Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 6


    తను కన్న బిడ్డలకు ఏమివ్వగలుగుతున్నాడు?

 

    తిండికి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

 

    కృష్ణవేణి ఎలా సంభాళించు కొస్తుందో తను ఆలోచించడు. ఆలోచించినా తనేం చెయ్యలేనని తనకు తెలుసు.

 

    ఒకడు పోయాడు. మిగిలింది, ఒక కొడుకూ, ఒక కూతురు, భార్య. వాళ్లకు ఇంత తిండి పెట్టలేని దద్దమ్మ తను.

 

    తన భార్య తన పుట్టింటివారు పెట్టిన నగలన్నీ అమ్మింది. ఇంట్లో ఉన్న సామానుకూడా ఒక్కొక్కటే బజారుకు చేరింది.

 

    మరీ ఐదేళ్లగా తెలుగు సాహిత్యపు విలువలు పూర్తిగా మారిపోయాయి. ఈ వయసులో తను ఆ ట్రెండును అనుకరించాలంటే తన ఆత్మను చంపుకోవాలి.

 

    తన ఆత్మను చంపుకొని ప్రేమకథ రాశాడు. బ్రహ్మాండంగా రాశాననుకొన్నాడు. తన మీద ఆధారపడిన వాళ్లను నిలువునా చంపడంకంటే తన ఆత్మను చంపుకోవడమే మంచిదని మనసుకు సర్ది చెప్పుకొన్నాడు.

 

    ఆ ప్రేమకథ ముగింపు తన ధోరణిలోనే వచ్చింది. ఏ ప్రకాశకుడికీ నచ్చలేదు. ఏ పత్రిక ఎడిటర్ కూ నచ్చలేదు. చివరకు ఒక ప్రకాశకుడిచ్చిన సలహా మేరకు ముగింపు మార్చాడు. పుస్తకం వచ్చింది. కాని తనకు ప్రతిఫలంగా ఐదువందలు రూపాయలు వచ్చాయి.

 

    "నీ ప్రేమ కథలు ఎవరిక్కావాలయ్యా? మానసికంగా శారీరకంగా ఎండిపోయిన నువ్వు రసవత్తరమైన ప్రేమ కథలు ఎక్కడ రాయగలవు గాని, ఓ మాంచి మాంత్రికుడి కథ రాయి!" అన్నాడు ఓ పత్రికాధిపతి.

 

    "మాంత్రికుడి కథా ?" తను తెల్లముఖం వేశాడు.

 

    తనకు తల తిరిగిపోయింది. చూస్తూ ఉండిపోయాడు.

 

    "అయితే దయ్యాలకథ రాయి మంచి సస్పెన్సుతో" అన్నాడు.

 

    తను తలవంచుకొని ఇంటికి తిరిగొచ్చాడు.

 

    తనకు అన్నం వడ్డిస్తున్న తన భార్యను చూచాడు. నలభై నిండని ఆమె, బతుకు భారంతో వంగిపోయింది.

 

    "నిన్న బియ్యం అయిపోయినయ్ అన్నావ్?" తల ఎత్తకుండానే తను కృష్ణవేణిని ప్రశ్నించాడు.

 

    "పక్కింటి పిన్నిగారిదగ్గర ఓ కిలో అప్పుతీసుకొన్నాను." తలవంచుకొనే సమాధానం చెప్పింది ఆమె.

 

    చేటతీసుకొని బియ్యం అప్పుకోసం పక్కింటికివెళ్ళే ఇల్లాలి మానసిక వ్యథ గురించి ఏనాడో తను ఒక నవలలో రాశాడు. ఆమె సమాధానం వినీ, అన్నం తిన్నాడు. ఎలా తిన్నాడో ఆ అన్నం! తినక ఏంచేస్తాడు ! అది ఆకలి చేయించే గారడీ.

 

    అన్నంతిని లేచివస్తుంటే చిరుగులు కన్పించకుండా, ఓనీ సర్దుకుంటూ కూతురు ఎదురైంది. ఆ పిల్లను పలకరించే ధైర్యం తనకులేదు.

