Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 7

    అంటే  తన కొడుకు పుట్టినరోజు సంబరం చూడటం తనకు ఇష్టంలేదని కాదు. తండ్రిని మించిన తనయుడవుతాడు తన కొడుకు. కాని తను ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. తన బిడ్డ తనకంటే చాలా అదృష్టవంతుడు. తనకు చిన్నతనంలో పుట్టినరోజంటూ ఒకటి వుంటుందనీ, ఆనాడు తల్లిదండ్రులు తన కోరికలు తీరుస్తారానీ తెలియదు. కటిక దారిద్ర్యంతో బాధపడే తల్లిదండ్రులకు, ఎపుడు ఏ పిల్ల పుట్టినరోజో జ్ఞాపకం వుంచుకొనే తీరికా, ఓపికా వుండేవి కావేమో! అంతవున్నా చెయ్యగలిగిందీ, సంతోషించ తగిందీ ఏదీ వుండేది కాదు.

    విశ్వనాథంగారు కాలిబాటన నడుస్తూవుంటే, ఎంతోమంది తొలగి నిల్చొని నమస్కారాలు చేసి పోతున్నారు. అందరికీ, ఒకే రకం చిరునవ్వుతో తల పంకించి, చేయి పైకెత్తి నమస్కారంలాంటి అభినయం చేస్తున్నాడు. అలా చేసినప్పుడల్లా ఆ చేతిలోని కర్ర పైకీ కిందకూ ఆడుతుంది.

    జడ్జీ అయాక ఎంతోమంది మిత్రులను తను పోగొట్టుకొన్నాడు. అంతకుముందు సాయంకాలాలలో తనతోపాటు షికారుకొచ్చే లాయరు రామయ్యగారిని తప్పించుకోవటానికి కొన్నిరోజులపాటు వాకింగే మానేయాల్సి వచ్చింది.

    ఎప్పుడూ కదలకుండా కూర్చొని మెదడుతో పనిచేసే వాళ్ళకు గుండెజబ్బులు వస్తాయని ఆయనకు గట్టి నమ్మకం. అందరిలా వట్టి మెదడే కాకుండా తను గుండెతో కూడా పనిచేస్తాడు. ప్రతిసారీ జడ్జిమెంటు చదివేప్పుడు తన హృదయం కుతకుతలాడిపోతుంది. తను న్యాయం ఇవ్వగలిగానన్న తర్వాతగాని హృదయం తేలికపడదు. తను జడ్జిమెంటుకు కూర్చున్నప్పుడు వాదులూ, ప్రతి వాదులూ, గుండెలు చిక్కపట్టుకొని తన మొహంలోకి చూస్తూ కూర్చుంటారు. ఆ చూపుల్ని తను భరించలేడు. ఆ చూపుల్ని తప్పించుకోవటానికి లాయర్ల మొహంలోకి చూస్తాడు. వాళ్ళ మొహాలు చూస్తుంటే మళ్ళీ తనకు ధైర్యం వస్తుంది. వాళ్ళ ఆలోచనలన్నీ కేసుల్లో క్లయింట్సునుంచి తాము వసూలు చేసిన డబ్బు, ఇంకా రావాల్సిన డబ్బును గురించే తిరుగాడుతుంటాయి. కేసు గెలిస్తే లాయరు తన ప్రతాపాన్నీ, తెలివితెటల్నీ చాటుకుంటాడు. ఓడితే "ఆనరబుల్ జడ్జి పొరపాటు చేశారు" అంటాడు.

    తన కెందుకో  గుండెజబ్బు వస్తుందని అనుమానం! అలాంటి అనుమానానికి ఆర్గుమెంటుగానీ, లాపాయింట్ గానీ ఏమీ లేదు, పెద్దవాళ్ళకు గుండెజబ్బులొస్తాయి కాబట్టి! మిగతా జబ్బులొస్తే మందులతో వాటిని నయం చేయించుకోగలరు. గుండెజబ్బు మాత్రం మందులకు లొంగేది కాదుగా! అయినా ఈ ఆర్గుమెంటు ఏమీ బాగాలేదు. అయితే అది కూడా ఒక యాస్పెక్టులో కరెక్టే!

