ఆ రాత్రంతా నేను నిద్రపోతే విజయతో కబుర్లే సరిపోయాయి. "తల్లి ఇంక నన్ను పడుకోనియ్యి" అని అది చేతులు జోడించేసి ముసుగు తన్నేశాకా నేనూ పడుకున్నాను. ఇంకో గంటకి తెల్లారిపోయింది!
నేను నిద్రలేచేసరికి అంతా హడావుడిగా వుంది నా నెత్తిమీద నూనె నెయ్యీ పెట్టడానికి ముత్తయిదువలు ఎదురుచూస్తున్నారు.
విజయ నైటిలోనే ఇడ్లిలు తింటూ వచ్చి "మజాగా వుందే వాతావరణం" అని పగలబడి నవ్వింది.
"ఏవైందే?" అన్నాను.
అది చెప్పిన వార్తల సారాంశం ఏవిటంటే, పట్నం నుండి వచ్చిన వివేక్ స్నేహితులు పదింట్లో పేకాట వెయ్యబోతే అమ్మమ్మ గట్టిగా అరిచి తన నిరసన తెలియజేసింది. మా పాలేరు నారాయణ వివేక్ తన్నినంత పనిచేసి స్నానాలగది లోంచి బయటికి తోసేశాడు.
మొహాల కడిగింపులు' అని వెళ్ళిన ఆడపెళ్ళివారిని చూసి "మేం కడుక్కోలేమా? ఛ....ఛ... ముచ్చట్లకి కూడా హద్దుండాలి! ఇలాంటి ప్త్రెవేట్ పనులు ఇంకోళ్ళు చెయ్యడం ఏవిటి?" అని మగపెళ్ళివారు చిరాకుపడ్డారు.
ఇవన్నీ తెలిసిన అమ్మమ్మ తనవైపు మూడు తరాల వారిని పొగుడుకుని, అటు వైపువారిని తెగిడి తూలనాడిందట. ఈ విషయం ఎవరో మగపెళ్లివారికి ఉప్పు అందించారు దాంతో, ఆడవాళ్ళ అలుకలూ, బుడిబుడి రాగాలూ,మగవాళ్ళ కోపాలు, ఆడపెళ్లివారి అతి మర్యాదలూ. అంతలోనేమూతివిరుపులా.....ఇలా ఇరుపక్షాలవారూ ఒకర్ని ఒకరు శత్రువుల్లా చూసుకుంటూ రణగొణధ్వనిగా పెళ్ళితంతు ముగించారు.
వివేక్ పంచె కట్టుకుని పైన షర్ట్ వేసుకున్నాడు. పురోహితుడ్ని మంత్రాలు త్వరగా చదవమని తొందరరపెట్టాడు.
మాంగల్యధారణప్పుడు అతని ముని వేళ్ళు నా మెడమీద తగిలినప్పుడు అద్భుతంగా అనిపించింది. తలవంచుకుని కూర్చున్న నాకు అతని పాదాలు కనిపించాయి. ఎందుకో పవిత్రమైన భావనతో వాటికి నమస్కరించాలపించింది.
వివేక్ కి ఇదంతా చిరాకుగా వుందని అతని ముఖం చూస్తేనే తెలిసిపోతోంది. అప్పగింతలలాంటి చాలా ఘట్టాలు కేన్సిల్ అయ్యాయి. అమ్మమ్మ నోరు నొక్కుకున్నా ఫలితం లేకపోయింది. ఆవిడ ఇష్టానికి విరుద్దంగా బఫే కూడా ఏర్పాటు చెయ్యాల్సొచ్చింది.
భోజనాలయ్యాక విజయతో వివేక్ చాలాసేపు మాట్లాడాడట. అది నా దగ్గరికి వచ్చి "మీ ఇద్దరి అభిప్రాయాలలో ఆకాశానికి, భూమికి వున్నంత తేడా వుంది. బట్ హి ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ జెంటిల్మెన్!" అని సర్టిఫికేట్ ఇచ్చింది.
