Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 6

అతను తనను శాసించడం, తను అనుమతించడం చిత్రంగా వుంది. తను చావాలంటే అతని అనుమతి కావాలా? అవును కావాలి. తను వాగ్దానం చేసింది. అంత పూలిష్ గా ఎందుకు ప్రవర్తించింది?
అతని కళ్ళ ఆకర్షణకు లోబడిపోయిందా? అతని చూపుల్లో ఎదుటివాళ్ళను కట్టివేసే శక్తి ఏదో ఉంది. అతని కంఠంలో ఏదో సమ్మోహనశక్తి వుంది.
ఇంతకూ అతను భారతీయుడా లేక ఆంగ్లేయుడా? మనిషా లేక ఆత్మా?
మనిషే!
అతని శరీరం వర్ణం. ఆంగ్లేయుల శరీరపు వర్ణానికి భిన్నంగా ఉంది. అయినా అతని భాష వింటే అతడు ఆంగ్లేయుడేమోననిపిస్తుంది. అతను ఆత్మ కాదు.
అతను ఇంకొంచెంసేపు మాట్లాడితే..అతను తెల్లవారేంతవరకూ తన దగ్గరే కూర్చుని మాట్లాడి వుంటే ఎంత బాగుండేది!
క్రింద డెక్ లోకి వెళితే అతను కన్పిస్తాడేమో!
కన్పించడు! కన్పించకపోతే తనకేం?
ఎందుకు తను అతన్ని గురించి ఇంతగా ఆలోచిస్తున్నది? అతనెవరు? తనెవరు?
అతను తనకు ఏమౌతాడు?
ఏమీ కాడా? మరి అతని మాటలకు తనెందుకు లొంగిపోయింది.
అతని కంఠం ఒక మధురగీతం తాలూకు ఆలాపనలా తన మనసును ఎందుకు ఇంకా చుట్టుకొనే ఉన్నది?
అతను తనకు జీవితం పట్ల ఆసక్తిని కలిగించాడు...తనలో ఏదో మార్పు వచ్చింది! అతన్ని మర్చిపోలేకుండా వున్నది. ఏదో వింత అనుభవం. తను ఎందర్నో చూసింది. కాని ఇతని పరిచయం... పేరుకూడా తెలియదు... కొద్దినిమిషాల పరిచయం మాత్రమే... కాని ఆ పరిచయం తనకు యుగయుగాల పరిచయంలా... జన్మజన్మల పరిచయంలా అనిపిస్తోంది.
పూర్వజన్మలో....
దీన్నే కర్మ అంటారా?
ఈ ప్రపంచం ఒక అతీతశక్తి ద్వారా నడిపించబడుతుంది. తను క్రిస్టియన్. తనకు భగవంతుని మీద నమ్మకం వుంది.
సృష్టిలో మానవజన్మ సర్వశ్రేష్ఠమైనది. అయినా అతను కర్మచేత బదిపించబోతున్నాడా? పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం అనుభవిస్తున్నాడా?"
అవును. "బుద్ధి కర్మానుసారిణి" అని భారతీయులు భావిస్తారట. అది నిజమేనేమో! అంటే బుద్ధి కర్మను బట్టి నడుస్తుందట.
లేకపోతే తను అతన్ని గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నది?
సీత కనురెప్పలు బరువుగా వాలిపోయావు.
"నువ్వు ధైర్యంగా వుండాలి. నీ పేరు సీత. భారతీయుల ఆరాధ్య దేవత. ఆమె ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నది. ఆమె పరమ పవిత్రురాలు. నువ్వు నీ పేరును సార్థకం చేసుకోవాలి" అతని కంఠం ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నది.
ఆ కంఠాన్ని మధురగానంలా వింటూ సీత నిద్రలోకి జారిపోయింది.
సీత తృళ్ళిపడి నిద్రలేచింది.
అప్పటికే బారెడు పొద్దెక్కింది.
గాభరాగా మంచం దిగింది.
బాబాయి లేచి వుంటాడు. టిఫిన్ చేసి సెలూన్ లో తనకోసం కోపంగా ఎదురుచూస్తూ వుంటాడు.
అయినా చిత్రం! తనకు ఇంతకుముందులా భయం కలగడంలేదు.
