Previous Page Next Page 
పిపాసి పేజి 6


    ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అందంతో, వింతగా కనిపించింది రాధిక. చూస్తున్న కొద్దీ, మరీ చూడాలనిపించే ఆమె అందాన్ని, పరవశించి చూస్తున్నాడు మధన్. కార్యక్రమం ముగిసింది.


    క్రితంరోజులాగే, జనం అంతా వెళ్ళిపోయేదాకా, ఒక పక్కగా నుంచున్నారు మధన్, సత్యం. కాస్త వొత్తిడి తగ్గాక, గ్రీన్ రూమ్ చేరుకున్నారు. తలుపు తీసుకుని లోపలి కెళ్ళగానే, వెకిలిగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు నిన్నటి మనిషి. సత్యం జేబులోంచి పాతిక రూపాయలు తీసి అతని చేతులో పెట్టాడు. ఇప్పుడే ఎవరో పాతిక ఇచ్చి వెళ్ళారు ఇప్పుడే వస్తానంటూ "కిల్లీ నములుతూ, గట్టిగా ఇకిలించాడు అతడు. సత్యానికి ఏదో అర్థం అయినట్టు, మరో పది తీసి అతని చేతులో పెట్టాడు. అతను నవ్వుతూ లోపలికి పొమ్మన్నాడు.


    అతనిని చూస్తూ వుంటే మధన్ కి ఒళ్ళుమండింది. ఆడపిల్లల శరీరాలమ్మి డబ్బు చేసుకోవాలనుకునే కిరాతకుడు అనుకుంటూ పళ్ళు కొరుక్కున్నాడు, ఏమీ చెయ్యలేక. తలుపు చప్పుడు కాగానే, ఉలికిపడింది రత్నావళి. "నేనే రాధీ" అన్నాడు మధన్. హమ్మయ్య మళ్ళీ ఏ కీచకుడో అనుకుని, హడలిపోయాను, మధన్, నన్నీకూపంలోంచి తొందరగా బయటపడెయ్యకపోతే నన్ను నేను కాపాడుకోవడం కష్టమైపోతోంది, వీడు డబ్బు తీసుకుని గంటకొకణ్ణి పంపుతున్నాడు. ఏవో కబుర్లు చెప్పి వాళ్ళనొదిలించుకుంటున్నాను కానీ, లేకపోతే, ఏనాడో కుళ్ళి పోయుండేదాన్ని, ఈ పాపిష్టి బ్రతుకు ఇక నావల్లకాదు. నన్ను తీసికెళ్ళి మా అమ్మ పాదాల కిందపడేయ్ మధన్, నీ మేలు ఈ జన్మలో మరచిపోను" అంటూ కాళ్ళమీద పడింది రాధిక, కన్నీటితో అతని పాదాలు కడుగుతూ.     


    "రాధీ..... ఇన్నేళ్ళు గడిపినదానివి, మరికొన్నిగంటలు ఎలాగో గడుపు. రేపే, నేనూ సత్యం, హైదరాబాద్ కి బయలుదేరుతున్నాం. ధైర్యంగా వుండు" అంటూ ఓదార్చాడు.       


    మరికాస్సేపు కూర్చుని "వెళతానంటూ" లేచాడు మధన్.


    "తప్పకుండా వస్తారు కదూ? లేకపోతే ఈపాడు బతుకు బతకటం కన్నా చచ్చిపోతాను."


    తన అరచేతిని ఆమె నోటికడ్డంగా పెట్టి, "ఇంకెప్పుడూ అలా అనకు" అన్నాడు లాలనగా.


    కృతజ్ఞతతో అతనికేసి చూసింది ఆమె.


    నవ్వుతూ, ఆమె దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు మధన్.


    ఎప్పుడో తను హైస్కూల్లో వుండగా, స్టూడెంట్లంతా కలిసి, ఎస్ కర్షన్ కి వచ్చారు హైదరాబాదుకి. విశాలమైన రోడ్లు, ఎత్తయిన పెద్ద పెద్ద భవనాలు, రోడ్ల మధ్యన అందమైన పార్కులు, జంట నగరాలను కలిపే హుస్సేను సాగరం, సెక్రటేరియెట్ కార్యాలయం, రవీంద్రభారతి, గోల్కొండ, గండిపేట, చార్మినారు, ఎన్నో చూశాడు కానీ, ఈ సందుగొందులు చూసిన గుర్తులేదు. సత్యం వెనకాలే, నడుస్తున్నాడు మధన్, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నగరమైన హైదరాబాదులో కూడా ఇలాంటి సందులుంటాయా అని ఆశ్చర్యపోతూ.       


