"ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి ఊటీ పరిసరాలు, ట్రౌట్ హెచరీ చూడటానికి బయల్దేరారు అందరూ. నేనుమాత్రం ప్రియను చూసుకుంటూ హోటల్లోనే ఉండిపోయాను. వాళ్ళంతా సాయంకాలం నాలుగ్గంటలకు తిరిగొచ్చి ఆరుగంటలబండికి తిరిగి కోయంబత్తూర్ వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. డాక్టర్ ప్రియనప్పుడే కదిలించండం మంచిదికాదని సలహా ఇచ్చాడు. ఇంకా టెంపరేచర్ ఉందనీ, చలిగాలికి ఎక్స్ పోజ్ కావడం మంచిదికాదని సలహా ఇచ్చాడు. కనీసం మరో నలభయిఎనిమిది గంటలైనా ఆమెను కదల్చడానికి వీల్లేదన్నాడు. అనిత ప్రియకు తోడుగా ఉండిపోతానంది. కాని ప్రియ అనితను ఒప్పించి వాళ్ళతో పంపించివేసింది ప్రియతో ఉండిపోవడమంటే మిగతా టూరంతా మానుకోవడమే. నేనుండి పోవడానికి ప్రియ అంగీకరించింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ రెండు రోజులూ ఉదయం, సాయంకాలం డాక్టర్ హోటల్కొచ్చి ప్రియను పరీక్ష చేసి మందులు వాడడంలో సూచనలిచ్చాడు."
జగన్ ఆగి గాలి పీల్చుకున్నాడు.
"మూడోరోజుకు ప్రియకు పూర్తిగా నయమైంది. ఆ మూడు రోజులూ ఒక్క క్షణంకూడా విడవకుండా ఆమెనే కనిపెట్టుకొని ఉన్నాను. మరో రోజు అక్కడే గడిపి, ఐదో రోజు బ్లూ మౌంటెన్ ఎక్స్ ప్రెస్ ఎక్కి కోయంబత్తూర్ చేరాము. తెల్లవారి ఉదయానికి మద్రాసు చేరాము. ఎక్స్ కర్షన్ పార్టీ కన్యాకుమారినుంచి దక్షిణదేశయాత్ర ముగించుకొని మద్రాస్ చేరేదాకా మేమిద్దరం మద్రాస్ లో ఉండిపోయాము. ఉన్న రెండు రోజులూ, మా ఇద్దరికీ రెండు క్షణాల్లా గడిచిపోయినై.
మద్రాస్ లో ఉన్న ఆ ఆఖరిరోజు.
బాగా పొద్దుపోయేదాకా మెరీనా బీచిలో కూర్చుని కబుర్లు చెప్పుకొన్నాము. తొమ్మిదిగంటల ప్రాంతములో హోటల్ రూమ్ కి చేరుకున్నాము.
"ఆ రాత్రి...."
"ఊఁ ఆ రాత్రి ఏం జరిగింది?" ఉత్కంఠతో అడిగాడు కృష్ణ.
"జరగకూడనిదే జరిగిపోయింది. ఆ తప్పు ఏ ఒక్కరిదీ కాదు. ఇద్దరమూ బాధ్యులమే, ప్రేమించుకున్నాము. ఐనా తొందరపడకుండాఉంటే బాగుండేది. కానీ ఆనాటి బలహీనత అలాటిది. పెళ్ళయేదాకా ఆగగలిగితే ఎంత బాగుండేదోనని ఇవ్వాళ అనుకుంటాను. కాని ప్రయోజనం?"
"ఆ తర్వాత పెళ్ళెప్పుడు చేసుకున్నారూ?"
"అదే జరగలేదు. అదే జరిగివుంటే మోనో ఈరోజు అనాధగా ఉండాల్సిన ఖర్మేమొచ్చింది?" నిట్టూర్చాడు జగన్మోహనరావు.
కృష్ణ నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది.
కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు.
"ఆమెను మోసం చేశావా?"
"లేదు."
"మరి నిన్నే ఆమె...."
"అదీకాదు."
"మరి?"
"ఎవరు ఎవరినీ మోసం చేసుకోలేదు. సమాజమే మమ్మల్ని మోసం చేసింది. పరిస్థితులు అందుకు అనుకూలించాయి" దిగులుగా అన్నాడు జగన్.
కృష్ణ అరచేతుల్తో నుదురు రుద్దుకున్నాడు.
"ఏమైంది? పెద్దవాళ్ళు మీ వివాహానికి అంగీకరించలేదా?"
"అవును!"
