"థ్యాంక్యూ!"
"మీరు ఇంకా మాట్లాడతారనుకున్నాను. కాని అకస్మాత్తుగా ఆపేశారు"
"నేను ఆపలేదు. ఆపించారు"
"ఎందుకలా జరిగింది"
"భయం!"
"భయమా? ఎవరికీ?"
"పెద్దలకు వ్యవస్థ మారాలంటూ ఇంకా ఏమేమి మాట్లాడతానోనని భయం. మార్కుసిజం బోధిస్తానని భయం"
రేణుక గౌతమ్ ముఖంలోకి ముగ్ధురాలైనట్టు చూస్తున్నది. గౌతమ్ ఆమెతో అన్ని మాటలు మాట్లాడటం మొదటిసారి.
గౌతమ్ ఆగి ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.
రేణుక చటుక్కున చూపుల్ని కిందకు వాల్చింది.
"నాది ఒక కోరిక?" రేణుక చిన్నగా అన్నది.
"ఏమిటి?" ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండానే అడిగాడు.
రేణుక పర్స్ లో నుంచి పార్కర్ పెన్ తీసింది. "దీన్ని మీరు తీసుకోవాలి?"
"ఎందుకూ!"
"నిన్న మీరు అంతబాగా మాట్లాడినందుకు?"
"అదేమిటి? దానికి దీనికీ...."
"సంబంధం ఉంది. అభినందన సూచకంగా ఇస్తున్నాను. తిరస్కరించరనే నమ్మకంతోనే ఇస్తున్నాను"
గౌతమ్ ఓ క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"తీసుకోరా?"
"ఒక షరతు మీద!"
"ఏమిటి?"
"సాయంత్రం నాతో మీరు బీచికి వస్తానంటే...."
రేణుక చివున తలెత్తి గౌతమ్ ముఖంలోకి చూసింది. ఏదో అనాలనుకుంది. తడబడింది.
"మీ ఫ్రెండ్సు వస్తున్నారు. త్వరగా చెప్పండి"
"అలాగే!"
"సరిగ్గా ఐదుగంటలకు హైకోర్టు దగ్గరకు రండి. ఫోర్టు బీచ్ కి వెళ్దాం"
"మరి ఇది...."
"అప్పుడే తీసుకుంటాను." అంటూ గౌతమ్ ముందుకు వెళ్ళిపోయాడు.
వాణి వెనకనుంచి వచ్చి రేణుక భుజం మీద చెయ్యి వేసింది.
తృళ్ళిపడి వెనక్కు చూసింది. గాభరా పడింది.
"ఎందుకు రేణూ అంత గాభరా? గో అహెడ్! విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్!"
"ఏమిటి నువ్వంటున్నది?" తడబడింది రేణుక.
వాణి నవ్వుతూ "నా దగ్గిరా దాపరికం అక్కర్లేదు. నేను నీమంచి కోరేదాన్నే. కాని ఆ సుధారాణితో జాగ్రత్తగా ఉండు. ఒకకంట కనిపెట్టి ఉండు. అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు" వాణి ముందుకు వెళ్ళిపోయింది.
రేణుక ముఖంలో ముసిముసి నవ్వుల దొంతర్లు అలుముకుంటున్నాయి కళ్ళల్లో కొట్టవచ్చినట్టు ఆనందపు తళుకులు తేలిపోతున్నాయ్. వార్డు నుంచి బయటికి వస్తుంటే పాదాలు నేలకు తగిలినట్టు, గాలిలో తేలిపోతున్నట్టు అన్పించసాగింది.
గాలిలో ఎగరాలని ఉంది. పరుగులు తియ్యాలని ఉంది. రెస్ట్ లెస్ గా ఉంది. ఆ ఆనందాన్ని భరించలేకుండా ఉంది.
తమాషా? మనిషిని ఆవేదనా, బాధకూడా నిల్చున్నచోటు నిల్చోనివ్వవు. అనందంకూడా అంతే!
"ఏమిటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?" సుధారాణి కంఠం.
ఓ క్షణం నిలబడి సుధారాణి ముఖంలోకి చూసింది.
"ఏదో గుర్తొచ్చింది?"
"అంత ఒంటరిగా నవ్వుకునే విషయం ఏమై ఉంటుందా అని!"
"నీకు అనవసరం" అనాలనిపించింది. కాని సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయింది రేణుక.
వెళ్ళిపోతున్న రేణుకను చూస్తూ సుధారాణి అదోలా నవ్వింది.
ఆ కళ్ళలో ఈర్ష్య తేలు పిల్లలా అలజడిగా తిరగసాగింది.
రేణుక తలవంచుకుని బీచ్ లో కూర్చుని ఇసుక మీద గీతలు గీస్తున్నది.
ఎదురుగా కూర్చున్న గౌతమ్ ఆమెకేసి కన్నార్పకుండా చూస్తున్నాడు.
రేణుకలోని అణువణువూ అనిర్వచనీయమైన అనుభూతితో స్పందిస్తోంది. మనసులో ఏదో సంచలనం. ఆ సంచలనాన్ని అదుపులో పెట్టుకోవడానికి అన్నట్టు ఇసుకలో పిచ్చిగీతలు గీస్తోంది. అనుకోకుండా గౌతమ్ అని రాసింది. అదిచూసి గౌతమ్ ఆ పేరు పక్కగా రేణుక అని రాశాడు.
రేణుక తలెత్తి చూసింది. గౌతమ్ తల వంచుకుని ఇసుక మీద ఏదో రూపాన్ని గీయడానికి ప్రయత్నిస్తున్నాడు. రేణుక గౌతమ్ ను తనివితీరా చూస్తూ కూర్చుంది.
గౌతమ్ పొడవుగా, పెద్దగా చాయలేకపోయినా ఆకర్షణీయంగా ఉంటాడు అనుకొనేది. ఈ రోజు ఆమె కళ్ళకు అతను మరీ అందంగా కన్పిస్తున్నాడు.
గౌతమ్ తల ఎత్తాడు. రేణుకకు దొంగతనం చేసినట్టు అనిపించింది. చటుక్కున చూపుల్ని మరల్చుకుంది.
'ఎందుకండి అంత గాభరా! నా ముఖం చూడాలని ఉంటే హాయిగా చూడవచ్చుగా? నేను ఏమీ అనుకోను!" అన్నాడు గౌతమ్ చిరునవ్వు నవ్వుతూ. రేణుకకు ఏం మాట్లాడాలో తోచలేదు. మరీ ఇబ్బందిగా అనిపించింది. ఎలా కూర్చోవాలో, చేతులు ఎలా పెట్టుకొవాలో కూడా తెలియనంతటి సంచలనం ఏదో ఆమెను ఇబ్బంది పెడుతోంది.
"ఇంత సిగ్గేమిటి? ఇలా రావడం ఇదంతా కొత్తగా ఉంది కదూ?"
"అవును!" అన్నట్టు తల ఊపింది.
"ఏదైనా చెప్పండి"
"మీరే చెప్పండి. మీరేగదా ఇక్కడకు తీసుకొచ్చారు?" అన్నది రేణుక.
"అంటే మీకు ఇక్కడకు రావడం-ఇలా నాతో బీచ్ కి రావడం ఇష్టంలేదా? నా బలవంతంమీదనే వచ్చారా!"