"ఏమిటలా చూస్తారు! చాలాగొప్ప సస్పెన్సు నవల అవుతుంది. అది కల్పనకాదు. నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని తీసుకొని రాయాలనుకొంటున్నాను. పాఠకులు పిచ్చిగా చదువుతారని నా నమ్మకం."
సుందర్రావు ముఖం విప్పారింది!
"నిజంగా అది మీ జీవితంలో జరిగిందా ?"
"అవును !"
"మరి మీరు దయ్యాలను నమ్ముతారా ?"
"నమ్మడమేమిటండీ వాటిని చూశాను-మాట్లాడాను-చాలా భయంకరమైన ఎక్స్ పీరియన్స్! ఇప్పటికీ తల్చుకుంటే నాకు జుట్టుపీక్కోవాలనిపిస్తుంది." అన్నాడు తను.
అతను తన ముఖంలోకి సందేహంగా చూచాడు.
"ఏమిటలా చూస్తారు ? నమ్మకం కుదరడంలేదా ?"
"మీరు హేతువాదు లనుకుంటాను. రాడికాల్స్ ఇలాంటివి నమ్ముతారా ?"
"అదివేరు. నాకు నమ్మకం ఉంది. కాని కొన్ని భయపెట్టే నమ్మకాలను సాహిత్యంలో చొప్పించి ప్రజల్ని భయపెట్టకూడదని నాభావం అంతే."
"అయితే మీరు ఇంతకాలం రాసిందీ-చెప్పిందీ..."
"సుందర్రావుగారూ ! రైటర్స్ రాసేవన్నీ నిజాయితితోనూ, తను నమ్మినవే రాస్తారను కోవడం మీ అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. అసలు సంగతి చెప్పండి ! రాయమంటారా ?"
"తప్పక రాయండి. ముఖ్యంగా మీవంటి రచయిత, పాతికేళ్ల తర్వాత దయ్యాల కథ రాశారంటే మామూలు పాఠకులే కాకుండా, ఇలాంటి వాటిని తిరస్కారంగా చూసే మేధావులు కూడా చదువుతారు."
తనులేచి నిలబడ్డాడు. కనీసం ఓ రెండువందలు అడ్వాన్సు అడగాలనుకొన్నాడు, కాని నోరు ఎత్తి అడగలేక పోయాడు.
"ప్రసాద్ గారు ఓ రెండు నిముషాలుండండి!" అంటూ ఎడిటర్ లేచి పబ్లిషర్ గదిలోకి వెళ్ళాడు.
దాదాపు అర్ధగంటకు తిరిగొచ్చాడు.
"ఈ అయిదువందలు ఉంచండి. మీరన్నట్టు పాఠకుల్ని పిచ్చివాళ్లను చేస్తే మొత్తం ఐదువేలు ఇవ్వడానికి మా పబ్లిషర్ గారు అంగీకరించారు. లేదా మరో అయిదువందలు మాత్రమే ఇస్తాం. మీరు మీ అనుభవాన్ని మాంచి సస్పెన్సుతో రాయండి."
అయిదువందలు అందుకొన్నాడుతను.
గిర్రున వెనక్కు తిరిగి ఇంటికేసి నడక సాగించాడు.
చాలా ఉసిగా కసిగా నడుస్తున్నాడు.
కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
ఎన్నేళ్లయిందో ఐదువందలు జేబులోపెట్టుకొని.
కృష్ణవేణికి సంతోషంతో గుండె ఆగిపోతే?
అసలే బలహీనంగా ఉంది.
అనేక ఆలోచనలు. బుర్ర చెదలపుట్టలా ఉంది.
చిత్రమైన అనుభూతి. అది సంతోషమా ? కాదు ! బాధా ? కాదు, కసా? ఏమో? ఎవరిమీద కసి?
తమాషా అనుభూతి.
మహా రచయితకూడా మాటల్లో వ్యక్తం చెయ్యలేని అనుభూతి ఉగాది పచ్చడిలాంటి అనుభూతి. ఉగాది పచ్చడి రుచి ఎలా ఉందంటే ఖచ్చితంగా చెప్పగలమా?
ఇంట్లో ఆరోజంతా పండగే.
తన కూతురు కమల తనతో ఏదో అంటోంది.
తన కొడుకు సూర్యం తన భవిష్యత్తు ప్లాన్సు గురించి చెబుతున్నాడు.
కృష్ణవేణి ముఖంలో సంతృప్తి !
తనే వేగిపోతున్నాడు. బుర్ర వేడెక్కి పోయింది.
కథ మొదలు పెట్టాడు.
ఆరోజే జ్వరం వచ్చింది.
రెండు రోజులనుంచి రాస్తున్నాడు.
ఎంతో రాయలేక పోయాడు. ఆ కథ ఆలోచిస్తుంటేనే జ్వరం వస్తోంది.
త్వరగా ముగించాలి.
శివప్రసాద్ చివ్వునలేచి మంచంమీద కూర్చున్నాడు. చిన్నగా మంచం దిగాడు. అందరూ మంచినిద్రలో ఉన్నారు.
టేబుల్ లైట్ ఆన్ చేసి అంతవరకూ రాసినకథ చదవసాగాడు. చివరి వాక్యం చదివాడు.
"అదే బాబూ ! కటికచావు చచ్చిందికదా? దయ్యం అయి....."
3
అప్పటికి నాకు భూతరాజు ధోరణి అర్థం అయింది. అంతకుముందున్న భయం పూర్తిగాపోయింది ! వీడు, ఈ భూతరాజుగాడు నన్ను ఎలాగయినా భయపెట్టి వెనక్కు పంపించాలని చూస్తున్నాడని తెలుసుకొన్నాను.
ఇద్దరం నడుస్తున్నాం. 12-30 దాటింది. మసక వెన్నెల ఆకుల సందులనుంచి జారుతోంది.
నేను ఒకచెట్టు దగ్గరకువచ్చి అకస్మాత్తుగా ఆగిపోయాను.
భూతరాజు పది గజాలు ముందువెళ్ళి వెనక్కు చూచాడు. నేను నిలబడి పోవడంచూసి వెనక్కు వచ్చాడు.
"ఏం బాబూ నిలబడ్డారు ?"
నేను దూరంగా ఏదో వింటున్నట్టుగా నటించాను. మాట్లాడలేదు.
"బాబూ ! నిలబడిపోయారేంటి ?"
"భూతరాజూ విన్నావా?" అన్నాను అతడికేసి ఓరగాచూస్తూ.
"ఏమిటి బాబూ ?"
"అదే ? ఆ దయ్యం ఏడవడం ?"
భూతరాజు ముఖంలోకి చూశాను. అతడి ముఖంలో ఎలాంటి భయం కన్పించలేదు.
"నాకేమీ విన్పించడంలేదు. మీకు విన్పిస్తుంది కాబోలు. అదేబాబు దయ్యాలు చేసేమాయ. ఇంకా నేను, అది దుమ్మలగూడెం మర్రిచెట్టు మీదికెళ్ళి పోయిందనుకొన్నాను. దాని సిగతరగ! ఇంకా ఇక్కడే ఉందన్న మాట ! దాని ఏడుపు ఒకక్షణం ఇక్కడ విన్పిస్తుంది. మరోక్షణం కొన్ని మైళ్ల దూరంలో విన్పిస్తుంది. ఒకేచోటఉన్న ఇద్దర్లో ఒకళ్ళకి వినిపిస్తుంది. మరొకళ్ళకి వినిపించదు. నువ్వు భైరవమూర్తి దగ్గరకెళ్తున్నట్టు అది ఇప్పుడే పసికట్టిందనుకొంటా."