Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 8

    కథ సస్పెన్సులోవుండగా సినీమారీల్ తెగినట్టు అన్పించింది కృష్ణకు.
   
    మామిడిచెట్టుకిందనుంచి ఇంట్లోకివచ్చి హాల్లో కూర్చున్నారు.
   
    "పోలీసోడి కూతురిని ప్రేమించినందుకు ఫలితం అనుభవించావన్న మాట?" అప్రయత్నంగానే అనేశాడు కృష్ణ.
   
    అంతలోకే "ఇదేమిటి ఇలా అన్నాను" అనుకున్నాడు.
   
    జగన్ కృష్ణ ముఖంలోకి చూశాడు.
   
    "యస్పీ....అదే ప్రియ తండ్రేగా ఇదంతా చేయించాడూ?" నమ్మకం చుట్టు అనుమానం తొడుగువేసి అడిగాడు మురళీకృష్ణ.
   
    "ఇంకా అనుమానం ఎందుకూ? ప్రియ తండ్రే చేయించాడు. క్రింది పోలీసాఫీసర్లకు ఏం చెప్పాడో ఏమో! వాళ్ళే రౌడీలను పెట్టి నా తల బద్దలుకొట్టించారు."
   
    "ఆ దెబ్బతో నువ్వు ప్రియను మర్చిపోయావ్. అంతేనా సంగతి?"
   
    "మర్చిపోవడమా? అసంభవం. ఎలాగయినా ప్రియను కలుసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాను. కాని నా ప్రయత్నాలు ఫలించలేదు. యస్పీ బంగళాలోకి ఆర్డర్లీలకు తెలియకుండా జొరబడటం తేలిక పనికాదు. ఓ ఆర్దర్లీకి లంచం ఇచ్చి తెలుసుకొన్నాను."
   
    "ఏమని?"
   
    "వైజాగ్ నుంచి తీసుకెళ్ళాక ప్రియ రెండునెలలుమాత్రమే తండ్రి దగ్గర వుందనీ, ఆ తర్వాత ప్రియను తండ్రి ఎక్కడకో పంపించేశాడనీ....."
   
    ఆగాడు జగన్.
   
    "తర్వాత ఏం జరిగింది?"
   
    "నిరాశా నిస్పృహలతో కృంగిపోయిన నేను ఆ సంవత్సరం పరీక్ష రాయలేదు."
   
    "ఇంతకూ మోనో ఎవరి బిడ్డా?" మురళీకృష్ణకు అంతా అయోమయంగా వుంది."
   
    "నా బిడ్డే!"
   
    "అది సరే! తల్లెవరని?"
   
    కొరడాదెబ్బ తగిలినట్టు త్రుళ్ళిపడి చూశాడు జగన్.
   
    "రామాయణం అంతా విని వెనకటికి ఓ వెర్రోడు రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట! అలాగే వుందిరా నీ ప్రశ్న. మోనో ప్రియ కన్నబిడ్డ అని చెప్పాగా మద్రాసు ఉడ్ లాండ్ హోటల్లో...." అంటూ ఆగికృష్ణ ముఖంలోకి చూశాడు జగన్.
   
    "గర్భవతిగా వుండగానే పెళ్ళి జరిగిందా?"
   
    "యు మస్ట్ బి క్రేజీ! గర్భవతిగా పెళ్ళయితే ముందు తెలియక ప్రసవించేనాటికైనా తెలియదా? పెళ్ళయిన తొమ్మిదినెలల లోపున భార్యకు బిడ్డపుడితే పెళ్ళికిముందే గర్భవతి అని భర్తకు తెలిసిపోదా ఏం? ప్రియ తండ్రి పోలీసాఫీసరని మర్చిపోకు. పోలీసువాడు ఇలాంటివాటి విషయాల్లో ఆరితేరిఉంటాడు."
   
    "మరైతే...."
   
    "కూతుర్ని దూరంగా, ఎక్కడికో మారుమూల ప్రదేశానికి పంపించాడు. ప్రసవించేక బిడ్డను ఎక్కడో పారేసి కొద్దినెలలకు ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికి అతనికి గుంటూరునుంచి హైదరాబాద్ కు డిప్యూటీ కమీషనర్ గా ట్రాన్స్ఫర్ ఐందిట. అదికూడా అతనికి కలిసొచ్చింది. అసలు కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకొని ఉంటాడు. మరుసటి సంవత్సరం ప్రియకు పెళ్ళిచేసి తండ్రి రిటైర్ అయ్యాడు."
   
