Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 7

     సిగ్గుతో తలొంచుకుంది ఆమె.
    "మొత్తానికి మావాడి దుమ్ము దులిపారు" అన్నాడు కుమార్.
    "వస్తానండీ" అంటూ లేచిందామె.
    "వస్తూ వుండండీ" అన్నాడు నవ్వుతూ కుమార్.
    "అంటే ఇంకా కొన్నాళ్ళిక్కడ వుంటారన్నమాట" అంది.
    "ఆ! మావాడి వాలకం చూస్తే అలాగే వుంది"
    ఇంతలో హేమ, మాలతి, సంగీత, శిరీష, ఫాతిమా అక్కడికొచ్చారు. కుమార్ మాధవిని అందరికీ పరిచయం చేశాడు. ఆమె నవ్వుతూ అందరికీ నమస్కారం చేసింది.
    "ఇవాళ మాతో వుండిపోండీ ఇక్కడ" అంది హేమ.
    "ఇవాళ ఆఫీసు సెలవు పెట్టలేదు" అంది ఆమె.
    "వెళ్ళి సెలవు పెట్టి వచ్చేయండి" అంది మాలతి.
    "ప్లీజ్! మాకు బోర్ కొడుతోంది" అంది ఫాతిమా.
    వారి బలవంతాన్ని భరించలేకపోయింది మాధవి. సరేనంది. సెలవు చీటీ రాసి 'బేరర్' చేతికిచ్చి ఆఫీసులో ఇచ్చి రమ్మంది. మరికాసేపటికి అందరూ మాటలలో మునిగిపోయారు.
    భోజనాలు, కాఫీలూ, ఫలహారాలూ అయ్యాక షికారుకు బయలుదేరారు అందరూ.
    బ్రిడ్జి దగ్గరికి రాగానే ఆగిపోయింది మాధవి నవ్వుతూ.
    "ఈ బ్రిడ్జిని ఈ జన్మలో మరచిపోలేను" అన్నాడు అజయ్.
    "ఏం ఎందుకని?" కొంటెగా అడిగింది ఆమె.
    "ఆ చివరవున్న నిన్నూ, ఈ చివరనున్న నన్నూ ఒక్కచోట కలిపింది!" ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
    "అబ్బో! డాక్టరుగారికి కూడా ...
    కన్నెపిల్ల ప్రక్కనుంటే మూగవాడికి కూడా మాటలొస్తాయి. అందులోనూ నీలాంటి..."
    "ఇంకచాలు, చెప్పనక్కర్లేదు" అజయ్ నోటికి తన చేతులడ్డం పెట్టింది.
    వేళ్ళను ముద్దెట్టుకున్నాడు అజయ్.
    "ఛీ!" అంటూ చెయ్యి తీసేసింది.
    "ఆడపిల్ల 'ఛీ' అంటే ఎంత బావుంటుందో తెలుసా?"
    "మీకు చాలా తెలుసు కాబోలు!"
    అది వరకు విని తెలుసుకున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూసి తెలుసుకున్నాను. కళ్ళలోని సిగ్గూ, బుగ్గలలోని ఎరుపూ, ఆ చిలిపి అధరాలూ..."
    "పోండీ"
    "పోనా? హైదరాబాదు? పోతున్నా, రేపే వెళుతున్నా"
    "రేపేనా?"
    "ఏం? వెళ్ళొద్దా?"
    "....."
    "నాకూ వెళ్ళాలని లేదు. నిన్ను చూసిన క్షణం నుంచే ఎన్నో ఏళ్ళుగా పరిచయమయిన ఆప్తురాలిని చూసినట్లనిపించింది."
    "నాకూ అలాగే అనిపించింది. మీరెవరో, నేనెవరో. పరిచయం కూడా లేదు. కానీ కొద్దిపాటి పరిచయంతోనే మనసు మాత్రం ఏదో పాత మనిషిని చూసినట్లుగా పరితపిస్తోంది.
    "నిజం. ఇదేనేమో ప్రేమంటే"
    "ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.
    "అజయ్! మరో రెండు రోజులుండివెళ్ళకూడదు?"
    "వాళ్ళంతా ఒప్పుకుంటారో లేదో?"
    "ప్రయత్నించండి."
    "తప్పకుండా" అన్నాడు.
    అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎంత దూరం నడిచారో అప్పటికీ గానీ తెలీలేదు. మిగతా వాళ్లందర్నీ ఒదిలిపెట్టి తామిద్దరూ చాలా దూరం వచ్చేశారన్న సంగతి.
    వెంటనే తిరుగుముఖం పట్టారు ఇద్దరూ.
    అతికష్టంమీద మరో రెండు రోజులుండడానికి ఒప్పించాడు అజయ్. ఆడపిల్లలు మాత్రం వెళ్ళిపోతామన్నారు.
    "మాధవీ మహత్యం" అన్నాడు నవ్వుతూ కుమార్.
    "మనవాడు ప్రేమలో పడ్డట్టున్నాడు" అన్నాడు నవ్వుతూ వేణు.
    వేణూ, కుమార్, మిశ్రా తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. పగలంతా అజయ్ వీళ్ళతో ఉన్నా సాయంత్రం అయ్యేటప్పటికి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు మాధవిని కలుసుకోడానికేలే అని తెలిసిన ముగ్గురూ గమనించనట్లు ఊరుకున్నారు.

 Previous Page Next Page