కృష్ణ తలతిప్పి జగన్ చూస్తున్నవైపు చూశాడు.
ఇంద్రనీలవర్ణం పెయింట్ చేసివున్న గోడకు తగిలించివున్న ఫోటోలో మోనోలిసా! ముమ్మూర్తులా అదే రూపం! అదే నవ్వు!
"ఆమె - ఆమె ఎవరూ?"
"ఆమే నా ప్రియ. మోనోలిసా మేకప్ లో వున్న నా ప్రియ."
కృష్ణ చూపులు ఆ ఫోటోకు అతుక్కుపోయినట్టు అయినాయి.
అతని చూపులవాడికి ఆ ఫోటో చిరిగిపోతుందేమో అనిపిస్తుంది.
ఆమెను తను ఎక్కడో చూశాడు.
ఎక్కడో?
ఎప్పుడో?
ఆమె__ఆమె కాదు
కాదు__కాదు
ఇంపాజిబుల్.
కాని అచ్చం అలాగే వుంది!
అబ్ సర్డ్ !
ఆ విశాలమైన కాళ్ళూ, ఆ ముక్కూ, ఆ పెదవులవంపూ, ఆచెంపల నునుపూ_ఆమే!
సందేహంలేదు__ఆమే!
నో! నో! ఇట్ కాంట్ బి!బట్ షి లుక్స్ లైక్ హర్__
ఓ మైగాడ్!
కృష్ణకు తల తిరిగిపోతూవుంది.
అతడి కాళ్ళు భూమిలోకి దిగిపోతూన్నాయి.
కళ్ళముందు మంచుతెరలు కమ్ముకుపోతున్నాయ్.
ఆకాశంలో ఎగురుతున్న పక్షి, హఠాత్తుగా రెక్కలు తెగి భూమిమీదకు దూసుకొస్తున్న దృశ్యం కళ్ళముందు కన్పిస్తూ ఉంది.
"కృష్ణా ఇప్పటికయినా అర్ధమైందా ఆమే నవ్వులోని ఆకర్షణ ఎలాంటిదో? ఆమే చూపులు యమపాశాల్లా ఎలాగున్నాయో? ఆ చూపుల్లో చిక్కుకొని, ఆ పెదవులను తాకిన మానవమాతృడెవడూ బయటపడడు, ఆ చూపుల్లోని మత్తు, ఆ నవ్వులోని చేదు తీపిని రుచిచూసిన మగవాడెవడూ ప్రపంచములో మరో స్తీని కోరడు. మరొక ఆడదాన్ని కన్నెత్తి చూడడు...."
జగన్ కంఠస్వరం, ఏదో చీకటి గుహలోనుంచి వస్తున్నట్టుగా వినిపిస్తున్నది కృష్ణకు.
"ఆమె పేరు?"
"చెప్పానుగా ప్రియ అని."
"పూర్తి పేరు....."
"సుధాప్రియ."
"సుధా ప్రియా?"
హీరోషిమాలో యాటంబాంబు ప్రేలినరోజు ఆ నగరవాసులు చేసిన హాహాకారాలూ, రోదనలూ ఎలాఉండి ఉంటాయే ఇప్పుడు కృష్ణ ఊహించగలుగుతున్నాడు.
"తండ్రి__"
"పోలీసాఫీసర్,"
"పేరు?"
"రమణమూర్తి."
జనపధాలను ముంచుతున్న ఉప్పెననాటి కాళరాత్రి__తల్లులూ పిల్లలూ చేస్తున్న ఆక్రందనలు కృష్ణ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
బయట టాక్సీవాడు హారన్ ఆపకుండా కొడ్తున్నాడు.
"బాబయ్యా! ఇంకా నిలబడే వుండిపోయినారు. టైమ్ అయిపోనాదంటూ టాక్సీవాడు గోలపెడ్తున్నాడు" సింహాచలం లోపలకు వచ్చి ఆదుర్ధాగా చెప్పాడు.
సుధాప్రియ___మోనోలిసా ఫోటోమీదినుంచి చూపుల్ని బలవంతంగ మరల్చుకొని, గదిలోనుంచి బయటికి వచ్చాడు కృష్ణ.
తాళ్ళుతెగి ఫోటో కింద పడి బద్దలైనట్టు ఏవో భ్రమలు గదిలోనుంచి బయటకు వస్తున్న కృష్ణ మనసును చుట్టివేశాయి.
కృష్ణా! మళ్ళీ మద్రాస్ ఎప్పుడొచ్చావ్?" టాక్సీలో కూర్చున్న స్నేహితుడిని అడిగాడు జగన్.
"త్వరలోనే...." కృష్ణ మాట పూర్తికాకుండానే టాక్సీ కదిలింది.
మునిపళ్ళతో నొక్కిపట్టిన కింద పెదవి కసుక్కున నొక్కుకుపోయింది. గంటుపడింది కాని బాధమాత్రం తెలియడంలేదు కృష్ణకు.