    "మరి బిడ్డ....."
   
    "అనాధశరణాలయంలో పెరుగుతున్న మోనాను నేను తెచ్చుకొని పెంచుకుంటున్నాను."
   
    దీర్ఘంగా నిట్టూర్చాడు జగన్.
   
    మురళీకృష్ణకు బుర్రలో ఏదో తొలుస్తున్నట్టు ఇబ్బందిగా ముఖం పెట్టాడు.
   
    "మోనో ప్రియ బిడ్దేనని నీకెలా తెలిసిందీ! పోలీసాఫీసరు అంత తెలివితక్కువ వాజమ్మా ఏం? పెళ్ళికాకముందే కూతురు కన్నబిడ్డను నలుగురికీ తెలిసేలా అనాధశరణాలయంలో వదిలేస్తాడా?"
   
    "యూ ఆర్ ఆబ్స్ ల్యూట్లీ రైట్ కృష్ణా! ప్రియ గర్భవతి అయిన సంగతీ, బిడ్డ పుట్టిన సంగతీ చాలా రహస్యంగానే వుంచగలిగాడు."
   
    "అలాంటప్పుడు మరి ఆ బిడ్డగురించి నీకెలా తెలిసిందీ అని అడుగుతున్నా?"
   
    "వినుమరి!"
   
    "చెప్పు!"
   
    "ఆ ఏడాది నేను ఫైనల్ రాయలేదు. మా ఊరు వెళ్ళి అక్కడే వుండిపోయాను. ప్రియను మర్చిపోవాలని ప్రయత్నించాను. కానీ సాధ్యంకాలేదు."
   
    "బిడ్డసంగతి....." కృష్ణ అసహనంగా అన్నాడు.
   
    "అదే చెబుతున్నాను విను! ప్రియను తల్చుకుంటూ ఘోరమైన మానసికవ్యధకు గురైనాను. మళ్ళీ ఆమెను కలుసుకోవడం అసాధ్యమైంది. పర్యవసానం ఏమైనా తెగించి ఆమెను కలుసుకోవాలని అప్పుడప్పుడూ ఆలోచన వచ్చేది. కాని__దానివల్ల ప్రియకు ప్రమాదం కలగవచ్చని భావించి నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడే విరమించుకొనేవాడిని. అలా సంవత్సరం గడిచిపోయింది. ఫైనల్ రాద్దామని విశాఖపట్నం బయలుదేరాను" ఆగాడు జగన్.
   
    ఇబ్బందిగా సోఫాలో కదిలాడు కృష్ణ.
   
    "బస్ లో విజయవాడ చేరాను."
   
    "మళ్ళీ సాగదీస్తున్నావు" అనాలనిపించింది కృష్ణకు.
   
    "విజయవాడ రైల్వేస్టేషన్ ఫస్ట్ క్లాస్ వైటింగ్ రూమ్ లో ప్రియ కనిపించింది."
   
    "బాబయ్యా! ఈ గదిలో పక్క సర్దివేశాను. మంచినీళ్ళు పెట్టాను." అంటూ సింహాచలం వచ్చి కృష్ణకు ఎదురుగా నిలబడ్డాడు.
   
    "అవున్రా కృష్ణా! నువ్వు ఐదింటికే లేవాలిగా? ఇక వెళ్ళిపడుకో!"
   
    జగన్ సోఫాలోనుంచి లేచాడు.
   
    కృష్ణకూడా అప్రయత్నంగానే లేచాడు.
   
    "వెయిటింగ్ రూమ్ లో ప్రియ కన్పించింది అన్నావ్! ఊఁ తర్వాత ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు?"
   
    కృష్ణకు ఊపిరి సలపడంలేదు. ఉత్కంఠతో అడిగాడు.
   
    "మాట్లాడుకొనే అవకాశంకూడానా? ఒకళ్ళనొకళ్ళం దూరంనుంచే చూసుకొన్నాం. వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు. తండ్రి ఎక్కడ చూస్తాడోనన్న భయంతో తలవంచుకొని పక్కచూపులు చూసింది. నేనూ పోలీసాయన కంటబడకుండా చాటుమాటుగానే ప్రియను చూస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళే మద్రాస్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. తండ్రితోపాటు ప్రియ ఫ్లాట్ ఫారమ్ మీదకు రావడానికి లేచింది. తండ్రిని ముందుకు సాగిపోనిచ్చి...."
   
    "ఊఁ సాగిపోనిచ్చి....ఏమంది?"
   
