ఆమె ఇండియా చేరగానే కొత్తరకం దుస్తులు కుట్టించుకోవాలనిపించింది.
ఎలా? బాబాయి డబ్బు ఇవ్వడు. తన తల్లి దుస్తుల్లో తను ఇమిడిపోక పిచ్చుక పిల్లలా, చుట్టూ వుండే ఆడవాళ్ళ మధ్యన ఎబ్బెట్టుగా కన్పించినా బాబాయి లక్ష్య పెట్టడు. కోపం వస్తే చస్తే ఖర్చు పెట్టడు.
భారతదేశంమీద అంతకు ముందున్న ఉదాసీనభావం పోయింది. ఎప్పుడు ఆ దేశం చూద్దామా అనే ఉత్సుకత ఆమెలో రేకెత్తింది.
ఆమె తన బాబాయితో బయలుదేరినప్పుడు కేవలం హారే ప్రసాదించబోయే తిట్ల గురించీ, దెబ్బల గురించి మాత్రమే ఆలోచించింది.
సీత ఎన్నోసార్లు తను కూడా అమ్మానాన్నలతోపాటు మునిగిపోయి వుంటే బాగుండేదని ఆలోచించింది.
ఆనాడు...వాళ్ళు సముద్రతీరంలో మునిగిపోయిన రోజు...తను వాళ్ళతో వెళ్లకపోవడం కర్మ ప్రభావం వల్లనేమో!
వారంరోజులు తను డెవాన్ షైర్ తల్లిదండ్రులతోపాటే నావలో చేపలుపట్టడానికి వెళ్ళింది. తన తండ్రికి అది ఒక హాబీ.
ఆరోజు ఆకాశం మేఘావృతమై వుంది. "వర్షం వచ్చేలా వుంది. నువ్వు వద్దు. జలుబు చేస్తే జ్వరం వస్తుంది" అంది తల్లి.
తండ్రి కూడా ఆమెను సమర్థించాడు.
తను వాళ్ళతో వెళ్ళాలని పట్టుపట్టలేదు.
కారణం తన స్నేహితురాలితో ఆరోజు వేరే ప్రోగ్రాం వేసుకోవడమే. తనకూ, తన స్నేహితురాలికీ బొమ్మలు గీయడం హాబీ. ఇద్దరూ సముద్రతీరానికి వెళ్ళి ఒడ్డున వున్న పడవల్నీ, అక్కడ ఉన్న పల్లెకారుల్నీ చూస్తూ స్కెచ్ గీస్తూ కూర్చున్నారు.
సముద్రంలో పెద్దపెద్ద కెరటాలు లేస్తున్నాయి. సముద్రంలో ఏదో అలజడి బయలుదేరినట్టుగా వుంది. వర్షం ప్రారంభమయింది. ఇద్దరూ అక్కడ్నుంచి వచ్చేశారు.
తను తన కాటేజీలో వంటరిగా కూర్చుంది. అమ్మ నాన్నల కోసం ఎదురుచూస్తూ.
ప్రొద్దు పోయినా వాళ్ళు రాలేదు. అర్థరాత్రి అయింది. తను బిక్కుబిక్కుమంటూ కూర్చుని వున్నది.
అప్పుడే కాటేజీ ముందు జనం హడావిడిగా మూగినట్టు తోచింది. బయటికి వచ్చింది. దారుణ దృశ్యం! తను ఏనాటికీ మరువలేని దృశ్యం. తడిసిన శవాలు తన తండ్రీ...తల్లీ...ఇద్దరూ శాశ్వతంగా తనను వదిలి వెళ్ళిపోయారు. తను వాళ్ళమీదపడి ఏడుస్తుంటే ఎవరో దూరంగా లాగారు.
తన బాబాయి వచ్చేంతవరకు తను తన తండ్రి స్నేహితుడి ఇంట్లోనే ఉన్నది. బాబాయి వచ్చాడు. తనతో తీసుకెళ్ళాడు. అంతే తన జీవితానికి నరకపు తెరలు ఎత్తినట్టు అయింది.
గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చింది సీత.
సముద్రంకేసి చూసింది. ప్రశాంతంగానే వున్నది. ఇక తన జీవితం ఆటుపోటులకు గురికాడు. బంగారు భవిష్యత్తు తనకోసం ఎదురు చూస్తున్నట్టుగా అన్పిస్తున్నది. ఎన్నడూ లేని ఏదో సంతృప్తి మనసుని చుట్టివేసింది. ఏదో ధైర్యం!
అంతలోనే ఒక సందేహం వచ్చింది. తను తాడూ బొంగరం లేకుండానే ఆటలో గెలుపొందినట్టు భావిస్తోందా?
"లేదు. నువ్వు ఊహిస్తున్నది తప్పక జరుగుతుందనే నమ్మకాన్ని నీలో పెంచుకో" ఎవరిదో కంఠం... ఎవరు?
"ఎవరో...ఎవరో కారు...అతనే... అవును అతని కంఠమే - తనకు విన్పించింది.
అవును! అది అతని కంఠమే!
గిర్రున వెనక్కు తిరిగి చూసింది.
అక్కడ ఎవరూ లేరు! అతను రాలేదు మరి?
అవును! అతను రాలేదు. కాని అతని కంఠం తనకు విన్పించింది, లేక అలా అన్పించిందో! అతను తన ఆలోచనలు తన బుర్రలోకి పంపిస్తున్నాడు.
నెత్తి చుర్రుమనడంతో సీత తృళ్ళిపడింది.
చాలా ఎండెక్కింది. బాబాయి గంతులేస్తూ ఉండి వుంటాడు.
సీత తాపీగా నిర్భయంగా, డైనింగ్ హాలుకు నడిచింది.
సీత డైనింగ్ హాల్లో ప్రవేశించింది.
అక్కడ హారే లేడు.
బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసి క్యాబిన్ కు వెళ్ళిపోయాడు.
అతని రౌద్ర రూపం కళ్ళకుకట్టినట్టుగా వుంది.
అయినా ఆమె నిబ్బరంగానే వుంది.
బ్రేక్ ఫాస్ట్ చేసింది. ఈ ప్రయాణంలో ఈరోజు మాత్రమే ఆమెకు బ్రేక్ ఫాస్టులో పెట్టిన పదార్థాలు ఎంతో రుచిగా వున్నట్టు తోచింది.
ఫలహారం ముగించి తన క్యాబిన్ లోకి వెళ్ళింది. మాన్యుస్క్రిప్టు తీసుకుంది. రాత్రి ఫెయిర్ చెయ్యలేదు. అయినా భయంగా లేదు. ఆమె ధైర్యం మీద తనకే ఆశ్చర్యంగా తోచింది.
"ఇంత ఆలస్యం అయిందేం?" గుర్రుమన్నాడు హారే.
ఆమె మాట్లాడలేదు.
"నాకు తెలియక అడుగుతాను. ఈ వయసులో ఇంత బద్ధకం ఏమిటి? ఎందుకింత ఆలస్యం అయింది?"
"త్వరగా మెలుకువ రాలేదు" నిర్లిప్తంగా చెప్పింది సీత.
"అదే- ఎందుకంటున్నాను?" తీవ్రంగా అడిగాడు హారే.
ఆమె తల వంచుకున్నది. "నిద్రపోయాను" అన్నది చిన్నగా.
"నిద్ర!నిద్ర! ఎప్పుడూ నిద్రేనా? నేను ఈ వయసులో ఎంతపని చేస్తున్నానో చూస్తున్నావుగా? సోమరిపోతులంటే నాకు అసహ్యం..."