Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 9

                                                                            5
   
    పైన ఫాన్ తిరుగుతున్నా గదంతా ఉక్కపోతగా వుంది.
   
    పైగా ఏదో ముక్కవాసనకూడా వేస్తూంది.
   
    చాలారోజులుగా గది మూసిపెట్టి ఉంచడంవల్లనే కావచ్చు. గదిలో ఉన్న రెండు కిటికీల పై చెక్కలుమాత్రమే తెరిచివున్నాయి.
   
    మురళీకృష్ణ లేచివెళ్ళి కిటికీలకింది చెక్కలుకూడా తెరిచాడు. మళ్ళీ పక్కమీద వాలిపోయాడు.
   
    ఒళ్ళంతా విరగ్గొట్టినట్టుగా వుంది.
   
    కనురెప్పలు బలంగా వాలిపోతున్నాయి.
   
    అయినా మనసు వశం కావడంలేదు.
   
    ఎంత ప్రయత్నించీ మనసును నిద్రలోకి నెట్టలేకపోతున్నాడు.
   
    ఆరోజు సాయంకాలం బట్టలషాపులో జగన్మోహనరావు కన్పించినప్పటినుంచీ జరిగినదంతా ఊడిపోయిన దారపువుండదారంలా, వలయాలు చుట్టుకుంటూ మనసును ఆక్రమింపచేసింది. చేతనావస్థలోనే పీడకలను అనుభవించినట్టుగా వుంది. బేబీ మోనో కళ్ళముందు కన్పిస్తూ వుంది.
   
    ఎంత దురదృష్టవంతురాలు!
   
    తల్లి ఉండీలేనిదయింది.
   
    జగన్ జీవితమంతా అలా తెల్లారిపోవాల్సిందేనా?
   
    అద్వితీయమైన ఎన్నో ప్రేమకథలు తను విన్నాడు.
   
    లైలామజ్నూ, షిరీన్-ఫరిహాద్, హేర్-రాంఝా, అనార్కలీ, రోమియో-జూలియట్ ఇంకా ఎన్నెన్నో భగ్నప్రేమికుల గాథలు విన్నాడు.
   
    కాని ఇదిమాత్రం వన్ వే ట్రాఫిక్ లా వుంది.
   
    ఈ కథలోని హీరోయిన్ బిడ్డను కనేసి, మాజీ ప్రియుడి ముఖాన్కొట్టి తనుమాత్రం పెళ్ళిచేసుకొని హాయిగా మరొకడితో కాపురం చేస్తుంది. ఈ అమాయకుడేమో ప్రియురాలిమీద మోజు చంపుకోలేక ఆ బిడ్డను పెంచుతూ తనను ఏనాడో వదిలివేసిన మాజీ ప్రియురాలిని ఆరాధిస్తూ, క్షణం క్షణం అణువణువునా చంపుకుంటూ, తన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు.
   
    ఇప్పటికే మనిషి శారీరకంగా, మానసికంగాకూడా బాగా దెబ్బతిన్నట్టు కన్పిస్తున్నాడు. అది అతని మాటల్లోనూ, ప్రవర్తనలోనూ స్పష్టంగా కన్పిస్తోంది. ఊబిలో కూరుకుపోయాడు. ఆదుకొనే చెయ్యి ఉంటేనేగాని ఆ ఊబినుంచి బయటికి రాలేడు.
   
    జగన్ జీవితం ఇలా శలభంలా మాడి బూడిదయిపోకూడదు. మంచివాడు. పరుషంగా మాట్లాడటంకుండా చేతకానివాడు. అమాయకుడు. సత్యవాది. స్నేహశీలి ఇన్నేళ్ళతర్వాత తనను గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చాడు.
   
    తనముందు గుండెలో పేరుకొని గడ్డ గట్టిపోతున్న విషాదభాండాన్ని గుమ్మరించాడు.
   
    మోడు వారిపోయిన జగన్ జీవితాన్ని మళ్ళీ పుష్పింపచేయడం తన ధర్మం. స్నేహితుడి కర్తవ్యం.
   
    అందుకే తనేం చెయ్యాలి?
   
    ఒకటే మార్గం కన్పిస్తోంది.
   
    మోనాను తీసుకెళ్ళి తల్లిదగ్గర వదిలేస్తే?
   
    అ పని జగన్ చెయ్యలేడు.
   
    చేజేతులా తన ప్రియురాలి జీవితాన్ని నాశనం చెయ్యలేడు.
   
    కాని ఆమెకు తగిన శిక్ష అదే! అదే!
   
    కృష్ణకు నోరు ఎండిపోయినట్టు అయింది.
   
