అతను బిగ్గరగా నవ్వుతూ, "పతివ్రతలా మాట్లాడుతున్నావేమిటి.... ఛీ----ఛీ ఏదీ దగ్గరకురా ఇవ్వాళ నిన్ను పొందందే బయటికి వెళ్ళను" అంటూ, ఆమె భుజాలు పట్టుకోబోతూన్న అతన్ని, బలంగా ఒక్క గుద్దు గుద్దాడు మదన్.
"అబ్బా ---" అంటూ అతను వెనక్కి తిరిగి చూశాడు వీపు తడుముకుంటూ, అనుకొని ఈ సంఘటనకి అదిరిపోయి.
"మధన్---- సమయానికి వచ్చావు. నామానాన్ని కాపాడావు. నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. కాస్సేపు ఆలస్యమై వుంటే" ---- మరి చెప్పలేక, వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధిక.
"నువ్వెవడివి మధ్యలో? వాడికి డబ్బులిచ్చాను నేను." అన్నాడు అతను మధన్ వంక ఉరిమిచూస్తూ.
నోర్ముయ్--- డబ్బులిచ్చి కొనడానికి ఇదేమైనా వస్తువనుకున్నావా?" కోపంతో పెద్దగా అరిచాడు మధన్.
అతను తెల్లబోయి చూశాడు మధన్ వంక, పరిస్థితి ఏమీ అర్థంకాక. మధన్ ఉగ్రరూపం చూసి, ఇక లాభం లేదన్నట్టు, అతను మధన్ కేసి కోపంగా చూస్తూ బయటికెళ్ళిపోయాడు.
రాధిక మధన్ కాళ్ళమీదపడి ఏకధారగా ఏడుస్తోంది. లేవనెత్తి కళ్ళు తుడిచాడు. మధన్ "రాధీ..... ఒక్కక్షణం ఆలస్యమైతే ఘోరం జరిగిపోయేది. భగవంతుడు నన్ను సమయానికి పంపించాడు. ఏడవకు. ఈరోజు నుంచీ నీ కష్టాలు తీరిపోయాయి."
"మధన్--- ఇటువంటి కీచకుల చేతిలోంచి ఎలా తప్పించుకున్నానో, ఇన్ని సంవత్సరాల నుంచి ఛస్తూ ఎలా బతుకుతున్నానో ఎన్ని దేముళ్ళకి మొక్కుకున్నానో, వీరి చేతుల్లో చిక్కకుండా వుంచమని, చెప్పలేను మధన్. పోదాం పద. ఇంక ఒక్క క్షణం కూడా ఇక్కడుండొద్దు."
"పద" అంటూ రాధిక చెయ్యిపట్టి గబగబా బయటికి తీసుకొచ్చాడు.
"పదండి" అన్నాడు సత్యం గబగబా నడుస్తూ.
రాధికతో సహా కలిసొస్తున్న ముగ్గురినీ చూసి క్యాహై అన్నాడు మీసాలవాడు.
మధన్ గబగబా ముందుకెళ్ళి అతని చేతిలో ఐదువందల రూపాయలు పెట్టాడు." ఈమెని నేను పట్టుకెళుతున్నాను. అడ్డం పడ్డావో జాగ్రత్త నీ బండారం అంతా బయట పెడతాను" అంటూ రాధిక చెయ్యిపట్టుకుని గబగబా మెట్లుదిగి బయటికొచ్చేశాడు మధన్.
వెళ్ళిపోతున్న ముగ్గురుకేసి ఆశ్చర్యంగా షాకు తిన్నవాడిలా నోరు తెరిచి చూశాడు వెంటనే ఒళ్ళు తెలీని కోపంతో "జాగ్రత్త అడుగు ముందుకు వేశావో." అంటూ పెద్ద పులిలా గాండ్రించాడు.
"జాగ్రత్త చోర్.... నోరుమూసుకున్నావంటే ఈమె నొక్కదాన్నే లాక్కెళతాను. నోరు తెరచి అల్లరి చేశావో-- అందర్నీ తీసుకెళ్ళిపోతా నువ్వు దొంగవని పోలీసులకి పట్టిస్తా-- జాగ్రత్త అంటూ ఉరుములా అరిచాడు మధన్.
"అతను సి.ఐ.డి. ఇన్స్ పెక్టర్ లే అతనితో పెట్టుకోకు జాగ్రత్త, వొస్తాం" అంటూ మరి సమాధానం కోసం ఎదురు చూడకుండా ముగ్గురూ బయటి కొచ్చేశారు చీకట్లోంచి.
