Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 6


    "షరతు ఏమిటి?"


    "మధ్య నేను షరతు పెట్టడం ఏమిటి? పద! క్లాసుకు టైం అయింది" అంటూ లేచింది వాణి.


    సుధ పెద్ద అందమైంది కాదు. వయసులో ఉన్నది. కట్టూ బొట్టులో చాలా శ్రద్ధ చూపుతుంది. ఆకర్షణీయంగా కన్పిస్తుంది.


    శ్రీమంతులబిడ్డ. తల్లిదండ్రులకు ఏకైక సంతానం. డాక్టరీకూడా హోదాకూ, సరదాకూ చదువుతున్నది.


    ఆమెకు యువకుల్ని ఆకర్షించి ఆ తర్వాత దూరంగా ఉండి, వాళ్ళు బాధపడుతుంటే చూడటం సర్దా. ఆమె మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు రఘు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం సుధేనని చాలా మందికి అనుమానం.


    తను కావాలనుకుంటే తిరస్కరించే యువకుడు ఉండడని ఆమె విశ్వాసం.


    గౌతమ్ మీద ఆమె దృష్టి ఇటీవలే పడింది. అదీ గౌతమ్ రేణుకను ప్రేమిస్తున్నాడనే అనుమానం వచ్చిన తర్వాతనే. అతను తనను నిర్లక్ష్యం చెయ్యడం సుధలో పట్టుదలను పెంచింది.


    వాణీ వెళ్ళిపోయింది.


    సుధ క్లాసుకు వెళ్ళలేదు.


    ఆలోచిస్తూ కూర్చుంది.


    గౌతమ్ తను ఆకర్షించలేదా? అష్టదరిద్రుడు. తనలాంటి బంగారు పిచ్చుక కోరితే తిరస్కరించగలడా? తనను చూసి కాకపోయినా తన డబ్బుకైనా లొంగిపోతాడు.


    సిరి తనకు తానై వలచివస్తే వద్దనే మూర్ఖుడు ఉంటాడా? ఉండడు!


    గౌతమ్ తన బీదతనాన్ని ప్రతి నిముషం గుర్తుచేసుకుంటూ ఉంటాడు. అతనిలో ఆత్మహీనతాభావం ఉంది. అందుకే అంత ముభావంగా ఎవరితోనూ కలవకుండా ఉంటాడు.


    అలాంటివాడిని డబ్బు ఎరచూపి వశం చేసుకోవడం ఏమంత కష్టమైన కార్యం కాదు.


    కాలేజి సాంస్కృతిక ఉత్సవం జరుగుతున్నది.


    చీఫ్ గెస్టుగా ఆరోగ్యశాఖ మంత్రి వేదిక మీద ఉన్నారు. కాలేజీ ప్రిన్స్ పాల్ అధ్యక్షాసనాన్ని అలంకరించి ఉన్నాడు. సాంస్కృతిక శాఖకార్యదర్శి గౌతమ్ కంఠం మైక్ లో నుంచి విన్పిస్తోంది.


    "ఆదరణీయులైన అధ్యక్షులకూ, గౌరవనీయులైన మా ప్రిన్స్ పాల్ గారికి, విచ్చేసిన పెద్దలకూ నా నమస్కారాలు. నాతోటి విద్యార్థులకూ, విద్యార్థినులకూ శుభాకాంక్షలు.


    మానవుని శరీరం ఎదగడానికి ఆహారం ఎంత ముఖ్యమో, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి సాంస్కృతిక కార్యక్రమాలూ అంతే అవసరం. నూటికి డెబ్బయ్ ఐదుమందికి కడుపునిండా తిండి దొరకని ఈ దేశంలో మానసిక ఆహ్లాదం గురించి ఆలోచించడం హాస్యాస్పదమే. అది కేవలం కడుపునిండినవారు వెతుక్కొనే కాలక్షేపం మాత్రమే.


    మనదేశానికి స్వతంత్రం వచ్చింది. తెల్లవాడి స్థానాన్ని నల్లవాడు ఆక్రమించుకున్నాడు. కాని సామాన్యుడి జీవితంలో మార్పు ఏమీ రాలేదు. సామాన్యుడు అంటే ఎవరంటారా? శ్రమ పడేవాడూ, చమటకార్చి ఉత్పత్తిని పెంచేవాడూ సామాన్యుడు. ఆ శ్రమశక్తి ఫలితాన్ని అనుభవంచేవాడే అసామాన్యుడు. ఉదాహరణకు రెండేళ్ళక్రితం వరకూ మన ఈ ఆరోగ్యశాఖ మంత్రిగారు సామాన్యులు. సామాన్యులు ఓట్లు పొంది ఈనాడు మంత్రి అయ్యారు. ఓట్లు వేసినవారు ఇంకా సామాన్యులుగానే ఉన్నారు, కాని వారి ఓట్లతో గెలిచిన ఈ అనంతరామన్ గారు మంత్రి అయి అసామాన్యులు అయ్యారు.


    సభలో కరతాళ ద్వనులు మిన్నుముట్టాయి. మంత్రిగారి ముఖం మాడిపోయింది. కానీ తట్టుకోని పెదవులు మీదకు చిరునవ్వు తెచ్చి పెట్టుకున్నాడు.


    "పాపం! ఏడవలేకనవ్వుతున్నాడురా!" వెనకనుంచి ఒకడు అరిచాడు.


    ఒక క్షణం ఆగి గౌతమ్ మళ్ళీ ప్రారంభించాడు.


