"పద్మ చివ్వునలేచి కూర్చుంది.
"గుర్తుంది కనుకనే ఇవ్వాళ కొట్టాల్సి వచ్చింది కొట్టే అధికారం వుందనుకున్నాను. అది నా భ్రమకావచ్చు."
"ఇంకెంతకాలం అది మన యింట్లో వుంటుంది చెప్పు దాని పెళ్ళయిందాకా అన్నా, ప్రేమ లేకపోయినా బాధ్యాతగా భావించి దాన్ని బాధపెట్టకు."
"నేను మీ చెల్లెల్ని బాధపెడ్తున్నానా? ఏం బరువులు మొయ్యమంటున్నాను? ఇవతల పుల్ల అవతల పెట్టకుండా కాలుమీద కాలువేసుకొని కూర్చుంటున్నా అదే మనడం లేదే?" పద్మ తనకు తానే చెప్పుచెప్పుకొంటున్నట్టు అన్నది.
"అది కాదు పద్మా! నన్ను అర్థంచేసుకో తల్లీ తండ్రీ లేని పిల్ల!"
"అందుకే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. వక్రమార్గంలో నడుస్తుంటే నాకేంలే అని చూస్తూ ఊరుకోలేకపోయాను."
సత్యనారాయణకు భార్య మాటలుఅర్థంకాలేదు.
తన చెల్లెలు వక్రమార్గంలో నడుస్తోందా?
అంటే?
అంటే?
అబద్ధం!
అలా ఎన్నటికీ జరగదు.
జరగటానికీ వీలు లేదు.
సరోజ చిన్నపిల్ల!
అమాయకురాలు!
అనవసరంగా పద్మ అనుమానిస్తూంది.
ఎక్కడకు పోతుంది ఆడబుద్ది?
"ఈఇంటి పరువూ ప్రతిష్ఠా కాపాడడం నా కర్తవ్యం అనుకున్నాను. అందుకేనయాన వినకపోతే భయాన చెప్పి చూద్దాం అనుకున్నాను."
సత్యనారాయణ భార్య ముఖంలోకి వెర్రివాడిలా చూశాడు.
"మరీ ముద్దుచేసి నెత్తికీ ఎక్కించుకున్నారు. తప్పు చేసి కూడా ఎదురు తిరిగే స్వభావాన్ని అలవార్చుకుంది నీ చెల్లెలు."
"ఏమిటి నువ్వంటున్నది?" అడగలేక అడిగాడు సత్యనారాయణ.
పద్మ లేచివెళ్ళి డ్రాయరు సొరుగులాగి కాగితం మడతతీసి సత్యనారాయణ ఒళ్ళోకి విసిరింది.
"ఏమిటిది?" చేతిలోకి తీసుకొని విప్పకుండానే అడిగాడు.
"నీ చెల్లెకి ప్రేమలేఖ! ఎవడో రాశాడు!"
"పద్మా!"
"ముందు చదవండి! తరవాత అరవోచ్చు!"
వణుకుతున్న చేతులతో ఉత్తరం విప్పాడు.
"సరూ డార్లింగ్....."
సత్యనారాయణ మెదడులో రక్తం వేగంగా చిమ్మింది. ఉత్తరం చివరు పేరు చూశాడు.
"నీ ప్రియుడు" అని మాత్రం రాసివుంది. పేరు లేదు.
సత్యనారాయణ నిలువెల్లా వణికి పోయాడు.
"ఎవరిది రాసింది?"
"నాకేం తెలుసూ? నన్ను నిలదీస్తారేం?" విసురుగా అన్నది పద్మ.
"నీ చేతికి ఎలా వచ్చింది?"
"ఎవరో చిన్న కుర్రవాడు తెచ్చాడు. ఆ సమయానికి నేను వీధి వాకిట్లోకి వెళ్ళాను. సరోజను అడిగాడు. అంతకు ముందు అర్థగంట నుంచి సరోజ యింట్లోకీ, బయటకూతిరుగుతూంది కాలు కాలిన పిల్లిలాగ. నాకు అనుమానం వచ్చి సరోజ ఎందుకని ఆ కుర్రవాణ్ని అడిగాను. వాడుగాబరాపడ్డాడు. చేతిలో కవరు కన్పించి వాణ్ణి పట్టుకొని కవరు లాక్కున్నాను." పద్మ ఆగి భర్త ముఖంలోకి చూసింది.
సత్యనారాయణ కణతలు నొక్కుకుంటున్నాడు కుడిచేత్తో.
