"మీ ఆవిడ పేరేమిటిరా?" రాజారావు అడిగాడు.
"అరుంధతి!"
"అందానికి తగిన పేరు" అనాలనుకున్నాడు కాని అనలేదు.
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూచున్నారు. నీళ్ళు తోడి చెప్పటానికి అరుంధతి అక్కడకు వచ్చింది. అప్పుడే శాంతమ్మ కూడా బయటినుంచి వచ్చింది. ఆంజనేయస్వామి దేవాలయంలో కొబ్బరి కాయను కొట్టి, కొబ్బరిచిప్పను చేత్తో పట్టుకుని యథాలాపంగా లోపల అడుగు పెట్టిన తల్లిని ఉద్దేశించి, "అమ్మా చూడు ఎవరొచ్చారో!" అన్నాడు సీతాపతి సంతోషంగా.
శాంతమ్మ రాజా ముఖంలోకి నిదానంగా చూసింది. సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోయింది.
"రాజా! ఎప్పుడొచ్చావు నాయనా! ఎలా వున్నావు? ఏమిటీ వేషం? ఎంత చిక్కిపోయావో?" ఆప్యాయంగా తల నిమురుతూ ఆత్రంగా పరామర్శించింది శాంతమ్మ.
"చూశావా తల్లిప్రేమ! నేను చిక్కిపోయానని అన్నవాళ్ళులేరు. కనీసం కట్టుకున్న పెళ్ళాంకూడా ఎప్పుడూ అనలేదు" అన్నాడు రాజారావు సీతాపతి ముఖంలోకి గర్వంగా చూస్తూ.
శాంతమ్మ ముసిముసిగా నవ్వుకుంది. కొబ్బరికాయ చిప్పలో వున్న కుంకుమతీసి రాజారావు ముఖానికీ, సీతాపతి ముఖానికీ పెట్టింది. రాజారావు బుద్ధిమంతుడిలా బొట్టు పెట్టించుకోవడం చూచి సీతాపతికి నవ్వొచ్చింది.
"అదేమిటమ్మా! నాస్తికుడు! వాడికి బొట్టుపెడతావు!" అన్నాడు సీతాపతి.
"వాడు నాస్తికుడైతే నాకేం!" అంటూ కొబ్బరివిరిచి చెరొక ముక్కా పెట్టింది శాంతమ్మ. రాజారావు కొబ్బరిముక్కను కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని, సీతాపతి వైపు కొంటెగా చూశాడు.
"ఆహ ఏం భక్తిరా! అమ్మ దగ్గిర దొంగభక్తి చూపిస్తున్నావ్! నాకు తెలియదా ఏం? అన్నాడు సీతాపతి రాజారావు వీపుమీద చరుస్తూ.
"మరీ అంత గట్టిగా కొట్టకురా! అసలే బలహీనంగా వున్నాడు" అంటూ మందలించింది శాంతమ్మ కొడుకుని.
"ఇక నువ్వొచ్చావుగా? అమ్మకు నేను కనిపించను" అన్నాడు సీతాపతి.
"ఏడ్చావులే నోరుమూసుకో!" అన్నాడు రాజారావు.
అంతసేపూ మైమరచి చూస్తూ నిల్చున్న అరుంధతి పులకరించిపోయింది. రాజారావుకు తను ఊహించుకున్న దానికంటే పెద్ద స్థానమే ఆ ఇంట్లో వున్నట్లు గ్రహించుకుంది. కొడుకు చిన్నతనంలోనే తప్పిపోయి యువకుడుగా తిరిగి ఇంటికివస్తే కలిగేలాంటి ఉద్వేగం, ఉత్సాహం, ఆనందం మిళితమయ్యాయి ఆ రోజు ఆ ఇంటి వాతావరణంలో రాజారావు రాకతో.
"ఇదుగోనే అమ్మాయి! ఈ పువ్వులూ, బొట్టూ పెట్టుకో! ప్రసాదం కూడా నోట్లోవేసుకో!" అంటూ కొబ్బరిచిప్ప పువ్వులూ కోడలికి అందించింది. పూలు అందుకుంటున్న అరుంధతి చేతివేళ్ళను చూశాడు రాజారావు.