    ఆ సందు చివరలో ఎన్నోకార్లూ, టాక్సీలు ఆగాయి. డబ్బుతో స్వర్గాన్నే కొని పోరెయ్యగల మగధీరులందరూ, మనిషికీ డబ్బులకీ వెలకట్టే శక్తిమంతులంతా దొంగచాటుగా, ఎవరికి తగ్గ సరుకుని వారు కొనుక్కోవటానికి ఉబలాటపడుతున్నారు. అమ్మే వాళ్ళకీ, కొనేవాళ్ళకీ మధ్య బ్రోకర్లు, వాళ్ళ కమీషన్ కోసం, కక్కూర్తిపడుతూ, కాకుల్లా నుంచున్నారు. పీక్కుపోయిన బుగ్గలు, గుంటలుబడ్డ కళ్ళు కప్పుకోవడానికి, నాలుగు పూతలు పౌడరూ, కంటి చుట్టూ అరంగుళం కాటుక, పూడిపోగా మిగిలిన జుట్టుకి, నాలుగు సవరాలు తగిలించి, వాటిని కాస్సేపు కప్పి పుచ్చడానికి, పది గజాల పూలు చుట్టి, సంఘంలోని పెద్దమనుష్యులనంతా వాళ్ళు గ్రహించి, వారికోసం, వారి ఆనందం కోసం, పరిమళ ద్రవ్యాలు వాడి, కాస్సేపయినా, వారికి కావలసిన, సంతోషాన్ని అందజేసే, భారతమాతబిడ్డలు, సంఘం ఎత్తి పొడుపులకు అలవాటుపడ్డ ఆడపడుచులు. వారు కాలిపోతూ, ఇతరులకు వెలుగునిచ్చే త్యాగమూర్తులు. అయినా సంఘం బహిష్కరించిన పాపాత్ములు. వీరి నిలా తయారుచేసిన పెద్దమనుష్యులెవరు? తప్పెవరిది? శిక్ష ఎవరికి? ఇలా ఆలోచిస్తూ, వాళ్ళందరినీ తప్పుకుంటూ, సందులో నడుస్తున్నాడు మధన్, సత్యం వెనకాలే.


    సత్యం ఒక యింటి ముందు ఆగాడు, తలుపులు తెరిచే వున్నా, చీకటిగా వుంది. లోపలకాలు పెట్టగానే, ఎడమచేతివైపు మేడమెట్లు కన్పించాయి. సత్యం గబగబా మెట్లెక్కాడు. వెనకాలే వెళ్ళాడు మధన్. పైన ఒక వరండా వుంది. అక్కడే కుర్చీలో కూర్చునున్నాడు ఆరడుగుల మీసాలవాడు. మదన్ అతన్ని గుర్తుపట్టాడు. సత్యాన్ని చూసి నవ్వుతూ, "నమస్తే" అన్నాడు. సత్యం కూడా నమస్కారం పెట్టాడు.


    "మాఫ్ కర్ నా సత్యం! రత్నావళి బుక్ డ్, ఇప్పుడే ఎవరో వచ్చి వందరూపాయలిచ్చారు ఆమె కోసం. గొప్ప ఆసామి. మీరు మరెవరైనా...." ఏదో అనబోయాడతను.   


    మదన్ ఒంటిమీద తేళ్ళూ, జెఱ్ఱులూ పాకినట్టయింది. మొహం ఎర్రగా కందగడ్డలా అయింది. వెంటనే జేబులోంచి రెండు పచ్చ కాగితాలు తీసి, మాట్లాడకుండా అతని చేతిలో పెట్టాడు అతనికి కాగితాలు పుచ్చుకున్నా, వెర్రిమొహం వేశాడు.


    "ఏమిటి ఆలస్యం?" గట్టిగా అడిగాడు మదన్.


    "అతను ఇప్పుడే కదా వెళ్ళింది." అన్నాడు నసుగుతూ.


    "వీల్లేదు" పిచ్చివాడిలా అరుస్తూ, మరో వందరూపాయల నోటు అతని మీదికి విసిరాడు.


    అతను ఏం చెయ్యాలో తోచక స్థాణువులా నుంచున్నాడు. మదన్ ఆవేశంతో విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. సత్యం వెనకాలే వెళ్ళాడు. వెళుతున్నవారిని ఆపకుండా, అలా చూస్తూ నుంచున్నాడు అతను.


    రత్నావళి గదిదాకా వెళ్ళేసరికి, అక్కడ ఒక కాపలావాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. వాడి చేతుల్లో రెండు పది రూపాయల కాగితాలు పడేసి, "మేము అర్జంటుగా లోపలికి వెళ్ళాలి" అన్నాడు మదన్. అతని కంఠంలోని గంభీరత, కళ్ళల్లోని క్రౌర్యం చూసి, అతను మాట్లాడక, దారి కడ్డం జరిగాడు.   


    పెద్దపులిలా లోపలికి వెళ్ళాడు మదన్. "నన్ను క్షమించండి" మీ బిడ్డలాంటిదాన్ని. నా బ్రతుకు నాశనం చెయ్యకండి. నన్నొదిలి పెట్టండి." ప్రాధేయపడుతోంది రాధిక.

 Previous Page Next Page