"విప్పి చదువుతూ వుంటే వాడు ఉత్తరం ఇచ్చెయ్యమని గొడవ చెయ్యసాగాడు. ఎవరు రాశారని అడిగాను."
"మా అన్నయ్య సరోజకే ఇచ్చి రమ్మన్నాడు" అన్నాడు వాడు. అన్నయ్య పేరు అడిగితే చెప్పకుండా పారిపోయాడు" అన్నది పద్మ.
సత్యనారాయణ దిగ్గున లేచాడు. అతని ముఖం ఎర్రగా అయింది.
"ఎక్కడికి?" అడ్డం నిలుస్తూ అడిగింది పద్మ.
"అడ్డంలే...."పద్మను ఒక్క తోపుతోసి గబగబా సరోజ గదిలోకి వెళ్ళాడు.
వెనకే పద్మ వెళ్ళింది.
"సరోజా!" గద్దించాడు.
అన్న ఉగ్రరూపం చూసిన సరోజ వణికిపోతూనిల్చుంది.
"ఏమిటిది? ఎవరు రాశారు?" గద్దించి అడిగాడు.
సరోజ బెదురుచూపులు చూస్తూ నిల్చుంది.
"మాట్లాడవేం?" దగ్గిరకు వచ్చి ఆరిచాడు.
"అదేమిటో నాకు తెలియదు" వణికిపోతూ అన్నది.
"ముందు అది తీసి చదువు. ఎవరు రాశారో చెప్పు!"
"నాకేం తెలియదు. వదినే రాయించి వుంటుంది" దాదాపు ఏడుస్తూనే సరోజ.
పద్మ తెల్లబోయి నిల్చుంది.
"వదిన రాయించిందా రాస్కెల్!" అంటూ సరోజ ఆ చెంపా ఈ చెంపా పిచ్చిగా కొట్ట సాగాడు.
పద్మ అడ్డుపోయి సత్యనారాయణను దూరంగా లాగింది.
"ఏమిటి? చంపేస్తారా ఏం?" అన్నది పద్మ గాబరాగా.
"నువ్వు అడ్డులే, చెప్పవే? ఎవరు రాశారు? వదిన రాయించిందా?" మళ్ళీ చెయ్యి ఎత్తి ఆగిపోయాడు.
సరోజ నీళ్ళల్లో పడ్డ కోడిపిల్లలా వణికి పోతున్నది.
పద్మ చిన్నగా అక్కడ్నుంచి తప్పుకుంది.
సత్యనారాయణ వణికిపోతున్న సరోజను చూసి నీరు కారిపోయాడు. చెయ్యి పట్టుకొని మంచంమీదకూర్చో బెట్టి తనూ కూర్చున్నాడు.
"చూడమ్మా! నీ మంచికే చెబుతున్నాను. ఇటు వంటి విషయాల్లో అబద్ధం ఆడకూడదు! ఇంత అభాండం తల్లిలాంటి వదిన మీద వేస్తావా?"
సరోజ తల వంచుకొని కూర్చుంది.
"నిజం వీధిలో ఆ ఉత్తరం ఎవరు రాశారు?"
"పక్క వీధిలో వుండే ప్లీడరు గారి అబ్బాయి" అన్నది సరోజ నీళ్ళు నములుతూ.
అన్న ముఖంలోకి బేల చూపులు చూసింది.
సత్యనారాయణ తెల్లబోయి చూశాడు.
"అతను నీకెలా తెలుసూ ? ఎప్పుడైనా మాట్లాడావా?"
"లేదు. స్కూలునుంచి వస్తుంటే చూస్తూ నిల్చుంటాడు"
"ఇంతకు ముందు కూడా రాశాడా"
"ఒక ఉత్తరం రాశాడు"
"జవాబిచ్చావా?"
"ఇవ్వలేదు. భయం వేసింది.
"వాడికి పెళ్ళయింది తెలుసా? నీకు ఇలాంటి ఉత్తరాలు రాయడంలో అతని ఉద్దేశ్యం ఏమిటో ఆలోచించావా?"
"నేను జవాబు రాయలేదు."
"ఇకముందు ఇటువంటిది ఏదైనాజరిగితే నాకుచెప్పు! చెబుతావా?"
సరోజ తల ఆడించింది.
"లే! ఏడవకు. భోజనం చేద్దాం రా !"
"నాకు ఆకలిగా లేదు."
"పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. నెలకు ఎన్ని రోజులు అలిగి భోజనం మానేస్తావ్? పద!" కొంచెం గట్టిగానే అన్నాడు.
సరోజ లేచి అన్న వెనకే నడిచింది.
అందరూ భోజనాలు చేశారు.