భోజనాలు చేస్తున్నంతసేపూ స్నేహితులిద్దరూ చెప్పుకుంటున్న కబుర్లను వంటింటి గడపలో తలుపుచాటుగా వింటూ కూచుంది అరుంధతి. వాళ్ళు గత స్మృతులను తలచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అభిప్రాయభేదం వచ్చినప్పుడు శాంతమ్మను సాక్ష్యం అడుగుతున్నారు. శాంతమ్మ సాక్ష్యం ఎక్కువ రాజారావు పక్షమే ఉండటం వల్ల సీతాపతి చిరుకోపాన్ని నటిస్తున్నాడు. అరుంధతికి తన ఊహల్లోని రాజకుమారుడు అతనే ననిపించింది. సీతాపతి కూడా ఆ రోజు కొత్తవ్యక్తిలా వున్నాడు. అతనిలో జీవం తొణికిసలాడుతున్నట్లు వున్నాడు. నిజమే స్నేహాన్ని మించిన అనుభవం ఏదీ లేదేమో ప్రపంచంలో! అనిపించింది అరుంధతికి. కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది స్నేహితులిద్దర్నీ మార్చి మార్చి.
ఆ రాత్రి స్నేహితులిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పడుకుని అర్దరాత్రిదాకా కబుర్లు చెప్పుకుంటున్నారు. గదిలో పడుకున్న అరుంధతికి వాళ్ళు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం వినిపిస్తూనే వుంది. కాని మాటలు తెలియటంలేదు. అరుంధతికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆలోచిస్తూ పడుకుంది.
6
వారం రోజులు తిరక్కుండానే అరుంధతికి రాజారావు దగ్గర చనువు ఏర్పడింది. మాట్లాడడానికి సందేహం కలగటంలేదు .కారణం రాజారావుకు ఆ ఇంట్లోవున్న స్థానం, అతని కలుపుగోలుతనం, ముఖ్యంగా అరుంధతికి రాజారావుమీద ఏర్పడిన గౌరవం. రాజారావు తమ పార్టీ ఆదర్శాలగురించీ ఆశయాల గురించీ చెబుతూవుంటే శ్రద్ధగా వినేది. అండర్ గ్రౌండ్ జీవితంలో వారు ఎదుర్కోవలసిన సాహస కృత్యాలను గురించి చెబుతుంటే పసిపిల్లలు రాజకుమారుల సాహసగాథలు వింటున్నట్లే వినేది. రాజారావు దేశం గురించి ఎన్నో విషయాలు చర్చించేవాడు. రాజారావు పరిచయంతో వారం రోజుల్లోనే అరుంధతి చురుకైన బుర్రకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. చక్కగా ఒక విషయాన్ని గురించి ఆలోచించటం కూడా నేర్చుకుంది.
రాజారావు దగ్గరే కబుర్లు చెబుతూ కూచోవాలనిపించేది అరుంధతికి. అతను చదువుకుంటూ కూచుంటే చిరాకు వేసేది. ఒకరోజు రాజారావు ఉదయంనుంచే ఏదో రాసుకుంటూ, పుస్తకాలు తిరగేస్తూ కూచున్నాడు. భోజనంచేసి నిద్రపోయాడు. ఆనాడు అరుంధతితో ఎక్కువ మాట్లాడలేదు. అరుంధతి ఏమీ తోచక "శృంగారి అనే శృంగార కథల పత్రికను, అంతకు ముందు రెండుసార్లు చదివినదాన్నే చదువుతూ కూచుంది. రాజారావు నిద్రలేచి బయటకు వచ్చాడు. అరుంధతి తన్మయత్వంతో చదువుతున్న పుస్తకం ఏమిటో చూడాలని కుతూహలం కలిగింది.
"ఏమిటా పత్రిక? అంత శ్రద్ధగా చదువుతున్నావు?" రాజారావు ప్రశ్నకు సమాధానంగా పత్రికను అందించింది అరుంధతి. పత్రికను చేతిలోకి తీసుకొని చూసిన రాజారావు ఆశ్చర్యంగా అరుంధతి ముఖంలోకి చూశాడు. ఆమె అదేమీ గమనించే స్థితిలో లేదు.
"మీరు చదువుతూండండి నేను కాఫీ తెస్తాను" అంటూ వంటగదిలోకి వెళ్ళింది.
"తను ఆ పత్రిక చదవాలని తీసుకున్నాడనుకుంటూంది." అరుంధతి అమాయకత్వానికి జాలివేసింది రాజారావుకు.
రాజారావు అరుంధతిని గురించే ఆలోచిస్తున్నాడు. అంతలో కాఫీ తెచ్చింది. అప్పుడే నిద్రలేచిన అత్తగారికి కూడా తెచ్చి ఇచ్చింది.
"నువ్వు చదివే పుస్తకాలన్నీ చూపించు" అన్నాడు రాజారావు.
