Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 7

    శ్రీలక్ష్మి సుందరమ్మకేసి చూస్తూ వుండిపోయింది.
    'సుందరమ్మా! నిజం చెప్పు. నీకెంతమంది బిడ్డలు?'
    'నాకా' తృళ్ళిపడింది.
    'మరినాకా?' పకపక నవ్వింది శ్రీలక్ష్మి.
    'లేరు... లేరు...'
    'అబద్ధం చెప్పకు. నీకు బిడ్డలు ఉన్నారు. అవునా?'.
    'అవునవును. వున్నారు. ఒకరు కాదు. ఆరుగులు. ఆరుగులు బిడ్డల్ని కనిపెంచాను. పాపిష్టిదాన్ని బిడ్డలు లేరని అబద్ధం చెప్పి ఇక్కడ చేరాను. ఏ తల్లీ ఉన్న బిడ్డల్ని లేరని చెప్పదు. నేను... నేను...' కొంగుతో ముఖం కప్పుకుని బావురుమని ఏడవసాగింది.
    శ్రీలక్ష్మి గాభరా పడిపోయింది. 'ఊరుకో. ఏడవకు నువ్వేం తప్పు చెయ్యలేదు. అలాంటి బిడ్డలు వున్నా ఒకటే. లేకపోయినా...'
    'వద్దు! వద్దు! అలా అనకు. వాళ్ళు ఉన్నారు. ఉండాలి.'
    'నా ఉద్దేశం. తల్లిని అనాథశ్రమంలో చేర్చిన పిల్లలు ఉన్నా లేనివాళ్ళకిందే జమ అని'.
    'వాళ్ళు చేర్పించలేదు. నేనే వచ్చాను. వాళ్ళకు నేను ఇక్కడకు వచ్చినట్టు తెలియదు.' 
    'అదేలే! నువ్వు వాళ్ళ దగ్గర వుండలేకేగా వచ్చావు! ఆ అవమానాలు భరించలేకేగా?'
    'అవునమ్మా! నేను అర్ధం చేసుకోగలను. అవమానాలు భరించలేకే ఇక్కడకు వస్తాం.'
    సుందరమ్మ చివ్వున తలెత్తి చూసింది. 'అంటే నువ్వు కూడా?'
    'అవును! నేను కూడా అందుకే వచ్చాను. చాలామంది అందుకే వస్తారు. కాని చెప్పరు. అలా చెప్పుకోవాలంటే అభిమానం అడ్డువస్తుంది. అందుకే, నువ్వూ, నేనూ, మనలాంటి వాళ్ళందరూ అబద్దాలు చెబుతారు. వాళ్ళు బాగానే చూస్తారనీ, వాళ్ళని బాధపెట్టడం ఎందుకని మనమే వచ్చామనీ చెప్తుంటాం. సరేలే! బాగా అలసిపోయావు. కాసేపు పడుకో. మనకు జరిగిన అవమానాలను కలబోసుకోవడానికి చాలా రోజులున్నాయిలే. పడుకో.' అని శ్రీలక్ష్మి మంచం చివరకు జరిగి, స్టూలు మీదకు దిగి, రెండు చేతులతో స్టూలును తోసుకుంటూ బయటకు వెళ్ళింది.
    సుందరమ్మకు మనసు తేలిక పడినట్టుగా అన్పించింది.
    'చెప్పేశాను. నేను గొడ్రాలిని కాదని చెప్పేశాను. గుండెల మీద బరువును దించేసుకున్నాను. నేను చచ్చిపోయాక శ్రీలక్ష్మి అందరికీ చెబుతుంది. నేను గొడ్రాలిని కాదని చెబుతుంది. ఆరుగురి బిడ్డల తల్లినని చెబుతుంది.'
    సుందరమ్మ ఆలోచిస్తూ మంచం మీద వాలిపోయింది.
    ఆ రాత్రంతా కలత నిద్రలోనే గడిపింది. మధ్య రాత్రి ఎవరో వీపు మీద చరిచినట్టు తృళ్ళిపడింది.
    'మంచినీళ్ళు... మంచినీళ్ళు'
    సుందరమ్మ చివ్వున లేచి కూర్చుంది. అయేషా అరుస్తోంది. సుందరమ్మ మంచినీళ్ళ గ్లాసుతో ఆయేషా మంచం దగ్గరకు వెళ్ళి నీళ్ళు అందించింది. ఆయేషా ఆత్రంగా అందుకొని గటగట నీళ్ళన్నీ తాగి ఖాళీ గ్లాసు అందించింది.
    'ఇంకా కావాలా?'
    'వద్దు. నా ఏళ్ళు కూడా తీసుకుని నూరేళ్ళు బతుకు తల్లీ.' అంది ఆయేషా!
    సుందరమ్మకు నవ్వొచ్చింది. ఇదేం దీవెన? నూరేళ్ళు బతకాలా? ఎందుకు?
    'ఒక పిలుపుకే వచ్చి మంచినీళ్ళిచ్చావు. తిట్టలేదు. మొట్టికాయలు పెట్టలేదు.' అన్నది ఆయేషా.