రాధిక ఇంకా ఏడవడం చూసి "ఇంకెందుకూ ఏడుపు, విషవలయంలోంచి బయటపడ్డావు. హాయిగా అమ్మవొడిలో పడుకుని జరిగినవన్నీ మరిచిపో." అన్నాడు మధన్. "మధన్ నాకెందుకో భయంగా వుంది. వాడు తాచుపాములాంటివాడు. వాడి పగతీర్చుకునేదాకా వెంటాడుతూనే వుంటాడు. వాణ్ణి తలుచుకుంటే భయంగా వుంది" అంది భయపడుతూ.
"వాడి మొహం వాడేం చేస్తాడింక. మా మధన్ వాడి కోరలు పీకేశాడు. వాడింక మనజోలికి ఛస్తేరాడు.
ఈలోపల పోలీసులకి రిపోర్ట్ చేసి వీడి ఆట కట్టిస్తాను. ఎందరు ఆడపిల్లల ఉసురుపోసుకున్నాడో, ఎన్ని కాపురాలలో చిచ్చుపెట్టాడో! ఎందరి బతుకులు బజారుకెక్కించి, నాశనం చేశాడో" ఆవేశంతో అన్నాడు సత్యం.
"ఈరాత్రికి ఏదైనా హోటల్లో వుండి తెల్లారుఝామునే బయలుదేరి పోదామా లేక ఇప్పుడే బయలుదేరుదామా" అన్నాడు మధన్, సత్యం కేసి చూసి.
"ఇప్పుడే హోటళ్ళు చుట్టూ తిరిగి రూంకు వచ్చేసరికి తెల్లారుతుంది. పడుకున్న గంటా, రెండుగంటలకల్లా లేచిపోవాలి. నిద్దరపడితే లేవడం కష్టం. అందుకే సుబ్బరంగా గుంటూరు వరకూ టాక్సీ మాట్లాడుకుందాం. రాధికని గుంటూరులోనేగా దింపాల్సింది" అన్నాడు సత్యం.
మధన్ ఆలోచించాడు ఒక్క నిముషం. "సత్యం మనం ముందు వెళ్ళవలసింది మద్రాస్, గుంటూరుకాదు. టాక్సీ మద్రాసుకే మాట్లాడుకుందాం" అన్నాడు.
మెల్లగా ఈమాటా ఆమాటా మాట్లాడుకుంటూ చార్మినారు చేరుకున్నారు ముగ్గురూ. అప్పుడే రోడ్డు జనసంచారం లేదు నిద్దరపోయినట్టుంది. అక్కడ టాక్సీ కనబడింది.
"మెడ్రాసు కొస్తావా?" ఉర్దూలో అడిగాడు సత్యం.
"వారు ఆశ్చర్యంగా తప్పువిన్నానేమోనని మళ్ళీ అడిగాడు ఎక్కడికి సార్" "మెడ్రాసుకి." అని
"నూటయాభై రూపాయలవుతాయి" అన్నాడు వాడు.
"నూరిస్తాం" అన్నాడు సత్యం.
"నూటపాతికివ్వండి సార్" అన్నాడు ఆశగావాడు.
"సరే" అన్నాడు మధన్
ముగ్గురూ టాక్సీలో కూర్చున్నారు. సత్యం ముందు సీట్లో కూర్చున్నాడు. మధన్ రాధికా వెనకాల కూర్చున్నారు. కారు స్టార్టయింది. నల్లని రోడ్ల మీద రయ్..... మని దూసుకుపోతోంది కారు. "మధన్ ఇక్కడ పోలీస్టేషన్ దగ్గర ఆపమను ఈ రాత్రికి రాత్రి వాడి ఆట కట్టాలి." అన్నాడు సత్యం. "సరే."
ముగ్గురి మనసుల్లోనూ రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయ్. మాట్లాడకుండా కూర్చున్నారు. జరిగినదంతా పోలీస్టేషన్ లో చెప్పారు సత్యం మధన్. వాళ్ళు ప్రొసీడయ్యేప్పుడు రాధిక పేరు మాత్రం ఎక్కడా రాకుండా చూచుకోమని ప్రాధేయపడ్డాడు సత్యం. "సరే"నంటూ వెంటనే జీపులో బయలుదేరాడు ఇన్స్ పెక్టర్, సత్యం చెప్పిన అడ్రసు ప్రకారం.