    విశ్వనాథంగారు తన ఆలోచనలకు కళ్ళెం వేసేయటానికి ప్రయత్నించారు. అసలు బుర్రవున్న వాళ్ళకుండే జబ్బే అది. ఎటుపడితే అటు ఆలోచనలు కాన్సర్ లా పాకిపోతాయి.

    ఇద్దరూ మనుషుల్నీ, ముగ్గురు పిల్లలనూ వేసుకొని రిక్షా తొక్కుతున్నవాడికి ఇలాంటి ఆలోచనల బాధ లేదు. నిజంగా వాడికి మానసిక ప్రశాంతత వుంటుంది. శారీరక శ్రమ తప్పించి వాడికి మరే బాధా లేదు. రిక్షా లాగడం అయాక శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. కాని ఆలోచించేవాడి బుర్రకు నిద్రలో కూడా పూర్తి విశ్రాంతి దొరకదు.

    ఆ రిక్షావాడు...అందులో ఏదో చట్టవ్యతిరేకంగా ఉన్నట్లనిపించింది. రిక్షాలో ఇద్దరూ పెద్దవాళ్ళూ, ముగ్గురు పిల్లలూ...ముగ్గురు పిల్లలూ కలిసి ఎంతమంది పెద్ద వాళ్ళవుతారు! బరువులోనా? ఆలోచనల్లోనా? వ్యక్తిత్వంలోనా? ముగ్గురి వయస్సూ కలిపితే ఒక పెద్దవాడవడా? అసలు మనుషుల్ని కూడిక వేయవచ్చునా? కానిస్టిట్యూషన్ లా ఏమంటుంది? ఇది చాలా పెద్ద లిటిగేషన్! రిక్షావాడు కిందకు దిగి తోయటం మొదలుపెట్టాడు. రిక్షా తొక్కటానికి లైసెన్సుగాని తొయ్యటానికి లైసెన్సు వుందా? తనలో తనే నవ్వుకున్నారు జడ్జిగారు. పార్కు గేటుముందు ఒదిగి నిలబడి ఇద్దరు చేతులు జోడించారు. తల ఆడించినట్లే ఆడించి విశ్వనాథం గారు పార్కులోకి ప్రవేశించారు.

    ఆరున్నర దాటినా వాతావరణంలో వేడి తగ్గలేదు. అప్పటికే పిల్లలూ పెద్దలూ చాలామంది గార్డెన్ లో వున్నారు. విశ్వనాథంగారు వెళ్ళి చెట్టుకిందగావున్న ఖాళీ బెంచీమీద కూర్చున్నారు. దూరంగా పబ్లిక్ రేడియోనుంచి గ్రామస్థుల కార్యక్రమం విన్పిస్తున్నది. బెంచీకి దగ్గిరగా నడివయస్సు దాటినా ఓక ఆడమనిషీ, ఆమె ప్రక్కగా నెత్తిన పళ్ళబుట్టతో ఓ కుర్రాడూ వచ్చి నిలిచారు. పళ్ళబుట్ట బరువును భరించలేని ఆ పసివాని మెడ అటూ ఇటూ కదులుతోంది. ఆడమనిషి పిల్లవాడి నెత్తినుంచి పళ్ళబుట్ట దించింది. అంతకుముందే నేలమీదవున్న పెద్ద పళ్ళతట్ట పక్కగా ఆ బుట్టను పెట్టింది. కుర్రాడికి పళ్ళమ్మి ఏదో పని పురమాయించింది. వాడు పరుగెత్తుకెళ్ళాడు, పళ్ళమ్మి రెండు గోతాలను పరిచి సైజులువారీగా మామిడిపళ్ళను పేరుస్తూ వుంది.

 Previous Page Next Page