మీనంబాకం ఎయిర్పోర్టుకేసి టాక్సీ పరుగుతీస్తోంది.
7
కేరవిల్ జట్ విమానం, తెల్లటి మబ్బులను చీల్చుకొని వినీల విశ్వాంత రాళంలో పయనిస్తోంది.
విండోదగ్గరి సీట్లో మురళీకృష్ణ మంత్రముగ్దుడిలా కూర్చొని బయటకి చూస్తున్నాడు.
తూర్పుదిక్కున ఆకాశం క్రమంగా అరుణరాగ రంజితమవుతున్నది.
అదో ప్రపంచంలోనుంచి, అనిర్వచనీయమైన అద్వితీయమైన వాతావరణంలోకి ప్రవేశిస్తున్నట్టుగా వుంది. చీకటి గుహలోనుంచి అప్పుడే బయటపడిన మనిషిలో కలిగే అనుభూతిలాంటిదే కృష్ణకు కలుగుతూంది. పీడకలల్లోనుంచి అప్పుడే మేలుకొని చైతన్య స్పూర్తిని పొందుతూన్న మానసిక స్థితిలో వున్నాడు.
గడిచిన పన్నెండుగంటల కాలం__ఆ కాలగమనంలో పొందిన అనుభవమూ మనిషి జీవితాంతము కృంగదీసేదిగా వుంది.
క్రితంరోజు సరిగ్గా ఆరుగంటలకు జగన్ తనకు తటస్థపడ్డాడు.
ఇలా జరగకపోతే ఎంత బాగుండేది? ముందు మోనోకు జరిగిన అన్యాయానికి బాధపడ్డాడు. ఆ తర్వాత జగన్ గురించి బాధపడ్డాడు.
ఇప్పుడు ఎవరినిగురించి బాధపడాలి?
ఎవరికో మోసం జరిగిందనే భ్రమలో ఉన్నాడు, ఇంతవరకూ తను.
ఆ భ్రమ భ్రమగానే ఉంటే ఎంతబాగుండేది?
తను మద్రాస్ రాకుండావుంటే బాగుండేది!
అతడు కలవకుండా వుంటే__కలవకపోతే అసలు ఈ కథే లేదు.
అసలతను ఆఖరుక్షణంలో ఆ గదిలోకి వెళ్ళకుండా వుంటే ఈ కథకు ఈ మలుపులేదు.
మోసపోయిందెవరో కాదు.
తనే! తనే!
ఆ సుధాప్రియ తన ప్రియసుధే?
మోనోలిసా రూపంలో ఉంది సుధే. సందేహంలేదు.
తండ్రి పోలీసాఫీసరు.
పేరు రమణమూర్తి.
ఇంకా ఏం కావాలి?
"సుధాప్రియే, ప్రియసుధ! ప్రియసుధే సుధాప్రియ. సుధాప్రియే మోనోలిసా. మొనోలిసా. మోనోలిసాయే ప్రియసుధ. తన సుధ! తన అర్ధాంగి సుధ! తనను ఒక్కక్షణం విడిచి ఉండలేని సుధ.
తను తింటేకాని తినని సుధ.
తను లేకపోతే ప్రపంచమే శూన్యంగా భావించే సుధ.
తననే ఆరాధ్యదైవంగా పూజించే సుధే ఈ సుధాప్రియా?
మోనోను కన్నతల్లా?
హే భగవాన్!"
ఎంత మోసం చేశావ్?
నేను నీకేం అపకారం చేశాను?
కృష్ణకు గుండెలు విచ్చిపోతున్నట్టుగా వుంది.
అణువణువూ శరీరంనుంచి విడిపోయి గాలిలోకి తేలిపోతున్నట్టుగా వుంది.
విమానం ఇలా ఉన్నపాటుగా పేలి, శరీరం తునాతునకలై, తల చెక్కలు ముక్కలైపోతే ఎంత బాగుంటుంది?
"ఎక్స్ క్యూజ్ మీ!"
మృధుమధురమైన స్వరం విన్పించి పక్కకు తిరిగి చూశాడు కృష్ణ.
ఎయిర్ హోస్టెస్ ముందు సీటుకున్న ప్లాంకును లాగి, దానిమీద బ్రేక్ ఫాస్ట్ ట్రే వుంచింది.
"సర్ కాఫీ, టీ?" అడిగింది.
చక్కని పలువరస. ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.
"కాఫీ ప్లీజ్" జవాబు చెప్పాడు కృష్ణ.
ఆమె తల కొద్దిగా వంచి కళ్ళు తిప్పింది.
వెనక్కు తిరిగింది.
"జస్టు ఏ మినిట్ ప్లీజ్!"
వయ్యారంగా తిరిగింది. పెదవులమీద విరిసిన చిరునవ్వు అలాగే ఉంది.
"యస్ ప్లీజ్!"
"ఇఫ్ యూ డోంట్ మైండ్__మే ఐ నో యువర్ నేమ్?"