    "సామాన్యుడు కూడా బ్రతుకుతూనే ఉన్నాడు. అతను ఇంకా ఉచ్చాస నిశ్వాసాలు తీస్తున్నాడు కనక బ్రతికిఉన్న వాడికిందే లెక్క, యంత్రంలా బ్రతికే మానవుడి బ్రతుకుకూడా ఒక బ్రతుకేనా? ఒక్కసారి ఆలోచించండీ" హృదయంలో స్పందనలేని, రక్తంలో వేడిలేని, జీవితంలో నవ్యతంలేని జీవితం మృత్యువుతో సమానం.


    ఈనాడు మన స్వతంత్రభారతంలో ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాం. దేశం అభివృద్ధిపథంలో నడుస్తున్నదని చెబుతున్నారు నాయకులు (సభలో చప్పట్లు) రోజురోజుకూ ఉన్నవాడికీలేనివాడికీ మధ్య ఏర్పడిన అగాధం పెరుగుతుందేగాని తరగడం లేదు.


    కర్మసిద్ధాంతంమీద నమ్మకం రోజురోజుకూ పెరుగుతోంది. మతం పేరుమీదా, కులం పేరుమీదా ఓట్లూ సీట్లూ పంచుకుంటున్నారు. (హియర్ హియర్) మనదేశం కర్మభూమి. మన సంప్రదాయం చాలా గొప్పదని పెద్దలు వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాని మన సభ్యతా, సంస్కృతీ మనిషికీ మనిషికీ మధ్య మతం పేరుతో, కులాల పేరుతో అడ్డుగోడల్ని లేపాయి. దీపం చీకటిని పారద్రోలడానికి ఉపయోగపడుతుంది. అలాకాకుండా ఆ దీపమే ఇంటిని తగలేసేదిగా మారినప్పుడు ఆ దీపాన్ని ఆర్పేయండి"


    ప్రిన్సిపాల్ బెల్ కొట్టాడు.


    గౌతమ్ మాట్లాడటంమాని వెనక్కు చూశాడు.


    "మాట్లాడాలి గౌతమ్ మాట్లాడు" స్టూడెంట్సు కేకలు.


    మళ్ళీ గౌతమ్ ప్రారంభించారు-" యువతరంలో మార్పు రావాలి. ఎనాటమీ చేసే మెడికల్ స్టూడెంట్సులో కూడా కులాభిమానం ఉండటం హాస్యాస్పదం. సిగ్గుచేటు. మానవుడికి మానవుడికీ మధ్య ఏర్పడిన ఈ గోడల్ని పడగొట్టింది.


    మానవజాతిపుట్టుకతోనే కులాలముద్రలతో పుట్టలేదు. ముందు మనిషి పుట్టాడు. ఆ తర్వాత మతం, కులాలు పుట్టాయి. ధర్మశాస్త్రాలు పుట్టాయి. పదిమంది హిందువుల స్థానంలో ఒక మానవుడు చాలు. బైబిల్, ఖురాన్, గీత అన్నింటిలోసారం ఒక్కటే. అది మానవతాన్ని పెంచి మానవ సౌభ్రాతృత్వాన్ని స్థాపించడం. కాని మనం ఈనాడు చూస్తున్నదేమిటీ? చేస్తున్నదేమిటి?


    స్వతంత్రంవచ్చాక మన దేవుడిగుళ్ళల్లో రద్దీ మరీ ఎక్కువైంది? కారణం ఏమిటి? ఉండీలలో లక్షల కొద్దీ నోట్లకట్టలు వేసేవాళ్ళు ఎవరు? భగవంతుణ్ణీ (ఒకవేళ ఉంటే గింటే...చప్పట్లు) కూడా లంచం పెట్టి తమవైపుకు త్రిప్పుకోవాలనే ప్రయత్నం కన్పించటంలేదూ?


    "నేను ఆ దేవుణ్ణే, ఉన్నట్టయితే, దిగి రమ్మంటున్నాను. నువ్వు గొప్పవాడివో మానవతం గొప్పదో చూడమంటున్నాను."


    "సభలో చప్పట్లు. గౌతమ్ ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకున్నాడు. శ్రమజీవి చమటకు తగిన విలువనిచ్చినరోజే మనదేశంలో మానవతం తలెత్తుకొని మనగలదు. అది ఎలా సాధ్యం; ఈ వ్యవస్థలో, ఈ దోపిడీ వ్యవస్థలో అది సాధ్యంకాదు"


    ప్రిన్స్ పాల్ మళ్ళీ గంటకొట్టాడు. ఒక లెక్చరర్ గౌతమ్ దగ్గరకు వచ్చి చెవులో ఏదో చెప్పాడు.


    గౌతమ్ ప్రేక్షకులకు నమస్కరించి మరో మాట మాట్లాడకుండా కూర్చున్నాడు.


    సభలో కలకలం బయలుదేరింది.


    మంత్రిగారు లేచారు. వెనక నుంచి పిల్లి కూతలు విన్పించాయి.


    మీటింగు ఎలాగో పూర్తి అయింది అనిపించారు.


    ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జరిగింది.


    గౌతమ్ చుట్టూ స్టూడెంట్సు చేరారు. చాలా బాగా మాట్లాడావంటూ అభినందించారు.


    రెండోరోజు మధ్యాహ్నంవార్డులో ఒక రోగిని పరీక్షిస్తున్నాడు గౌతమ్.


    "నిన్న మీరు చాలా బాగా మాట్లాడారు"


    గౌతమ్ నిటారుగా నిల్చున్నాడు. వెనక్కు తిరిగి చూచాడు. రేణుక నిల్చుని ఉంది.

 Previous Page Next Page