    'తిట్టడమా? కొట్టడమా? ఎందరుకూ?'
    'అయ్యో తల్లీ! ఆ అన్నమ్మ ఒక పట్టాన లేచేది కాదు. అరవగా అరవగా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి ఎన్ని తిట్లు తిట్టేదనుకున్నావ్? కొట్టేది కూడా. నువ్వు అలా చెయ్యవు కదూ?'
    'ఛా! ఎందుకు చేస్తానూ?'
    'ఇంకా చావలేదని తిట్టేది. నువ్వే చెప్పు తల్లీ ఎన్ని కష్టాలొచ్చినా ఎవరికైనా చావాలని వుంటుందా?'
    'వుండదు.'
    'నువ్వు మంచిదానివి. ఇక మళ్ళీ లేపనులే. వెళ్ళి పడుకో.'
    'ఫర్వాలేదు. అవసరం అయితే లేపు.' అని ఆయేషా పడుకున్నాక దుప్పటి సర్ది సుందరమ్మ తన మంచం దగ్గరకు వెళ్ళింది.
    సుందరమ్మ పడుకుందేగాని నిద్ర పట్టలేదు.
    భగవాన్! నన్ను తీసుకెళ్ళు. నా జీవితంలో మళ్ళీ తెల్లవారకూడదు. మళ్ళీ వెలుగు చూడకూడదు. నా బిడ్డలకు నేను ఏమైపోయానో తెలియకూడదు. ఎప్పటికీ తెలియకూడదు. అదే వాళ్లకు శిక్ష. ఆ శిక్ష చాలు. పదేపదే అనుకోసాగింది.
                                                                           *   *   *
    అయినా తెల్లవారింది.
    వెలుగు వచ్చింది.
    దిగ్గున లేచి కూర్చుంది.
    'ఏంటమ్మా! ఇంకా పడుకునే వున్నావ్? తెల్లగా తెల్లారిపోతేనూ? లే! లే! ఆ ముసల్దానికి ముఖం కడిగించి ఈ పాలు తాగించు'. అంటూ పాలగ్లాసులు పట్టుకొచ్చిన ఆయా, గ్లాసు ఒక స్టూలు మీద పెట్టి, ఆదరాబాదరాగా బయటికి వెళ్ళిపోయింది.
    సుందరమ్మ దిగ్గున మంచం దిగింది. ఊడిపోయిన జట్టు ముడి వేసుకుంది. శాంతమ్మ మంచం దగ్గరకు వెళ్ళింది. ఆమె ముఖంలోకి చూసింది. ఎంత ప్రశాంతంగా నిద్ర పోతుందో? రాత్రి తనను పక్కే కూర్చో బెట్టుకుని నిద్ర పోయింది. మళ్ళీ లేవలేదు. రాత్రంతా హాయిగా నిద్రపోయినట్టుంది.
    సుందరమ్మ శాంతమ్మ నుదురు మీద చెయ్యి వేసింది. ఒక్కసారిగా కరెంటు షాకు కొట్టినట్టు చెయ్యి వెనక్కు లాక్కుంది. సుందరమ్మ కొయ్యబారిపోయినట్టయి పోయింది.
    'ఏమైంది? ఏమైంది?' అయేషా, శ్రీలక్ష్మి ఒక్కసారిగా అరచినట్టే అడిగారు.
    పక్క బట్టలు మార్చడానికి వచ్చిన ఆయా శాంతమ్మ నుదుటిమీద చెయ్యివేసి చూసింది.
    'ముసల్ది పోయింది.' అంది అతి మామూలుగా.
    ఆవార్త గుప్పుమంది. అందరూ గదిలో కమ్ముకున్నారు. వార్డెన్ పరుగు పరుగున వచ్చింది. సుందరమ్మ మాటా పలుకు లేకుండా చూస్తూ నిల్చుంది.
    'వెళ్ళిపోయింది'.
    'అదృష్టవంతురాలు. మరీ నికృష్టంలో పడకుండా పోయింది.'
    అందరూ తలొకమాటా అంటున్నారు. శవాన్ని మంచం మీద నుంచి దింపి, బయట అరుగుమీద పడుకోబెట్టారు. పక్కనే వున్న మగవాళ్ళ హోం నుంచి కూడా కొందరు చూడడానికి వచ్చారు.
    మున్సిపాలిటీ లారీ వచ్చింది. శాంతమ్మ శవాన్ని లారీలోకి ఎక్కించారు. లారీ వెళ్ళి పోతుంటే సుందరమ్మ గుడ్లప్పగించి చూస్తూ నిల్చుంది.
    'ఇంకా ఏం చూస్తావు లేవయ్యా! ఇక పద! రేపు మనమూ ఇలా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే.'
    సుందరమ్మ చివ్వున తలెత్తి చూసింది. ఒక వృద్దుడు మరో వృద్ధుడితో అంటున్నాడు.

 Previous Page Next Page