"అర్ధం లేదు. పెద్దవాళ్ళు అంగీకరించలేదని పెళ్ళి చేసుకోవడం మానేశారా? అంత చేతకానివాడివి ఆమెనెందుకు ప్రేమించావ్? ఒక ఆడదాని గొంతు కోశావ్! ఒక నిండు జీవితాన్ని బలితీసుకున్నావ్."
"ఉద్రేకపడకురా కృష్ణా నువ్వూహిస్తున్నట్టు ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. పెళ్ళి చేసుకొంది."
"పెళ్ళి చేసుకుందా?" తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది కృష్ణకు.
"బలవంతంగా చేశారు. తండ్రి బలవంతంచేసి చేశాడు."
దారుణం చూస్తూ ఎలా ఊరుకున్నావ్ రా? మీరిద్దరూ మైనారిటీ తీరినవారేకదా అప్పటికి! పోలీసు కంప్లయింట్ ఇచ్చి ఆ పెళ్ళి ఆపు చేయించి వుండాల్సింది."
"పోలీస్ కంప్లయింటా?"
"ఆఁ! ఏం? పోలీస్ కంప్లయింటే!"
"ప్రియ తండ్రే పోలీసాఫీసర్."
"పోలీసాఫీసరా?"
"అవును! అప్పుడు గుంటూరుజిల్లా ఎస్పీగా ఉండేవాడు. చెపుతా విను. మేము మద్రాసునుంచి విశాఖపట్నం చేరగానే వెంటనే రమ్మని తండ్రికి ఉత్తరం రాసింది ప్రియ. ఆయనొచ్చాక మా పెళ్ళి విషయం చెప్పి ఆయనంగీకారం తీసుకొని పెళ్ళి చేసుకుందామని ఓ నిర్ణయానికొచ్చాము. ఓ వారంరోజులు గడిచాయి. ప్రియ తండ్రి రాలేదు. ఇంకో రెండురోజులు చూసి మేమే గుంటూరు వెళదామని నిర్ణయించుకున్నాము. కాని ఆ మరుసటి రోజే ప్రియ కాలేజీకి రాలేదు. రెండోరోజుకూడా కాలేజీకి రాకపోయేసరికి సాయంకాలం గరల్స్ హాస్టల్ కు వెళ్ళాను. ప్రియ రూం మేట్ అనిత కన్పించి చెప్పింది" ఆగాడు జగన్.
"ఏం చెప్పింది?"
"ఆ క్రితం రాత్రే ప్రియతండ్రి వచ్చి ప్రియను తీసికెళ్ళాడని చెప్పింది. అది విని నాగుండెలు కదబడిపోయాయి."
"ఆఁ తర్వాత?" కృష్ణ ఆదుర్దాగా అడిగాడు.
"మళ్ళీ ఎప్పుడొస్తానందండీ" అని అనితను అడిగాను.
"ఏమో చెప్పలేదు. బహుశా ఇప్పటిలో రాకపోవచ్చు. పెట్టా బేడా సర్దుకొని వెళ్ళిపోయింది" అని అనిత చెప్పింది.
"మరి కాలేజీ?" అని అడిగాను.
"ఆ సంగతి నాకు తెలియదు. ప్రియతో మాట్లాడే అవకాశం లేదు. తండ్రి ప్రియను విడవకుండా వెంటే ఉన్నాడు. తొందరపెట్టాడు బయల్దేరమని. ప్రియకూడా ఏదో ఖంగారుపడుతూనే కన్పించింది."
అంటూ అనిత ఇంకా ఏమేమో చెబుతూనే ఉంది.
నామనసుకు ఎక్కడంలేదు. పరిపరివిధాలుగా ఆలోచించసాగాను. నేరుగా వాల్తేరు స్టేషన్ కు వెళ్ళాను.
అప్పటికే గోదావరి వెళ్ళిపోయింది. ఆ రోజే కరెక్టు టైంకు వచ్చి వెళ్ళిపోయిందట అది నా దురదృష్టం! అంటూ నిట్టూర్చాడు జగన్.
"ఊఁ ఆ తర్వాత!" కృష్ణ అడిగాడు ముందుకు వంగి.
"మళ్ళీ పదకొండు దాటితేగాని బండిలేదు. స్టేషన్ నుంచి బయటికి వచ్చాను. నన్ను వెన్నంటి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కుతిరిగి చూశాను. కాని ఎవరూ లేరు. రిక్షా మాట్టాడుకొని ఎక్కాను. రిక్షా బీచ్ రోడ్డు ఎక్కుతుండగా ఒక ఆటో నన్ను దాటుకొనివెళ్ళి, నాముందు ఆగి పోయింది."