అంత 'జెంటిల్ నెస్ ' నేను భరించలేనేమో! అనుకున్నాను ఆ రాత్రి అసలు భాగోతం ప్రారంభమైంది.
తెల్లని పాలనురగలాంటి చీర కట్టి, పాలగ్లాసు చేతికిచ్చి బుట్టెడు సన్న జాజులు నా జడలో తురిమి ముత్తయిదువలు నా చెవిలో గుసగుసలాడారు! వారి మాటలకి నేను తెల్లబోయాను. తలుపు చాటున నిలబడి, కొంగునిండా కప్పుకుని సిగ్గుగా మాట్లాడే అత్తయ్యలూ, పెద్దమ్మలూ ఇలా మాట్లాడగలరని నాకు అప్పడే తెలిసింది.
అమ్మ నా దగ్గరికి వచ్చి నుదుటిమీద ముద్దు పెట్టుకుని "అతనిమాట కాదనకు చెప్పినట్లు విను" అంది. అమ్మ ఎప్పడూ అంతే. అన్నింటికి భయం. తనలాగే నన్నూ అందరు చెప్పినట్లు వినమంటుంది.
అమ్మమ్మ వచ్చి గుండ్రాయితో దిష్టి తీసింది.
"పాపా! మొగుడ్ని మొదటిరాత్రే కొంగుకి కట్టేసుకోవాలి. అన్నింటికి ఒక్క సారే అడగగానే సరే అనక! బెట్టుచేసి బ్రతిమాలించుకోవాలి.
పెళ్ళాం అలకకి భయపడని మగాడు మొగుడే కాదు!" అంది.
'నాకు బెట్టుచేసేటంత దైర్యం లేదు' అనుకున్నాను. నా తనువు ప్రథమ సమాగమంకొరకు తొందరపడుతోంది. మగవాడిపై ఇష్టం అతను ముట్టుకున్నకే తెలుస్తుందేమో! అతని స్పర్శకోసం నా శరీరం తహతహలాడుతోంది.
ముత్తయిదువల మధ్యన తెల్లని రాయంచలా హోయలుపోతూ సిగ్గు బారానికో, జడలో పూల భారనికో తల వంచుకుని నడుస్తూ వుంటే విజయ మాటలు గుర్తొచ్చాయి.
'ఫస్ట్ నైట్ గంగిరెద్దులా అలకరించుకుని వెళ్ళకు! అతనికి చిరాకు రాగలదు' అంది.
నిజమే! నా మెడలోని రాళ్ళ నెక్లెసు చెవులకి పెట్టుకున్న ముత్యాల జూకాలూ తడుముకున్నాను. "ఒక్కనిమిషం పిన్ని! ఇవి తీసేసి వస్తాను" అన్నాను.
అమ్మలక్కలు ఫక్కున నవ్వారు.
"అవేం అడ్డమే పిచ్చిపిల్లా?" అన్నారు.
"అబ్బ! బరువుగా వున్నాయి" అబద్దం ఆడాను.
వాళ్ళు మళ్ళీ పెద్దగా నవ్వేశారు. "అవేబరువంటే ఎలానే? ఇంక కాసేపట్లో అంతకన్నా బరువుని...." అని ఆపిమళ్ళీ నవ్వడం మొదలు పెట్టారు.
వాళ్ళ మోటు హాస్యాలకి నాకు కాస్త కోపం వచ్చింది.
"నా శోభనానికి మావాళ్ళు మొగలిపూలతో జడకుట్టారు. మా ఆయన ఒళ్ళంతా గీసుకుపోయింది పాపం!" ఓ ముసలి ముత్తయిదున బోసినోటితో చెప్పింది చిన్నగా నవ్వుతూ.
"అంత ఆత్రమెందుకటా? జడ ఇప్పచ్చుగా?" అడిగిందొకావిడ.
