది. అకస్మాత్తుగా స్కూలు మాన్పించడం మంచిదికాదు. ఇరుగూపొరుగూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చావాలి. బాగా ఆలోచించి స్కూలుకు పంపడమే మంచిదని నిర్ణయించుకున్నాడు.

    "సరే! వెళ్ళు స్కూలుకు. జాగ్రత్తగా వుండు! లే! ఏడవకు. ముఖం కడుక్కో, టైం అవుతోంది" అన్నాడు సత్యనారాయణ సరోజకు దగ్గరగా వచ్చి.

    సరోజ తలెత్తి వదినను, అన్నను  మార్చి  మార్చి చూసింది. కోపంగా చూసింది. కసిగా చూసింది.

    "లేమ్మా!" అన్నాడు సత్యనారాయణ.

    "నేను వెళ్ళను. నాకు చదువు అక్కర్లేదు." కసిగా అన్నది సరోజ. ఆ  కంఠంలో మొండితనం, పట్టుదలా ఉన్నాయి.

    సత్యనారాయణ ముఖంలోకి చూశాడు.

    "చూడమ్మా సరోజా! మూడు నెలలయితే పరీక్షలైపోతాయ్. ఇంతా చదివి పరీక్షలకు వెళ్ళకపోవడం యెందుకు, స్కూలుకు వెళ్ళు" అన్నది పద్మ.

    సరోజ వదిన కేసి కొరకొరా చూసింది. ఏవగింపుగా  చూసింది.

    "నేను వెళ్ళను. నా కెందుకు చదువు? ఏ కుంటివాడినో గుడ్డివాడినో తెచ్చి ఆ మూడు మూళ్ళూ వేయించండి. పీడ విరగడవుతుంది." కసిగా అన్నది.

    "ఏమిటి సరూ, ఆ మాటలు? ఏదో అన్నాను. ఇప్పుడు వెళ్ళమంటున్నానుగా?" అన్నాడు సత్యనారాయణ అనునయంగా.

    "పెళ్లాం నన్ను స్కూలుకు పంపించమంటే పంపిస్తావ్? వద్దంటే మానేస్తావ్? అంతేగా?" రోషంగా అన్నది సరోజ వెక్కి వెక్కి ఏడుస్తూనే.

    "సరోజా! ఏమిటా మాటలు?" దాదాపు అరచినట్టే అన్నాడు సత్యనారాయణ.

    "మళ్ళీ కొడ్తావా? కొట్టు! నువ్వు కొట్టినా  చంపినా నేను  మళ్ళీ స్కూలుకు వెళ్ళను. ఆ, అంతే."

    సరోజా, నా మాట విను...."

    "నీమాట వినాల్సిన పని నాకు లేదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు తీర్పు చెబుతున్నావా?" పద్మ  మాటల్ని మధ్యలోనే అందుకుంది సరోజ.

    "అసలు నువ్వు కాదూ స్కూలు మాన్పించమని మొగుడికి చెప్పింది ?" మళ్ళీ రెట్టిస్తూ అన్నది సరోజ.

    "నోరు మూస్తావా  లేక...."

    "కొడ్తావా ?కొట్టు ? అమ్మే వుంటే...." మళ్ళీ ఏడుపు ప్రారంబించింది.

    సత్యనారాయణ విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు.

    సరోజ గోడకు చేరబడి ఏడ్వసాగింది.

       
                                             6


    సరోజ స్కూలు మానేసి ఇంట్లో కూర్చుంది.

    వదినమీద కసి పెంచుకుంది.

    పద్మ ఏం మాట్లాడినా పెడార్థాలు తీస్తున్నది.

    పద్మ సరోజతో మాట్లాడడం మానేసింది.

    సత్యనారాయణ నాలుగైదు సంబంథాలు తెచ్చాడు. ఒక్కటీ సరోజకు నచ్చలేదు.

    ఆ రోజు ఉదయం సరోజను చూడటానికి ఒక కుర్రవాడు వచ్చాడు. సత్యనారాయణ ఆఫీసులో పనిచేసే ఓ సూపర్నెంటు ఒకడు ఆ సంబంధం తెచ్చాడు.

    కుర్రవాడు బి. ఏ  పాసయ్యాడు.

    తెలివయినవాడు.

    బుద్థిమంతుడు !పొట్టిగా వున్నా బాగానే వుంటాడు.

    కట్నం అక్కరలేదన్నాడు.

    బ్యాంక్ లో అకౌంటెంటుగా పనిచేస్తున్నాడు.

    సత్యనారాయణకు ఆ సంబంధం పూర్తిగా నచ్చింది.

    ఆఫీసునుంచి వస్తూనే చెల్లెల్ని పిలిచాడు.

    "పిల్చావా అన్నయ్యా" అంటూ వచ్చింది సరోజ.

    "ఏమ్మా! ఆ అబ్బాయి నీకు నచ్చాడా? మంచి కుర్రవాడు. కట్నం కానుకల అక్కరలేదన్నాడు" అంటూ ఆమె ముఖంలోకి చూశాడు సత్యం.

    ఆమె ముఖం  ముడుచుకుంది. సున్నా  చుట్టింది.

    "చెప్పు, ముహూర్తాలు పెట్టించుమన్నావా?"

    సరోజ మాట్లాడలేదు. గోళ్ళు కొరుక్కోసాగింది.

    "ఏమిటి మాట్లాడవ్ ?" కొంచెం విసుగ్గా అన్నాడు సత్యం.

    "నన్నెందుకు అడుగుతావు ? ఎవరో ఒకరికి కట్టి  పీడ వదిలించుకోవాలను కుంటున్నావుగా ? చేసెయ్యి ! ఎవడయితేనేం ?"

    చివ్వున తలెత్తి సరోజ ముఖంలోకి చూశాడు సత్యనారాయణ. మనస్సు చివుక్కుమన్నది.

    "ఏమిటా మాటలు ? ఆ కుర్రవాడికేం తక్కువ ?"

    "అవును పొట్టిగా నల్లగా చాలా అందంగా వున్నాడు. కట్నం లేకుండా చేసుకుంటానన్నాడుగా ? అదేగా మీ ఇద్దరికీ కావాల్సింది ?" ఏడుస్తూ అన్నది.

    "ఎందుకా ఏడుపు ?ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు " అంటూ విసురుగా గది బయటకు వచ్చాడు సత్యం.

    "ఈ సంబంధఅయినా నచ్చిందా నీ ముద్దుల చెల్లెలికి" వ్యంగ్యంగా అడిగింది పద్మ.

   
    ఆగాడు! వెనక్కు తిరిగి భార్యకేసి చూశాడు. విసుగ్గా చూశాడు.

    మరుక్షణం కనుబొమలు ముడిపడ్డాయి.

    "ముదనష్టపుదానా ! సరిగా కూర్చో "పిల్లకు జడ వేస్తూ కసురుకుంది పద్మ.

    ఆ కోపం పిల్ల మీద కాదని  సత్యనారాయణకు తెలుసు. ఆడవాళ్ళను మొగుడిమీద కోపంవస్తే పిల్లల మీదా, పిల్లుల మీద చూపిస్తారని తెలుసు.

    "మన అంతస్తుకూ, మనం ఇచ్చే కట్నాలకూ ఏ ఇంద్రుడో చంద్రుడో రావాలంటే ఎక్కడ్నుంచి వస్తాడో" అల్లుతూ. ఆ జడ అల్లే తీరులోకూడా ఆమెకోసం వ్యక్త అవుతోంది. 

 Previous Page Next Page