మూడవ వారం సీరియల్
వివేక్ ముందుకి వచ్చి ఆవిడ్ని పట్టుకున్నాడు. పరిస్ధితి కాస్త ప్రమాదకరంగానే వుండటంతో అప్పటికి ప్రయాణంవాయిదావేసి, ఆవిడకి వైద్యంచేశాడు. ఓ గంటకి అమ్మమ్మ కళ్ళు విప్పింది. నేను అమ్మమ్మ కాళ్ళూ, చేతులూ రాస్తూ ఆవిడ పక్కనే ఏడుస్తూ కూర్చుని వున్నాను. అమ్మమ్మ కళ్ళువిప్పి మాట్లాడాకా ధైర్యం వచ్చింది.
వివేక్ లోపలికి వచ్చి "అనూహ్యా....నువ్వు మాతో వస్తావా? మమ్మల్ని వెళ్ళిపోమన్నావా?" అని అడిగాడు.
అతనితల్లి నా చుట్టూ చేతిని వేసి, "అదేంమాటరా? ఇంక నిన్ను విడవమన్నా విడువదు" అని లేవదీసింది.
నేను అమ్మమ్మవైపు చూశాను.
ఆవిడ బలహీనంగా మంచంలో పడుకునివుంది. ఆ సమయంలో ఆవిడ్ని అలా వదిలి నేను వెళ్ళడం అమానుషం అనిపించింది. "నేను ఇప్పుడు రాను" అని అనేలోగానే బాబాయ్ హడావుడిగా "నీ పెట్టెకార్లో పెట్టేశాను, ముహుర్తం దాటిపోతోంది....త్వరగా నడవమ్మా" అని తొందరపెట్టేశాడు.
నేను వెక్కుతూనే కారు ఎక్కాను. కార్లో వివేక్. నేనూ తప్ప ఎవరూ లేరు. వాళ్ళమ్మా, అన్నయ్యా, వదినా వేరే కార్లో బయలుదేరారు. కార్లో అతను నన్ను ఓదారుస్తాడనుకున్నాను. కానీ అతను సిగరెట్ తాగుతూ డ్రైవ్ చెయ్యసాగాడు.
విండో ఓపెన్ చేసి వుండడంతో నాకు చలేస్తోంది.
ఒంటి మీద పలుచని చీర కొంగుతప్ప ఏమిలేదు. కొంగునిండా కప్పుకున్నాను.
అతను సిగరెట్ అవతల పారేశాకా నావైపు తిరిగాడు. ఓ చెయ్యి నా నడుముచుట్టూ వేసి తన దగ్గరికి ఒక్క ఉదుటున లాక్కున్నాడు. నా చెవిలో గుసగుసగా "ఏయ్....ఇక్కడ చీకట్లో కారు ఆపేస్తాను. ఓపెన్ ఎయిర్లో... గోదావరి ఒడ్డున శోభనం! వెరైటీగా వుంటుంది. సరేనా?" అన్నాడు.
చాక్లేట్ తింటావా? అన్నంత క్యాజువల్ గా అడుగుతుంటే అతను జోక్ చేస్తున్నాడనుకున్నను. కానీ అతను నిజంగానే కారు ఆపేశాడు.
నా అంగీకారంకోసం అతను ఆగలేదు. అదీ అతని తత్వం! ప్రతిదాంట్లో వెరైటి కావాలి!
నా చెయ్యిపట్టి కార్లోంచి లాగి ఒక్కసారిగా పైకి ఎత్తేశాడు. అలాగే తీసుకెళ్ళి క్రింద పడుకోబెట్టేశాడు.
మొదటిసారిగా....అనాచ్చాదితమైన నా వీపుని ముద్దాడిన గరకు నేల, ఎన్నో ముద్రలు వేసింది తన జ్ఞాపకంగా!
"ఆఁ!" అని అరవబోయాను. అప్పటికే అతని పెదవులు నా పెదవులని కప్పేశాయి.
నాకు క్షీరసాగరమథనం గుర్తొచ్చింది. కళ్లు గట్టిగా మూసుకున్నాను. అతను అమృతం లభించినంత తృప్తిగా తలెత్తి నా కళ్ళలోకి చూస్తూ, "ఎలా వుంది?" అని అడిగాడు.
నేను మాట్లాడలేదు. నా వీపుమండుతోంది.
"ఏం అనిపిస్తోందో చెప్పు" అన్నాడు.
"అమ్మమ్మకి ఎలా వుందో పాపం!" అన్నాను.
అతను నా ముఖాన్ని తన రెండుచేతులతో పట్టుకుని ఆశ్చర్యంగా "నీకు మీ అమ్మమ్మ గుర్తొస్తోందా ఇప్పుడూ?" అన్నాడు.
నేను తల ఊపాను. అమ్మమ్మ చెప్పినమాటలు నా చెవుల్లో మార్మోగాయి "నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం!" అన్నాను.
అతను పక్కకిజరిగి, "నాకుమాత్రం ఇక్కడకూడా నిన్ను వదిలిపెట్టని మీ అమ్మమ్మ అంటే చచ్చే అసహ్యంగా వుంది" అన్నాడు కొపంగా.
నేను అతనిమీదపడి కాలర్ దగ్గర పట్టుకుని, "చంపేస్తాను! అమ్మమ్మని ఏవైనా అంటే!" అన్నాను.
అతను నావైపు ఆశ్చర్యంగా చూశాడు.
అప్పటికి మేము జంటగా మారి ఇంకా ఇరవై నాలుగు గంటలుకూడా కాలేదు.