    పక్కమీదనుంచి లేచి కూజాలోని చల్లటినీళ్ళు తాగాడు. అరచేతిలోకి నీళ్ళు వంచుకొని ముఖంమీద చల్లుకొన్నాడు. కిటికీలోనుంచి వీస్తున్న చల్లగాలికి గదికూడా చల్లబడింది. వేడిగా వుండిన బుర్ర కాస్త చల్లబడి హాయిగా ఉన్నట్టు అన్పించింది. తిరిగివెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. దిండు సర్దుకొని తిరిగి వత్తిగిల్లాడు.
   
    అప్పుడు అతని ఆలోచన అతనికే అక్రమంగా అన్యాయంగా తోచింది.
   
    జగన్ బతుకును బాగుచేయడంకోసం మోనోను తల్లిదగ్గర వదిలేస్తే జరిగేదేమిటి? ఆ స్త్రీ బ్రతుకు బండలవుతుంది. ఆమెను కట్టుకొన్న మగవాడి బ్రతుకు దుర్భరం అవుతుంది. మోనో తండ్రికీ తల్లికీకూడా దూరంఅవుతుంది. ఆపాపం! తనకే తగులుతుంది.
   
    బాగా ఆలోచిస్తే ఒకే ఒక మార్గం కన్పిస్తుంది. అది జగన్ ను పెళ్ళిచేసుకోవడానికి వప్పించడమే. మోనోను తన బిడ్డలా స్వీకరించగల ఉదాత్తభావాలూ, మంచిమనసూ వున్న స్త్రీ దొరికితే అతని సమస్యకు పరిష్కారం దొరికినట్టే__
   
    కృష్ణ కళ్ళముందు వసుంధర రూపం మెదిలింది.
   
    వసుంధర కృష్ణ పినతల్లి కూతురు.
   
    బి.ఏ., బి.ఇ.డి. చదివి టీచరుగా పనిచేస్తూంది.
   
    వసుంధర మనస్తత్వం తనకు తెలుసు.
   
    జగన్మోహన్ ను అర్ధం చేసుకోగల ఇంగితజ్ఞానం ఆమెకుంది.
   
    ఆమెతో మాట్లాడి ఒప్పించగలననే నమ్మకం కృష్ణకు కలిగింది. తను వెళ్ళబోయేముందు ఈ విషయం జగన్ తో మాట్లాడటానికి నిర్ణయించుకున్నాడు. యాదృచ్చికామిన సంఘటనలు కొన్ని జీవితాలను మలుపు తిప్పుతాయి. కొన్ని నరకానికి మెట్లుకాగా మరికొన్ని స్వర్గానికి సోపానాలు అవుతాయి.
   
    వసుంధర అంగీకరిస్తే జగన్ జీవితం నందనవనం అవుతుంది....
   
                                                                         6
   
    "బాబయ్యా! బాబయ్యా!"
   
    కృష్ణ కంగారుగా లేచాడు.
   
    తలుపు తడుతూ సింహాచలం పిలుస్తున్నాడు.
   
    బయటనుంచి కారు హారన్ వినిపిస్తోంది.
   
    అబ్బ అప్పుడే ఐదు అయిందా? తను రెండుగంటలు కూడా నిద్రపోయినట్టు అన్పించడంలేదు. కళ్ళు తెరిపిళ్ళు పడటంలేదు.
   
    బెడ్ మీదనుంచి, పక్కబల్లమీద వుండిన వాచీ తీసి చూశాడు.
   
    ఐదూ పది అయింది.
   
    "బాబయ్యా! టాక్సీ వచ్చింది" బిగ్గరగా అరుస్తున్నాడు సింహాచలం.
   
    లుంగీ బిగించుకొని తలుపు తెరిచాడు.
   
    "బాబయ్యా! సాలాసేపట్నుంచి పిలుట్టున్నా. మాంచి కునుకులో ఉన్నట్టున్నారు. రాత్రి బాగా పొద్దుపోయిందాకా మాట్టాడుకొన్నారు."
   
    "అవును సింహాచలం! రాత్రి నాకు బాగా నిద్రపట్టలేదు."
   
    "కొత్తచోటు గందా మరి! కాఫీ చేసుకొస్తా మీరు ముఖం కడుక్కొని సామాను సర్దుకోండి."
   
    "ఇంకా ఇరవయి నిముషాలే టైముంది. ఐదున్నరకైనా బయలుదేరాలిగా? కాఫీ వద్దుగాని ఈ బట్టలు మడిచిపెట్టు. ఈ లోపల బాత్ రూం లోకి వెళ్ళొస్తాను" అన్నాడు కృష్ణ బ్రష్ మీద పేస్టు వేసుకుంటూ.
   