"ఆ....అంతా ఇంతా జడ నాది? బారెడు పొడవుండేది ఇప్పుతూ కూర్చునివుంటే రాత్రంతా సరిపోయేది!" ఆవిడ చెప్పింది.
ఎవరి శోభనాల గురించి వాళ్ళు నెమరు వేసుకుంటూ వుండగానే , వివేక్ వున్న గది వచ్చేసింది. నాకు చిరుచెమటలు పోశాయి.
బాబాయ్ గొంతు బ్రతిమాలుతున్న ధోరణిలో "అదికాదు బాబూ! ఏదో పెద్దవాళ్ళ ముచ్చటలుంటాయి కదా!" అంటున్నాడు.
నేను నెమ్మదిగా తలెత్తి చూశాను.
వివేక్ చేతిలో సిగరెట్ పట్టుకునే ,ఆ బాబాయ్ తో మాట్లాడుతున్నాడు. బాబాయ్ చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతున్నాడు.
నాకు భయమో, సంశయమో తెలీదుకానీ ఒళ్ళంతా కంపించింది పెద్దవాళ్ళ ముందు కూర్చోవడంకూడా తప్పని లేచి నిలబడి మాట్లాడే ఆచారం కళ కుటుంబం మాది! అలాంటిది వివేక్ ఆయనముందు సిగరెట్ కాలుస్తూ మాట్లాడుతున్నాడు!
ఇంతలో నాకు మరింత భయం కలిగించే మాటలు మాట్లాడాడు అతను.
"ఏవిటండి ఈ న్యూసెన్స్? ఆ గదిలో ఆ ఏర్పాట్లు ఏమిటి? పురోహితులూ, దంపత తాంబూలాలూ, హడావిడి ఎందుకూ? ఈ విషయానికి ఇంత పబ్లిసిటి కావాలా?" అని నాకేసి తిరిగి-
"అనూహ్యా ! పెద్దవాళ్ళకు చాదస్తం అనుకో.... నీకైనా తెలియాలిగా!" అన్నాడు.
అంతమంది ముందు, ముఖ్యంగా బాబాయ్ ముందు అతను నాతో మాట్లాడిన వైఖరికి నేను మ్రాన్పడి పోయాను. కళ్ళల్లో నీరు సుళ్లు తిరిగాయి.
తలవంచుకుని దుఃఖాన్ని అదిమిపెట్టి, కొంగు మెలిపెడ్తూ నిలబడ్డాను.
ఇంతలో నా భుజంమీద ఓదార్పుగా ఓ చెయ్యి పడింది. తల ఎత్తి చూశాను.
మా అత్తగారు మృదువుగా "లోపలికి వెళ్ళమా" అని నన్ను గదిలోకి పంపించింది. ఆ సమయంలో ఆవిడ నా కంటికి దేవతలా కనిపించింది.
నేను వెనక్కి తిరగగానే ఆవిడ కొడుకుతో ఇంగ్లీషులో-" అమ్మాయిని వూరకే అలా బెదరగొట్టకు. భయస్తురాల్లా వుంది. అంతా నీ ఇష్టప్రకారమే జరిపిస్తాం ఊరుకో" అంది.
నేను గదిలో పూలతో అలంకరించిన మంచంమీద , మోకాళ్ళ చుట్టూ చేతులూ వేసుకుని దిగులుగా కూర్చున్నాను. బయట ఏదో గొడవ వినిపిస్తుంది.
"మా ఇంటా వంటా లేదు. అనసూయమ్మవంశం అంటే చుట్టుపక్కల ఎంత పేరో మీకేం తెలుసు?" అమ్మమ్మ గొంతు కంచుగంటలా వినిపిస్తోంది.
మంచానికి కట్టిన పూలన్నీ నన్ను చూసి జాలిగా ఊగుతున్నాయి. పాలు ఆరి పైన మీగడతొరక కట్టింది. అగరుబత్తీలన్నీ మసిమసిగా మారిపోయాయి. ఆ రాత్రి వివేక్ నేను అర్ధంతరంగా అత్తారింటికి ప్రయాణం అయ్యాను. పెద్దలు పెట్టిన ముహూర్తానికి మా శోభనం జరుగలేదు.