* * *
అలా వీపుమంటతో మొదలైన నా శృంగారజీవితం ప్రతిసారీ అతనిమాటలకి ఒళ్ళుమంటతో ముగుస్తూనే వుంది!" నీ కేంరాదు ప్రయత్నించవుకూడా! అమ్మమ్మ పెంపకం కదా! అసలు నీకు పెళ్ళెందుకు చేసినట్లు'?" లాంటి మాటలు భరించలేకపోయాను. అలా అని అతను కోరినట్లుగా చెయ్యలేకపోయేదాన్ని!
అతనికి అసలు సిగ్గులేదు!
మా అత్తగారు ఓ పదిరోజులు మా ఇంట్లో వున్నారు. ఆవిడ పెద్దకోడలు దగ్గరికి అమెరికా వెళ్లి పోయేటప్పుడు నాకు జాగ్రత్తలు చెప్తూ. "చిన్నవాడని చాలా గారాబం చేశాను. మంకుపట్టు ఎక్కువ! నువ్వు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించమ్మా ప్రేమతో ఆకట్టుకో" అని చెప్పింది.
అతని ప్రేమ బడివానలా ఎడ తెరిపి లేకుండా కురిపించేస్తాడు. అంతలోనే ఉరుముల్లా ఫెళఫెళలాడే మాటలు విసుర్తాడు.
ఆస్పత్రినుండి "అనూ... అయిదునిమిషాల్లో రెడీగా వుండు...." అని ఫోన్ చేస్తాడు.
అయిదు దాటి ఆరోనిమిషం గడిస్తే చాలు అతని మూడ్ ఆఫ్ అయిపోతుంది!
నేను పెళ్ళికిముందు కొత్త కాపురం గురించి కన్న కలల్లో.... అతను వచ్చే వేళకి నేను పూలుకడ్తూ హంసధ్వనిలో ఆలపిస్తూవుంటే. అతను సదిలేకుండా వెనకనుండి వచ్చి నా తలలో పూవులు ఆఘ్రాణించి నా మెడమీద సున్నితంగా చుంబిస్తాడు! నేను గిరుక్కున వెనుతిరాగగానే, నన్ను గిరుక్కున వెనుతిరగగానే, నన్ను అలాగే ఎత్తుకుని డాబామీదకి తీసుకువెళ్తాడు.
ప్రశాంతంగా వున్న వెన్నెల పక్కమీద ఆరుబయట ఆదమరచి ఒకరిలో ఒకరు లీనమై తదాత్మ్యతను అనుభవిస్తాము....ఇలా సాగేవి! కానీ వాస్తవంలో అందుకు విరుద్దంగా అతను ఇంట్లోకి వస్తూనే చిటికెలు వేస్తూ "ఊఁ....క్విక్...రెడీయా?" అంటాడు.
నేను "కాఫీ" అనగానే.
చిరాగ్గా-" అబ్బా! ప్లాస్కులో రెడీగా వుంచకూడదూ" అంటాడు.
అన్నీ అలా హడావిడిగా "టైమ్ వేస్టు" అంటూ పరుగులమీద చేసేసుకుంటూ, మిగుల్చుకున్న టైమ్ ఏంచేసుకోవాలో నాకు అర్ధమయ్యేది కాదు!
అతను నన్ను ఒంటరిగా వదిలివెళ్ళిపోగానే, నేను అనంతమైన ఏకాంతంలో బావురుమని మిగిలిపోయేదాన్ని! అతని జ్ఞాపకాలు నెమరేసుకుందామంటే. స్పీడుగా వెళ్తున్న రైల్లోంచి కనపడి అంతలోనే మాయమయ్యే టెలిఫోన్ స్తంభాల్లా....ఒక్కటీ వెనక్కిరావు! నేను పెరిగిన వాతావరణానికీ, అతను పెరిగిన వాతావరణానికీ హస్తిమశకాంతరం తేడా వుండటమే అందుకు కారణమేమో!
అతనంటే నాకు ఇష్టమే. అతని మొండితనం నేను భరించలేకపోయేదాన్ని.
వివేక్ డ్రింక్ చెయ్యడం మొదటిసారిగా చూసినప్పుడు నేనంత గొడవచేశానో తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాదే మిగుల్తుంది.
అనూ...నువ్వూ తీసుకో, చాలా ఉషారుగా వుంటుంది" అన్నాడు.
"ఏమిటి! మీరు....మీరు తాగుతారా?" నేను
అరిచినట్లుగా అన్నాను.
"ఎందుకా కేకలు? ఇందులో అంత విచిత్రం ఏముందీ?" అతను మామూలుగా అన్నాడు.
"వీల్లేదు ఇంట్లో ఈ భాగోతాలు నాకు ఇష్టంలేదు" అవి అవన్నీ తీసెయ్యబోయాను.
వివేక్ నా చెయ్యి గట్టిగా పట్టుకుని, "పూల్ లా ప్రవర్తించకు కావాలంటే నువ్వూ ఓ పెగ్ తీసుకో చాలా బావుంటుంది" అన్నాడు.
నేను ఏడుస్తూ అతన్ని అనరాని మాటలన్నాను. "నా రాత బాలేక తాగుబోతుని చేసుకున్నాను. ఇంకా ఏవేంవ్యసనాలున్నాయో" అని తల బాదుకున్నాను.
"షటప్.... కోపం తెప్పించకు!" అరిచాడు వివేక్.
ఆ రాత్రంతా నేను నిద్రపోకుండా ఏడుస్తూనే గడిపాను. తెల్లవారుఝామున అతను చెయ్యేస్తే విసిరికొట్టాను. అతని నుండి అలవాటు లేని ఘాటైన వాసనేదో గుప్పున కొట్టింది.