సీతకు ఈ ఉదయమే కొత్తగా వుంది. సూర్యకిరణాలు స్పర్శలో ఇంతకుముందులేని అద్భుతమైన ఆనందానుభూతి ఏదో వున్నట్టు అన్పించింది ఆమెకు. ఆ గాలి, ఆ వాతావరణం ఆమెకు ఏదో కొత్త సందేశాన్ని ఇస్తున్నట్టు అన్పించసాగింది.
పల్చటి గౌను ధరించింది. క్రితం రోజులాగే వాతావరణం వేడిగా వుంది. బాలభానుని కిరణాల కాంతి సముద్ర కెరటాలను సున్నితంగా తాకుతున్నట్టుగా వుంది. ఓడ తిన్నగా సముద్రాన్ని చీలుస్తూ ముందుకు సాగిపోతున్నది.
ఇంతకుముందు ఆమె ఆలస్యంగా నిద్రలేచిన రోజు భయపడుతూ హారె ముందు అపరాధిలా తలవంచుకొని నిల్చునేది. భయంతో వణికిపోతూ నిల్చునేది.
ఈరోజు ఆమె తిన్నగా హారే క్యాబిన్ కు వెళ్ళలేదు. తాపీగా ఓడపై డెక్ మీదకు వెళ్ళింది.
దూరంగా కన్పిస్తున్న క్షితిజాన్ని చూస్తూ నిల్చుంది.
ఇంతకాలంగా తనను బాధిస్తున్న వంటరితనం అకస్మాత్తుగా పోయినట్టు అనిపిస్తోంది ఆమెకు.
తను వంటరిది కాదనీ, ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టూ అన్పిస్తోంది. ఆ కొత్త ప్రపంచం ఆకర్షణీయంగా, అతి దగ్గరగా ఉన్నట్టు తోస్తున్నది. ఆ కొత్త ప్రపంచంలో ఎవరో చేతులు చాచి తనకోసం చూస్తున్నట్టుగా...
హారే అంత కఠినంగా ప్రవర్తించడానికి కారణం అతను తన జీవితంలో ఎక్కువభాగం భారతదేశంలో వుండటం వల్లనేనని ఆమె అభిప్రాయం. అందుకే ఆమెకు భారతదేశం అంటే అయిష్టం ఏర్పడింది.
ఆమెకు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి దగ్గిర భారతీయ చిత్రాలు అనేకం ఉండేవి. రాజస్థాన్ పెయింటింగ్స్ కాపీలు ఆయన దగ్గిర ఉండేవి. ఏనుగులూ, అందమైన దుస్తుల్లో వున్న మహారాజులూ, రాణులూ ఆ పెయింటింగ్స్ లోని చిత్రాలు.
అవి ఇప్పుడు ఎక్కడున్నాయో? బాబాయి స్టోర్ రూంలో దుమ్ముకొట్టుకుని సామానుల మధ్య పడి వుంటాయి. తన తల్లిదండ్రులు పోగానే తనతోపాటు తన ఇంట్లో వున్న వస్తువులన్నీ బాబాయ్ ఇంటికి వింబుల్డన్ కు వచ్చి చేరాయి.
తను పుట్టెడు దుఃఖంలో వుండటం వల్ల వాటి గురించి ఆలోచనే తనకు రాలేదు.
తన దుస్తులతో పాటు తన తల్లి దుస్తులు కూడా తనకు యిచ్చాడు బాబాయ్.
హారే డబ్బు ఇచ్చేవాడు కాదు. అందువల్ల తన దుస్తులు చిరిగిపోయాక తల్లి దుస్తులు ధరిస్తున్నది. ఆమెకు పెద్దవిగా వున్నా వాటినే ధరిస్తున్నది.
హారే అప్పుడప్పుడు చౌకబారు దుస్తులు సీతకు కొనిచ్చేవాడు. ఆమెకు మంచిబట్టలు వేసుకోవాలని ఉంటుంది.
సీతకు తల్లి మాటలు గుర్తుకొచ్చాయి.
"భారతదేశంలో దర్జీలు ఇళ్ళ వరండాల్లో కూర్చుని దుస్తులు కుడుతుంటారు.
ఎలాంటి దుస్తుల్ని చూపించినా వెంటనే వాటిని చూసి అలాంటివే కుట్టే నైపుణ్యం వాళ్ళకు వుంటుంది" అని ఆమె తల్లి చెబుతూ వుండేది.

 Previous Page Next Page