అరుంధతి ఉత్సాహంగా అన్ని పుస్తకాలు తెచ్చి పడేసింది. అన్నీ ప్రేమ కథలూ, అపరాధపరిశోధక నవలలూ.
"ఇవన్నీ చదివావా?" ప్రశ్నించాడు రాజారావు.
"ఆఁ- రెండు మూడుసార్లు చదివాను ఒక్కొక్కటి" అంది ఘనకార్యం చేసినట్లు అరుంధతి.
రాజారావు బాధగా జాలిగా చూశాడు. ఆ అమ్మాయిలో చదవాలనే తృష్ణ వుంది. కొత్త సంగతులు తెలుసుకోవాలనే కుతూహలం వుంది. చాలా చురుకైన బుర్రకూడా ఉంది. కాని లాభం? సక్రమ మార్గం యేదో, ఏం చదవాలో కూడా చెప్పేవాళ్ళు లేరు.
"అమ్మా, నిప్పుపెట్టి తీసుకురా" అంటూ అన్ని పుస్తకాలు రెండు చేతుల నిండుగా పట్టుకొని బయటకు తెచ్చాడు వాలికిముందు ఒక్కొక్క పుస్తకాన్నే కాలుస్తూ ఉంటే శాంతమ్మ, అరుంధతీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అరుంధతికి కోపం వచ్చింది. దుఃఖం కూడా వచ్చింది.
"ఎందుకు రాజా! దాని పుస్తకాలన్నీ కాల్చేస్తున్నావూ?" కుతూహలాన్ని అణుచుకోలేని శాంతమ్మ ప్రశ్నించింది.
"ఇలాంటి పుస్తకాలు చదవకూడదమ్మా. వీటివల్ల విజ్ఞానం కలగకపోగా, మనిషిలోని ప్రాధమిక పాశవిక ప్రవృత్తుల్ని రెచ్చగొట్టే శక్తి ఉంది" అన్నాడు రాజారావు.
రాజారావు మాటలు ఇద్దర్లో ఎవరికీ సరిగ్గా అర్ధం కాలేదు.
"రేపు సీతాపతి వెళ్ళేటప్పుడు నేను మంచి పుస్తకాలు లిస్టు రాసి యిస్తాను. అవి చదివితే మనస్సు వికసిస్తుంది" అన్నాడు రాజారావు. అరుంధతి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.
"కథల పుస్తకాలేనా?"
"అవును. కథల పుస్తకాలే. కథల పుస్తకాలూ, నవలలుకూడా చాలా మంచివి ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తులు రాసిన ఇతర దేశాల పుస్తకాలు కూడా తెలుగులోకి వచ్చాయి. అలాంటివి చదవాలి" అన్నాడు రాజారావు.
సీతాపతి వచ్చాక శాంతమ్మ పుస్తకాలు కాల్చివేసిన సంగతి చెప్పింది.
"శంఖంలో పోస్తేగాని తీర్ధం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆ పాడు పుస్తకాలు చదవవద్దని, వింటేనా?" అన్నాడు సీతాపతి. అరుంధతి ముఖం ఎర్రబడింది.
"మంచి పుస్తకాలు తెచ్చిపెట్టలేకపోయావు?" అన్నాడు రాజారావు. ఆ మాటతో అరుంధతి ముఖం వికసించటం రాజారావు చూడకపోలేదు.
"నాకు తెలిస్తేగా తెచ్చి పెట్టటానికి? అందుకే అసలు ఈ పుస్తకాలు చదవొద్దన్నాను" అన్నాడు సీతాపతి నవ్వుతూ.
"చాలా గొప్పగా చెప్పావులే!" అన్నాడు రాజారావు.
అరుంధతి చిరునవ్వు నవ్వింది. శాంతమ్మ ముసిముసిగా నవ్వింది. సీతాపతి పకపకా నవ్వాడు. రాజారావు నిండుగా నవ్వాడు.
"రాజారావు ఎంత హాయిగా నవ్వుతాడు!" అనుకుంది మనస్సులోనే అరుంధతి.
రెండోరోజు సీతాపతి ఏలూరు వెళుతూంటే రాజారావు పుస్తకాల లిస్టు ఇచ్చాడు. గోర్కి రచన "అమ్మ", ఠాకూరు నవల "పడవ మునక" కూడా రాశాడు. "మాలపల్లి" కూడా రాశాడు మరికొన్ని మంచినవలలతోపాటు.
"పెద్ద లిస్టే ఇచ్చావు ఓ పచ్చనోటయినా ఖర్చు చేయించేలా ఉన్నావు" అన్నాడు సీతాపతి.