    "కాఫీ ఎంతసేపు బాబూ! అంతా రెడీసేసిపెట్టా సిటికెలో పొడివేసి చేసి తెస్తా. మీరు కానీయండి."
   
    కృష్ణ బాత్ రూంనుంచి వచ్చేసరికి, బట్టలు సర్ది మీధపెట్టి, కాఫీ కప్పుతో సిద్దంగా ఉన్నాడు సింహాచలం.
   
    "జగన్ లేచాడా?" కాఫీ తాగుతూ అడిగాడతడు.
   
    "లేదు బాబూ! లేస్తే ఈపాటికి ఈడకొచ్చేవారేగా?"
   
    "అయితే చూడు. నువ్వు త్వరగా వెళ్ళి జగన్ ను లేపు. అర్జంతుగా మాట్లాడాల్సిన సంగతుంది."
   
    "రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నారుగా బాబూ! ఇంకా ఏం మాట్లాడతారు మీకు టైంకూడా అయిపోతుంటేనూ?" సింహాచలం కదలకుండా అక్కడే నిలబడ్డాడు.
   
    "ఫర్వాలేదు, వెళ్ళులేపు."
   
    సింహాచలం అయిష్టంగా అక్కడినుంచి కదిలి వెళ్ళాడు.
   
    కృష్ణ సూట్ కేసు సర్దుకోసాగాడు.
   
    "లేచారు బాబయ్యా!" మూడునాలుగు నిముషాలతర్వాత తిరిగొచ్చి చెప్పాడు సింహాచలం.
   
    "సింహాచలం పెట్టె తీసికెళ్ళి టాక్సీలో పెట్టు. నేను మీ అయ్యగారితో మాట్లాడి ఇప్పుడే వస్తాను."
   
    సూట్ కేసు సింహాచలానికి అందించి కృష్ణ జగన్ గదిలోకివెళ్ళాడు.
   
    "సారీ జగన్! నిన్ను నిద్ర లేపాల్సివచ్చింది" అంటూ కృష్ణ గదిలో ప్రవేశించాడు.

    "సింహాచలానికి చెప్పాను, నిన్ను లేపేముందరే నన్ను లేపమని వాడొక తిక్కవాడు. రాత్రి పొద్దుపోయేదాకా మేలుకున్నానట. అందుకని లేపలేదట! వీడొకడు నా ప్రాణానికి. కదిలితే మెదిలితే చాలు నేను ఏమైపోతానోనని వీడికి బెంగ" టవల్ తో ముఖం తుడుచుకుంటూ అన్నాడు జగన్మోహన్.
   
    "దట్సాల్ రైట్! నాకు టైంలేదు. నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి."
   
    "నేనే ఎయిర్ పోర్టుకు వచ్చి నిన్ను సెండ్ ఆఫ్ చేద్దామనుకున్నాను. కాని ఈ సింహాచలంగాడేమో నన్ను లేపలేదు."
   
    "ఫర్వాలేదు. ఇప్పుడు నీకు రెడీ అయ్యే సమయంలేదు నువ్వు...."
   
    "మళ్ళీ మద్రాసు ఎప్పుడొస్తావ్?" కృష్ణ మాటకు అడ్డొచ్చాడు జగన్.
   
    "నీ పెళ్ళికి."
   
    "నాకు పెళ్ళా?"
   
    "అవును, నువ్వు పెళ్ళిచేసుకోవాలి. ఇలా గతాన్ని తలుచుకొంటూ నిండు బ్రతుకును నాశనం చేసుకోవడం అర్ధం లేనిది. మా కజిన్ - మా పినతల్లికూతురు, పేరు వసుంధర, ఆమెను నువ్వు ఇష్టపడ్తావ్ చూస్తే ఐ ధింక్ షి ఈజ్ మోస్ట్ సూటబుల్ టు యూ. నీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పు, మరి! మాట్లాడమంటావా?"
   
    "కృష్ణా ఏమిట్రా నువ్వనేది?" వేదాంతిలా ముఖంపెట్టి, నిర్లిప్తంగా అన్నాడు జగన్.
   
    "మోనోకోసమైనా నువ్వు పెళ్ళిచేసికోవాలి!"
   
    జగన్ పెదవులపైన విషాదపూరితమైన చిరునవ్వు క్షణకాలం మెరిసిమాయమైంది.
   
    "కృష్ణా! అటు చూడు. నీమాటలు వింటున్నట్టుంది. ప్రియ ఎలా నవ్వుతుందో చూడు. మోనోలిసాకూడా ఇలాంటి పరిస్థితుల్లోనే అలా నవ్విందేమో! డావిన్సీ మోనాలిసాను చిత్రించినప్పుడు అతడి మనసులోకూడా...." అంటూ జగన్ గోడవైపు చూశాడు.

 Previous Page Next Page