అమ్మమ్మ ఏదో జరుగరానిది జరిగినట్లే శోకాలుపెడ్తూ అంపకాలు పెట్టింది.
అమ్మ నిశ్శబ్దంగా కొంగు నోట్లో కుక్కుకుని చూస్తూ నిలబడింది.
బంధువులందరూ 'అబ్బాయికి తిక్క ఎక్కువే!" అని గుసగుసలు పోయారు.
ఆరుబండ్లమీద మనవరాలికి సారె ఇచ్చి సాగనంపాలని ఉవ్విళ్ళూరిన అమ్మమ్మ తల కొట్టేసినట్లయింది. అయినా అందరూ నచ్చజెప్పడంతొ అవమాన భారాన్ని దిగమింగి ఊరుకుంది.
నన్ను తీసుకెళ్ళి చాటుగా-
"పెద్దల మాటలు చద్ది మూటలు, విను! మగవాడూ, కోడెదూడా ఒకే లాంటివి. కొమ్ము విసిరే అవకాశం ఇవ్వకూడదు. ముక్కు తాడు ఎంత త్వరగా వేస్తే అంత మంచిది.
మొక్కగా వున్నప్పుడు వంచకపోతే, మానయ్యాక వంగదు! అసలే మీ ఆయన మంచి పొగరుమీదున్నట్లు కనిపిస్తున్నడు. మనవంశం ఎలాంటిది?
మీ తాతయ్య ఎన్నడూ నా నోటికి ఎదురుచెప్పి ఎరగడు! మీ నాన్న ఇల్లరికం వచ్చి నాముందు మాట్లాకుండా బతికాడు
కానీ నీ మొగుడు పెద్దచదువులు చదివానని నీ మీద జులుంచేసేటట్లే కనిపిస్తున్నాడు. అదేం సాగనివ్వకు హైదరాబాద్ లో నేను కొనిచ్చిన ప్లాట్ లోనే కాపురం పెట్టు. ఇల్లూ, ఇంట్లో మనుషులూ నీ ఇష్టం వచ్చినట్లు మసులుకునేలాగా చూసుకో ఈ అనసూయమ్మ పేరు నిలబెట్టు "అంది.
నాకు అంతా అయోమయింగా వుంది.
ఏడుపు వచ్చేస్తోంది అమ్మమ్మనీ, అమ్మనీ, వున్న ఊరినీ శాశ్వతంగా విడిచిపెట్టి ఇంకో ఇంటికి వెళ్తున్నాననే ఊహే భరించరానిదిగా వుంది! అమ్మమ్మా , అమ్మతో బాటు పనివాళ్ళూ చుట్టుపక్కలవాళ్ళూ వచ్చిన బంధువులూ కూడా ఏడ్చారు.
"నేనేదో విలన్ గాడ్ని అయినట్లూ, నిన్ను నేను రాచి రంపాన పెట్టడానికి తీసుకెళ్తూన్నట్లు, జటాయు పక్షులా మీవాళ్ళంతా అలా గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారేం?" అంటూ నావైపు తిరిగిన వివేక్ నేనూ ఏడుస్తూ వుండడం చూసి "సరిపోయింది! నువ్వు కూడానా?" అన్నాడు అసహనంగా.
"అమ్మమ్మా !" అంటూ నేను భోరున ఏడుస్తూ వెళ్ళి ఆవిడ్ని చుట్టుకున్నాను.
"తప్పమ్మా.....ఏడవకూడదు" అని నన్ను ఓదార్చబోయి, ఆవిడే ఏడుస్తూ, క్రింద కూలబడిపోయింది. వెంటనే గుండె చేత్తో పట్టుకుని గిలగిలలాడింది.
"అయ్యో ....మళ్ళీ హార్ట్ ఎటాకేమో!" అన్నారు పక్కనున్న ఎవరో.