 

    పెద్దవాడు బి.ఏ. ఫైనల్ వరకూ ఎలాగో వచ్చాడు.

 

    "నాన్నా !"

 

    తను తృళ్లి పడ్డాడు.

 

    వాడు ఏమడుగుతాడో తనకు తెలుసు.

 

    "నాన్నా పరీక్ష ఫీజు కట్టాలి."

 

    "ఎవర్నయినా నీ స్నేహితుడ్ని అప్పు అడగరా ! ఇప్పటికిప్పుడు నాన్న దగ్గర డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది?" తన భార్య కృష్ణవేణి తనను ఆదుకొంది.

 

    "ఛీ ! ఎంతసేపూ అడుక్కొనే బతుకే! పెంచలేనివాళ్ళు కనడం ఎందుకో?" అంటూ వాడు బయటికి వెళ్ళిపోయాడు.

 

    తను అక్కడ నిలబడలేక పోయాడు.

 

    తనకు తనభార్య ముఖంచూసే సాహసంలేదు.

 

    ఆమె తన వెనకే వచ్చింది.

 

    "మీరు మరీ అంత బాధపడితే ఎలా? చిన్న సన్నాసి, ఉద్రేకం ఎక్కువ. ఏదో వాగుతాడు. పట్టించుకోకండి." తన కుర్చీ పక్కగావచ్చి నిల్చుని లాలనగా అన్నది.

 

    తనకు భోరున ఏడవాలనిపించింది.

 

    కాని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, రంగు వెలిసిపోయిన మట్టి గాజుల్ని పైకీ కిందకూ జరుపుతూ ఉండిపోయాడు తను.

 

    ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా తనకు నిద్ర రాలేదు.

 

    ఏదోచెయ్యాలి. తనమీద ఆధారపడి ఉన్న వాళ్ళను ఇలా హింసించడం అపరాధంకాదా ?

 

    "అందుకని ?"

 

    పైకిలేచి ఏదో అనబోతున్న అంతరాత్మ గొంతు కసిగా పిసికేశాడు. దాన్ని కసిగా కొట్టికొట్టి చంపేశాడు తను.

 

    చాలాసేపు ఆలోచించాడు.

 

    ఒక్క థీమూ తనకు తట్టి చావలేదు.

 

    తెలతెల వారుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. మనసు సంతృప్తి చెందింది. నిద్రతో కనురెప్పలు మూతలు పడ్డాయి.

 

    తెల్లవారి చాలా ఆలస్యంగా మెలకువ వచ్చింది.

 

    కృష్ణవేణి ఇచ్చిన కాఫీతాగి, స్నానంచేసి ఆదరా బాదరాగా బయలుదేరాడు.

 

    కృష్ణవేణి ఎదురొచ్చింది. ఏదో అడగాలని వచ్చినట్టు ఆమె చెప్పకుండానే తనకు తెలిసింది.

 

    "ఇప్పుడేవస్తా !" అంటూ ఆమె ముఖంలోకి చూడకుండానే తను బయటికి వెళ్ళాడు.

 

    ఎండలో రెండు కిలోమీటర్లు నడిచి 'వెలుగు-చీకటి' పత్రికాఫీసు చేరుకున్నాడు.

 

    ఎడిటర్ సుందర్రావు తలెత్తి తనను చూచాడు, కూర్చోమనలేదు. ఒకప్పుడు తను కన్పిస్తేచాలు వంగివంగి నమస్కారాలు చేసేవాడు. ఇప్పుడు అతనికి తనంటే గౌరవం లేకకాదు. తన కథలు వెయ్యమణి అడుగుతాడనే భయం. అందుకే ఆ నిర్లక్ష్యం.

 

    అతను కూర్చోమనకుండానే తను కూర్చున్నాడు.

 

    అతను నొసలు చిట్లించాడు.

 

    "మీరు మొన్న దయ్యంకథ రాయమన్నారుగా?"

 

    అతను నోరుతెరిచి తనకేసి చూశాడు.

 Previous Page Next Page