నిండుగా నవ్వాడు రాజారావు. రాజారావు నవ్వుతుంటే అరుంధతికి మనస్సులో మల్లెపందిరి విరిసినంత హాయిగా అనిపిస్తుంది.
"ఈ పిచ్చి పుస్తకాలు చదివే బస్తీ కాపరం పెట్టమని ప్రాణం తీస్తుంది. మంచి పుస్తకాలు చదివితే మహా పట్నాలకే వెళదాం అంటుందేమో! మధ్య నేను చస్తాను అన్నాడు కొంటెగా భార్య ముఖంలోకి చూస్తూ సీతాపతి.
అరుంధతి ముఖం చిన్నబుచ్చుకుంది. రాజారావు ఏదో అనబోయేంతలోనే "బస్ టైం అయినట్టుంది. వస్తాను" అంటూ గబగబా బయటకు వెళ్ళిపోయాడు సీతాపతి. శాంతమ్మ సావిట్లో కూచుని వడ్లు దంపిస్తూ వుంది. రాజారావు ఓ క్షణం అరుంధతిని చూసి గబుక్కున లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుంధతికి వంటరిగా రాజారావు ముందు నిల్చోవాలన్నా, కూచోవాలన్నా ఏదో ఇబ్బందిగా వున్నట్లు వుంటుంది. అరుంధతి కూడా తన గదిలోకి వెల్లి పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తూంది. ఎంత వద్దనుకున్నా మనస్సులో రాజారావును గురించి ఆలోచించకుండా వుండలేకపోతూంది.
ఒకోసారి తనకేసి అదోలా చూస్తాడు. కాని వెంటనే తడబాటుతో సర్దుకుంటాడు. అలాంటప్పుడు సాధారణంగా లేచి వెళ్ళిపోతాడు. రాజారావు తనతో చాలా చనువుగా మాట్లాడతాడు. కాని అది తన భర్తగానీ, అత్తగారుగాని వున్నప్పుడే. వంటరిగా వున్నప్పుడు వీలయినంతవరకు తనను తప్పించుకొనే తిరుగుతాడు. అప్పుడప్పుడు తనకు కోపంకూడా వస్తుంది. తనంటే నిర్లక్ష్యమేమో కాదు... తనంటే అతనికి ఎంతో ఇష్టం అని అతని ప్రవర్తనా, చూపులే చెబుతుంటాయి. మరి తనను అంతగా తప్పుకుని తిరగాల్సిన అవసరం? ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టింది. శాంతమ్మ వచ్చి కేక వేసేంతవరకూ ఆమెకు మెలుకువ రాలేదు.
"అమ్మాయ్, లే! మూడయింది. కాఫీ పెట్టు. ఇంకా బియ్యం చెరగటం కాలేదు. నేను ఓ గంటలో వస్తా. రాజాకు కాఫీ ఇవ్వు" అని పురమాయించి శాంతమ్మ అక్కడనుంచి వెళ్ళిపోయింది.
అరుంధతి లేచి గోడగడియారం చూసింది. మూడయింది. రాజారావు రెండు గంటలకే కాఫీ తాగుతాడు. గబగబా లేచివెళ్ళి పొయ్యి వెలిగించి కాఫీ పెట్టింది.
కాఫీ గ్లాసుతో అరుంధతి రాజారావు గదిలో ప్రవేశించింది. రాజారావు సాధారణంగా చదువుకుంటూ కూచుని వుంటాడు. ఆనాడు కిటికీచువ్వలు పట్టుకొని బయటకు చూస్తూ నిల్చున్నాడు. నిశ్శబ్దంగా నిలుచుంది అరుంధతి. అతన్ని వెనకనుంచి చూస్తూ- అలా యెంతసేపయినా చూస్తూ నిలబడిపోవాలనిపించింది ఆమెకు. సన్నగా పొడుగ్గా, పైజామా-లాల్చీతో కిటికీలోనుంచి అతను బయటకు చూస్తుంటే, తను అతని వెనుక నిల్చునివుంటే-ఏదో సినిమాలో దృశ్యంలా వుంది అరుంధతికి. సవ్వడి కాకుండా రెండడుగులు ముందుకు వేసింది. రాజారావు వెనక్కు తిరగలేదు. అరుంధతి చూపులు ఓ క్షణం అతడి సన్నగా, బొద్దుగా వున్న తెల్లటి మెడమీద నిలిచి, పైకి పాకి అతని నొక్కుల జుట్టులో చిక్కుపడిపోయాయి. ఆ జుట్టులోకి తన వేళ్ళను దూర్చి, ఆ జుట్టును చెరిపేయాలనే తమాషా కోర్కె కలిగింది ఆమెకు. చెయ్యి వణికింది. మనస్సు తొణికింది. కాఫీ వొలికింది. ఆమెకు వేడి కాఫీ చేతిమీద పడటంవల్ల ఆమె నోటినుంచి అప్రయత్నంగానే "అబ్బ" అన్నమాట వెలువడింది.