కృష్ణ జగన్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. గొంతులో ప్రశ్న గొంతుక్కే అడ్డం పడినట్టు అన్పించింది.
జగన్ మళ్ళీ అందుకొన్నాడు ఒకసారి గుండెలనిండుగా గాలి పీల్చుకొని- "నేను రిక్షా దిగి బీచిలో స్కాండల్ పాయింట్ కేసి నడిచాను. ఇసుకలో కొంతదూరం నడిచాక వెనక్కు తిరిగి బీచిరోడ్డుకేసి చూశాను. రోడ్డుమీద ఆటో లేదు. మనసు తేలికపడింది. ఆటోలో ఓ ప్రేయసీ ప్రియుల జంట వచ్చి దిగి ఉంటుందనుకొన్నాను. అనవసరంగా గాభరా పడ్డాను. నాలో నేనే నవ్వుకున్నాను. సముద్రపొడ్డున ఇసుకలో కూర్చున్నాను. అలలహోరుకు మించిన ఘోషతో నా గుండెలు నిండిపోయాయి. ఈ బీచిలోనే ప్రియా - నేనూ- ఎన్నో వెన్నెలరాత్రిళ్ళు....."
జగన్మోహన్ ఆగాడు.
ఏదో ఆలోచిస్తున్నాడు.
అతని ముఖం గంభీరంగా వుంది.
కొద్దిక్షణాలు ఆగి "ఊఁ! తర్వాత?" అడిగాడు కృష్ణ అతని మౌనాన్ని భగ్నం చేస్తూ.
మబ్బుల్లోనుంచి జారిపడినట్టు త్రుళ్ళిపడ్డాడు జగన్.
గొంతు సవరించుకున్నాడు.
"అలా ప్రియను గురించి ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నానో నాకె తెలియదు. దూరంగా సముద్రంలో లంగరువేసిన ఓడల దీపాల కాంతికి మెరిసి, ఎగసి, ఒరిగి, విరిగిపోతున్న అలలు నాలో చెలరేగుతున్న ఆందోళనను ద్విగుణీకృతం చేస్తున్నాయి."
ఓ క్షణం ఆగాడు జగన్.
"టైం చూశాను, పదిన్నర దాటింది. ఇంకో గంటలో బండి వుంది. బీచ్ రోడ్డులో రిక్షా దొరకకపోతే సమయానికి స్టేషన్ ను చేరలేనేమోనని గాభరాగా లేచి నిలబడ్డాను. బట్టలకు అంటిన ఇసుకరేణువుల్ని దులుపుకొంటూ, కూరుకుపోతూన్న ఇసుకలో గబగబా నడిచాను."
జగన్ గొంతుక్కు ఏదో అడ్డుపడినట్టు ఆగాడు.
"ఆఁ చెప్పు!"
"ఎన్నో అడుగులు ముందుకు వెయ్యలేదు. వెనకనుంచి నెత్తిమీద బలంగా ఏదో తగిలింది. కళ్ళముందు అగ్నిగోళాలు తిరిగాయి."
ఊపిరి బిగబట్టి ముందుకు వంగి వింటున్నాడు కృష్ణ. ఆ దెబ్బేదో తన నెత్తిమీదే తగిలినట్టు ముఖం పెట్టాడు.
"కాళ్ళు పట్టు తప్పాయి. ముందుకు ఒరిగాను."
కృష్ణ ఇంకొంచెం ముందుకు వంగాడు.
"ముక్కూ, మొహమూ ఇసుకలో కూరుకుపోవడంవరకే గుర్తు."
"తర్వాత ఏమయింది?"
"మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నర్సు నిలబడి వుంది. ముక్కులోఉన్న రాబారుగొట్టం తీస్తూ "కదలొద్దు" అనినట్టు సైగచేసింది. ముప్పయిఆరు గంటల తర్వాత కింగ్ జార్జి ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చాను. వారం తర్వాత ఆసుపత్రినుంచి డిస్ చార్జి చేశారు."
"బాబూ! పొద్దుపోయింది. తవరు లేస్తే కుర్చీలు లోపల వేసి తొంగుంటా" సింహాచలం తలకుచుట్టిన గుడ్డతీసి దులుపుకుంటూ ఎదురుగా నిల్చున్నాడు.
అతడిని చూసి అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు కృష్ణ.
జగన్ కూడా లేచాడు.
వాళ్ళలా లేవగానే సింహాచలం రెండుకుర్చీలూ లంకించుకొని లోపలకు నడిచాడు.