Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 6

                                                                 జడ్జిమెంట్

    ఆరోజు జడ్జి విశ్వనాధంగారు ఇంటికి వస్తూనే ఆలోచనలో పడ్డారు. ఫైల్సు లోపలపెట్టి డ్రైవరు చేతులు కట్టుకొని నిల్చున్నాడు.

    "ఇక నువ్వెళ్ళొచ్చు." అన్నట్టు తల పంకించారు జడ్జిగారు.

    లోపలకు వస్తూనే ఈజీచైర్లో చేరగిలపడి "లా" పుస్తకాలు తిరగెయ్యడం మొదలుపెట్టారు. విశ్వనాథంగారి  భార్య పార్వతమ్మ హార్లిక్సు కలుపుకొని గదిలోకి వచ్చింది.

    "ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకపోతే ఎట్లాగండీ? ఎప్పుడూ కేసు స్టడీసేనా?" అంది భార్య పార్వతమ్మ గ్లాసు అందిస్తూ.

    "ఏం చెయ్యమంటావ్? నా వృత్తి అలాంటిది?" లేని నవ్వు తెచ్చి పెట్టుకొంటూ హార్లిక్స్ గ్లాసు అందుకొన్నారు విశ్వనాథంగారు.

    రెండు గుక్కలు హార్లిక్స్ సప్పరించి "ఇక నువ్వెళ్ళితే బాగుంటుంది" అన్నట్టు భార్య ముఖంలోకి చూశారు.

    పార్వతమ్మ తనను కానట్టే ఎదురుగావున్న సోఫాలో చతికిలపడింది.

    దాంతో జడ్జీగారు హార్లిక్స్ మాట మర్చిపోయి మళ్ళీ పుస్తకాలలోకి తల దూర్చారు.

    పార్వతమ్మ భర్త ముఖంలోకి ఓ నిముషం చూసింది.

    "ఆ కేసు జడ్జిమెంటు రేపేనటగా?"

    హంతకుల్లో ఒకడు అప్రూవర్ గా మారినప్పుడు కూడా అదిరిపడి విశ్వనాథంగారు, నిజంగానే ఇంతెత్తున అదిరి పడ్డారు.

    "ఏమిటంతగా ఎగిరి పడ్డారు?" పార్వతమ్మ మురిపెంగా భర్తను చూస్తూ అడిగింది.

    విశ్వనాథంగారు భార్య ముఖంలోకి అయోమయంగా చూశారు.

    "ఏమిటలా చూస్తారు?"

    "ఏదో అన్నట్టున్నావ్?"

    "అదేనండీ. ఆ కేసు జడ్జిమెంట్ రేపేనటగా?"

    "ఏ కేసూ?"

    "అయ్యో రాత! మీకు మరీ ఇంత మతిమరుపైతే ఎట్లా?"

    "నాకు మతిమరుపైతే నష్టం నీకూ నాకూ ఏం లేదులే!"

    "మరెవరికంటారు? లాయర్లకా?"

    "వాళ్ళ సొమ్మేం పోతుంది? కోర్టుకు న్యాయం కోసం వచ్చిన క్లయింట్లకు!" భార్య ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నారు జడ్జిగారు.

    "అదే నేను చెప్పొచ్చేది!" పార్వతమ్మ చిటికవేసినట్లు, కొమ్ములు తిరిగిన లాయరులా మాట్లాడింది.

    విశ్వనాథంగారు తెల్లమొహంవేసి, చల్లారిపోయిన హార్లిక్స్ గడగడ తాగేసి, తెల్లమీసాలు తుడుచుకున్నారు.

    పార్వతమ్మ భర్త చేతిలోని గ్లాసు అందుకొని "ఇవ్వాళ బెంచి కొచ్చిందటగా? రేపు జడ్జిమెంటని...." ఆమె మాట పూర్తికాకుండానే జడ్జీగారు, 'ఎవరు చెప్పారూ?' అన్నారు.

    'ఎవరు చెప్పటం ఏమిటండీ? మన ప్రకాష్' భర్త పడకకుర్చీలోంచి నిలువునా లేవడంచూసి, మాట పూర్తికాకుండానే పార్వతమ్మ నోరు తెరచింది. చేతిలో వున్న గ్లాసు కిందకు జారిపోయింది. ప్రాణంలేని గ్లాసు  తనంతటతను జారిపోదు కనక పార్వతమ్మ వదిలేసి వుండాలి. 'లా' దీన్ని గురించి ఏం చెబుతుందో, విచారించకుండానే, జడ్జిగారు గదిలోంచి 'రైజ్' అయి హాల్లోకి వచ్చారు. వంకెనవున్న చేతికర్రను అందుకొని వెనకే వచ్చి నిలబడ్డ భార్యకేసి చూశారు.

    'ఇవ్వాళ కూడా వాకింగ్ ఏమిటి. అబ్బాయి పుట్టినరోజని మర్చిపోయారా?' అన్నది.

    'సరే! అయితే కొంచెం ఆలస్యమ్గానే వస్తాలే!' అంటూ బయటకు నడిచారు విశ్వనాథంగారు.

    పార్వతమ్మకు ఇలా పాయింట్ అర్ధంకాక తన్నుకు చచ్చింది. ఇంట్లో శుభకార్యం చేసుకుంటూ బయటకు వెళ్ళటం ఏమిటంటే, ఆలస్యంగా వస్తానంటూ భర్త బయటకుపోవటం ఏమిటో ఆమెకు బోధపడలేదు. అయోమయంగా బయటకు వెళ్ళిపోతున్న భర్తకేసి చూసింది. జిత్తులమారి లాయర్ని బోల్తా కొట్టించినంత సంతోషంగా విశ్వనాథంగారు, భార్యకేసి ఓసారి చూసి రోడ్డుమీదకు వచ్చారు.

    ఆయనగారి పెదవులపై విరిసిన హాసరేఖ వీధి మలుపు తిరిగేంతవరకూ వుంది. దానికి మూలమైన కథనాన్ని నెమరువేసుకుంటూ నడక సాగించారు విశ్వనాథంగారు ఇంట్లో చినబాబు పుట్టినరోజు పండుగని తనకు తెలియంది కాదు. చుట్టుపట్ల అమ్మలక్కలూ, పిల్లా జెల్లా యింట్లో చేరతారు. ఆ గందరగోళంతో తనకేమీ తోచదు. అమ్మలక్కలు తన మొహాన ఏదో దోబూచులాడుతున్నట్లు తనను తొంగి తొంగి చూడటం తనకు పరమ అసహ్యం. పిల్లల కాకిగోల తనకు మహాచిరాకు కలిగిస్తుంది. ఇంట్లో హడావిడి తగ్గేంతవరకూ తను హాయిగా, ప్రశాంతంగా షికారుచేసి తిరిగిరావచ్చు.

 Previous Page Next Page