రాజారయు చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. ఆమె మౌనంగా కాఫీ గ్లాసు వున్న చేతిని ముందుకు చాచింది. కాఫీగ్లాసు అందుకుంటున్న రాజారావు చేతివ్రేళ్ళు అరుంధతి వేళ్ళను తాకాయి. ఆమె మనస్సు, శరీరం కూడా మధురస్పందనలతో నిండిపోయినవి. గుండె వేగం హెచ్చింది. అనుకోకుండానే రాజారావు కళ్ళల్లోకి చూసింది. రాజారావు కళ్ళు ఎర్రగా వున్నాయి. మునిపళ్ళతో కిందపెదవిని నొక్కిపట్టి కొంచెంగా ముడుచుకున్న కళ్ళతో వెనక్కునెట్టే ప్రయత్నంలో అతను సతమతమవుతున్నట్టూ, కళ్ళల్లో తిరుగుతున్న నీటిని కట్టలు తెంచుకోకుండా అంచుల్లోనే ఆపే ప్రయత్నంవల్లనే ఆ కళ్ళు ఎర్రబడినట్టు అరుంధతి లీలగా గ్రహించింది. రాజారావు కళ్ళల్లో తననే చూస్తున్నాడు. ఆ చూపుల్లో తొంగిచూస్తున్న బాధ కన్నీరా? ఎందుకు? అందుకు తనే కారణం కాదుకదా! ఆ ఆలోచన రాగానే ఆమె హృదయంలో ఒకేసారి ఆనందం ఆవేదనా పెనవేసుకున్నాయి. తలెత్తి మరోసారి రాజారావు ముఖంలోకి చూడబోయింది. రాజారావు తన ఎదురుగా లేడు. మళ్ళీ మొదటిలాగే కిటికీ దగ్గర బయటకు చూస్తూ నిల్చున్నాడు.
అరుంధతి మనస్సు చివుక్కుమంది. ఎంత నిర్లక్ష్యం? తను ఇక్కడ నిల్చుని వుంటే అతను బయటకు చూస్తూ నిల్చుంటాడా? తను ఆ గదిలో వుండటం అతనికి ఇష్టం లేనట్లు చెప్పటమేగా? అరుంధతి గది బయటకు వచ్చేసింది.
అంతా నటన! ముందు కావాలనే తన చెయ్యి తాకాడు. కాదేమో, పొరపాటుగా తగిలిందేమో! కాదు కావాలనే చేశాడు మళ్ళీ అంతలోనే అంత ఉదాసీనత ఎందుకు చూపించాలి? ముఖం తిప్పుకొని ఎందుకు నిల్చోవాలి? తనతో రెండు మాటలు ఎందుకు మాట్లాడకూడదు? అరుంధతికి దుఃఖం పొర్లుకొచ్చింది. ఎలాగో తమాయించుకుంది. ఏమిటిదంతా? తను యెందుకిలా ఆలోచిస్తూంది? అతని చెయ్యి పొరపాటుగా తగిలివుంటుంది. మరి ఆ కన్నీటికి కారణం? భార్యా పిల్లలు గుర్తొచ్చారేమో? తనకోసం బాధపడుతున్నాడని ఎందుకనుకోవాలి? అలా అనుకుంటే తనకు సంతృప్తి. తన మనస్సు అతనిచుట్టూ ఎందుకు తిరుగుతుంది? తను తనభర్తకు ద్రోహం చెయ్యటంలేదుగదా? అరుంధతి నిలువెల్లా వణికిపోయింది. అలా ఎన్నటికీ కాదు, తను వివాహిత, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. తనకు అతనంటే గౌరవం! గొప్పవాళ్ళను గౌరవించటంలో తప్పులేదు. అతనికి భార్యాపిల్లలున్నారు. ఆ భావం కలగగానే ఆమెకు అంతరాంతరాల్లో ఏదో ములుకు నాటినట్లు లీలగా బాధ కలిగింది. ఛ! అతని భార్యాబిడ్డల్ని గురించిన ఆలోచన తనకు బాధ కలిగించటం ఏమిటి? అంతా భ్రమ!