    "ఓ క్షణం అక్కడే ఆగి ఆతృతగా చూసింది. ఆమె చూపులు నన్నే వెదుకుతున్నాయని స్పష్టంగా తెలిసిపోయింది. ఒక్క అంగలో ఆమెదగ్గిరకెళ్ళాను. నా చేతిలో ఓ చిన్న కాగితం__నాలుగు మడతలుపెట్టి ఉన్న కాగితం__పెట్టి పరుగులాంటి నడకతో ప్లాట్ ఫారమ్ మీదకు నడిచింది. తండ్రిని అందుకొంది. తండ్రివెనకే నడుస్తూంది. నాకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఆమె ఇచ్చిన కాగితం మడత జేబులో వేసుకున్నాను. వైటింగ్ రూమ్ లో నుంచి ప్లాట్ ఫారమ్ మీదకు వచ్చాను. కూతురిని ఫస్ట్ క్లాస్ కంపార్టు మెంట్ లో ఎక్కించి తనూ ఎక్కాడు. యస్సీ కిటికీపక్కన కూర్చున్నాడు. తండ్రిపక్కన ప్రియ కూర్చుంది. బండి కదిలేదాకా ప్లాట్ ఫారమ్ మీదే తారట్లాడాను. బండి కదిలింది. ధైర్యంచేసి కిటికీదగ్గిరకు పరిగెత్తాను."
   
    "బండి కాడిలాక ధైర్యం చేశావా?"
   
    "వేగాన్ని పుంజుకుంటున్న బండితోపాటు పరుగుతీశాను-"
   
    "ఇంతకూ ఆ చీటీలో ఏముందో ముందు చెప్పరాబాబూ చంపక!" కృష్ణ అసహనంగా అన్నాడు.
   
    "విషాదం మూర్తీభవించిన శిలాశిల్పంలా, శోకదేవతలా కదిలిపోతున్న రైల్లో కూర్చొన్న ఆనాటి ప్రియరూపం ఇప్పటికీ నా కళ్ళముందు కన్పిస్తూనే ఉంటుందిరా కృష్ణా!"
   
    "ఆ చీటీ__ఆ చీటీ__"కృష్ణ గొంతు కీచ్ మంది.
   
    నోరెండిపోతోంది.
   
    "బండి ప్లాట్ ఫారమ్ దాటివెళ్ళిపోయింది."
   
    "నీ జేబులో చీటీసంగతి చెప్పరా బాబూ?"
   
    "ట్యూబ్ లైట్ వెలుగుతున్న చోటాగి...."
   
    "జేబులోనుంచి చీటీ తీశావు" అసహనంగా అడిగాడు కృష్ణ.
   
    "తీశాను."
   
    "ఏముంది అందులో?"
   
    "మన పాప మదనపల్లి హాస్పిటల్లో ఆయా దగ్గిరుంది."
   
    "అని రాసివుందా?"
   
    "అవును. అంతకుమించి ఆ చీటీలో ఇంకేమీ లేదు. విశాఖపట్టణం ప్రయాణం మానుకొని విజయవాడనుంచే మదనపల్లి వెళ్ళాను."
   
    జగన్ ముఖం చెమట్లు పట్టింది.
   
    టవల్ తో ముఖం తుడుచుకున్నాడు.
   
    "మోనోను అనాధశరణాలయంనుంచి తెచ్చానన్నావుగా?" చిక్కుపడ్డ దారపు ఉండ కొసకోసం వెదుకుతున్నట్టుగా ఉంది కృష్ణకు.
   
    "అవును! ఆయా చెప్పింది. తనే అనాధశరణాలయంలో వదిలేసిందట. యస్పీనుంచి డబ్బు బాగానే ముట్టిందట" ఆగి కృష్ణ ముఖంలోకి ఓ క్షణం చూసి__
   
    "ఇదీ మోనో కథ. అప్పటినుంచీ మోనోకు తల్లీ తండ్రీ నేనే అయ్యాను. పాపను చూశావుగా? పూర్తిగా తల్లిపోలికే!"
   
    "బాబయ్యా! తమరింకా మందులుకూడా ఏసుకున్నట్టు లేదు" సింహాచలం గ్లాసుతో నీళ్ళుతెచ్చి జగన్ కు అందించాడు.
   
    "గుడ్ నైట్!" చెప్పాడు కృష్ణ.
   
    "బాబయ్యా ఇటు!" అంటూ సింహాచలం మురళీకృష్ణను హాలుకు కుడివైపున ఉన్న గదిలోకి తీసికెళ్ళాడు.

 Previous Page Next Page